• facebook
  • whatsapp
  • telegram

ఘనతర గణతంత్రం!

జమిలి ఎన్నికలు - సాధ్యాసాధ్యాలు

ఎన్నో ఏళ్లుగా చర్చనీయాంశంగా ఉన్న ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రతిపాదన కార్యరూపం దాల్చనుందనే వార్తలు ఇటీవల ఊపందుకున్నాయి. జాతీయ, రాష్ట్ర, స్థానిక స్థాయుల్లో ఒకేసారి ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమని ఎన్నికల సంఘం ప్రకటించగా; పలు రాజకీయ పార్టీలు సైతం ఆ దిశగా వ్యూహాలు రచించుకుంటున్నాయి. జమిలి ఎన్నికల ప్రతిపాదన, అందుకు రాజకీయ సానుకూలత కొత్త కాదు గానీ- ఆ ప్రతిపాదనపై కొంత నింపాదిగా, ఇంకా లోతుగా, దూరదృష్టితో ఆలోచన అవసరం. ప్రజాస్వామ్యానికి పీఠంలాంటి అమెరికాలో ఇటీవలి పరిణామాల్ని చూశాకైనా- ఇప్పుడిప్పుడే పరిణతి చెందుతున్న ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ జాగ్రత్తగా అడుగులు వేయాలి. భారతావనిలో ఎన్నికలకు ముందు, ఆ వెన్వెంటనే పాలనలో కొంత స్తబ్ధత లేదా మార్పులు చోటుచేసుకుంటాయి. ఎన్నికల కోడ్‌ సమయంలో పాలన పూర్తిగా స్తంభిస్తుంటుంది. అందువల్లే తరచూ ఎన్నికలవల్ల ప్రజలకు కొన్ని ఇబ్బందులుంటాయి. ‘జమిలి’ ఎన్నికలు జరిగితే ఆ సమస్య తీరుతుంది. ఎన్నికలకు అధికారికంగా అయ్యే ఖర్చు సైతం ఆదా అవుతుంది. కానీ ఆ లాభాలతో పోలిస్తే ‘జమిలి’ వల్ల నష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

విలువ తెలిసి ఓటు వేయాలి

సమాఖ్య వ్యవస్థలో కేంద్రానికి, రాష్ట్రానికి వేర్వేరు బాధ్యతలుంటాయి. దేశ రక్షణ, కరెన్సీ, బ్యాంకుల నియంత్రణ, రైల్వేలు, ఇతర దేశాలతో సంబంధాలు, జాతీయ రహదారులు, ఓడరేవులు, అంతర్జాతీయ వాణిజ్యం, అంతర్రాష్ట్ర జలవివాదాలు వంటి అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వ బాధ్యతలు. రోజువారీ పాలన, శాంతిభద్రతలు, ఆరోగ్యం, పాఠశాల విద్య, న్యాయస్థానాలు, జైళ్లు, వ్యవసాయం, భూ పరిపాలన, జలవనరులు, విద్యుత్తు, రవాణా, మౌలిక సదుపాయాలు- ఇలా ప్రజలకు చేరువగా ఉండే పరిపాలన అంతా రాష్ట్రాల బాధ్యత. స్థానిక రోడ్లు, మంచినీరు, వరదనీటి నిర్వహణ, మురుగునీటి పారుదల, పార్కులు, పారిశుద్ధ్యం వంటి రోజువారీ పరిపాలన స్థానిక ప్రభుత్వాల బాధ్యత. కానీ- భారతీయ వ్యవస్థలో ఈ బాధ్యతల విభజనపట్ల ప్రజలకు ఏమాత్రం అవగాహన లేదు. దాంతో ఎన్నికల్లో మునిసిపాలిటీ నుంచి పార్లమెంటు దాకా ఒకేరీతిన అత్యధిక ఓటర్లు ఓటు వేస్తారు. ఏ స్థాయిలో ఎవరి బాధ్యతలేమిటో తెలియకుండా ఓటు వేస్తే, అలాంటి ఎన్నికలవల్ల నిజమైన ఫలితాలు రావు. ప్రజాస్వామ్యం గందరగోళంలో పడుతుంది. అత్యధిక ఓటర్లు, ఓట్లు- ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగానో, వ్యతిరేకంగానో అన్ని స్థాయుల్లో ఒకే విధంగా ఓట్లు వేస్తున్నారు. అలాంటప్పుడు జమిలి ఎన్నికలు మరింత గందరగోళానికి దారితీసి ప్రజాస్వామ్యాన్ని ఇంకా బలహీనపరుస్తాయి.

స్థానికం నుంచి జాతీయ స్థాయి వరకూ ఒకేసారి ఎన్నికలు జరిగితే భారత్‌ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజల వాస్తవ సమస్యలు పక్కదోవ పడతాయనడంలో సందేహం లేదు. ఇటీవల గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ ఎన్నికల్ని స్వల్ప వ్యవధిలో జరపడంతో అసలు రాజకీయ పార్టీల హామీల మీద చర్చే లేకుండా పోయింది. ఏ పార్టీ ఏం హామీ ఇచ్చిందన్న విషయమే ప్రజలకు పూర్తిగా చేరలేదు. కాస్త మేనిఫెస్టోల్ని చదివి విషయాల్ని తెలుసుకోగలిగినవారు ఓటింగ్‌లోనే పాల్గొనలేదు. జమిలి ఎన్నికలు జరిగితే వివిధ స్థాయుల్లో అజెండాపై అంతంతమాత్రంగా ఉన్న చర్చ ఇంకా కుదించుకుపోతుంది, పక్కదోవ కూడా పడుతుంది. ఏ స్థాయిలో ఎవరికి, ఎందుకు ఓటు వేస్తున్నామో తెలియకుండా ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాస్వామ్యం మరింత సంక్షోభంలో పడుతుంది. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య ఏమాత్రం అంతరంలేకుండా పౌరుల చుట్టూ పాలన ఉండాలన్నది రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన అసలైన లక్ష్యం. సమాఖ్యతత్వాన్ని విస్తరించి పాలనను స్థానిక స్థాయికి చేర్చే ప్రయత్నాలు 30 ఏళ్లుగా జరుగుతున్నాయి. ఇప్పటికీ ఆశించిన స్థాయిలో మార్పు సాకారం కాలేదు. విజ్ఞులు, మేధావులు, జనహితం కోరేవారు హేతుబద్ధంగా, న్యాయంగా, రాజ్యాంగబద్ధంగా చెప్పే మాటల్ని, చేసే డిమాండ్లను పట్టించుకునే రాజకీయ సంస్కృతి దేశంలో ఉంటే; పాలనలో ప్రజల భాగస్వామ్యానికి అవకాశముంటే ఎన్నికలు ఒకేసారి పెట్టినా ఎవరికీ పెద్ద ఆందోళన ఉండదు. కానీ- అరిచి గీపెట్టినా, రోడ్డెక్కి ఆందోళనలు చేసినా మాట వినేవారు కనిపించని, అణచివేత అనివార్యంగా మారిన పరిస్థితుల్లో జమిలి ఎన్నికల వల్ల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లే అవుతుంది. జమిలి ఎన్నికలు అమలులోకి రావడానికి ముందు- రాష్ట్రాల్లో ప్రభుత్వాధినేత(ముఖ్యమంత్రి)ను నిర్ణీత కాలావధి ప్రాతిపదికన ప్రత్యక్షంగా ఎన్నుకునే ఏర్పాటు చేయాలి. అంటే ఎమ్మెల్యేల ద్వారా కాకుండా ముఖ్యమంత్రి నేరుగా ప్రజల ఓటుతోనే ఎన్నికవ్వాలి. ఆ పదవికి నిర్ణీత కాలవ్యవధి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం రద్దయి మధ్యంతర ఎన్నికల సమస్య తలెత్తదు. ముఖ్యమంత్రిగా పోటీ చేసేవారు రాష్ట్ర ప్రజలందరి ఓటూ అడగాలి. కాబట్టి, పెద్ద మొత్తంలో ఎన్నికలకోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించే అవకాశాలుండవు. ఆ పరిస్థితి వస్తే- విధానాలు, అభ్యర్థి సామర్థ్యం, వ్యక్తిత్వం, నిజాయతీ, గత చరిత్ర, విశ్వసనీయత వంటివి చర్చనీయాంశాలవుతాయి.

మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వాధినేత ఎన్నికలో తమ పాత్ర ఉండదు కాబట్టి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవారు పోటాపోటీగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలవాల్సిన పరిస్థితి ఉండదు. సేవ చేయాలనుకునేవారు, మంచి చట్టాలు తేవాలనుకునేవారు ఎమ్మెల్యేలుగా చట్టసభల్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేలు తమ సిసలైన బాధ్యతకు, అంటే శాసనసభ కార్యకలాపాలకు పరిమితమవుతారు. అప్పుడు వారు స్థానిక ప్రభుత్వాలను తమ ఉనికికి ప్రమాదంగా భావించరు. స్థానిక ప్రభుత్వాలు సైతం ఊపిరి పీల్చుకుంటాయి. ఎక్స్‌అఫీషియో సభ్యుల జాడ్యం వీడుతుంది. స్థానిక నిర్ణయాలు స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారానే జరుగుతాయి. ఈ రకంగా ఆట నియమాల్ని మార్చడంవల్ల జమిలి ఎన్నికల ప్రయోజనం నెరవేరడంతోపాటు రాజకీయం, పాలన బాగుపడతాయి.

ముఖ్యమంత్రుల ప్రత్యక్ష ఎన్నిక విధానంవల్ల ప్రజలకు తమ ఓటు హక్కు శక్తి తెలుస్తుంది. ఈ ఏడాది నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరిపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాం. ఆయన స్థానిక ప్రభుత్వాలనుంచి ఎదిగిన నాయకుడు. స్థానిక సంస్థలను సాధికారికంగా తీర్చిదిద్దడమే ఆయన జీవితమిచ్చే ప్రధాన సందేశం. కలకత్తా కార్పొరేషన్‌కి మేయర్‌గా ఉన్న చిత్తరంజన్‌ దాస్‌- బ్రిటిష్‌ ప్రభుత్వం నియమించే సివిల్‌ సర్వీసు అధికారి వద్దని, పట్టుపట్టి యువ సుభాష్‌ చంద్రబోస్‌ను ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా నియమించారు. కొన్ని నెలల్లోనే బోస్‌ తన సామర్థ్యంతో బలమైన ముద్ర వేయగలిగారు. విప్లవకారులకు మద్దతు ఇచ్చారన్న తప్పుడు ఆరోపణలతో 1924 అక్టోబర్‌లో బోస్‌ని అన్యాయంగా జైలులో నిర్బంధించారు. బోస్‌ కలకత్తాలోని అలీపూర్‌ జైలులో ఉన్నప్పటికీ, మళ్లీ చిత్తరంజన్‌ దాస్‌ పట్టుపట్టడంతో కార్పొరేషన్‌ సీఈఓగా జైలు నుంచే పనిచేయడానికి బోస్‌ను బ్రిటిష్‌ ప్రభుత్వం అనుమతించింది. నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ని బర్మాలోని మాండలే జైలుకు తరలించేంత వరకూ కలకత్తా నుంచే పాలన జరిగేది.

వికేంద్రీకరణకు పెద్దపీట

అనంతరం బోస్‌ కలకత్తా మేయర్‌ అయ్యారు. సుభాష్‌ చంద్రబోస్‌ జైలు నుంచి విధులు నిర్వహించేంత విస్తృతాధికారాలను, స్వయంప్రతిపత్తిని బిటిష్‌ వలస పాలనలోనూ ఎన్నికైన స్థానిక ప్రభుత్వాలు అనుభవించాయి.  ఒకప్పుడు పటేల్‌, నెహ్రూ, బోస్‌, ప్రకాశం పంతులు వంటి గొప్ప జాతీయ నాయకుల్ని తయారు చేసిన స్థానిక ప్రభుత్వాలు ఈవేళ మేధా దారిద్య్రంతో అలమటిస్తున్నాయి. వనరుల కొరతతో కునారిల్లుతున్నాయి. స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడానికి జమిలి ఎన్నికలు ఓ గొప్ప అవకాశం. ఇదే సమయంలో ప్రతి ఓటుకూ విలువనిచ్చే దామాషా ఎన్నికల పద్ధతినీ రాష్ట్రాల్లో తీసుకొస్తే అది జమిలి ఎన్నికలకు మరింత సార్థకతను చేకూరుస్తుంది. ఒక్క ఓటు తక్కువ వచ్చినా ఓటమే అనే ఇప్పుడున్న ఫస్ట్‌-పాస్ట్‌-ది-పోస్ట్‌ (ఎఫ్‌పీటీపీ) ఎన్నికల విధానం భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని అనర్థాల పాలు చేస్తోంది. మనం తెచ్చే మార్పులు ప్రస్తుత సమస్యలకు పరిష్కారాలు ఇవ్వాలి. అంతేకాని సంక్షోభాన్ని మరింత జటిలం చేయకూడదు. పార్లమెంటుకు నిర్ణీత స్థిర కాలవ్యవధి ఉండేలా యునైటెడ్‌ కింగ్‌డమ్‌ 2011లో తెచ్చిన చట్టం తరహాలో మనమూ చట్టాన్ని అమలు చేయవచ్చు. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణలు కావాలి. వివిధ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాలి. ఇంత జరిగినా మన వ్యవస్థలో అడపాదడపా మధ్యంతర ఎన్నికలు వస్తే పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. జమిలి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలలో జరుగుతున్నాయి, తెలంగాణలో 2019లో ‘ముందస్తు’ దాకా ఎన్నికలు కలిపే జరిపారు. కర్ణాటకలో కొన్నేళ్ల క్రితం దాకా జమిలి ఎన్నికలు నిర్వహించారు. కాని ఆయా రాష్ట్రాల్లో జమిలి ఎన్నికల వల్ల రాజకీయంగాని, పరిపాలనగాని గణనీయంగా మారిన దాఖలాలు లేవు. లోక్‌సభకు నిర్ణీత స్థిర కాలవ్యవధి, రాష్ట్ర ప్రభుత్వాల సారథులకు ప్రత్యక్ష ఎన్నిక; రాష్ట్రాల అసెంబ్లీలకు దామాషా పద్ధతిలో ఎన్నికలు; స్థానిక ప్రభుత్వాలకు నిధులు, అధికారాలు ఉండే ఏర్పాట్లు చేయాలి. అప్పుడే కేంద్ర, రాష్ట్ర, స్థానిక అంచెల్లో ఒకేసారి ఎన్నికలు అన్నవి విఫల ప్రయోగం కాకుండా భారత ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేస్తాయి.


 

Posted Date: 30-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం