• facebook
  • whatsapp
  • telegram

చైనా గుప్పిట్లో లేం!

‘ఈనాడు’తో శ్రీలంక మంత్రి లక్ష్మణ్‌ నమల్‌ రాజపక్స

‘మా నింగి, నేల, నీటిని ఉపయోగించి సరిహద్దు దేశాలపై దుశ్చర్యలకు పాల్పడే వెసులుబాటును శ్రీలంక ఏ దేశానికీ కల్పించదు. శ్రీలంక చైనా కబంధహస్తాల్లో చిక్కుకుందని, అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నది మునుపటి ప్రభుత్వం దేశంపై చేసిన దుష్ప్రచారమే. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు కోరుకుంటున్నామే తప్పించి విభేదాలను కాదు. పెట్టుబడిదారులకు రాయితీలు ఇచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నాం. భారతదేశంతో సత్సంబంధాలు కొనసాగిస్తాం. అంతర్జాతీయ సరిహద్దులు పూర్తిస్థాయిలో తెరచుకున్న తరవాత హైదరాబాద్‌-కొలంబో మధ్య విమాన అనుసంధానం పెంచుతాం’ అని శ్రీలంక క్రీడలు, యువజన సర్వీసుల మంత్రి; ప్రధానమంత్రి మహింద రాజపక్స కుమారుడైన లక్ష్మణ్‌ నమల్‌ రాజపక్స స్పష్టం చేశారు. కొలంబో నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఆయన ‘ఈనాడు’ ప్రతినిధి ఐ.ఆర్‌.శ్రీనివాసరావుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ప్రశ్న: కరోనా కల్లోలం నుంచి శ్రీలంక ఏ మేరకు తేరుకుంది?

జవాబు: ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. భారత ప్రధాని మోదీ వ్యాక్సిన్‌ పంపారు. కరోనాతో మా ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిపోయింది. అంతర్జాతీయ సరిహద్దులు మూసివేయడంతో ఆర్థికంగా కొంత ఇబ్బంది నెలకొంది.

ప్రశ్న: చైనా నుంచి భారీగా అప్పులు చేయడంతో శ్రీలంక ఆ దేశ కబంధ హస్తాల్లో చిక్కుకుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇది ఎంత మేరకు వాస్తవం?

జవాబు: మునుపటి ప్రభుత్వం సృష్టించిన అభూత కల్పనలు అవి. దేశ పునర్నిర్మాణానికి చాలా దేశాల నుంచి అప్పులు చేశాం. అలాగే చైనా నుంచీ తీసుకున్నాం. అంత మాత్రాన ఆ దేశ కబంధ హస్తాల్లో శ్రీలంక ఉందనడం సబబు కాదు. ఏ దేశం నుంచి అప్పు తీసుకున్నా సకాలంలోనే చెల్లించాం.  

ప్రశ్న: పెట్టుబడులను ఆకర్షించేందుకు శ్రీలంక ఇప్పటి వరకు ఎలాంటి వ్యూహాన్నీ ప్రకటించినట్లు లేదు... అవకాశాలు ఎలా వస్తాయి?

జవాబు: పెట్టుబడులు తరలి రావాలంటే ప్రత్యేక రాయితీల వ్యవస్థ అవసరం. అధికారాన్ని చేపట్టి ఆరు నెలలు అవుతోంది. త్వరలో ఆ విధానాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే స్థిరాస్తి రంగంలో భారతదేశం నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో శ్రీలంక పారిశ్రామికవేత్తలు వస్త్ర రంగంలో పెట్టుబడులు పెట్టారు. తెలంగాణలోనూ ఆ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు ఆలోచిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి.

ప్రశ్న: హిందూ మహాసముద్రంపై చైనా పట్టు పెరిగిన విషయమై ఆసియా దేశాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రభావం శ్రీలంకపై ఎలా ఉంటుందని భావిస్తున్నారు?

జవాబు: మా దేశ నింగి, నేల, నీరును ఏ దేశమూ, ఏ దేశానికి వ్యతిరేకంగా వాడుకునేందుకూ మా ప్రభుత్వం అంగీకరించదు. ప్రత్యేకించి సరిహద్దు దేశమైన భారత్‌కు హాని తలపెట్టేందుకు ఎవరికీ, ఎప్పటికీ అవకాశం కల్పించం.

ప్రశ్న: చైనా ఒత్తిడి మేరకే ఈస్ట్‌ కంటైనర్‌ టెర్మినల్‌ (ఈసీటీ) నిర్మాణ పనులను భారత్‌-జపాన్‌ కన్సార్షియానికి అప్పగించేందుకు శ్రీలంక ప్రభుత్వం నిరాకరించిందంటున్నారు. ఈ ప్రభావం ఎలా ఉంటుందనుకుంటున్నారు?

జవాబు: ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో లోపాలు ఉన్నాయన్న అసంతృప్తి ప్రజల్లో బాగా ఉంది. అందులోని వాస్తవాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ ప్రతిపాదించిన నిబంధనలపై భారత్‌-జపాన్‌ గుత్తేదారుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఒక అడుగు వెనక్కు వేయాల్సి వచ్చింది. చైనా ప్రభుత్వ ఒత్తిడి మేరకు రద్దు చేశామనడం వాస్తవం కాదు. భారతదేశంతో సత్సంబంధాలనే శ్రీలంక కోరుకుంటుంది. ప్రస్తుతం నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హంబన్‌టొటపోర్టు అభివృద్ధిని మా నాన్న గతంలో అధికారంలో ఉన్నప్పుడు భారతదేశానికే ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అప్పట్లో అది కార్యరూపందాల్చలేదు. భారత్‌ నిరాకరించడంవల్లే చైనాకు దాన్ని ఇవ్వాల్సి వచ్చింది. జాఫ్నా పునర్నిర్మాణంలో భాగంగా భారత ప్రధాని మోదీ పెద్ద సంఖ్యలో ఇళ్ల నిర్మాణానికి సహాయం అందజేశారు. రైల్వే లైన్ల నిర్మాణంలోనూ భారత్‌ అందిస్తున్న సహకారాన్ని ఎప్పటికీ మరిచిపోం.

ప్రశ్న: భారత్‌-శ్రీలంకల మధ్య వాణిజ్యం తక్కువగా ఉంది... మరింతగా పెంచుకునేందుకు ఏయే రంగాల్లో అవకాశాలు ఉన్నాయి?

జవాబు: అవును. రెండు దేశాల మధ్య వాణిజ్యం తక్కువగానే ఉంది. మరింత విస్తృతం చేసుకునేందుకు రెండు దేశాలకూ మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి సముద్ర వాణిజ్యానికి చాలా అవకాశం ఉంది. పర్యాటక రంగంలోనూ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భారతదేశం నుంచి శ్రీలంకకు వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువే. అంతర్జాతీయ సరిహద్దులు పూర్తి స్థాయిలో తెరుచుకున్న తరవాత హైదరాబాద్‌కు విమానాల అనుసంధానం పెంచుతాం. తెలుగు, తమిళ సినిమాలకు శ్రీలంకలో ఆదరణ అధికం. సినిమాల చిత్రీకరణ కోసం తరలివచ్చేవారి సంఖ్యను మరింత పెంచుకునేందుకుగల అవకాశాల్ని పరిశీలిస్తున్నాం.

ప్రశ్న: ఆసియాలో వారసత్వ రాజకీయాలు కనిపిస్తాయి. ప్రధానమంత్రి మహింద రాజపక్స కుమారుడిగా రానున్న రోజుల్లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

జవాబు: వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లింది. ప్రజల్లో చైతన్యం పెరిగింది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఎక్కడ ఏం జరుగుతోందన్నది క్షణాల్లో తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో వారసత్వం అనేది రాజకీయాల్లోకి రావడం వరకే పనికి వస్తుంది. నిలదొక్కుకోవడమన్నది పనితీరు, ప్రజామోదంపైనే ఆధారపడి ఉంటుందని నమ్ముతాను.

Posted Date: 18-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం