• facebook
  • whatsapp
  • telegram

ఉత్తరాఖండ్‌లో ఉత్కంఠ పోరు

సమస్యలే ప్రచారాంశాలు

 

 

దేవభూమి ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో రేపు జరగనున్నాయి. కనీసం ఈసారి కొలువుతీరే సర్కారు అయినా అయిదేళ్లపాటు పూర్తిస్థాయిలో ఉంటుందా అన్న ప్రశ్న ఓటర్ల నుంచి వినిపిస్తోంది. 2002లో ఉత్తరాఖండ్‌ ఏర్పడినప్పటి నుంచి ఆ రాష్ట్రం పది మంది ముఖ్యమంత్రులను చూసింది. వారిలో నారాయణ్‌ దత్‌ తివారీ మాత్రమే పూర్తిస్థాయిలో సీఎం పదవిలో కొనసాగారు. ఆది నుంచి భాజపా, కాంగ్రెస్‌లే ఒకదాని తరవాత ఒకటి ఉత్తరాఖండ్‌ను ఏలుతూ వస్తున్నాయి. ఆ రాష్ట్రంలో 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2017 ఎన్నికల్లో భాజపా 57 సీట్లు సాధించి అధికారాన్ని అందుకుంది. త్రివేంద్రసింగ్‌ రావత్‌ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. ఇతర శాసన సభ్యులు ఆయనపై తీవ్ర నిరసన గళం వినిపించడంతో నాలుగేళ్లు పూర్తిగా నిండకుండానే ఆయన తన పదవిని విడిచిపెట్టాల్సి వచ్చింది. అనంతరం త్రివేంద్ర స్థానంలో సీఎం పగ్గాలు చేపట్టిన తీరథ్‌ సింగ్‌ రావత్‌ సైతం నాలుగు నెలలు పూర్తికాకుండానే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరవాత అనూహ్యంగా పుష్కర్‌ సింగ్‌ ధామిని గతేడాది జులైలో ముఖ్యమంత్రి పీఠంపై భాజపా కూర్చోబెట్టింది.

 

ఉత్తరాఖండ్‌ను ప్రధానంగా గడ్వాల్‌, కుమావూ ప్రాంతాలుగా విభజిస్తారు. తీర్థయాత్రలు, పర్యాటకం ఆ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరులు. గత డిసెంబరులో హరిద్వార్‌లో జరిగిన ధర్మ్‌సంసద్‌ (మత సమ్మేళనం)లో పలువురు విద్వేష పూరిత ప్రసంగాలు చేశారు. అది ఈ ఎన్నికల్లో బాగా ప్రభావం చూపుతుందని, వాటివల్ల కాంగ్రెస్‌కు లాభం కలిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, పార్టీల ఎన్నికల ప్రచారంలో విద్వేష ప్రసంగాల ప్రస్తావన ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యకరం. కాంగ్రెస్‌తోపాటు తొలిసారి ఆ రాష్ట్ర ఎన్నికల బరిలోకి అడుగుపెట్టిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సైతం ధర్మసంసద్‌ గురించి ఎక్కడా పెదవి విప్పడంలేదు. కాంగ్రెస్‌, ఆప్‌లు ప్రధానంగా అవినీతి, ఉద్యోగాల సృష్టి, విద్య, ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పన, కాలుష్యం వంటి సమస్యలనే ప్రచార సాధనాలుగా ఎంచుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆ రాష్ట్రంలో పర్యటించి దివంగత సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ జన్మభూమి ఘనతను కొనియాడారు. భాజపా, కాంగ్రెస్‌ల హయాములో రాజకీయ అస్థిరతతో ఉత్తరాఖండ్‌ విసిగిపోయిందని, తమకు అవకాశం ఇస్తే రాష్ట్ర ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తామని ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ హామీ ఇస్తున్నారు. రాష్ట్రంలోని మహిళలందరికీ నెలకు వెయ్యి రూపాయలు, నిరుద్యోగ యువతకు అయిదువేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని, లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని వరాలు కురిపిస్తున్నారు.

 

ఉత్తర్‌ ప్రదేశ్‌ మాదిరిగా కుల, మత సమీకరణలు ఉత్తరాఖండ్‌లో పెద్దగా పనిచేయవు. ఈ రాష్ట్రంలో ముస్లిములు చాలా స్వల్పం. దళిత జనాభా 20శాతం కన్నా తక్కువే. ఈ దఫా ఎన్నికల్లో విజయం కోసం భాజపా, కాంగ్రెస్‌ ఒకే రకమైన పంథాను అనుసరిస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటలు, తిరుగుబాట్లు, నిర్ణయాత్మక నాయకత్వ లేమి ఆ రెండు పార్టీలనూ  పట్టి పీడిస్తున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి ధామి యువ సారథ్యం, శాసనసభ్యుల్లో అసంతృప్తిని చల్లార్చగల సామర్థ్యం భాజపాను ఆకర్షిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తే మరోసారి ధామికే సీఎంగా అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హరీశ్‌ రావత్‌- హస్తం పార్టీ తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తుందని ఆశించినా, నిరాశ తప్పలేదు. మొత్తానికి ఉత్తరాఖండ్‌ ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కడతారన్నది తెలియాలంటే ఫలితాల దాకా వేచి చూడాల్సిందే!

 

- రతన్‌ మణిలాల్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రణాళిక కొరవడి... ప్రగతి తడబడి!

‣ యూపీలో భాజపా - ఎస్‌పీ మధ్య తీవ్ర పోటీ

‣ భూతాపం ఉత్పాదకతకు శాపం

‣ డ్రాగన్‌ వైపు రష్యా మొగ్గు!

 

 

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 14-02-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం