• facebook
  • whatsapp
  • telegram

పంజరంలో శాంతికపోతం

సూచీకి జైలు శిక్ష

మయన్మార్‌లో పౌర ప్రభుత్వం ఏర్పడకుండా గత ఫిబ్రవరిలో మోకాలడ్డిన సైన్యం తాజాగా మరో వికృత చేష్టకు పాల్పడింది. ఆ దేశంలో ప్రజాస్వామ్య పోరాటాలకు దిక్సూచిగా నిలిచిన నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ(ఎన్‌ఎల్‌డీ) అధినాయకురాలు ఆంగ్‌ శాన్‌ సూచీకి ఓ కోర్టు ద్వారా నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. సైన్యానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడంతోపాటు కొవిడ్‌ నియంత్రణ మార్గదర్శకాలను ఉల్లంఘించారన్న నామమాత్ర అభియోగాలను అందుకు కారణంగా చూపింది. పదవీచ్యుతుడైన అధ్యక్షుడు యూ విన్‌ మయంట్‌కూ అదే శిక్షను ఖరారు చేసింది. అనంతరం వారి శిక్షను రెండేళ్లకు తగ్గించింది.

గతేడాది నవంబరులో జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డీ ఘన విజయం సాధించడంతో తమ అధికారాల్లో కోతపడేలా రాజ్యాంగానికి ఆ పార్టీ సవరణలు తెస్తుందేమోనని మయన్మార్‌ సైన్యం ఆందోళన చెందింది. ఈ ఏడాది ఆరంభంలో ఆత్యయిక పరిస్థితి విధించి పాలనా పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకునేందుకు యత్నించింది. సంబంధిత దస్త్రంపై సంతకం చేసేందుకు మయంట్‌ నిరాకరించడంతో ఆయన్ను జైలుకు పంపింది. తమకు మద్దతుగా ఉన్న ఉపాధ్యక్షుడు మయంట్‌ స్వెని తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించిమరీ ఆత్యయిక స్థితిని తీసుకొచ్చింది. సూచీ సహా వందలమంది నేతలను నిర్బంధించింది. ఆ తరవాతి నిరసనల్లో 1,300 మందికిపైగా పౌరుల ప్రాణాలను బలితీసుకుంది. జుంటా(సైనిక ప్రభుత్వం)ను ఆయుధాలతోనే ఎదుర్కొనేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు సిద్ధమవుతున్నాయి. పెద్ద సంఖ్యలో యువత అడవుల్లో తుపాకులు, హ్యాండ్‌ గ్రెనేడ్‌లతో శిక్షణ పొందుతున్నారు. మూడు దశాబ్దాల విరామం తరవాత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ బర్మా(సీపీబీ) తమ ప్రజావిమోచన సైన్యాన్ని పునఃస్థాపించింది. దీంతో అంతర్యుద్ధం దిశగా మయన్మార్‌ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

సూచీ 15 ఏళ్లకుపైగా గృహనిర్బంధంలో ఉండి 2010లో విముక్తి పొందారు. అత్యంత ప్రజాదరణ కలిగిన ఆమెను శాశ్వతంగా తమకు అడ్డు తొలగించుకోవాలని జుంటా భావించింది. అందులో భాగంగానే కొవిడ్‌ మార్గదర్శకాల ఉల్లంఘన, వాకీటాకీల దిగుమతిపై నిషేధాన్ని ఉల్లంఘించడం వంటి 11 రకాల అభియోగాలు మోపింది. అవన్నీ రుజువైతే సూచీకి గరిష్ఠంగా 102 ఏళ్ల జైలుశిక్ష పడుతుంది. వాస్తవానికి కొన్నేళ్లుగా సైన్యంతో సూచీ సన్నిహితంగానే ఉంటున్నారు. రోహింగ్యాలపై సైన్యం ఊచకోతను సమర్థించేలా 2017లో అంతర్జాతీయ న్యాయస్థానంలో మాట్లాడటంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుత చర్యతో ప్రజాస్వామ్య మనుగడను ఎంతమాత్రమూ సహించబోమని సైన్యం మరోసారి తేల్చి చెప్పినట్లయింది.

మయన్మార్‌లో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నప్పటికీ, అంతర్జాతీయ సమాజం పెద్దగా స్పందించడం లేదు. ఐక్యరాజ్య సమితి, అమెరికా సహా పలు దేశాలు సైన్యం తిరుగుబాటును ఖండించే ప్రకటనలతో సరిపెట్టాయి. తూతూమంత్రాల్లాంటి ఆంక్షలు విధిస్తున్నాయి. తీవ్రస్థాయి ఆంక్షలకు గురవకుండా చైనా మైత్రి జుంటాకు రక్షణ కల్పిస్తోంది. ఇండియా సైతం మయన్మార్‌ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. భారత్‌-మయన్మార్‌ మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలున్నాయి. అక్కడి సైన్యంతోనూ స్నేహబంధం ఉంది. కాబట్టి మధ్యవర్తిత్వం ద్వారా అక్కడి సంక్షోభాన్ని ఇండియా పరిష్కరించాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. జుంటాపై ఒత్తిడి పెంచితే అది పూర్తిగా చైనా చేతుల్లోకి వెళ్తుందేమోనని భారత్‌ ఆందోళన చెందుతోంది. వేర్పాటువాద సంస్థ నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌(ఎన్‌ఎస్‌సీఎన్‌) చీలిక వర్గాలు కొన్ని మయన్మార్‌ కేంద్రంగా మనుగడ సాగిస్తూ ఈశాన్య భారత్‌లో విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. కొంతకాలంగా వాటిపై అక్కడి సైనిక ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో మయన్మార్‌ సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ ముఠాల విషయంలో జుంటా ఉదాసీనంగా వ్యవహరించే అవకాశముందని ఇండియా భావిస్తోంది. ప్రపంచ అగ్రశక్తుల్లో ఒకటిగా ఎదగాలనుకుంటున్న భారత్‌- ప్రజాస్వామ్య పరిరక్షణ చర్యలకు దూరంగా ఉండటం సరికాదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఈశాన్యాన విద్రోహ శక్తులకు సొంతంగా ముకుతాడు వేయగల సత్తా భారత బలగాలకు ఉందని గుర్తుచేస్తున్నారు. మయన్మార్‌లోని రఖైన్‌ ప్రావిన్సుపై ఆ దేశ అధికారాన్ని అరాకన్‌ ఆర్మీ సవాలు చేస్తోంది. ఆ బలగాలపై పోరాటంలో ఇండియా మద్దతు జుంటాకు అవసరం. సైనిక తిరుగుబాటు ప్రణాళికలు చైనాలో మొగ్గతొడిగాయని మయన్మార్‌ ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. తమ దేశంలో చైనా ఉత్పత్తులను పూర్తిగా నిషేధించాలని పిలుపు ఇస్తున్నారు. అందులో భాగంగానే- తమ దేశానికి ఎగుమతులు పెంచాల్సిందిగా మయన్మార్‌ వర్తకులు ఇండియాను కోరుతున్నారు. ఈ పరిస్థితులను మన దేశం సద్వినియోగం చేసుకోవడంతోపాటు మయన్మార్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు చొరవ తీసుకోవలసిన అవసరం ఉంది.

- శ్రీయాన్‌

Posted Date: 09-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం