• facebook
  • whatsapp
  • telegram

కేరళ ఆనవాయితీ మారేనా?

వామపక్షాలవైపే సర్వేల మొగ్గు

అర్ధశతాబ్దం నుంచి అప్రతిహతంగా కొనసాగుతున్న ఆనవాయితీని ఈసారి కేరళ తిరగరాస్తుందా? తమిళనాడు తరహాలో పాలకపక్షమే అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? అసెంబ్లీ ఎన్నికలకు ముందు వస్తున్న సర్వేలను చూస్తుంటే అది దాదాపుగా ఖాయమే అనిపిస్తోంది. తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేలు ఒకదాని తరవాత మరొకటి అధికారంలోకి వస్తుండేవి. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఆ సంప్రదాయాన్ని జయలలిత ఛేదించారు. వరసగా రెండోసారీ గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని నిలబెట్టుకున్నారు. తమిళనాడుకు పొరుగునే ఉన్న కేరళలోనూ ఇలాంటి సంప్రదాయమే ఉంది. అయిదు దశాబ్దాలుగా ఒకసారి ఎల్‌డీఎఫ్‌, మరోసారి యూడీఎఫ్‌ అధికార పగ్గాలు చేపడుతున్న ఈ రాష్ట్రంలో- ఈసారి వరసగా రెండోసారి ఎల్‌డీఎఫ్‌ కూటమి అధికారాన్ని దక్కించుకునే సూచనలు కనిపిస్తున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఇప్పటిదాకా వచ్చిన సర్వేలన్నింటినీ క్రోడీకరిస్తే- ఎల్‌డీఎఫ్‌ కూటమికి కనీసం 72 నుంచి గరిష్ఠంగా 91 స్థానాల వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 140 స్థానాలున్న కేరళలో సర్కారు ఏర్పాటుకు కనీసం 71 స్థానాలు అవసరం. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఎల్‌డీఎఫ్‌ దాన్ని సులభంగానే సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేరు బంగారం స్మగ్లింగ్‌ కేసులో వినిపించినా, అది ఓటర్లను ఎంతమేర ప్రభావితం చేస్తుందన్నదాన్ని బట్టి, తుది ఫలితాలు ఆధారపడి ఉంటాయి.

కనిపించని విజయావకాశాలు

ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమికి మరోసారి నిరాశ తప్పేట్లు లేదు. ఇప్పటిదాకా వెలువడిన సర్వేలలో దాదాపు అన్నీ ఎల్‌డీఎఫ్‌ కూటమివైపే మొగ్గు చూపగా, కాంగ్రెస్‌ అధిష్ఠానం సొంతంగా చేయించుకున్న సర్వేలో మాత్రమే యూడీఎఫ్‌ కూటమికి 73 స్థానాలు దక్కవచ్చన్న అంచనా వినిపించింది. 2011లో ఆ కూటమికి వచ్చిన 72 స్థానాలకంటే అది ఒకటి ఎక్కువ. మరోవైపు, 88 ఏళ్ల వయసులో ఉన్న ‘మెట్రోమ్యాన్‌’ శ్రీధరన్‌పై భాజపా పెద్ద ఆశలే పెట్టుకున్నా, ఆ పార్టీకి భారీ విజయావకాశాలైతే కనిపించడం లేదు. శ్రీధరన్‌కు మంచి పేరే ఉన్నా, ఆయన పార్టీకి అధికారాన్ని లేదా గౌరవప్రదమైన స్థానాలు సాధించిపెట్టగలరా అనేది అనుమానమే. కమలదళం ఈసారి గణనీయంగా ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగే సూచనలు కొన్ని నియోజక వర్గాల్లో కనిపిస్తున్నట్లు రాజకీయ పండితులు అంటున్నారు. ఎన్డీయేకు కొన్నిచోట్ల దాదాపు 35 శాతం వరకు ఓట్లు పడినా, ఎల్‌డీఎఫ్‌ కూటమి ముందు నిలిచి గెలవడం కష్టమే. ఈసారి యూడీఎఫ్‌ విజయావకాశాలు అంతంతమాత్రంగానే ఉండటంతో స్వింగ్‌ ఓట్లన్నీ ఎల్‌డీఎఫ్‌ కూటమికి పడి వారి విజయావకాశాలను పెంచుతాయన్నది విశ్లేషకుల మాట.  అసలు సిసలు కమ్యూనిస్టు అయిన పినరయి విజయన్‌ (75) అదృష్టాన్ని నమ్ముకోరు. గత ముఖ్యమంత్రుల్లా కాకుండా తన ప్రభుత్వ నిర్ణయాలపై పూర్తి పట్టు కొనసాగిస్తారు. ప్రభుత్వంపై తనదైన ముద్ర ద్వారా రాష్ట్రంలో అధికార కేంద్రంగా నిలిచారు. ముఖ్యమంత్రి అయిన తొలిరోజు నుంచే క్షేత్రస్థాయిలో కూటమి పటిష్టీకరణకు కృషిచేశారు. ఐఎంఎఫ్‌లో ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేసిన గీతాగోపీనాథ్‌ లాంటివారిని సలహాదారులుగా తీసుకుని ప్రభుత్వ సేవలను మెరుగుపరచే ప్రయత్నాలు చేశారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఆయనకున్న ఆదరణ కారణంగా వరద సాయానికి రూ.4,912 కోట్లు వస్తే, కొవిడ్‌ సమయంలో మరో రూ.523 కోట్లు వచ్చాయి. వరదలతో ఇళ్లు కోల్పోయిన కుటుంబాల కోసం ఇళ్లు కట్టించి ఇవ్వడానికి భూములు అడిగితే 100 ఎకరాలు విరాళంగా వచ్చాయి. 2020లో బయటపడిన బంగారం స్మగ్లింగ్‌ కేసులో ముఖ్యమంత్రితో పాటు స్పీకర్‌, మరో ముగ్గురు మంత్రులకూ భాగస్వామ్యం ఉందని ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్‌ వెల్లడించడం కొంతవరకు ప్రతికూలాంశమే.

కూటమికి కొత్త మిత్రులు

కేరళ కాంగ్రెస్‌-మణి (కేసీ-ఎం) వర్గం ఎల్‌డీఎఫ్‌లో చేరడం ఆ కూటమికి మేలు కలిగించే పరిణామమే. ఇది- మధ్య కేరళలో కూటమి అవకాశాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. గతంలో యూడీఎఫ్‌లో భాగంగా ఉన్న ఈ పార్టీ ఎన్నికలకు ముందు వైఖరిని మార్చుకుంది. మలబార్‌ కేథలిక్‌ వర్గంలో కేసీ-ఎం అధినేత జోస్‌ కె.మణి ద్వారా కొంతవరకు పట్టు సాధించవచ్చని ఎల్‌డీఎఫ్‌ నేతలు భావిస్తున్నారు. అటు నుంచి కనీసం 2-3 శాతం ఓట్లు పడినా తలరాతలు మారిపోతాయి. ఉత్తర కేరళలోని ముస్లిం ఓట్లు మాత్రం ప్రధానంగా ఐయూఎంఎల్‌ ఖాతాలో పడే అవకాశముంది. వాటినీ కొంతవరకు సాధించగలిగితే ఇక తమకు ఢోకా ఉండదన్నది ఎల్‌డీఎఫ్‌ నేతల భావన. కేరళ జనాభాలో 27 శాతంగా ఉన్న ముస్లిములు అక్కడి ఎన్నికల ఫలితాలను బాగానే ప్రభావితం చేయగలరు. ఎన్నికల ప్రచారంలో మత్స్యకారులతో ఈత కొట్టి, యువతతో కలిసి బస్కీలు తీసిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ తమ పార్టీ తలరాతను ఎంతవరకు మార్చగలరనేది ఎన్నికల ఫలితాలతో తేటతెల్లమవుతుంది. 

- కామేశ్వరరావు పువ్వాడ
 

Posted Date: 13-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం