శాసనమండలిలో 2022 మార్చి 7న తెలంగాణ బడ్జెట్ 2022-23ను రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఉదయం 11.35 గంటలకు ప్రారంభమైన బడ్జెట్ ప్రసంగం దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది.
బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి పెద్ద పీట
దళితుల అభ్యున్నతికి తొలి ప్రాధాన్యమిస్తూనే బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసింది. వ్యవసాయానికి తోడ్పాటును కొనసాగిస్తూనే అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు అండగా నిలిచింది. అత్యధిక కుటుంబాలకు పథకాల ద్వారా చేరువయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. వైద్య, ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చింది. కొత్త పథకాలు.. సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కొత్త ఉద్యోగాల భర్తీ లక్ష్యాన్ని కొనసాగించింది. ఇందుకోసం రూ. 4,000 కోట్లు కేటాయించింది. ప్రాధాన్య పథకాలకు పెద్ద పీట వేస్తూ.. ఇప్పటి వరకు చేపట్టిన అన్ని కార్యక్రమాలనూ కొనసాగించేలా బడ్జెట్ రూపొందించింది. సొంత రాబడులే ఆలంబనగా రూ. 2.56 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
కొత్త పథకాలు.. కార్యక్రమాలు
‣ ఇంటికి: స్థలం ఉంటే రెండు పడక గదుల ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు
‣ మోటార్ సైకిళ్లు: మొదటి విడతలో లక్ష మంది భవన నిర్మాణ కార్మికులకు
‣ ఆసరా: 57 ఏళ్లకే పింఛను అమలు
‣ బీమా: నేతన్నలకు 5 లక్షల బీమా సాయం: గీత కార్మికులకు రూ.100 కోట్లతో ప్రత్యేక పథకం
‣విద్య: రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయం.. అటవీ వర్సిటీ ఏర్పాటు
‣ కేసీఆర్ పోషకాల కిట్: బాలింతల్లో రక్తహీనత సమస్య పరిష్కారానికి
‣ ఆరోగ్య సంరక్షణ కిట్: 7 నుంచి 12వ తరగతి చదివే 7 లక్షల మంది విద్యార్థినులకు పంపిణీ
‣ వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 1.77 లక్షల కుటుంబాలకు దళితబంధు అమలుకు వీలుగా రూ. 17,700 కోట్లు కేటాయించింది. 57 ఏళ్లకే ఆసరా పింఛను అమలుకు నిధులను కేటాయించింది. రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తూనే ఇంటి స్థలమున్న పేద కుటుంబాలు ఇళ్లను నిర్మించుకునేందుకు చేయూత ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక తోడ్పాటును అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి నియోజకవర్గంలో మూడేసి వేల ఇళ్ల నిర్మాణానికి తోడ్పాటును అందించనుంది. మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిధులను కేటాయించింది. పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది. అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మరో 8 వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ. 1,000 కోట్లను ప్రతిపాదించింది. రూ. 75,000 లోపు వ్యవసాయ రుణాల మాఫీకి నిర్ణయించింది. గిరిజన ఆవాస ప్రాంతాలకు రోడ్ల వసతికి రూ. 1,000 కోట్లు కేటాయించింది. గొర్రెల పంపిణీ పథకాన్ని కొనసాగించేలా నిధులను ప్రతిపాదించింది. తొలిసారిగా చేనేత కార్మికులకు రూ. 5 లక్షల బీమా పథకాన్ని ప్రకటించింది. అలాగే గీత కార్మికుల కోసం రూ. 100 కోట్లతో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించనుంది. భవన నిర్మాణ కార్మికులకు మొదటివిడతగా లక్ష మందికి మోటార్ సైకిళ్లను అందజేయనుంది.
బాలింతలకు, విద్యార్థినులకు కిట్లు
బాలింతల పౌష్టికాహార సమస్యకు, రక్తహీనత సమస్యకు పరిష్కారం అందించేలా కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఏడు నుంచి 12వ తరగతి చదువుతున్న ఏడు లక్షల మంది విద్యార్థినులకు ప్రయోజనం కల్పించే పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. వారికి ఉచితంగా హెల్త్ అండ్ హైజెనిక్ కిట్‌లను పంపిణీ చేయనుంది. శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ ఉన్న గ్రామాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి నిధులు అందించనుంది. రోడ్ల మరమ్మతులు, నిర్వహణ, మెట్రోరైలు ప్రాజెక్ట్‌తో హైదరాబాద్ పాతనగరం అనుసంధానం, శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు వంటి మౌలిక సదుపాయాలకు బడ్జెట్ కేటాయించింది. మిషన్ భగీరథ, పరిశ్రమలకు ప్రోత్సాహం, జలమండలికి ఉచిత నీటి సరఫరాకు, ఆర్టీసీ బలోపేతానికి, పామాయిల్ సాగు పోత్సాహకానికి నిధులు దక్కాయి. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఉపకార వేతనాలు, పల్లెప్రగతి, పట్టణ ప్రగతికి ప్రత్యేక నిధులు, పరిశ్రమలకు ప్రోత్సాహం, రోడ్ల వసతితో పాటు వైద్యఆరోగ్య రంగానికి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు నిధులను పెంచింది.
నీతి ఆయోగ్ సిఫారసులపై విశ్వాసం
గ్రాంట్ ఇన్‌ఎయిడ్ రూపంలో కేంద్రం నుంచి అందుతున్న మొత్తం పరిమితంగా ఉంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఆశావహంతో బడ్జెట్‌లో గ్రాంట్ ఇన్‌ఎయిడ్‌ను రూ. 41,000 కోట్లుగా ప్రతిపాదించింది. కేంద్రం నుంచి పన్నుల వాటా రూ. 18,394 కోట్లుగా అంచనా వేసింది. కేంద్ర పథకాలు, విపత్తు నిర్వహణ నిధితో పాటు జీఎస్టీ పరిహారంగా రూ. 15,446 కోట్లు వస్తుందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రానికి గతంలో నీతి ఆయోగ్ సిఫారసు చేసిన మేరకు కేంద్రం నుంచి రూ. 25,555 కోట్లు అందుతుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 49,350 కోట్ల మార్కెట్ రుణాలను తీసుకుంటున్న ప్రభుత్వం వచ్చే ఏడాది మరో రూ. 10,000 కోట్లను అదనంగా తీసుకునేలా రూ. 59,632 కోట్లను ప్రతిపాదించింది.
సొంత రాబడులపైనే ధీమా
రాష్ట్ర ప్రభుత్వం సొంత రాబడులపై పూర్తి విశ్వాసం కనబరచింది. సవరించిన అంచనాలపై 23 శాతం పెంచి రూ. 2.56 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. సొంత పన్నుల రాబడి అంచనాలను 16 శాతం పెంచింది. పన్ను రాబడుల అంచనా తొలిసారిగా రూ. లక్ష కోట్ల మార్క్ దాటింది. రూ. 1.08 లక్షల కోట్ల పన్ను రాబడులను అంచనా వేసింది. అమ్మకం పన్ను, జీఎస్టీ రాబడి అంచనాలను 20 శాతం దాకా పెంచింది. ఎక్సైజ్ రాబడి అంచనాలను రూ. 500 కోట్లు పెంచగా రిజిస్ట్రేషన్ శాఖ రాబడిని 17 శాతం దాకా పెంచింది. పన్నేతర రాబడిలో భూముల అమ్మకం ద్వారా రూ. 15,500 కోట్లను సమకూర్చుకోనుంది. గనులశాఖ ద్వారా రాబడి అంచనాలను 59 శాతం దాకా పెంచింది.

బడుగుల సంక్షేమమే మా లక్ష్యం
- బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు
‘ఇది బడుగుల జీవితాలు మార్చే.. కేసీఆర్ మార్కు బడ్జెట్’ అని ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు అభివర్ణించారు. శాసనసభలో ఆయన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం 90 పేజీల ప్రసంగ పాఠాన్ని రెండు గంటల పాటు చదివారు. ఇందులో దాదాపు ఆరు పేజీల వరకు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడానికే కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల గురించి హరీశ్ విపులంగా వివరించారు. తెలంగాణ అవతరించిన అనతికాలంలోనే దేశంలోకెల్లా అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చిందంటూ ప్రసంగం మొదలుపెట్టిన ఆర్థికమంత్రి చివరగా మహాభారతంలోని ఒక వాక్యంతో ముగించారు. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ అభ్యున్నతి గురించి తపనే తప్ప వేరే చింతన లేదని చెప్పారు. ప్రగతినిరోధక శక్తులు అవరోధాలను సృష్టిస్తున్నా వాటిని ఎదుర్కోగల సత్తా తెలంగాణ ప్రభుత్వానికి ఉందని, ప్రజల శ్రేయస్సు కోసమే కృషి చేస్తామంటూ ప్రసంగాన్ని ముగించారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు..
రాష్ట్రాల ఆదాయానికి గండి
కేంద్ర పన్నుల నుంచి న్యాయబద్ధంగా 41% రాష్ట్రాలకు రావాలి. కానీ సెస్‌ల పేరుతో దాన్ని కుదిస్తోంది. రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయంలో 11.4% మేర నిధులకు గండికొడుతోంది. ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం ఆమోదించలేదు. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన నిధులనూ ఇవ్వలేదు. వాటి కోసం ప్రయత్నిస్తాం. ఆ నిధులనూ బడ్జెట్‌లో పేర్కొన్నాం. ఈసారి 35 కొత్త కార్యక్రమాలకు నిధులను కేటాయించాం.

బడ్జెట్ అంటే అంకెలే కాదు
‘‘బడ్జెట్ అంటే అంకెల సముదాయం కాదు. ప్రజల ఆశలు, ఆకాంక్షల వ్యక్తీకరణ. కేంద్ర ప్రభుత్వం ‘కాళ్లలో కట్టె పెట్టినట్టు’ వివక్ష చూపుతోంది. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం లేకపోగా నిరుత్సాహం కలిగించేలా వ్యవహరిస్తోంది. తెలంగాణ పురుటిదశలో ఉన్నప్పటి నుంచే దాడి ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెట్టింది. దీంతో దిగువ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును తెలంగాణ కోల్పోయింది. ఐదేళ్ల పాటు హైకోర్టును విభజించకుండా తాత్సారం చేసింది. విభజన హామీలను ఇప్పటికీ అమలు చేయడం లేదు. ఇవి చాలవన్నట్టు పార్లమెంటులో తెలంగాణ ఆవిర్భావం గురించి చర్చ జరిగిన ప్రతిసారి ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అని వ్యాఖ్యానిస్తూ కేంద్ర పెద్దలు రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. రాష్ట్రంలో ఐటీఐఆర్‌ను అమలు చేయకుండా కేంద్రం తీరని అన్యాయం చేసింది. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రికి విన్నవించారు. కాని చెప్పుకోదగ్గ ప్రోత్సాహకాలేవీ ఇవ్వలేదు.
రూ. 495 కోట్లు ఏపీ ఖాతాలో వేసింది
కేంద్ర ప్రాయోజిత పథకాల కింద తెలంగాణకు విడుదల చేయాల్సిన రూ. 495 కోట్లను పొరపాటుగా ఏపీ ఖాతాలో వేసింది. ఏడేళ్ల నుంచి అడుగుతున్నా తిరిగి ఇవ్వలేదు. జహీరాబాద్‌లోని నిమ్జ్‌కు రూ. 500 కోట్ల కేంద్ర వాటానూ ఇవ్వలేదు. తెలంగాణకు ప్రత్యేక గ్రాంటుగా రూ.723 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం చెప్పినా ఇవ్వలేదు. మొత్తం అన్ని రకాల గ్రాంట్లు కలిపి రూ. 5,386 కోట్లు తొక్కిపెట్టింది. కరోనా సమయంలోనూ రాష్ట్రాలకు ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదు. పైగా న్యాయంగా దక్కాల్సిన నిధులలోనూ కోతలు పెట్టింది.
విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోం
విద్యుత్ సంస్కరణలకు లంకె పెట్టి రాష్ట్రాల మెడ మీద కత్తిపెట్టింది. రైతు వ్యతిరేకమైన ఆ సంస్కరణలు అమలు చేయకపోవడం వల్ల ఐదేళ్లలో రూ.25,000 కోట్లు సమకూర్చుకునే అవకాశాన్ని తెలంగాణ కోల్పోయింది. రైతుల మీద ఛార్జీల భారం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కంఠంలో ప్రాణముండగా విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోమని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పారు. 4 కోట్లమంది ప్రజల శ్రేయస్సు కోసం రూ. 25,000 కోట్లు వదులుకోడానికి సిద్ధపడ్డారు. రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకూ కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదు. ఒక్క పథకానికీ డబ్బులివ్వలేదు. రుణం తెచ్చుకునైనా అభివృద్ధి చేసుకుందామనుకుంటే దానికీ మోకాలడ్డుతోంది’’ అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

రహదారులకు పెద్దపీట
వరుసగా రెండో ఏడాదీ రహదారులకు నిధుల కేటాయింపును ప్రాధాన్య అంశంగా ప్రభుత్వం తీసుకుంది. 2022 - 23 బడ్జెట్‌లో రూ.8,327 కోట్లు కేటాయించింది. 2021 - 22తో పోల్చిస్తే మాత్రం రూ.461 కోట్లు తగ్గించింది. ఈ సారి రహదారులు, వంతెనలకు భారీగా రూ.4,140 కోట్లను కేటాయించింది. కృష్ణా, గోదావరి నదులపై భారీ వంతెనలను నిర్మించనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్న కల్వర్టులు, చిన్న వంతెనలు పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది.
‣ భవనాల కోసం రూ.900 కోట్లు కేటాయించగా.. అందులో నూతన సచివాలయానికి రూ. 400 కోట్లు ప్రత్యేకించారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాన్ని అనుసంధానం చేసే రహదారులు పూర్తి చేసేందుకు రూ.400 కోట్లు కేటాయించారు.
ఆర్‌ఆర్‌ఆర్‌కు 500 కోట్లు
ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)కు రూ.500 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. 340 కిలోమీటర్ల మేర రెండు దశల్లో నిర్మించనున్న ఈ రహదారికి ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 - 22)లో రూ.750 కోట్లను కేటాయించింది. 4,760 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. ఇందు కోసం రూ.2,120 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా. భూ సేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంది.
- ఆరు చోట్ల ప్రాంతీయ విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినా నిధుల కేటాయింపు ఆ స్థాయిలో లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విమానాశ్రయాల కోసం రూ.50 కోట్లు కేటాయించగా, 2022 - 23 బడ్జెట్‌లో రూ.41.76 కోట్లు కేటాయించారు.
మహిళలకు కేసీఆర్ పౌష్టికాహార కిట్‌లు
రాష్ట్రంలో బాలింతలు, గర్భిణుల్లో రక్తహీనతను అధిగమించేందుకు ప్రభుత్వం ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. రక్తహీనత అధికంగా ఉన్నట్లు గుర్తించిన ఆసిఫాబాద్, కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, వికారాబాద్, ములుగు, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పౌష్టికాహార కిట్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. ఈ పథకం కింద ఏటా 1.25 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారు. మరోవైపు మహిళా,శిశు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.1,907.28 కోట్లు కేటాయించింది. 2021 - 22తో పోల్చితే ఇది రూ.300 కోట్లు అదనం.
- సమీకృత చిన్నారుల అభివృద్ధి పథకం, జాతీయ పౌష్టికాహార మిషన్, ఆరోగ్య లక్ష్మి పథకాల కింద పౌష్టికాహారం అందించేందుకు రూ.690 కోట్లు కేటాయించింది.
బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.177 కోట్లు
బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.177 కోట్లు కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ధూప దీప నైవేద్యం పథకం కింద మరో 1,736 ఆలయాలను చేర్చనుంది. అర్చకులు, ఇతర సిబ్బందికి ప్రతి నెలా నిర్దేశిత తేదీలోగా జీతాలు చెల్లించేందుకు రూ.138 కోట్లు గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూపంలో అందజేస్తుంది.
అభివృద్ధి వ్యయంలో తెలంగాణ రెండో స్థానం
దేశంలోని రాష్ట్రాలు చేస్తున్న అభివృద్ధి వ్యయంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో గోవా ఉంది. అంతర్ రాష్ట్ర సగటు తలసరి అభివృద్ధి వ్యయంపై 2017-20 సంవత్సరాలకు సంబంధించిన గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. దేశంలోని 18 రాష్ట్రాల లెక్కలను సరిపోలుస్తూ సర్వేను రూపొందించారు. ఆ జాబితాలో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంది. రాష్ట్రంలో సగటున ప్రతి వ్యక్తిపై అభివృద్ధి కోసం వెచ్చిస్తున్న మొత్తం రూ.24,758.
వైద్యఆరోగ్యశాఖకు రెట్టింపు నిధులు
2021 - 22: రూ. 5,816.52 కోట్లు
2022 - 23: రూ. 11,237.33 కోట్లు
వైద్య ఆరోగ్యశాఖకు తాజా బడ్జెట్ (2022 - 23)లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. రూ. 11,237.33 కోట్లు కేటాయించింది. ప్రగతి పద్దును పరిశీలిస్తే.. గతేడాది కంటే మూడింతలు అధికంగా నిధులు పెరగడం విశేషం. ప్రగతి పద్దులో 2021 - 22లో ఆరోగ్యశాఖకు రూ.1,933.30 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది ఏకంగా రూ.5,743.02 కోట్లకు పెంచింది. మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో పరిశీలిస్తే.. గత బడ్జెట్‌లో వైద్యశాఖకు 3.3 శాతం నిధులుండగా.. ఈ ఏడాది ఒక శాతం పెరిగి 4.3 శాతానికి చేరడం ఆహ్వానించదగిన పరిణామమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
‣ ప్రభుత్వ వైద్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు సర్కార్ ప్రాధాన్యమిచ్చింది. రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పనున్న వైద్యకళాశాలల కోసం రూ.1000 కోట్లను కేటాయించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు బలవర్థకమైన ఆహారాన్ని అందించేందుకు ప్రస్తుతమిస్తున్న ఛార్జీలను ఏకంగా రెట్టింపు స్థాయిలో పెంచింది. కేసీఆర్ కిట్‌కు రూ.443 కోట్లు, ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, పింఛనుదారుల ఆరోగ్య పథకాలకు రూ.1,343 కోట్ల చొప్పున అవసరాలకు తగ్గట్లుగా కేటాయింపులు జరిపింది.
‣ హైదరాబాద్‌కు నలువైపులా గచ్చిబౌలి, ఎల్బీనగర్, అల్వాల్, ఎర్రగడ్డల్లో ఏర్పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల కోసం రూ.1000 కోట్లు.
‣ నిమ్స్‌లో అదనంగా మరో 2వేల పడకలను ఏర్పాటు చేయనుంది. దీంతో ఇక్కడ మొత్తం పడకల సంఖ్య 3,489కి పెరుగుతాయి.
‣ వరంగల్‌లో 24 అంతస్తులతో నెలకొల్పనున్న 2వేల పడకల ఆసుపత్రిలో 35 సూపర్ స్పెషాలిటీ, స్పెషాలిటీ విభాగాలు అందుబాటులోకి వస్తాయి.
‣ ఈ సంవత్సరం ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వ వైద్యకళాశాలలను మంజూరు చేయనుండగా.. 2023లో మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల, యాదాద్రి భువనగిరి జిల్లాలకు మంజూరుచేయనుంది.
‣ జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న 256 బస్తీ దవాఖానాల సంఖ్య 350కి పెంపు. రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లోనూ మరో 60 బస్తీ దవాఖానాల ఏర్పాటు.
ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలకు పెంపు
ఆరోగ్యశ్రీ చికిత్సలో భాగంగా ప్రస్తుతం ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకూ గరిష్ఠ పరిమితి ఉంది. దీన్ని రూ.5 లక్షలకు పెంచింది. గుండె, కాలేయం, బోన్ మ్యార్ తదితర అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకూ చెల్లిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 22 మాతాశిశు సంరక్షణ కేంద్రాలను రూ.407 కోట్లతో నెలకొల్పింది. రాష్ట్రంలో 300 అమ్మఒడి వాహనాల ద్వారా గర్భిణులకు సేవలందిస్తోంది.
ఆహార ఛార్జీల పెంపు
‣ ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షయ, క్యాన్సర్ తదితర రోగులకు బలవర్థక ఆహారం అందించేందుకు ఆహార ఛార్జీలను ఒక్కో పడకకు రూ.56 నుంచి రూ.112కు పెంచింది.
‣ సాధారణ రోగులకు ఒక్కో పడకకు రూ.40 నుంచి రూ.80కి పెంపు.
‣ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య ప్రమాణాల మెరుగు, కార్మికులకు వేతనాలు పెంపునకు ఒక్కో పడకకు రూ.5వేల నుంచి రూ.7500కు పెంపు. ఇందుకు రూ.338 కోట్లను ఖర్చుచేస్తుంది.
‣ 61 శవాగారాల ఆధునికీకరణకు రూ.32.50 కోట్లు.

పోలీస్ శాఖకు నాలుగింతలు
2021 - 22: రూ. 234.85 కోట్లు
2022 - 23: రూ. 1,104.85 కోట్లు
రాష్ట్ర పోలీస్ శాఖకు గత ఏడాది బడ్జెట్ కంటే ఈసారి నాలుగు రెట్లకుపైగా అధికంగా కేటాయించారు. తాజా బడ్జెట్‌లో కొత్త పోలీస్‌స్టేషన్లు, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. గత బడ్జెట్‌లో ఇది కేవలం రూ.5 కోట్లు. ఈ సారి ఏకంగా రూ.323 కోట్లు. ఈ విడత వాహనాల కొనుగోళ్లు, జిల్లా పోలీస్ కార్యాలయ సముదాయాల నిర్మాణానికి రూ.300 కోట్ల చొప్పున కేటాయించారు. పోలీస్ సిబ్బంది స్పోర్ట్స్ మీట్‌కు రూ.72.08 కోట్లు, పోలీస్‌స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.50 కోట్లు, కమ్యూనిటీ పోలీసింగ్‌కు రూ.25.72 కోట్లు, వరంగల్ కమిషనరేట్ నిర్మాణానికి రూ.25 కోట్లు ఇచ్చారు.
‣ నిఘా విభాగానికి కూడా కేటాయింపులు పెరిగాయి. ఈ సారి విభాగానికి రూ.67.95 కోట్లు (గతేడాది రూ.41.6 కోట్లు) ఇచ్చారు. పోలీస్ అకాడమీ, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, హోంగార్డుల విభాగాలు, ప్రత్యేక పరిరక్షణ దళం (ఎస్పీఎఫ్)కు ఈ సారి కేటాయింపులు తగ్గాయి.
కొత్త రుణం రూ.59,672 కోట్లు
- ఒక్కొక్కరిపై అప్పురూ.1,25,116
ఒకవైపు రాష్ట్ర ఆదాయం, వృద్ధి రేటు పెరుగుతుండగా...మరోవైపు ప్రజలపై అప్పుల భారమూ పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.2,85,120 కోట్ల రుణాన్ని ప్రతిపాదించింది. తాజాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ పరిధిలో మరో రూ.59,672 కోట్ల రుణాన్ని సమీకరించుకోనుంది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర రుణం రూ.3,29,980 కోట్లు అవుతుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు రుణాలు ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు రూ.1,45,456 కోట్లకు చేరతాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రుణం మొత్తం రూ.4,75,444 కోట్లవుతుంది. అంటే ఒక్కొక్కరిపై తలసరి అప్పు రూ.1,25,116.
‣ ఈ ఏడాది ప్రతిపాదించిన అప్పుల్లో నీటిపారుదల శాఖకు రూ.8,940 కోట్లు, నీటి సరఫరా, పారిశుద్ధ్యానికి రూ.7,267 కోట్లు, గృహనిర్మాణానికి రూ.1,528 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.1,472 కోట్లు, రోడ్డు రవాణాకు రూ.1,221 కోట్లు, పశుసంవర్ధకశాఖకు రూ.797 కోట్లు, వైద్యఆరోగ్యానికి రూ.720 కోట్లు, విద్యుత్తు ప్రాజెక్టులకు రూ.374 కోట్లు, ఇతర పరిశ్రమలకు రూ.254 కోట్లు, పంటల సందర్శనకు రూ. 221 కోట్లు, మత్స్య రంగానికి రూ.127 కోట్లు, వివిధ సాధారణ సేవలకు రూ.103 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగుల రుణాలకు రూ.97 కోట్లు, పాడి అభివృద్ధికి రూ.83 కోట్లు ఉన్నాయి. అంతర్గత రుణాలు రూ.8,700 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నవి రూ.438 కోట్లుగా నమోదైంది.
బడ్జెట్ వెలుపల రుణాలు 40,449 కోట్లు
- జనవరి చివరికి రూ.1,45,455 కోట్లకు చేరిన కార్పొరేషన్ల అప్పులు
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్ వెలుపల వివిధ కార్పొరేషన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకు రూ.40,449 కోట్ల రుణాలు తీసుకున్నాయి. కాళేశ్వరం సహా వివిధ కార్పొరేషన్లు తీసుకున్న ఈ రుణాలకు సర్కారు పూచీకత్తు ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరం వరకూ ఇలా ప్రభుత్వం పూచీకత్తుగా ఉన్న రుణాలు రూ.1,05,006 కోట్లు కాగా.. ప్రస్తుత ఏడాదితో కలిపి ఆ మొత్తం రూ.1,45,455 కోట్లకు చేరాయి.
2021 - 22లో పూచీకత్తు రుణాలు (రూ.కోట్లలో)
‣ కాళేశ్వరం కార్పొరేషన్: 30,922
‣ తాగునీటి సరఫరా సంస్థ: 2,832
‣ నీటివనరుల అభివృద్ధి సంస్థ: 2,315
‣ టీయూఎఫ్‌ఐడీసీ: 721
‣ టీఎస్‌ఆర్టీసీ: 667
‣ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ: 659
‣ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్: 438
‣ ఐటీశాఖ: 201
‣ హైదరాబాద్ జలమండలి: 169
చదువుకు పెరిగినా.. అవి వేతనాలకే సరి!
విద్యాశాఖకు ఈసారి బడ్జెట్‌లో కొంతవరకు నిధులు పెంచినా.. అవి పెరిగిన వేతనాలు, పింఛన్లు, ఇతర నిర్వహణ ఖర్చులకే పోతున్నాయి. విద్యాశాఖకు 2020-21 బడ్జెట్‌లో నిర్వహణ, ప్రగతి పద్దు కింద మొత్తం రూ.13,564 కోట్లు కేటాయించారు. ఈసారి అది రూ.16,043 కోట్లకు పెరిగింది. అంటే రూ.2,479 కోట్లు అధికం. ఇవి నిర్వహణ పద్దులోనే పెరిగాయి. గత జూన్ నుంచి కొత్త పీఆర్‌సీ ప్రకారం పెరిగిన వేతనాలు ఇచ్చారు. ఏప్రిల్, మే నెలల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. రెండు డీఏల సొమ్మును చెల్లించాలి. విశ్రాంత ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి పింఛను పెరగాలి. అంటే పెరిగిన బడ్జెట్ సొమ్ము సిబ్బంది జీతాల కోసమే కావడం గమనార్హం. ‘మనఊరు- మనబడి’ కింద గత బడ్జెట్‌లో రెండేళ్లకు రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పినా.. అది రూ.7,289 కోట్లకు చేరింది. ఆ నిధులను మూడేళ్లలో ఖర్చు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,497 కోట్లతో పనులను ప్రారంభించామని చెప్పిన సర్కారు మిగిలిన నిధుల్లో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎంత ఖర్చు చేస్తామన్నది ప్రకటించలేదు. మొత్తం బడ్జెట్‌లో విద్యాశాఖకు 6.2 శాతమే నిధులు కేటాయించారని ఉపాధ్యాయ సంఘాలు విమర్శించాయి.
మళ్లీ బాలికలకు ఆరోగ్య, పరిశుభ్రత కిట్లు
రాష్ట్రంలో బాలికా ఆరోగ్య రక్ష పథకాన్ని వచ్చే విద్యాసంవత్సరం (2022 - 23) నుంచి పునరుద్ధరించాలని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే బాలికలకు నిత్యం అవసరమైన ఆరోగ్య, పరిశుభ్రత కిట్ అందజేస్తుంది. 2018 - 19లో పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టగా.. రెండేళ్లపాటు అమలైంది. ఒక్కో ఏడాది కిట్ల సరఫరాకు రూ.100 కోట్ల వరకు ఖర్చుచేసింది. 2020 - 21, 2021 - 22 సంవత్సరాల్లో అమలు చేయలేదు. తాజాగా బాలికా ఆరోగ్య రక్షను అమలు చేస్తామని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. గతంలో ఒక్కో కిట్‌లో 13 రకాల ఉత్పత్తులున్నాయి. ఏడాదిలో నాలుగుసార్లు కిట్‌లను ఇచ్చారు. అప్పట్లో 4 కిట్లకు రూ.1600 ఖర్చు చేసింది. ప్రస్తుతం బాలికల సంఖ్య 7 లక్షల వరకు ఉంటుందని అంచనా. అంటే సుమారు రూ.120 కోట్లు ఖర్చవుతుంది.
వర్సిటీలకు కేటాయింపులు అంతంతే
ఈసారి బడ్జెట్‌లో రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు కేటాయింపులు అంతంతమాత్రంగా ఉన్నాయి. మొత్తం ఉన్నత విద్యాశాఖ పరిధిలో 11 వర్సిటీలు ఉన్నాయి. గత ఏడాది వీరికి వేతనాల కోసం బ్లాక్ గ్రాంట్ రూపేణా రూ.617.36 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.759.37 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. గతంకంటే రూ.142 కోట్లు మాత్రమే అధికం. కొత్త పీఆర్‌సీ ప్రకారం వేతనాలు, పింఛన్లు ఇవ్వాల్సి ఉండటంతో ఆ మేరకు పడే భారాన్ని పరిగణనలోకి తీసుకొని నిధులిచ్చినట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి గతానికంటే 2 నుంచి 4 రెట్లు ఇవ్వాలని ప్రతిపాదించినా ఫలితం లేకపోయింది. ఓయూకు ఈసారి రూ.65 కోట్లకు పైగా పెరగ్గా.. కాకతీయకు రూ.28 కోట్లు, జేఎన్‌టీయూహెచ్‌కు రూ.10 కోట్లు పెంచారు.

ఒక్కో కొత్త వర్సిటీకి రూ.100 కోట్లు
హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాల, సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కళాశాలను విశ్వవిద్యాలయాలుగా మారుస్తామని కొద్దిరోజుల కిందటే ప్రకటించిన రాష్ట్ర సర్కారు అందుకు అనుగుణంగా బడ్జెట్‌లో ఒక్కోదానికి రూ.100 కోట్ల చొప్పున నిధులు కేటాయించింది. వచ్చే కొత్త విద్యాసంవత్సరం (2022 - 23) నుంచి అవి వర్సిటీలుగా మారనున్నాయి. 42 ఎకరాల విస్తీర్ణంలోని కోఠి మహిళా కళాశాలలో ప్రస్తుతం 4 వేల మంది విద్యనభ్యసిస్తున్నారు. ఈ కళాశాల స్థాపించి 2024 నాటికి వందేళ్లు పూర్తి చేసుకుంటుంది. సిద్దిపేట జిల్లా ములుగులో 2016లో నెలకొల్పిన ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌సీఆర్‌ఐ) ప్రస్తుతం ఓయూకు అనుబంధంగా కొనసాగుతోంది. అందులో నాలుగేళ్ల బీఎస్‌సీ ఫారెస్ట్రీ ఆనర్స్ కోర్సుతో పాటు పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఆ కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చనున్నారు.
రైతుబంధు, రైతుబీమా పథకాలకు దండిగా నిధులు
- వ్యవసాయశాఖకు 2022 - 23లో కేటాయింపులు రూ.24,254 కోట్లు
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పుష్కలంగా నిధులు కేటాయించింది. రైతుబంధు, రైతుబీమా పథకాలకు గత బడ్జెట్‌కన్నా స్వల్పంగా నిధులు పెంచింది. అవసరమైతే అదనంగా కూడా కేటాయిస్తామంది. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అత్యంత ఎక్కువ నిధులు కేటాయించిన పథకం రైతుబంధు. దీనికి రూ.14,800 కోట్లు ఇచ్చారు. ప్రస్తుత ఏడాది (2021 - 22) రూ.14,400 కోట్లు రైతుల ఖాతాల్లో వేయగా వచ్చే ఏడాదికి మరో రూ.400 కోట్లు పెంచి కేటాయించారు. గత నాలుగేళ్లలో ఈ పథకం కింద 63 లక్షల ఖాతాల్లో రూ.50,448 కోట్లు జమచేసినట్లు సర్కారు తెలిపింది. ఈ పథకంతో రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడ్డారని వివరించింది. రైతుబీమాకు రూ.1,466 కోట్లు కేటాయించింది. గత మూడేళ్లలో 75 వేలకు పైగా కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.3,775 కోట్ల పరిహారాన్ని ఎల్‌ఐసీ అందజేసినట్లు బడ్జెట్‌లో పేర్కొంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఏడాది 2013 - 14లో ఇక్కడ వ్యవసాయ రంగ వృద్ధిరేటు 4 శాతం కాగా 2019 - 20 నాటికి 29 శాతానికి పెరిగిందని వివరించింది.
రూ.75 వేల లోపు వారికి రుణమాఫీ
రాష్ట్రం ఏర్పడిన తరవాత 2014 - 18 మధ్య తొలివిడతలో నాలుగు దఫాలుగా 35.32 లక్షల మంది రైతుల రుణాల మాఫీకి రూ.16,144 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. 2018 డిసెంబరులో రెండో విడత రుణమాఫీని ప్రకటించాక ఇప్పటివరకూ 5.12 లక్షల మంది రైతుల బాకీలను మాఫీ చేసినట్లు సర్కారు తెలిపింది. ఈ నెలాఖరులోగా రూ.50 వేలలోపు అప్పు ఉన్నవారందరి రుణాలను మాఫీ చేస్తామని చెప్పింది. 2018 డిసెంబరు 11 నాటికి బ్యాంకులకు రూ.75 వేలలోపు కట్టాల్సిన రైతుల రుణాల మాఫీకి వచ్చే ఏడాది (2022 - 23)లో నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసింది.
‣ అదనంగా 2.50 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం పెంచేందుకు రూ.1,000 కోట్లను కేటాయించింది.
‣ పశుసంవర్ధకశాఖకు రూ.2,768.68 కేటాయించగా.. అందులో రాయితీపై గొల్లకుర్మలకు గొర్రెలను పంపిణీ చేసేందుకు రూ.1,000 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కొక్కరికి 20 గొర్రెలు, ఒక పొట్టేలును యూనిట్‌గా పంపిణీ చేస్తారు. ఇందులో లబ్ధిదారుడి వాటా పోను ప్రభుత్వ వాటా కట్టేందుకు ఈ నిధులు వినియోగిస్తారు.
‣ వ్యవసాయ యంత్రాలకు గత బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించగా తాజాగా రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చారు.
‣ పంటల ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం నేరుగా మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన ‘మార్కెట్ జోక్య నిధి’కి గత బడ్జెట్‌లో రూ.500 కోట్లు ఇవ్వగా ఈ ఏడాది రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు.
‣ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పదేళ్లలో తెలంగాణ ప్రాంతంలో అప్పటి వ్యవసాయశాఖ రూ.7,994 కోట్లు ఖర్చుపెడితే.. రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లలోనే రూ.83,989 కోట్లు వెచ్చించినట్లు ప్రభుత్వం వివరించింది.
‣ వచ్చే ఏడాదికి వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల పద్దు కింద రూ.24,254.35 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో రూ.25,000 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ.21 వేల కోట్లుగా పేర్కొంది.
‘సాగు’తోంది ఉరవడి!
2021 - 22లో ఇచ్చింది రూ.16,919 కోట్లు
ఇప్పటికే ఖర్చు చేసింది రూ. 21,000 కోట్లు
2022 - 23 కేటాయింపులు రూ.22,675 కోట్లు
సాగునీటి రంగానికి బడ్జెట్‌లో ప్రభుత్వం మరోసారి పెద్దపీట వేసింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వేగం పెంచడం, ఇప్పటికే ఆయకట్టుకు నీళ్లివ్వడం ప్రారంభించిన వాటిని పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి రూ.22,675 కోట్లు ఇవ్వనున్నట్లు చెప్పింది. 2021 - 22లో రూ.16,919 కోట్లు కేటాయించి ఇప్పటికే రూ.21వేల కోట్లు ఖర్చుచేసిన సర్కారు, వచ్చే ఏడాది బడ్జెట్ పెంచింది. రాష్ట్ర పద్దు నుంచి రూ.9,959 కోట్లు కాగా, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణంగా 12,716 కోట్లు సమకూర్చనుంది.
‣ కేటాయింపుల్లో 50 శాతానికి పైగా నిధులను కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కిందనే ఖర్చుచేయనుంది. దీని తర్వాత పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతలకు ప్రాధాన్యమిచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వెచ్చించిన రూ.21 వేల కోట్లలో కాళేశ్వరం వాటా రూ.10,500 కోట్లు. ఇందులో రూ.8,500 కోట్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా తీసుకొన్న రుణం. మరోవైపు కాళేశ్వరం ఎత్తిపోతల కార్పొరేషన్‌కు రూ.12,240 కోట్ల రుణాన్ని ఇంజినీర్లు ప్రతిపాదించగా సర్కారు కొంత తగ్గించినట్లు తెలిసింది.
‣ పాలమూరు - రంగారెడ్డి పథకానికి వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.రెండువేల కోట్లు కేటాయించగా, ఇందులో రూ.600 కోట్లు రుణం. ఇది కూడా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే. సీతారామ ఎత్తిపోతల, దేవాదుల, కంతనపల్లి, శ్రీరామసాగర్ వరద కాలువ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన రుణం కోసం ఏర్పాటైన కార్పొరేషన్ ద్వారా రూ.2,489 కోట్లు తీసుకోనుంది. అత్యధికంగా సీతారామ ఎత్తిపోతలకు రూ.940 కోట్లు కేటాయించగా దేవాదులకు ఇచ్చింది రూ.350 కోట్లు. ఈ నాలుగు ప్రాజెక్టులను వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయడానికి వీలుగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.7,737 కోట్లు రుణం తీసుకోవడానికి ఇంజినీర్లు ప్రతిపాదించగా ప్రభుత్వం దాన్ని కొంత తగ్గించినట్లు సమాచారం.
‣ చిన్ననీటి వనరులకు కూడా అధిక ప్రాధాన్యమిచ్చి రూ.1,245 కోట్లు, మధ్యతరహా ప్రాజెక్టులకు రూ.283 కోట్లు కేటాయించింది. ఇందులో కోయిల్‌సాగర్, మూసీ, లంకసాగర్, పెద్దవాగు జగన్నాథపూర్, మోదికుంటవాగు, సుద్దవాగు, గొల్లవాగు, కుమురం భీం ప్రాజెక్టులకు కేటాయింపులు ఎక్కువగా ఉన్నాయి.
‣ కృష్ణా నదీ యాజమాన్యబోర్డుకు రూ.11.16 కోట్లు, గోదావరి బోర్డుకు రూ.8.75 కోట్లు కేటాయించింది.
మెట్రోకు మెరుపులు
‣ రాయదుర్గం - శంషాబాద్ మార్గానికి రూ.377 కోట్లు
రాష్ట్ర బడ్జెట్‌లో మెట్రో రైలు ప్రాజెక్టులకు రూ.2,377 కోట్లు కేటాయించారు. గత పదేళ్లలో ఇంత భారీమొత్తంలో నిధులను ప్రతిపాదించడం ఇదే మొదటిసారి. ఏటా రూ.200-500 కోట్లనే కేటాయించేవారు. 2021-22 బడ్జెట్‌లో రూ.1,000 కోట్లను ప్రతిపాదించినా.. రూ.200 కోట్లకు మించి మంజూరు చేయలేదు. తాజా బడ్జెట్‌లో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లతో పాటు అదనంగా పాతబస్తీ మెట్రోకు రూ.500 కోట్లు, రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రతిపాదిత 31 కి.మీ. ఎక్స్‌ప్రెస్ మెట్రోకు రూ.377.35 కోట్లుగా కేటాయించారు.
‣ పాతబస్తీలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మిగిలిపోయిన 5.5 కి.మీ. మెట్రో మార్గాన్ని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. వారసత్వ కట్టడాలు, ప్రార్థనా స్థలాలతో అవాంతరాలు చోటుచేసుకున్నాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
నష్టాల్లో ఉన్న సంస్థను ఆదుకునేందుకే!
కొవిడ్ కారణంగా మెట్రో రైలు తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయింది. నష్టాలు రూ.2 వేల కోట్లను దాటాయి. 2022 - 23 బడ్జెట్‌లో మెట్రో ప్రాజెక్టుకు రూ.1500 కోట్లను ప్రతిపాదించారు. ఈ మొత్తం ఎల్ అండ్ టీని ఆదుకునేందుకేనన్న ప్రచారం ఉంది. నిధుల కేటాయింపుపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
పారిశ్రామికం పరుగులెత్తేలా!
2021 - 22: రూ. 3,077 కోట్లు
2022 - 23: రూ. 3,496 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్ (2022 - 23)లో పారిశ్రామిక రంగానికి తగిన ప్రాధాన్యతనిచ్చింది. ఈ క్రమంలో రూ.3,496 కోట్లను కేటాయించింది. గత బడ్జెట్‌లో కేటాయించిన రూ. 3,077 కోట్ల కంటే ఇది రూ.419 కోట్లు ఎక్కువ. అలాగే పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాలకు పెద్దపీట వేస్తూ.. రూ.2,519 కోట్ల (2021 - 22లో రూ.2,000 కోట్లు)ను ఆ పద్దుకే కేటాయించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పారిశ్రామిక రాయితీలకు ఇంత పెద్దమొత్తం కేటాయింపులు ఇదే ప్రథమం. వీటిలో ప్రధానంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.2,142 కోట్లు; విద్యుత్ రాయితీకి రూ.190 కోట్లు; చిన్న, ఆహారశుద్ధి పరిశ్రమలకు పావలా వడ్డీ కింద రూ. 187 కోట్లు ఉన్నాయి. ఇంకా ఐటీ అభివృద్ధికి రూ.360 కోట్లు, గనులకు రూ.120 కోట్లు, నిమ్జ్ భూసేకరణకు రూ.30 కోట్లు, హస్తకళల అభివృద్ధికి రూ.9.60 కోట్లు, రామగుండంలోని ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ వాటా నిధికి రూ.10 కోట్లు, పారిశ్రామిక సమూహాల అభివృద్ధికి రూ.10 కోట్లు, హైదరాబాద్ పరిశోధనలు, ఆవిష్కరణల మండలికి రూ.రెండు కోట్లు చూపింది.
పర్యాటక, సాంస్కృతిక శాఖలకు రూ.1,026.41 కోట్లు
రాష్ట్ర బడ్జెట్‌లో పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన శాఖలకు కలిపి ఈసారి రూ.1,026.41 కోట్లు కేటాయించింది. గతేడాది రూ.726 కోట్లతో పోలిస్తే ఈసారి కేటాయింపులు రూ.మూడొందల కోట్లు అధికం. కాళేశ్వరం సర్క్యూట్ టూరిజం అభివృద్ధికి రూ.1,500 కోట్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. తాజా బడ్జెట్‌లో పర్యాటకశాఖకు కేటాయించిన రూ.760 కోట్ల నిధుల్లో రూ.750 కోట్లు ‘కాళేశ్వరం’కే కేటాయించారు.
గీత కార్మికులకు రూ.100 కోట్లు
గీత కార్మికుల సంక్షేమానికి గతంలో లేని రీతిలో తాజా బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో త్వరలో ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ సమావేశంలో ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకొంది. తాటిచెట్ల పైనుంచి పడి మరణించిన లేదా అంగవైకల్యం పొందిన గీత కార్మికుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు ఈ నిధులు కేటాయిస్తారా? మరేదైనా కొత్త పథకం అమలు చేస్తారా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఐటీ శాఖకు రూ.360 కోట్లు
ఐటీ శాఖకు 2022-23 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.360 కోట్లు కేటాయించింది. గత ఏడాదితో పోల్చితే నిధుల్లో పెరుగుదల లేదు. ఐటీ మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.150 కోట్లు ఇచ్చింది. నైపుణ్య శిక్షణ కోసం టాస్క్‌కు రూ.16 కోట్లు, సాఫ్ట్‌నెట్‌కు రూ.18.5 కోట్లు కేటాయించింది. విహబ్‌కు రూ.7 కోట్లు ఇచ్చింది. టీఫైబర్ ప్రాజెక్టు నిర్వహణ కోసం నిధుల్ని రూ.7 కోట్లకు పరిమితం చేసింది. టీ-హబ్ ఫౌండేషన్‌కు రూ.2 కోట్లు చూపించింది.
పురపాలనకు రూ.10,590 కోట్లు
రాష్ట్రంలో నగరాలు, పట్టణాలకు గత ఏడాదితో పోల్చితే తాజా బడ్జెట్‌లో రూ.1,276 కోట్ల మేర నిధులు తగ్గాయి. 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.10,590.91 కోట్లు కేటాయించారు. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ప్రత్యేక సాయాన్ని తగ్గించారు. మున్సిపాలిటీల్లో వడ్డీలేని రుణాల కోసం రూ.375 కోట్లు ఇచ్చారు. ఆర్థిక సంఘం నిధుల కింద రూ.750 కోట్లు పేర్కొన్నారు. హెచ్‌ఎండీఏకు రూ.200 కోట్లు, జలమండలి పరిధిలో ఉచిత తాగునీటి పథకానికి రూ.300 కోట్లు ప్రతిపాదించారు.
ఆర్టీసీకి రూ.1500 కోట్లు
ఆర్టీసీకి బడ్జెట్‌లో భారీ ఉపశమనం లభిస్తుందని సంస్థ వర్గాలు భావించినప్పటికీ ఆ మేరకు ఊరట లభించలేదు. 2022-23కు సంబంధించి ప్రభుత్వం రూ.1500 కోట్లను కేటాయించింది. బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశించినప్పటికీ అలా జరగలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రూ.1,500 కోట్లు కేటాయించగా.. ఫిబ్రవరి వరకు రూ.1,125 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మరో రూ.1,500 కోట్లు పూచీకత్తుపై రుణంగా తీసుకునేందుకు అవకాశం కల్పించింది. కానీ, తాజా బడ్జెట్‌లో ‘పూచీకత్తు’ వెసులుబాటు కూడా లేదు.
పచ్చదనానికి పెరిగిన నిధులు
అటవీశాఖకు రూ.1,410.34 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం రూ.1,271.92 కోట్లతో పోలిస్తే ఈసారి రూ.138.42 కోట్ల నిధులు పెరిగాయి. రూ.130.22 కోట్లు ప్రగతి పద్దు కాగా, రూ.1,280.12 కోట్లు నిర్వహణ పద్దు కింద చూపారు. హరితహారం, అగ్నిప్రమాదాల నివారణ, అటవీకరణ, అటవీ విశ్వవిద్యాలయం వంటి వాటికి నిధులు ఇందులో ఉన్నాయి. అత్యధికంగా హరితహారానికి రూ.932 కోట్లు ప్రతిపాదించారు. అటవీశాఖ రూ.1,352.92 కోట్ల ప్రతిపాదనలు పంపితే రూ.57.42 కోట్లు అదనంగా కేటాయించారు.
విపత్తు నిర్వహణకు విత్తం పెంపు
రాష్ట్ర విపత్తు నిర్వహణ అగ్నిమాపక శాఖకు గత బడ్జెట్ కంటే ఎక్కువగా కేటాయించారు. ఈ బడ్జెట్‌లో రూ.16.12 కోట్లు (క్రితంసారి రూ.7.5 కోట్లు) ఇచ్చారు. కొత్త ఫైర్ స్టేషన్ల నిర్మాణాలు, శకటాల కొనుగోలుకు రూ.2 కోట్ల చొప్పున ఇచ్చారు. అయితే రూ.కోట్ల విలువైన అత్యాధునిక శకటాలు కొనుగోలు చేయాలని భావించిన ఆ శాఖకు ఈసారీ నిరీక్షణ తప్పేలా లేదు.
‣ జైళ్ల శాఖకు గతేడాది (రూ.18.51 కోట్లు) కంటే ఈసారి కేటాయింపులు స్వల్పంగా (రూ.18.13 కోట్లు) తగ్గాయి.
బడ్జెట్‌లో దళితబంధుకు భారీగా నిధులు
- 1.77 లక్షల కుటుంబాలకు పథకం అమలు
దళితబంధు పథకం అమలుకు ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేసింది. ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో హుజూరాబాద్ మినహా ఇతర నియోజకవర్గాల్లో ఒక్కోచోట 1500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1.77 లక్షల దళిత కుటుంబాలకు లబ్ధి జరగనుంది. పథకం కింద.. ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా, ఇష్టమైన పని ఎంపిక చేసుకుని ఉపాధి పొందేందుకు ప్రభుత్వం గ్రాంటు రూపంలో రూ.10 లక్షలు ఇస్తోంది. వచ్చే ఏడాదికి 2 లక్షల మందికి లబ్ధిచేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. హుజూరాబాద్ నియోజకవర్గం, వాసాలమర్రి గ్రామం, నాలుగు ప్రయోగాత్మక మండలాలు, రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి వంద మంది చొప్పున ఇప్పటికే దాదాపు 35 వేల దళిత కుటుంబాలు ఎంపికయ్యాయి. హుజూరాబాద్, వాసాలమర్రి లబ్ధిదారులకు యూనిట్లు మంజూరవుతున్నాయి. తాజా బడ్జెట్‌లో మరో 1.77 లక్షల కుటుంబాలకు పథకం అమలయ్యేలా నిధులు కేటాయించారు. ఇప్పటివరకు లబ్ధిపొందని కుటుంబాలకు ముందు ప్రాధాన్యమివ్వాలని పథకం ప్రకటించిన సమయంలో భావించినప్పటికీ, ఎలాంటి పరిమితులు లేకుండా దళిత కుటుంబాలందరికీ అవకాశమివ్వాలని నిర్ణయించారు.
సంక్షేమ శాఖలకు రెట్టింపు
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు 2022 - 23 బడ్జెట్‌లో ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. ఈ శాఖల బడ్జెట్ గత ఏడాదితో పోల్చితే దాదాపు రెట్టింపైంది. ఇందులో సింహభాగం రూ.17,700 కోట్లను దళిత బంధు పథకానికి ఇచ్చింది. ఎస్సీ సంక్షేమానికి భారీగా పెంచగా, మిగతా సంక్షేమశాఖల బడ్జెట్ కేటాయింపుల్లో పెద్దగా మార్పుల్లేవు. గురుకులాలకు కేటాయింపులు పెద్దగా పెరగలేదు.
‣ 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు కలిపి ప్రభుత్వం రూ.31,466.53 కోట్లు కేటాయించింది.
‣కార్మిక, ఉపాధి కల్పన శాఖకు బడ్జెట్‌లో రూ.511.36 కోట్లు కేటాయించింది. ఐటీఐల ఉన్నతీకరణ, కొత్త ఐటీఐల అభివృద్ధికి స్వల్పంగా రూ.4.5 కోట్లు ఇచ్చింది. నైపుణ్య శిక్షణ కోసం రూ.2.6 కోట్లు ప్రకటించింది.
గురుకులాలకు..
బడ్జెట్‌లో ఎస్సీ గురుకులాలకు రూ.1063.79 కోట్లు, గిరిజన గురుకులాలకు రూ.492.74 కోట్లు కేటాయించింది. సంక్షేమ శాఖల్లో అత్యధికంగా 281 గురుకుల విద్యాలయాలున్న బీసీ సొసైటీకి నిధులు స్వల్పంగా పెంచి రూ.330 కోట్లు కేటాయించింది. మైనార్టీ సొసైటీలో 204 గురుకుల పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా మారాయి. అయినా, ఈ సొసైటీకి గత ఏడాదితో సమానంగా రూ.222.92 కోట్లు కేటాయించింది.
బోధనానికి 2,539.33 కోట్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు బోధన ఫీజులు, ఉపకారవేతనాల కోసం ప్రభుత్వం రూ.2,539.33 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద ఏటా 13.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. బీసీ సంక్షేమ శాఖ నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో బడ్జెట్‌లో నిధులు పెంచారు.
‣ కల్యాణలక్ష్మికి గత ఏడాదితో సమానంగా ఈ సారి రూ.2,750 కోట్లు ఇచ్చింది.
‣ విదేశీ విద్య పథకం అమల్లో మైనార్టీ సంక్షేమశాఖకు ప్రాధాన్యం లభించింది. ఈ పథకం కింద మైనార్టీలకు రూ.100 కోట్లు, బీసీలకు రూ.66 కోట్లు, ఎస్సీలకు రూ.45 కోట్లు, ఎస్టీలకు రూ.10 కోట్లు కేటాయించారు.
నేతన్నలకు బీమా భరోసా
- కార్మికులు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం
రాష్ట్రంలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది ఉపాధి పొందుతున్న చేనేత రంగంలోని కార్మికుల కోసం కొత్త బీమా పథకాన్ని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. ప్రస్తుతం అన్నదాతలకు కల్పిస్తున్న ‘రైతు బీమా’ మాదిరి ‘నేతన్నలకు బీమా’ను తీసుకొచ్చింది. ఈ ప్రకారం ఎవరైనా చేనేత కార్మికులు ఏ రకంగా మరణించినా వారి కుటుంబాలకు రూ.అయిదు లక్షల పరిహారం అందుతుంది. ఈ పథకానికి ప్రీమియం కింద రూ.50 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. చేనేత, జౌళి రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చిన సర్కార్ రూ.467 కోట్లను కేటాయించింది. గత బడ్జెట్‌లో కేటాయింపులు రూ.341 కోట్లు కాగా... ఈసారి రూ.106 కోట్లను పెంచింది. వీటిలో బతుకమ్మ చీరలకు రూ.400 కోట్లను చూపింది. మిగిలిన పద్దుల్లో చేనేత, మరమగ్గాల కార్మికుల ప్రోత్సాహకాలకు రూ.3.14 కోట్లు, మరమగ్గాల కార్మికులకు ఆర్థికసాయం కింద రూ. 1.97 కోట్లను పేర్కొంది.
మరో 10 లక్షల మందికి ఆసరా!
- 57 ఏళ్ల వారికీ ఇస్తామని ప్రకటన
రాష్ట్రంలో మూడేళ్లుగా ఆసరా పింఛన్ల మంజూరు కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అసహాయులకు బడ్జెట్‌లో హామీ లభించింది. పెండింగ్ దరఖాస్తులతో పాటు 57 ఏళ్లు దాటిన వారికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బడ్జెట్‌లో రూ.11,728 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ప్రతినెలా దాదాపు 48 లక్షల మందికి పింఛన్లు ఇవ్వవచ్చని గ్రామీణాభివృద్ధి శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత మూడేళ్లుగా రాష్ట్రంలో కొత్త పింఛన్లు మంజూరు కాలేదు. 65 ఏళ్ల వయసు దాటిన వృద్ధులు, ఇంటిపెద్దను కోల్పోయి వితంతువుగా మారిన మహిళలు, ఇతర కేటగిరీల కింద దరఖాస్తు చేసిన 3.30 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించి, 2021-22 నుంచి పింఛను మంజూరు చేస్తామని సర్కారు ప్రకటించినప్పటికీ అమలు కాలేదు. గత ఆగస్టులో దరఖాస్తులు తీసుకోగా దాదాపు 7.8 లక్షల మంది అర్జీ పెట్టుకున్నారు.
అందుబాటులో నెలకు రూ.977 కోట్లు
రాష్ట్రంలో గత మూడేళ్లుగా పింఛను కోసం అందిన దరఖాస్తులు, 57 ఏళ్లు దాటిన వారి దరఖాస్తులు పరిశీలిస్తే డూప్లికేట్ తీసివేయగా...దాదాపు 10 లక్షల మంది అర్హులు ఉంటారని అంచనా. ప్రస్తుతం రాష్ట్రంలో 38.41 లక్షల మంది పింఛను కోసం నెలకు రూ.775 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. కొత్తగా వచ్చే లబ్ధిదారులకు మరో రూ.200 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. తాజాగా పెరిగిన కేటాయింపులతో అర్హులందరికీ పింఛన్లు మంజూరయ్యే అవకాశాలున్నాయి.
ఆసరా పింఛన్లు ఇలా...
ప్రస్తుత పింఛనుదారులు: 38,41,000
పెండింగ్ దరఖాస్తులు: 3,30,089
57 ఏళ్లు దాటిన అర్హులు: 7,80,000
భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్లు
- తొలి విడత లక్ష మందికి
రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. తొలి విడతగా లక్ష మందికి రాయితీపై మోటారు సైకిళ్లను అందిస్తామని పేర్కొంది. త్వరలోనే విధివిధానాలు వెల్లడిస్తామని తెలిపింది. రాష్ట్రంలో 60 ఏళ్లలోపు భవన నిర్మాణ కార్మికులు 21.46 లక్షల మంది ఉన్నారు. వీరిలో 12.68 లక్షల మంది ఏటా తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకుంటున్నారు. పథకం కింద 35 ఏళ్లలోపు వారిని పరిగణనలోకి తీసుకోవాలా? వయసుతో సంబంధం లేకుండా అర్హత ఉన్నవారికి ఇవ్వాలా అనే అంశంపై కార్మికశాఖ సమాలోచనలు చేస్తోంది. లక్ష వాహనాల్లో గరిష్ఠంగా 30-50 శాతం వరకు సబ్సిడీ భరించే అవకాశాలున్నట్లు సమాచారం. తొలి విడత కింద పథకం వ్యయం రూ.300-500 కోట్ల వరకు ఉండవచ్చని కార్మిక వర్గాలు పేర్కొంటున్నాయి.
భారీగా పెరిగిన ప్రత్యేక అభివృద్ధి నిధి
- ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలతో కలిపి రూ.47,350.37 కోట్లు
ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్) కింద 2022 - 23 ఏడాదికి కేటాయింపుల్ని ప్రభుత్వం భారీగా పెంచింది. గత బడ్జెట్‌తో పోల్చితే రూ.13,739 కోట్లు అదనంగా కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల నిధులతో కలిపి ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.47,350.37 కోట్లు చూపించింది. ప్రతిపాదించిన బడ్జెట్‌లో జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు రూ.33,937.75 కోట్లు, ఎస్టీలకు రూ13,412.62 కోట్లుగా పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల నిధులను మినహాయిస్తే వివిధ ప్రభుత్వ విభాగాల పరిధిలో ఆయా ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.24,167.01 కోట్లు పేర్కొంది.
జాగా ఉంటే ఇంటికి రూ.3 లక్షలు
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ కొత్త పథకానికి సర్కారు రూ.12 వేల కోట్లు ప్రతిపాదించింది. ఇప్పటికే మంజూరై నిర్మాణంలో ఉన్న వాటికి మరో రూ.3,650 కోట్లు ఇస్తామని చెప్పింది. సొంత స్థలం ఉంటే ఒక్కో ఇంటి¨కి రూ.మూడు లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రతిపాదించింది. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి కొత్త పథకం ద్వారా ఆర్థిక సాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలకే నిర్ణయాధికారం ఇచ్చింది. ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల చొప్పున 3.57 లక్షల ఇళ్లు ఎమ్మెల్యేల కోటా కింద.. మిగిలిన 43 వేలు ముఖ్యమంత్రి పరిధిలో ఉంటాయి. ప్రమాద బాధితులు, నిర్వాసితులకు కేటాయించేందుకు వీలుగా వీటిని సీఎం కోటాలో ఉంచారు.
రెండేళ్ల క్రితం రూ.5 లక్షలని ప్రకటన
స్థలం ఉంటే ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తామని గత రెండు బడ్జెట్లలోనూ ప్రభుత్వం చెప్పింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తామని రెండేళ్లక్రితం ప్రకటించింది. గత బడ్జెట్‌లో రూ.11 వేల కోట్లు కేటాయించింది.ఇప్పుడు కొత్త పథకంలో లబ్ధిదారులకు సొంత స్థలం ఉండాలి. నిర్మాణానికయ్యే వ్యయంలో రూ.3 లక్షలు మాత్రమే సర్కారు ఇస్తుంది. మిగతా ఖర్చు లబ్ధిదారులే భరించాలి.
కరెంటు రాయితీకి రూ.10,500 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: ఇంధనశాఖకు మొత్తం బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.12,198 కోట్లు కేటాయించింది. ఇందులో వ్యవసాయానికి, ఇతర వర్గాలకు ఉచితంగా లేదా తక్కువ ఛార్జీలకు కరెంటు సరఫరా కోసం రాయితీ కింద ‘విద్యుత్ పంపిణీ సంస్థ’ (డిస్కం)లకు రూ.10,500 కోట్లను ఇవ్వనుంది. 2021 - 22లో రాయితీ కింద రూ.10,625 కోట్లు ఇవ్వగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022 - 23)లో రూ.125 కోట్లు తగ్గించింది. విద్యుత్ కేంద్రాలు, పంపిణీ, సరఫరా వ్యవస్థల నిర్మాణాలకు గతంలో జాతీయ విద్యుత్ ఆర్థిక సంస్థ (పీఎఫ్‌సీ), గ్రామీణ విద్యుదీకరణ సంస్థల నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు రుణాలు తీసుకున్నాయి. ఈ బకాయిల కిస్తీ చెల్లింపులకు బడ్జెట్‌లో రూ.1,574 కోట్లు కేటాయించింది. రాయితీ పద్దు కింద రూ.10,928 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని డిస్కంలు గతంలో అంచనా వేశాయి. బడ్జెట్‌లో రూ.10,500 కోట్లే కేటాయించడంతో ప్రభుత్వాన్ని మళ్లీ అడిగే అవకాశం ఉంది. ఏటా బడ్జెట్ కేటాయింపులను మించి ప్రభుత్వం అదనంగా సర్దుబాటు చేస్తోంది. ఈ సారీ అలాగే జరిగే అవకాశముందని విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు.
విద్యుత్ సంస్థలకు కేటాయింపులు
2021 - 22: రూ. 11,037 కోట్లు
2022 - 23: రూ. 12,198 కోట్లు
పల్లె ప్రగతికి రూ.3,330 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు కలిపి బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.29,271 కోట్లు కేటాయించింది. పల్లెప్రగతి కోసం రూ.3,330 కోట్లు ఇచ్చింది. మండల పరిషత్‌లకు రూ.500 కోట్ల గ్రాంట్లు, గ్రామపంచాయతీలకు నెలకు రూ.227.50 కోట్లు చొప్పున ఇచ్చేలా నిధులు పేర్కొంది. పంచాయతీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి రూ.1,054.07 కోట్లు ఇచ్చింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల బడ్జెట్‌లో అత్యధికంగా ఆసరా పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.11,728 కోట్లు కేటాయించింది.
‣ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలోని స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు కేటాయించే నిధుల్ని తగ్గించింది. 2021 - 22లో రూ.2,500 కోట్లు కేటాయించగా, వచ్చే ఏడాదికి రూ.1,250 కోట్లకు పరిమితం చేసింది.
‣ఉపాధి హామీ పథకానికి రూ.1,460 కోట్లు కేటాయించింది. ‘పీఎంకేఎస్‌వై’కి రూ.100 కోట్లు ఇచ్చింది. రూర్బన్ పథకానికి రూ.10 కోట్లు ఇవ్వగా, గ్రామీణ జీవనోపాధి మిషన్‌కు రూ.210 కోట్లు పేర్కొంది. దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజనకు రూ.150 కోట్లు వచ్చింది. స్వచ్ఛభారత్ గ్రామీణ మిషన్‌కు రూ.350 కోట్లు పేర్కొంది.
బడ్జెట్ ముఖ్యాంశాలు
బడ్జెట్ ప్రసంగం (తెలుగులో)
బడ్జెట్ స్పీచ్ (ఇంగ్లిష్‌లో)