• facebook
  • whatsapp
  • telegram

సాంస్కృతిక వెలుగులో జనగణన



భారతదేశంలో ఇప్పటివరకు సామాజిక, ఆర్థిక అంశాల ప్రాతిపదికగానే జనగణన చేపట్టారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు విభిన్న సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, విశ్వాసాలతో జీవనం సాగిస్తున్నారు. జనగణన సందర్భంగా ప్రజల సాంస్కృతిక ప్రత్యేకతలను నమోదు చేయాలనే భావన బలంగా వినిపిస్తోంది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా...


భూమిపై ఉన్న సకల చరాచర జీవుల్లో అత్యంత బుద్ధిజీవి మానవుడే. అన్వేషణలు, ఆవిష్కరణలు, నిర్మాణాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు వంటివెన్నో మానవుడితోనే సాధ్యమవుతున్నాయి. మనుషులు ఒంటరిగా కాకుండా జాతులుగా, సమూహాలుగా జీవిస్తున్నారు. అందర్నీ కలిపి జనాభాగా పిలుస్తారు. జనాభా పెరుగుదలవల్ల కాలక్రమంలో సామాజిక, ఆర్థిక, రాజకీయపరంగానే కాకుండా... సాంస్కృతికంగా, వనరులపరంగా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి.


ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం...

ప్రఖ్యాత ఆర్థికవేత్త థామస్‌ రాబర్ట్‌ మాల్థస్‌ జనాన్ని, ప్రజా సమూహాలను ‘జనాభా విస్ఫోటం’గా అభివర్ణించాడు. తన జనాభా సిద్ధాంతం ద్వారా ప్రజాసంఖ్య పెరగడంవల్ల ఆర్థిక వ్యవస్థలు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో వివరించాడు. 14-15 శతాబ్దాల్లో మానవుడు భౌగోళిక పరిశోధనల ద్వారా కొత్త ఖండాలను కనుగొన్నాడు. 17వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం, 18వ శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక విప్లవం రావడంతో మానవాళి భూగోళమంతటా విస్తరించడం మొదలైంది. ఆ క్రమంలో ఆర్థికవేత్తలు జనాభా పెరుగుదల తీరుతెన్నులను అధ్యయనంచేస్తూ జన విస్ఫోటం మూడు రకాలుగా ఉంటుందని చెప్పారు. ఒకటి: పుట్టుకలు, మరణాల పెరుగుదల సమానంగా ఉంటే జన సంఖ్య ఎప్పుడూ సంతులనంగా ఉంటుంది. రెండోది: జనాభా పెరుగుదల రేటు మరణాల రేటును మించితే జనాభా అధికమవుతుంది. ఈ స్థితిలో దేశాలు ఆర్థికంగా సంపన్నం కావడంతో పాటు విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడంవల్ల ప్రజల జీవితకాలం పెరుగుతుంది. మరణాల రేటు తగ్గుతుంది. మూడోది: జననాల సంఖ్య పరిమితం కావడంతో పాటు మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడంవల్ల రెండూ ఒక సంతులన స్థితికి వస్తాయి. ఈ దశలో విద్య, వైద్య సదుపాయాలు విస్తృతస్థాయిలో అందుబాటులో ఉండటమే కాకుండా... సామాజిక, సాంస్కృతిక, భౌతికపరమైన ఆలోచనలవల్ల పరిమిత జనసంఖ్య పట్ల ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన ఉంటుంది. సంతానలేమి వంటి సమస్యల కారణంగానూ జననాల సంఖ్య తగ్గుతుంది. ఇటువంటి జనాభా పరిణామాలవల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడమో, వెనకబడటమో జరుగుతోంది. జనాభా పెరుగుదలతో వనరుల వినియోగం అధికమవుతుంది. వస్తువులకు గిరాకీ పెరగడంవల్ల పారిశ్రామిక కార్యకలాపాలు విస్తరించి కాలుష్యం పెద్దయెత్తున వెలువడుతుంది. దాంతో పర్యావరణం దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితిని ఇప్పటికే చూస్తున్నాం. 1991వరకు అధిక జనాభాను శాపంగా భావించేవారు. ఐక్యరాజ్య సమితి జనాభా కార్యకలాపాల నిధి (యూఎన్‌ఎఫ్‌పీఏ) వంటి సంస్థలు ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల్లోని ప్రభుత్వాలు జనాభా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించాయి. ఇప్పుడు జనసంఖ్యను చూసే ధోరణి మారిపోయింది. నేడు మనుషులంటే మానవ వనరులు. వినియోగదారులు కూడా. జనాభాతో పాటే పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతాయనే ఆలోచనా ధోరణి కనిపిస్తోంది. భారత్‌లో 1872లో జనాభా గణాంకాలు మొదలయ్యాయి. నాటి నుంచి 2011 వరకు పదేళ్లకు ఒకసారి జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) జనగణన చేపట్టింది. తద్వారా దేశంలో జనాభా పెరుగుదలతో పాటు శిశు మరణాలు, విద్యా వసతులు, స్త్రీ- పురుష లింగ నిష్పత్తి వంటి ఎన్నో విషయాలు తెలియవచ్చాయి. వాటితోపాటు ఇటీవల జనగణన విషయంలో రెండు కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఒకటి: వెనకబడిన వర్గాల జనగణన చేపట్టడం. రెండోది: సాంస్కృతికపరంగా జనాభాను లెక్కించడం. వెనకబడిన వర్గాల జనాభా, స్థితిగతులను తెలుసుకోవడానికి 1953లో కాకాసాహెబ్‌ కాలేల్కర్‌ కమిటీ ఏర్పాటైంది. ఆ తరవాత బాబు బింధేశ్వరీ ప్రసాద్‌ మండల్‌ కమిషన్‌ కొలువుతీరింది. అప్పటినుంచీ దేశ జనాభాలో వెనకబడిన ప్రజల సంఖ్య ఎంత, వారి కోసం ఎటువంటి అభివృద్ధి పథకాలను రూపొందించాలనే అంశాలపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సమాజంలోని ఉన్నత వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలతో పాటు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన గణాంకాలనూ స్పష్టం చేయాలనే డిమాండ్‌ ఇటీవల వినిపిస్తోంది.


ఆధునిక మానవుడు అర్థం కావాలంటే...

ఇప్పటిదాకా చేపట్టిన జనగణన, సామాజిక, ఆర్థిక సర్వేల్లో ఇల్లు ఉందా, ఉంటే అది గుడిసెనా, పెంకుటిల్లా లేక సిమెంటుతో కట్టిన భవనమా అనే అంశాలు కనిపించేవి. సాంస్కృతిక జనగణనలో ఆ ఇంటి నిర్మాణ రీతుల్ని, వాస్తు శిల్ప రీతుల్ని కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా దేశంలో సాంస్కృతిక వైవిధ్యంతో పాటు వివిధ కళారూపాలకు సంబంధించిన సమాచారం లభిస్తుంది. ఆధునిక మానవుడిని ఆశ్చర్యపరుస్తున్నవి, ఆలోచింపజేస్తున్నవి, ఆచరణాత్మక పథంవైపు నడిపిస్తున్నవి- సాంస్కృతిక అంశాలే! కాబట్టి, నేటి మానవుడిని అర్థం చేసుకోవాలంటే సాంస్కృతిక కోణంలోంచి జనగణన చేపట్టడం ఆవశ్యకం. కృత్రిమ మేధ వంటి సాంకేతికతలతో కూడిన అంతర్జాల ప్రపంచంలో మానవుడు భవిష్యత్తులో మరింతగా ప్రభావితమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో వేదాంతులు, తాత్వికులు కలలుగన్న మానవత్వపు సొబగులు నిలవాలంటే నేటి సాంస్కృతిక మానవుడి ముఖచిత్రాన్ని అధ్యయనం చేయాలి. అందుకోసం తగిన సమాచారం అవసరం. కాబట్టి, జనగణనలో సాంస్కృతిక అంశాలకు చోటు కల్పించాలి. తద్వారా నిరంతరం మారుతున్న మానవ మేధాపరమైన మార్పులను విశ్లేషించుకోవడం సాధ్యమవుతుంది. రేపటి మానవుడి పతనాన్ని నిలువరించడానికి అవసరమైన వ్యూహాన్ని రచించుకునే అవకాశమూ లభిస్తుంది.


భిన్నత్వంలో ఏకత్వం...

భారత్‌లో విభిన్న భౌగోళిక పరిస్థితులు, సంస్కృతీ సంప్రదాయాలు ఉన్నాయి. ప్రజల ఆచార వ్యవహారాలు, మత విశ్వాసాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ- భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోంచే ‘సాంస్కృతిక జనగణన’ చేపట్టాలనే వాదన బలపడుతోంది. సామాజిక, ఆర్థిక సూచికలతో పాటు సాంస్కృతిక అంశాల ప్రాతిపదికన యావద్దేశాన్నీ మ్యాపింగ్‌ చేయాలనే ఆలోచన మొదలైంది. అందులో భాగంగా ప్రజల మత విశ్వాసాలు, ఆరాధనా విధానాలు, ఆచారాలు, వస్త్రధారణ, కళలు, కళారూపాలు, సంగీత వాయిద్యాలు, భాష, ఆహార పద్ధతులు వంటి అంశాలకు సంబంధించి సమాచారం సేకరించాలనే అభిప్రాయం పెరుగుతోంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పర్యావరణ పరిరక్షణ కోసం... వెదురు పెంపకం!

‣ ‘లేబర్‌’దే బ్రిటన్‌ పీఠం

‣ ఉదారవాదికి ఇరాన్‌ పట్టం

‣ జల వనరులకు నష్టం... దేశార్థికానికి కష్టం

‣ దేశ భద్రత... అగ్నివీరుల భవిత... జంటగా సంస్కరణలు!

Posted Date: 23-07-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని