• facebook
  • whatsapp
  • telegram

మమత బలం కమలానికే లాభం?

అనుకూల ప్రత్యర్థి

ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం... సామాన్యులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. దేశంలో గూడుకట్టుకుంటున్న ప్రజాగ్రహాన్ని జాతీయ పార్టీ కాంగ్రెస్‌ ఎన్నికల అస్త్రంగా తనకు అనుకూలంగా మలచుకోలేకపోతోంది. నాయకత్వ లోపం, పార్టీ రాష్ట్ర శాఖల్లో కుమ్ములాటలు ఆ పార్టీని బలహీనపరుస్తున్నాయి. దాంతో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఇంకా మిగిలి ఉన్న కొద్దోగొప్పో ఓటు బ్యాంకులను డీఎంకే, వైసీపీ, టీఆర్‌ఎస్‌, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, రాష్ట్రీయ జనతాదళ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) వంటి లౌకికవాద, ప్రాంతీయ పార్టీలు చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వీటన్నింటిలోకి టీఎంసీ ఎక్కువ లబ్ధి పొందగల స్థితిలో ఉంది. స్వరాష్ట్రం పశ్చిమ్‌ బంగతోపాటు గోవా, త్రిపుర, ఈశాన్య రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ ఓట్లను తన ఖాతాలో వేసుకొనే అవకాశాలు టీఎంసీకి ఉన్నాయి. అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుస్మితాదేవ్‌, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కుమారుడు, మాజీ ఎంపీ అభిజిత్‌, గోవా మాజీ ముఖ్యమంత్రి లూయిజినో ఫెలీరో టీఎంసీలో చేరారు. త్వరలో జరగనున్న గోవా ఎన్నికల కోసం టీఎంసీ అధినేత మమతా బెనర్జీ స్వయంగా ప్రచారం చేయనున్నారు. త్వరలోనే యూపీలోనూ పర్యటించనున్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కొత్త శక్తినందించాలని ప్రియాంకా గాంధీ శ్రమిస్తున్నా- ఇప్పటికే అక్కడి ఇద్దరు సీనియర్‌ నేతలు టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు.

కాంగ్రెస్‌కు గండి

ఇటీవల పశ్చిమ్‌ బంగ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ద్వారా భారతీయ జనతా పార్టీని నిలువరించగల ఏకైక లౌకిక పార్టీ తానేనని టీఎంసీ గట్టి సంకేతాలు ఇచ్చింది. ఆ రాష్ట్రంలో 2016 ఎన్నికల్లో 12.25శాతంగా ఉన్న కాంగ్రెస్‌ ఓట్ల శాతం 2021 ఎన్నికలకు వచ్చేసరికి 3.03శాతానికి పడిపోయింది. కాంగ్రెస్‌కు పడాల్సిన ఓట్లు టీఎంసీ ఖాతాలోకి చేరాయి. గతంలో 44 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌ ఈసారి ఒక్క సీటునూ రాబట్టుకోలేకపోయింది. బెంగాల్‌ జనాభాలో 30శాతం ఉన్న ముస్లిముల ఓట్లు కాంగ్రెస్‌ నుంచి టీఎంసీకి బదిలీ అయ్యాయి. భాజపా వ్యతిరేక పార్టీలన్నీ ఏకం కావాలనే విషయంలో ప్రతిపక్షాలు ఏకీభవిస్తున్నాయి. ఈ మేరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రాహుల్‌ గాంధీ చొరవతో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశాలకు టీఎంసీ దూరంగా ఉండిపోయింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు నాయకత్వం వహించే సత్తా రాహుల్‌గాంధీకి లేదని మమత కోల్‌కతాలో వ్యాఖ్యానించారు. ఆ అర్హత తనకే ఉందని ఆమె భావిస్తున్నారన్నది సుస్పష్టం. ఈ విషయంలో రాహుల్‌ కన్నా మమతకు ఎక్కువ అనుకూలాంశాలు ఉన్న మాట నిజం. ప్రధాని నరేంద్ర మోదీ తరహాలో మమతసైతం సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. బెంగాల్‌లో 34 ఏళ్ల వామపక్ష పాలనను ఎదిరించి నెగ్గిన చరిత్ర ఆమెది. తరవాత మోదీ-అమిత్‌ షా ద్వయాన్నీ ఎదుర్కొని ఎన్నికల్లో విజయం సొంతం చేసుకున్నారు. తద్వారా మోదీ తరవాత దేశ నాయకత్వం చేపట్టే సత్తా తనకే ఉందని మమత విశ్వసిస్తున్నారు. వివిధ రాష్ట్రాల కాంగ్రెస్‌ శాఖల్లో సోనియా కుటుంబ నాయకత్వ తీరుపై అసంతృప్తి గూడుకట్టుకున్న నేతలు చాలా మంది ఉన్నారు. లౌకిక వాదానికి కట్టుబడి వారంతా భాజపాలో చేరలేరు. మోదీ-షాలపై విరుచుకుపడే టీఎంసీ వైపు వారు సహజంగానే ఆకర్షితులవుతారు. మైనారిటీ ఓట్లు టీఎంసీకి పడే అవకాశాలూ ఎక్కువే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఎదిరించే శక్తి కాంగ్రెస్‌కు కాకుండా టీఎంసీకే ఉందనే అభిప్రాయం మైనారిటీలలో బలపడిన కొద్దీ కాంగ్రెస్‌ నుంచి టీఎంసీలోకి వలసలు పెరగవచ్చు. దీనివల్ల జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడితే అది భాజపాకే ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది! బెంగాల్‌ను దాటి ఇతర రాష్ట్రాల్లో పాగా వేయడానికి మమత ప్రయత్నిస్తే- అది కాంగ్రెస్‌ ఓటు బ్యాంకులకు గండికొట్టి తనకు లబ్ధి చేకూరుస్తుందని భాజపా సంబరపడుతోంది. మమత మిత్రురాలు రూపంలో ఉన్న శత్రువు అని, ప్రతిపక్ష శిబిరాన్ని బలహీనపరచి భాజపాకు లబ్ధి చేకూర్చే ప్రత్యర్థి అని కాంగ్రెస్‌ నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌధరి వ్యాఖ్యానించారు. ఆయన బెంగాల్‌ రాజకీయాల్లో మమతకు ప్రధాన ప్రత్యర్థి.

వాటిపైనే గురి

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు బదులుగా భాజపాకు ప్రత్యామ్నాయంగా ఎదిగే సత్తా టీఎంసీకి ఉందా అన్నదీ మరోవైపు అనుమానమే. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ పశ్చిమ్‌ బంగ, త్రిపురల్లో సీట్లన్నీ గెలుచుకుని, బయటి రాష్ట్రాలº్ల 25 స్థానాలను కైవసం చేసుకోగలిగినా దాని మొత్తం సీట్లు తక్కువగానే ఉంటాయి. ఒకవేళ ఇతర రాష్ట్రాల్లో టీఎంసీ 25 సీట్లు గెలిస్తే కాంగ్రెస్‌ బలం ఆ మేరకు తగ్గిపోతుంది. కాంగ్రెస్‌ మొత్తం సీట్లు 100 లోపునకు పరిమితమైతే కేంద్రంలో యూపీఏ తరహా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు మరింతగా క్షీణిస్తాయి. ప్రస్తుతం స్టాలిన్‌, శరద్‌ పవార్‌, లాలూ, అఖిలేష్‌ తదితరులు భాజపా పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తున్న మాట నిజమే. టీఎంసీ తమ ప్రాంతాల్లోకి చొచ్చుకువస్తే వారంతా ఆ పార్టీకి గట్టి ప్రత్యర్థులుగా మారిపోయే అవకాశాలే ఎక్కువ. ఈ సంగతి మమతకు తెలుసు కనుక ప్రాంతీయ పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాలపై కాకుండా, కాంగ్రెస్‌ ప్రాబల్య ప్రాంతాలపై కన్నేశారు. ఈ క్రమంలో హస్తంపార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాల్లోనే టీఎంసీ బలపడితే- కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ను సాధించాలని ఆశిస్తున్న భారతీయ జనతా పార్టీకి ఇంతకన్నా లాభించే అంశం మరొకటి ఉండబోదు.

భాజపా వ్యతిరేక ఓట్లపై దృష్టి

భారతీయ జనతా పార్టీ జాతీయవాదానికి హిందూత్వను మేళవించి ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రజాకర్షక అజెండాతో దూకుడుగా ముందుకు సాగుతోంది. దానికి భిన్నంగా టీఎంసీ మైనారిటీలు, మహిళలు, పేదలకు ప్రాధాన్యమిస్తూ వామపక్ష మధ్యేవాద సిద్ధాంతాలు, సంక్షేమ కార్యక్రమాలతో ముందడుగు వేస్తోంది. ఇదే అజెండాతో దేశంలోని మిగతా రాష్ట్రాల్లోనూ భాజపా వ్యతిరేక ఓట్లను చేజిక్కించుకోవాలని సంకల్పిస్తోంది. అంటే, సంప్రదాయంగా కాంగ్రెస్‌కు పడే ఓట్లను తనవైపు తిప్పుకోవాలని చూస్తోంది. ఉత్తర్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 40శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తుందని ఆ పార్టీ నేత ప్రియాంకా గాంధీ ప్రకటించారు. తాము ఆ పని ఎప్పుడో చేశామని, 2019 ఎన్నికల్లో దాదాపు 40శాతం సీట్లను మహిళలకే ఇచ్చామని టీఎంసీ స్పష్టం చేసింది. ఈ విషయంలో తానే ముందున్నట్లు వివరించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ్‌ బంగలోని 42 సీట్లలో 17 మహిళలకు ఇచ్చారు. పైగా నేడు దేశంలో మమతే ఏకైక మహిళా ముఖ్యమంత్రి!

- రాజీవ్‌ రాజన్
 

Posted Date: 28-10-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం