• facebook
  • whatsapp
  • telegram

ఓట్ల వేటలో వినూత్న వ్యూహాలు

పశ్చిమ్‌ బంగలో పార్టీల విన్యాసాలు

పతంగి నింగికెగరనుందా? నేలమీది గడ్డి పరకల పాలిట మరణశాసనం అవుతుందా? అంతిమంగా కమల వికాసానికి సాయపడుతుందా? ఆల్‌ ఇండియా మజ్లిసే ఇత్తెహాదుల్‌-ముస్లిమీన్‌ (ఏఐఎమ్‌ఐఎమ్‌) పార్టీ ఇప్పటికే పశ్చిమ్‌ బంగ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమైంది. కనీసం 10 స్థానాల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకొంటోంది. ముస్లిం వర్గాన్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారన్న అంశం తెర మీదికొచ్చి ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది మంటను మరింత ఎగదోయడానికి, ముస్లిం మతాధికారి అబ్బాస్‌ సిద్దిఖి ‘ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌’ ఏర్పరచారు. ఏఐఎమ్‌ఐఎమ్‌తో కలిసి పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌కు కష్టాలు తెచ్చిపెట్టారు.

బుజ్జగింపు రాజకీయాలు

అల్పసంఖ్యాక ప్రజలను ఓటుబ్యాంకుగా పరిగణించే సంప్రదాయం పశ్చిమ్‌ బంగ రాజకీయాల్లో ఏనాటినుంచో కొనసాగుతోంది. ఈ ధోరణి ఎన్నికల తరుణానికి మాత్రమే పరిమితం కాదు. మమతా బెనర్జీ ఒక ప్రత్యేక తీరులో ప్రార్థన చేస్తూ కనిపించే కటౌట్లు, పోస్టర్లు తరచూ దర్శనమిస్తూ ఉంటాయి. సరిగ్గా ఒక మతానికి చెందిన పర్వదినాల ముందుగా ఇలాంటివి ప్రత్యక్షమవుతాయి. ఇమాములకు మౌజమ్‌లకు నెలవారీ వేతనం ఇవ్వాలన్న మమత నిర్ణయం ఈ క్రమంలో తాజా పరిణామం. పశ్చిమ్‌ బంగను 34 ఏళ్లు ఏలిన వామపక్ష కూటమి సైతం ఈ బుజ్జగింపు రాజకీయాల పరుగుపందెంలో ఏ మాత్రం వెనకబడలేదు. ప్రతి ఎన్నికల సీజనులో ముస్లిం అల్పసంఖ్యాక వర్గం నుంచి అందినంత దొరకబుచ్చుకోవడానికి ఈ కూటమి అనుసరించే తీరే వేరు. నజరానాలు ప్రకటించడం, మదార్సా బోర్డును సంస్థాగతీకరించడం, అల్పసంఖ్యాక ముస్లిం చదువుల కోసం ఒక విశ్వవిద్యాలయం నెలకొల్పడం... ఇలా రకరకాల ఎత్తుగడలు వేసింది. చిట్టచివరికి వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామనీ ప్రకటించింది. ఆ నిర్ణయం ఏనాడూ అమలు కాలేదు. కారణం మరేం లేదు... ఈ లోపే వారి పాలనకు శుభం కార్డు పడింది. ముస్లిం ఓటర్లు ఎన్నికల్లో కీలక పాత్ర వహిస్తారు కాబట్టి, ఏ పార్టీ అయినా వారికి ప్రాధాన్యమిచ్చేది. 2019 సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనవాయితీని   ధిక్కరించి, భిన్న వ్యూహం అనుసరించింది.

హిందువుల మీద, హిందూ శరణార్థుల మీద దృష్టి సారించి, వారిని ఏకోన్ముఖం చేయడంలో భాజపా విజయం సాధించింది. హిందూ ఓటర్ల ఏకోన్ముఖత సాధించిన అనంతరం, 2016 తరవాతి కాలంలో వామపక్ష కూటమి ఓటర్లు గంపగుత్తగా కమలం పార్టీ వైపు వచ్చేశారు. ఒక ఉజ్జాయింపు అంచనా ప్రకారం, కోటి మంది వామపక్ష ఓటర్లు భాజపా వైపు మళ్లారు. ఫలితంగా ఆ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో అపూర్వరీతిలో 18 స్థానాలు చేజిక్కించుకుంది.

మైనారిటీల్లోనూ ఆదరణ

ఏకోన్ముఖత సిద్ధాంతానికి సమాంతరంగా మరో వాదన ఉంది.   పశ్చిమ్‌ బంగ ముస్లిం అల్పసంఖ్యాకులు భాజపాకి ఎప్పుడూ ఓటేయరన్న మిథ్య ఈ ఎన్నికల్లో పటాపంచలైందన్నదే ఆ వాదన. దీనిపై చర్చించాలంటే- ఆయా నియోజకవర్గాల మొత్తం ఓటర్లలో ముస్లిముల ఓట్లు, పార్టీలవారీగా పడిన ఓట్లు ఇక్కడ తప్పనిసరిగా పరిశీలించాలి. దక్షిణ మల్డా లోక్‌సభ నియోజకవర్గంలో 64శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి 4,44,270 ఓట్లు (34.73 శాతం), తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి 3,51,353 ఓట్లు (27.47 శాతం) గెలుచుకున్నారు. ఇక భాజపా విషయానికి వస్తే, ఆ పార్టీ ఖాతాలో 4,36,048 ఓట్లు (34.09 శాతం) దఖలు పడ్డాయి. జాంగీపూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో దాదాపు 82 శాతం ముస్లిం ఓట్లున్నాయి. ఇక్కడ భాజపా అభ్యర్థి 24.3శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. తృణమూల్‌ కాంగ్రెస్‌ 43.15శాతం, కాంగ్రెస్‌ 19.61శాతం గెలుచుకున్నాయి. ఇతర నియోజకవర్గాల గురించి చెప్పడానికి ఈ రెండు లోక్‌సభ స్థానాలూ సరిపోతాయి. వాస్తవానికి, 2011 జనాభా లెక్కలు, ఆ తరవాతి అంచనాల ప్రకారం చూస్తే, పశ్చిమ్‌ బంగలో 30 శాతం పైగా ఉన్న ముస్లిం జనాభా రమారమి 102 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలను ప్రభావం చేయగలదు. అసెంబ్లీ మొత్తం స్థానాల్లో ఇవి సుమారుగా 35శాతం ఉంటాయి. 2019 ఎన్నికల్లో విజయాలు చవి చూసిన భాజపా... హిందూ ఓటర్లకే తనను పరిమితం చేసుకుంటుందని అనుకోలేం. ‘లౌకికవాది’ మమతా బెనర్జీపై పోరాటంలో కమలనాథులకు ముస్లిం ఓట్లు ఎంతగానో కలిసిరానున్నాయి. ఒక వంక ఏఐఎమ్‌ఐఎమ్‌ పశ్చిమ్‌ బంగ రాజకీయంలో తన వంతు వాటా కోసం గట్టిగా పోటీ పడుతోంది. మరోవంక అయిదు జిల్లాల్లో 90 అసెంబ్లీ నియోజకవర్గాల ముస్లిములపై పట్టు ఉన్న ‘ఫుర్ఫురా శరీఫ్‌’ సూఫీ పవిత్రక్షేత్రం మతాధికారి అబ్బాస్‌ సిద్దిఖీ- తృణమూల్‌ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాలతో 2021 పశ్చిమ్‌ బంగ ఎన్నికల వాతావరణం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది.

ఇంతింతై... వటుడింతై!

పశ్చిమ్‌ బంగలో ఓటర్ల ఏకోన్ముఖత (పోలరైజేషన్‌) గత లోక్‌సభ ఎన్నికలప్పుడు జరిగినంతగా అంతకు ముందెన్నడూ జరగలేదు. 2001, ఆ తరవాత 2006 ఎన్నికల్లో జీజేపీ తటస్థంగా ఉండిపోయింది. వాస్తవానికి 1998, 1999, 2004 సాధారణ ఎన్నికల్లో ఈ పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ కూటమిలో చిన్నభాగస్వామిగా ఉంటూ వచ్చింది. అయినా సరే, రాష్ట్ర ఎన్నికల విషయానికి వస్తే తృణమూల్‌ పార్టీ కాంగ్రెస్‌తో చేతులు కలిపేది. ఆఖరుకు వామపక్ష కూటమితో 2011లో జరిపిన అంతిమ సమరంలోనూ ఆ పార్టీ జట్టు కట్టింది కాంగ్రెస్‌తోనే కానీ భాజపాతో కాదు. అప్పటి ఎన్నికల్లో కమలం పార్టీ 4.1శాతం ఓట్లు సంపాదించింది. మమత పార్టీ 2016లో ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగి లెఫ్ట్‌ఫ్రంట్‌ - కాంగ్రెస్‌ కూటమిని, భాజపాను ఓడించి విజయకేతనం ఎగరేసింది. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా భాజపా ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ సమయంలోనూ అది సాధించిన ఓట్లు   10శాతం మాత్రమే. 2019 ఎన్నికల్లో అదే భాజపా అసాధారణంగా 40శాతం ఓట్లు కైవసం చేసుకుని పశ్చిమ్‌ బంగ ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించడం విశేషం. ఆ ఓట్లు భాజపా పట్ల అభిమానంతో పడినవైనా కావచ్చు. లేదా వామపక్ష కూటమి ఓట్లు 27 శాతం నుంచి 7.5 శాతానికి కుప్పకూలిన ఫలితంగా- కాంగ్రెస్‌ ఓట్లు ఏడు శాతం, తృణమూల్‌ ఓట్లు సుమారు రెండు శాతం క్షీణించడం కారణంగా పెరిగినవైనా కావచ్చు.

- దీపాంకర్‌ బోస్‌

Posted Date: 12-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం