• facebook
  • whatsapp
  • telegram

‘అధికారి’క రణ క్షేత్రం

రసవత్తరంగా పశ్చిమ్‌ బంగ రాజకీయాలు

పశ్చిమ్‌ బంగలో రాజకీయం వేడెక్కింది. సోమవారం నందిగ్రామ్‌లోని టెఖాలి మైదానానికి చేరుకున్న జనసమూహం 2011లో తాము పట్టం కట్టిన వ్యక్తి కోసం ఓపికగా నిరీక్షించారు. సువేందు అధికారి తృణమూల్‌ కాంగ్రెస్‌ను వదిలి భాజపాలో చేరిన అనంతరం టీఎంసీకి చెందిన క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ఒక రకమైన శూన్యం నెలకొంది. ఈ తరుణంలో దీదీ ఏం చెబుతారో వినేందుకు నందిగ్రామ్‌ వేదికపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. తృణమూల్‌ అధినేత్రి, పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి మమత ప్రసంగం వారిని ఏ మాత్రం నిరాశపరచలేదు. పైగా వారిలో ఉత్సాహానికి ఊపిరులూదింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచీ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంద్వారా రాజకీయ వేడిని రగల్చడంలో దీదీ విజయం సాధించారు. సువేందు అధికారి పార్టీని వీడిన తరవాత చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను పలు వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. దీదీ ప్రసంగం తరవాత కోల్‌కతాలోని ఈ వర్గాల్లో ముందుగా ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకొంది. తరవాత ఒక్కసారిగా కార్యకర్తలంతా కేకలతో తమ ఆనందాన్ని ప్రకటించారు. నిజమైన పోటీ ప్రారంభం కాకముందే ఒకే ఒక ప్రకటన ద్వారా మమతా బెనర్జీ  ‘అధికారి’ కుటుంబానికి ఒక పెద్ద కుదుపు ఇచ్చినట్లయింది. కానీ, నందిగ్రామ్‌లో మమత పోటీ చేస్తే ఆమెను కనీసం 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని లేదా రాజకీయాలనుంచి తప్పుకొంటానని సువేందు అధికారి ప్రకటించడంతో- చర్చలు ఊపందుకున్నాయి. రాజకీయ పరిశీలకులు ఈ పరిణామాలకు పెద్దగా స్పందించలేదు. ప్రస్తుతం భవానీపూర్‌ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దీదీ నందిగ్రామ్‌ నుంచీ పోటీ చేస్తే ఆ పోరు రసవత్తరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ‘రాష్ట్రంలోని 294 సీట్లలో పార్టీ పోటీ చేస్తున్నందువల్ల నేను నందిగ్రామ్‌పై ఎక్కువ సమయం కేటాయించలేకపోవచ్చు. భవానీపూర్‌ నా పెద్దక్క, నందిగ్రామ్‌ నా రెండో సోదరి. నందిగ్రామ్‌ ప్రజలైన మీరే ఎన్నికల్లో అన్ని అంశాలనూ పర్యవేక్షించాలి. నేను మీకు ఒక హామీ మాత్రం ఇవ్వగలను. ఎన్నికలు ముగిశాక నేను చేయగలిగినంతా చేస్తా’ అని జనసందోహాన్ని ఉద్దేశించి ఆమె అన్నారు.

ఇప్పటికే పశ్చిమ్‌ బంగలోని పలు నియోజకవర్గాల్లోకి భాజపా చొచ్చుకొచ్చిన నేపథ్యంలో- తాను నందిగ్రామ్‌ పోరుకే పరిమితమైతే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కీలకమైన వర్గాల మద్దతు గానీ, సీట్లను గానీ కోల్పోవలసి ఉంటుందని ఆమెకు బాగా తెలుసు. నందిగ్రామ్‌లో ముస్లిమ్‌ మైనారిటీ ఓట్లు పెద్దసంఖ్యలో తనకు అనుకూలంగా ఉన్నట్లు మమత భావిస్తున్నారు. దాంతో నందిగ్రామ్‌లో సులభంగానే విజయకేతనం ఎగరవేయవచ్చనేది ఆమె ఆలోచన. తనకు ఒకప్పటి నమ్మకమైన సైనికుడైన సువేందు అధికారిపై పోటీ చేయడంమీదే దృష్టి సారిస్తే ఫలితం అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. కానీ, మిగతా నియోజకవర్గాల మాటేమిటి? ఈసారి తృణమూల్‌ పరిస్థితి గతంలో ఉన్నట్లు నల్లేరుపై నడకలా లేదు.

పశ్చిమ్‌ బంగ రాజకీయ సమరాంగణంలో మమత జాదవ్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సీపీఎం నేత సోమ్‌నాథ్‌ చటర్జీపై 1984లో విజయం సాధించారు. అప్పట్లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ హత్యకు గురి కావడంతో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన సానుభూతి పవనాలు వీచాయి. ఆ ప్రభంజనంలో ఆ పార్టీ అభ్యర్థిగా మమత గెలుపొంది 29 ఏళ్ల ప్రాయంలోనే లోక్‌సభలో అడుగు పెట్టారు. 1971 నుంచి 2009 వరకు ఎన్నికల రణరంగంలో సోమ్‌నాథ్‌ చటర్జీ ఓడిన సందర్భం అదొక్కటే కావడం గమనార్హం. ఆయనకు పదిసార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన చరిత్ర ఉంది. పశ్చిమ్‌ బంగలో ఎన్నికల వాతావరణం ఎలా ఉంటుందో మమతకు కొట్టిన పిండి.

నందిగ్రామ్‌ నుంచి 2016లో పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచిన సువేందు అధికారినే ఈ సారీ అక్కడ బరిలో నిలపాలని భావిస్తే- మమతా బెనర్జీ భవానీపూర్‌, నందిగ్రామ్‌లలో సమయం ఎక్కువగా కేటయించలేని పరిస్థితులను భాజపా అవకాశంగా మలచుకోవచ్చు. అయితే మమత భాజపా ఉచ్చులో పడతారా అన్నది సందేహాస్పదమే. టీఎంసీని గెలిపించే దిశగా కార్యకలాపాల్లో నిమగ్నమైఉన్న ప్రశాంత్‌ కిశోర్‌ ఎలాంటి సలహాలిస్తారనే విషయమై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మమతా బెనర్జీ చేసిన ఆశ్చర్యకర ప్రకటన సువేందు అధికారికి ఎక్కువ ప్రాధాన్యం కలిగేందుకు దోహదపడుతుందా? వీరిద్దిరిమధ్యా పోటీ నెలకొంటే అది పూర్తి వ్యక్తిగతంగా తయారవుతుందా? భాజపాపై మమత చేస్తున్న దీర్ఘకాలిక పోరు మాటేమిటి? పశ్చిమ్‌ బంగ ఫైర్‌ బ్రాండ్‌గా పేరొందిన దీదీ తన ట్రేడ్‌మార్క్‌ అయిన తెలుపు, నీలిరంగు హవాయి పాదరక్షలతో రాజకీయ వాటర్లూ యుద్ధరంగంలోకి దిగుతారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మరి కొన్ని నెలలు ఆగాల్సిందే!

- దీపాంకర్‌ బోస్‌
 

Posted Date: 20-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం