• facebook
  • whatsapp
  • telegram

అభివృద్ధికి ఇరుసుగా పురపాలన

వికేంద్రీకరణతోనే ‘మూడో అంచె’ పరిపుష్టం

దేశంలో పట్టణ పాలన గాడితప్పింది. క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలకు... పురపాలికల పనితీరుకు మధ్య ఎక్కడలేని అగాధం కనిపిస్తోంది. ముంబయి కేంద్రంగా పట్టణీకరణ సమస్యలపై పనిచేస్తున్న ‘ప్రజా ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ దేశంలోని 40 నగరాలు, పట్టణాల్లో అధ్యయనం నిర్వహించి మెరుగైన పాలన ప్రాతిపదికన సూచీలు ప్రకటించింది. ఈ సూచీల్లో ఒడిశా మొదటి స్థానం దక్కించుకోగా- మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కేరళ, మధ్యప్రదేశ్‌లు ఆ తరవాతి స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ 15వ స్థానంలో, తెలంగాణ 19వ స్థానంలో నిలిచాయి. పురపాలికల్లోని ప్రతినిధుల పనితీరు, శాసన వ్యవస్థ అనుసరిస్తున్న విధానాలు, పౌర భాగస్వామ్యం, సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన యంత్రాంగం, ఆర్థిక వికేంద్రీకరణ వంటి అంశాల ప్రాతిపదికగా సూచీలో రాష్ట్రాల స్థానాలు నిర్ణయించారు. ఆ క్రమంలో ఏ రాష్ట్రమూ వంద మార్కుల స్కేలుపై 60ని కూడా సాధించలేకపోవడం గమనార్హం. దేశంలోని పురపాలక వ్యవస్థల్లోని లోపాలను, పౌరసేవా వ్యవస్థల వైఫల్యాలను కళ్లకు కట్టిన పరిణామమిది. 74వ రాజ్యాంగ సవరణ 12వ షెడ్యూలు నిర్దేశించిన 18 విధులను ఏ పురపాలిక కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదన్న విషయం దీనితో మరోమారు స్పష్టమైంది. 

సమస్యల కుంపట్లుగా నగరాలు..!

రాజ్యాంగంలో ప్రవచించిన పద్ధతిలో పురపాలికలకు  స్వయం ప్రతిపత్తి లభించలేదు. 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి రాష్ట్ర ప్రభుత్వాలు అడుగడుగునా తూట్లు పొడిచాయి. పురపాలికల విధులకు సంబంధించిన అనేక అధికారాలను రాష్ట్రాలు తమ వద్దే అట్టిపెట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, నగరపాలికల మధ్య నిధుల పంపిణీ శాస్త్రీయ ప్రాతిపదికన జరగాలని రాజ్యాంగం నిర్దేశించింది. ఈ ప్రక్రియ పూర్తిగా రాష్ట్ర ఆర్థిక సంఘాల సారథ్యంలో జరగాలనీ స్పష్టం చేసింది. కానీ, ఏ దశలోనూ రాష్ట్ర సర్కార్లు నిధుల పంపిణీకి ముందుకు రాకపోవడమే అతిపెద్ద సమస్య. ఫలితంగా పురపాలికలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. దేశవ్యాప్తంగా వీటి ప్రధాన ఆదాయ వనరు... ఆస్తిపన్ను! తమకు ఏటా రావలసిన ఆస్తి పన్ను వసూళ్లలో సుమారు 55శాతం నుంచి 60శాతం మాత్రమే మున్సిపాలిటీలు సాధించుకోగలుగుతున్నాయి. అనేక పురపాలికలు తమ ఉద్యోగులకు వేతనాలూ చెల్లించలేని దుస్థితిలో ఉన్నాయి. రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆస్తిపన్ను మాఫీ చేయడం, కొన్ని వర్గాలను మినహాయించడం వంటి రాష్ట్ర ప్రభుత్వ చర్యలు పురపాలికల ఆదాయానికి భారీగా గండికొడుతున్నాయి. నీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, రోడ్లు, రవాణా, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి మౌలిక పౌర సేవలను పురపాలికలు పూర్తిస్థాయిలో, సంతృప్తికరమైన రీతిలో నిర్వహించలేకపోతున్నాయి. క్రమంగా విస్తరిస్తున్న మురికివాడలు మరో పెద్ద సమస్యగా మారాయి. రాజ్యాంగం నిర్దేశించిన విధులు ఒక్కొక్కటిగా పురపాలికల చేతినుంచి జారిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న మురుగు నీటి శుద్ధి బోర్డులు, జల మండలి, పట్టణాభివృద్ధి సంస్థలు వంటి వివిధ ఏజెన్సీలు పురపాలికలకు ఉద్దేశించిన విధులను నిర్వర్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పురపాలికలు ఏడు విధులను, తెలంగాణ పురపాలికలు నాలుగు విధులను మాత్రమే నిర్వర్తిస్తున్నాయి. దరిమిలా ప్రజాస్వామిక పాలనలో మూడో అంచెగా అభివర్ణితమైన ఈ వ్యవస్థలు తమ స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోతున్నాయి. 

నగరపాలికలకు ఎన్నికైన కార్పొరేటర్లు, మేయర్లకు పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయి. కమీషనర్‌కే పూర్తి పాలనాధికారాలు దఖలుపడ్డాయి. పట్టణ పాలనలో పౌరుల క్రియాశీల భాగస్వామ్యం కీలకం. మరోవంక నగర పాలనపట్ల పౌరుల ఆసక్తి నానాటికీ తగ్గుతుండటం గమనార్హం. మున్సిపల్‌ ఎన్నికలలో పోలింగ్‌ శాతం చాలా తక్కువగా నమోదవుతోంది. వార్డు కమిటీల ఏర్పాటు- పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అనేక పురపాలికల్లో వార్డు కమిటీల ఏర్పాటు మాటే లేదు. పట్టణ పాలనలో మరో కీలకమైన అంశం ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం. ఆ వ్యవస్థ సైతం సక్రమంగా పనిచేయడం లేదు.

నిధులు, విధులు కీలకం

నైపుణ్య మానవ వనరుల కొరత మెరుగైన పట్టణ పాలనకు ప్రతికూలంగా ఉంది. అనేక పురపాలికల్లో మంజూరైన పోస్టులే భర్తీ కావడం లేదు. ఉద్యోగుల నియామక వ్యవహారంలోనూ పురపాలికలకు స్వతంత్ర ప్రతిపత్తి లేదు. మెరుగైన పట్టణ పాలన సాకారం కావాలంటే ప్రజాస్వామిక పాలన వ్యవస్థలో మూడో అంచె అయిన నగరపాలికలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఉండాలి. వాటికి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కల్పించాలి. రాజ్యాంగంలోని పన్నెండో షెడ్యూలులో నిర్దేశించిన 18 విధులపై నగర ప్రభుత్వాలకు పూర్తి అధికారం ఉండాలి. ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు మున్సిపల్‌ పాలనలో చక్కటి శిక్షణ ఇవ్వాలి. ఉద్యోగ నియామకాలపై పూర్తి అధికారం పురపాలికలకు ఉండాలి. పౌరులకు మేయర్‌ను, కౌన్సిలర్‌ను ‘రీకాల్‌’ చేసే హక్కు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇస్తున్నట్టుగా; రాష్ట్రాలు నగర పాలికలకు పన్నుల్లో వాటా ఇవ్వాలి. అప్పుడే పురపాలికల ఆర్థిక పటిష్ఠీకరణ సాధ్యమవుతుంది. ఆస్తి పన్ను, యూజర్‌ ఛార్జీల పెంపుదల, సవరణలపై పూర్తి అధికారం పురపాలికలకు ఉండాలి. పట్టణ పాలనకు సంబంధించిన అన్ని రంగాల్లో పాలన సామర్థ్యం పెంపొందించడానికి, పౌర సేవలను సమర్థంగా అందించడానికి, పారదర్శకతకు, పౌరులకు వేగంగా సమాచారమందించడానికి ఇ-గవర్నెన్స్‌ దోహదం చేస్తుంది. మెరుగైన పట్టణ పాలనకు, అభివృద్ధికి అవినాభావ సంబంధం ఉంది. ఆ క్రమంలో మేలైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే- నగరాలు పట్టణాలు పురోగతి బాట పడతాయి. 

- పుల్లూరు సుధాకర్‌
(పట్టణాభివృద్ధి వ్యవహారాల నిపుణులు)

 

Posted Date: 06-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం