• facebook
  • whatsapp
  • telegram

అసోమ్‌పై భాజపా ఆశలు!

‘తూర్పు వైపు అడుగు’లో ఆ రాష్ట్రమే కీలకం

ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో అసోమ్‌పై భాజపా పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఈశాన్య భారత్‌లో పార్టీ వ్యూహాల ఆచరణకు అసోం కీలక వేదిక కానుంది. ప్రస్తుతం పశ్చిమ్‌ బంగ, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలలో ఎన్నికలు జరుగుతుండగా- అసోమ్‌లో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం కొనసాగుతోంది. ఎన్డీయే ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న ‘తూర్పువైపు అడుగు (ఏఈపీ)’ విధానంలో అసోం ముఖ్య భూమిక పోషించనుంది. ఈశాన్య భారత్‌ను- మయన్మార్‌ నుంచి జపాన్‌ వరకు పలు దేశాలతో సాంస్కృతిక, జాతులపరమైన సంబంధాలు బలోపేతం చేయడంలో ఏఈపీ కీలక భూమిక పోషించనుంది. ఇండో-చైనా ప్రాంతంలో చైనా ప్రభావం అంతకంతకూ పెరిగిపోతున్న క్రమంలో దాన్ని నిలువరించేందుకు భారత్‌, జపాన్‌ ఇరు దేశాలకూ ఏఈపీ ఎంతగానో తోడ్పడనుంది. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం జపాన్‌ సహకారం అందిస్తోంది. ఇందులో అసోం, ఈశాన్య భారత్‌ ప్రాంతాలు భౌగోళికంగా కీలకంగా మారాయి. 2017లో ‘ఈశాన్య అభివృద్ధికి భారత్‌-జపాన్‌ సమన్వయ వేదిక’ను టోక్యో ఏర్పాటు చేసింది. ఈశాన్య భారత్‌లో మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ఈ సంస్థకు రూపకల్పన చేశారు. ఈ ప్రాంతంలో జపాన్‌ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడానికి ముఖ్య కారణం చైనా ప్రభావమే. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) నేతృత్వంలో ప్రభుత్వం కొనసాగుతున్న మిజోరం రాష్ట్రం తప్పించి ఈశాన్యంలోని మిగతా ఆరు రాష్ట్రాల్లో భాజపా ప్రమేయం కలిగిన ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌, త్రిపురలలో భాజపా ఆధ్వర్యంలో ప్రభుత్వాలు ఉండగా- మేఘాలయ, నాగాలాండ్‌లలో అధికార కూటముల్లో కమలదళం భాగస్వామ్య పక్షంగా కొనసాగుతోంది. ఈశాన్యానికి సింహద్వారం వంటి అసోమ్‌లో అధికారాన్ని తమ చేతుల్లో ఉంచుకోవడం భాజపాకు చాలా కీలకం. దీనివల్ల మొత్తం ప్రాంతంపై తన పట్టును కొనసాగించే అవకాశం ఉంటుంది.

ఒకవైపు పరిస్థితులు ఇలా ఉండగా, మరోవైపు భాజపా ఎదుట ఎన్నో సవాళ్లు పొంచి ఉన్నాయి. వాటిన్నింటికీ పరిష్కారాలు వెదకాల్సి ఉంది. ముందుగా... టికెట్ల పంపిణీపై పార్టీలో అంతర్గతంగా నెలకొన్న విభేదాలు, అసంతృప్తుల్ని చల్లార్చాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ ఇతర పార్టీల నుంచి పోటెత్తిన నేతల కారణంగా, పార్టీనే నమ్ముకుని ఉన్న శ్రేణులకు కొత్తవారికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. పైగా- అసోం సీఎం సోనోవాల్‌, శక్తిమంతమైన మరో మంత్రి హిమంత బిశ్వశర్మల మధ్య సంబంధాలు అంతంత మాత్రమే. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా వంటివారు నేరుగా రంగంలోకి దిగాల్సి వస్తోంది. చాలామంది నిపుణుల అభిప్రాయం ప్రకారం... ఈసారి భాజపాకు పెద్ద సంఖ్యలో సీట్లు వస్తాయని అంచనాలు ఉన్నా, ఆ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే పరిస్థితులు ఉంటాయని గట్టిగా చెప్పడం కష్టమేననే అభిప్రాయాలున్నాయి. భాజపా పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) దూకుడుగా సమర్థించడాన్ని బ్రహ్మపుత్ర లోయలో అస్సామీ భాష మాట్లాడే ప్రజలు అంతగా ఆమోదించడం లేదు. సీఏఏపట్ల రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈసారి రాష్ట్ర రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన అస్సాం జాతీయ పరిషత్‌ (ఏజేపీ), రైజోర్‌దళ్‌ కూటమికి రాజకీయ అంచనాలను తారుమారు చేసే అవకాశాలూ లేకపోలేదని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికైతే ఇది కాగితంపై శక్తిమంతమైన సంకీర్ణంగానే కనిపిస్తోంది. పశ్చిమ అసోమ్‌లో కాంగ్రెస్‌, ఏఐయూడీఎఫ్‌, బోడో పీపుల్స్‌ ఫ్రంట్‌(బీపీఎఫ్‌)లతో కూడిన కూటమి నుంచి భాజపాకు హోరాహోరీ పోరు ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లు అంచనా. అసోమ్‌లోని తేయాకు తోటల కార్మికుల మనసులు గెలుచుకునేందుకు కాంగ్రెస్‌ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. తేయాకు కార్మికులు సుమారు 40 స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగలిగే పరిస్థితుల్లో ఉన్నారు. కాంగ్రెస్‌ ప్రచార కార్యక్రమంలో భాగంగా పార్టీనేత ప్రియాంక గాంధీ తేయాకు తోటల కార్మికులను పరామర్శించారు. వారి కష్టాలను సావధానంగా విన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే రోజుకు రూ.365 కూలీ గిట్టుబాటు అయ్యేలా చూస్తామని రాహుల్‌గాంధీ తన ప్రచారంలో హామీ ఇచ్చారు. మరోవైపు, భాజపా ప్రతిపక్షాలు తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాయి. కొవిడ్‌ మహమ్మారి కారణంగా చోటుచేసుకున్న ఆర్థిక ఇక్కట్ల ప్రభావం పార్టీల నిధులపైనా పడింది. మొత్తంగా- ఈసారి పరిస్థితులు భాజపాకు ఆశావహంగానే కనిపిస్తున్నా, అధిగమించాల్సిన సవాళ్లు మాత్రం అనేకమున్నాయి.

- సంజీవ్‌
 

Posted Date: 23-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం