• facebook
  • whatsapp
  • telegram

అంతర్జాతీయ క్రీడల్లో రష్యా ఏకాకి

ఉక్రెయిన్‌పై దండయాత్ర ఫలితం

దేశ ఆర్థికాభివృద్ధిలో క్రీడలూ కీలక పాత్ర పోషిస్తాయి. వాటి ద్వారా పర్యాటకం, ఆతిథ్యం వంటి రంగాలకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రపంచస్థాయి పోటీల్లో క్రీడాకారులు సాధించే విజయాలు దేశానికి ఎనలేని ఖ్యాతిని తెస్తాయి. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాకు క్రీడారంగంలో తీవ్ర ప్రతికూల పరిణామాలు ఎదురవుతున్నాయి. క్రెమ్లిన్‌ను క్రీడాలోకం దాదాపు ఏకాకిని చేసింది. వివిధ ప్రపంచ క్రీడా సమాఖ్యలు రష్యాలో పోటీలను రద్దు చేసుకున్నాయి. సమీప భవిష్యత్తులోనూ అక్కడ ఎలాంటి టోర్నీలు నిర్వహించే అవకాశం లేదని తేల్చి చెప్పాయి. పలు దేశాలు రష్యాతో ఆడాల్సిన మ్యాచ్‌లనూ రద్దు చేసుకుంటున్నాయి.  

పలుదేశాల ఆగ్రహం

రష్యాకు తోడుగా నిలిచిన బెలారస్‌ సైతం పలుదేశాల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తోంది. రష్యాతో పాటు బెలారస్‌లో నిర్వహించ తలపెట్టిన వివిధ టోర్నీలను రద్దు చేసుకోవాలని లేదా ఇతర దేశాలకు తరలించాలని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) క్రీడా సమాఖ్యలకు పిలుపిచ్చింది. పోటీల్లో ఆ రెండు దేశాల జాతీయ పతాకాలను వాడకూడదని, జాతీయ గీతాలను వినిపించకూడదని సూచించింది. దీనికి అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలూ సానుకూలంగా స్పందించాయి. ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ ఫైనల్‌ను ప్యారిస్‌కు తరలించాలని ఐరోపా ఫుట్‌బాల్‌ సంఘాల యూనియన్‌ (యూఈఎఫ్‌ఏ) నిర్ణయం తీసుకోవడంతో రష్యాకు తొలి దెబ్బ తగిలింది. ఆ తరవాత వరసగా వివిధ క్రీడా సమాఖ్యలు ఆ దేశాన్ని బహిష్కరిస్తున్నాయి. ఫుట్‌బాల్‌, టెన్నిస్‌, సైక్లింగ్‌, ఫార్ములా ఒన్‌, అథ్లెటిక్స్‌, షూటింగ్‌, బ్యాడ్మింటన్‌, హాకీ, బాస్కెట్‌బాల్‌, చెస్‌, స్కేటింగ్‌ తదితర ప్రపంచ సమాఖ్యలు రష్యాపై నిషేధం విధించాయి. రేసింగ్‌ అభిమానులను అలరించే ప్రముఖ ఫార్ములా ఒన్‌ రేసులు ఇక రష్యాలో జరిగే అవకాశమే లేదు. మొదట ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన రష్యన్‌ గ్రాండ్‌ ప్రి రేసును మాత్రమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఎఫ్‌1 నిర్వాహక సంస్థ అంతర్జాతీయ ఆటొమొబైల్‌ సమాఖ్య (ఎఫ్‌ఐఏ) ఆ తరవాత మొత్తం ఒప్పందాన్నే వద్దనుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు నిరసనగా ఆ దేశంతో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) నిర్వహించే ప్రపంచకప్‌ అర్హత మ్యాచ్‌ ఆడబోమని పోలాడ్‌ ప్రకటించింది. ఫుట్‌బాల్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే సాకర్‌ ప్రపంచకప్‌ నుంచి రష్యాను బహిష్కరిస్తున్నట్లు ‘ఫిఫా’ ప్రకటించింది. తదుపరి నోటీసులు ఇచ్చేదాకా ఏ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ టోర్నీల్లోనూ పాల్గొనకుండా ఆ దేశానికి చెందిన జట్లు, క్లబ్బులను నిషేధించింది. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు పోటీపడే ప్రతిష్ఠాత్మక చెస్‌ ఒలింపియాడ్‌ను అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య(ఫిడే) రష్యా నుంచి తరలించింది. జులైలో మాస్కోలో జరగాల్సిన ఈ టోర్నీతో పాటు దివ్యాంగుల కోసం తొలిసారి నిర్వహించాలనుకున్న చెస్‌ ఒలింపియాడ్‌, మిగతా చదరంగ టోర్నీలనూ రష్యాలో నిర్వహించబోమని స్పష్టం చేసింది. దీంతో చెస్‌ ఒలింపియాడ్‌ ఆతిథ్య హక్కుల కోసం రంగంలోకి దిగిన భారత్‌ దాన్ని చేజిక్కించుకుంది. డేవిస్‌ కప్‌, బిల్లీ జిన్‌కింగ్‌ కప్‌ నుంచి రష్యా, బెలారస్‌లను సస్పెండ్‌ చేసినట్లు అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య ప్రకటించింది. మాస్కోలో జరగాల్సిన టెన్నిస్‌ టోర్నీలనూ నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. సైక్లింగ్‌, ప్రపంచ రగ్బీ క్రీడా సమాఖ్యలూ ఆ దేశాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. వాలీబాల్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, షూటింగ్‌ పోటీలు సైతం రష్యా నుంచి తరలిపోయాయి. స్వతహాగా జూడో ఆటగాడైన పుతిన్‌కు అంతర్జాతీయ జూడో సమాఖ్య నుంచి ఎదురుదెబ్బ తగిలింది. సమాఖ్య గౌరవ అధ్యక్షుడు, క్రీడారాయబారి స్థానాల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది.

ఇప్పటికే డోపింగ్‌ వివాదం

ఇప్పటికే డోపింగ్‌ వివాదం రష్యాను వెంటాడుతోంది. ఒలింపిక్స్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాల కోసం అడ్డదారి తొక్కినట్లు ఆరోపణలున్నాయి. అథ్లెట్లకు నిషేధిత ఉత్ప్రేరకాలు అందించడం, కష్టపడకుండానే పతకాలు సాధించేందుకు మాదక ద్రవ్యాలు అలవాటు చేశారనే విమర్శలున్నాయి. డోపింగ్‌ ద్వారా రష్యా అథ్లెట్లు ఒలింపిక్స్‌లో 46 పతకాలు గెలుచుకున్నారనే ఆరోపణలపై విచారణ జరిపిన ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) రష్యాను దోషిగా తేలుస్తూ ఎలాంటి ప్రధాన టోర్నీల్లో పాల్గొనకుండా ఆ దేశంపై 2019లో నిషేధం విధించింది. డోపీలుగా తేలిన అథ్లెట్ల దగ్గర నుంచి ఒలింపిక్స్‌ పతకాలనూ వెనక్కి తీసుకున్నారు. 2020లో అంతర్జాతీయ క్రీడా ఆర్బిట్రేషన్‌ ఆ నిషేధాన్ని రెండేళ్లకు తగ్గించింది. ఇప్పటికీ ప్రపంచ టోర్నీల్లో క్రెమ్లిన్‌ అథ్లెట్లు రష్యా పేరుతో పోటీపడటానికి అవకాశం లేదు. రష్యా ఒలింపిక్‌ కమిటీ పేరుతో మాత్రమే బరిలో దిగేందుకు అనుమతి ఉంది. ఇక ఇప్పుడు ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా క్రీడా సమాఖ్యల వేటుతో రష్యా క్రీడా రంగం మరింత కుదేలు కానుంది. ఈ పరిణామాలు తీవ్ర నష్టం చేకూర్చే ప్రమాదముంది. సమీప భవిష్యత్తులో క్రీడా టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వడం, ఇతర దేశాల అథ్లెట్లు పోటీల్లో పాల్గొనడం జరగకపోవచ్చు. రానున్నకాలంలో రష్యా క్రీడా రంగంపై ప్రతికూల ప్రభావం తప్పకపోవచ్చనేది నిపుణుల అంచనా.

- ఎస్‌.చందు

 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 28-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం