• facebook
  • whatsapp
  • telegram

ఉత్తరాఖండ్‌లో కమల వికాసం

ఎదురులేని భాజపా

హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్‌ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ వరసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకొని చరిత్ర సృష్టించింది. నూతన రాష్ట్రంగా ఏర్పడినప్పటినుంచి భాజపా, కాంగ్రెస్‌లు ఒకదాని తరవాత ఒకటి ఉత్తరాఖండ్‌ను ఏలుతూ వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో హేమాహేమీలైన నాయకులకు సైతం భంగపాటు తప్పలేదు. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌, ఆ పక్షం రాష్ట్ర శాఖ అధ్యక్షులు గణేశ్‌ గోదియాల్‌లకు తాజా ఎన్నికల్లో ఓటర్ల నుంచి తిరస్కారం ఎదురైంది. ఎన్నికల్లో పార్టీ ప్రచార కార్యక్రమానికి హరీశ్‌ రావత్‌ నేతృత్వం వహించారు. మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ ఓటమి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన విజయం సాధించి ఉంటే సీఎంగా కొనసాగే అవకాశం ఉండేది. నిజానికి ఉత్తరాఖండ్‌లో ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్‌ సీఎంలు గెలిచిన దాఖలాలు లేవు. అదే ఒరవడిని ధామీ కొనసాగించినట్లయింది. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని తొలిసారి ఒక మహిళ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ సీఎం బీసీ ఖండూరి కుమార్తె రీతూ ఖండూరి పేరును భాజపా పరిశీలిస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. కోట్‌ద్వార్‌ నియోజకవర్గంనుంచి ఆమె విజయం సాధించారు.

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంటుందని ఎన్నికల పరిశీలకులు భావించారు. అయిదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చడం భాజపాకు తీవ్ర ప్రతికూలంగా మారుతుందని చాలామంది విశ్లేషించారు. కాంగ్రెస్‌ సైతం అదే అంశాన్ని ప్రధాన ప్రచార సాధనంగా వాడుకుంది. ఓటర్లు దానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి ముందస్తు అంచనాలను తలకిందులు చేస్తూ 70 స్థానాలున్న శాసనసభలో భాజపా అత్యధికంగా 47 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్‌ కేవలం 19 సీట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకొంది. ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్భవించిన ఉత్తరాఖండ్‌ క్రాంతి దళ్‌ (యూకేడీ) మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా చతికిలపడింది. దానికి కనీసం ఒక్కస్థానమూ దక్కలేదు. రాష్ట్ర ఎన్నికల్లోకి కొత్తగా అడుగుపెట్టిన ఆమ్‌ ఆద్మీ పార్టీ సైతం ఖాతాను తెరవలేకపోయింది. ఓటర్లపై ఆప్‌ భారీగా వరాల జల్లు కురిపించినా, ఏమాత్రం ఫలితం లభించలేదు.

కాంగ్రెస్‌ వ్యవస్థీకృత వైఫల్యం, ఆ పార్టీలో నేతల అంతర్గత కలహాలే భాజపా విజయానికి రాచబాటలు పరిచాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కొంతకాలంగా భాజపా రాష్ట్రవ్యాప్తంగా తన బలాన్ని పటిష్ఠం చేసుకుంటుంటే, కాంగ్రెస్‌ నాయకులు మాత్రం ఆధిపత్య కుమ్ములాటల్లో మునిగిపోయారు. పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన నేతలు ఆ విషయాన్ని పక్కనపెట్టి తమ వివాదాలను చక్కబెట్టుకోవడంలోనే మునిగిపోయారు. అందుకే మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌తో పాటు సీనియర్‌ నేత, రాష్ట్ర మాజీ మంత్రి యస్పాల్‌ ఆర్య, మాజీ స్పీకర్‌ గోవింద్‌ సింగ్‌ కుంజ్వాల్‌ వంటి వారు ఓటమిని చవిచూడక తప్పలేదు.

మాటిమాటికీ పార్టీలు మారతారన్న ఖ్యాతిగడించిన హరక్‌ సింగ్‌ రావత్‌ వంటి వారికీ ఈ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఏర్పడటానికి ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్‌ ప్రభుత్వంలో హరక్‌ మంత్రిగా పనిచేశారు. ఆయన వేర్వేరు కాలాల్లో కాంగ్రెస్‌, భాజపాల్లో ఉన్న సమయంలో మంత్రి పదవులు చేపట్టారు. బీఎస్‌పీలోకీ హరక్‌  పాదం మోపారు. తాజా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన భాజపాను వీడి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకొన్నారు. ఈ ఎన్నికల్లో హరక్‌ నేరుగా పోటీలోకి దిగలేదు. తన కోడలు, మోడల్‌ అనుకృతి గుసాయీకి కాంగ్రెస్‌ టికెట్‌ ఇప్పించుకున్నారు. ప్రజలనుంచి ఆమెకు తిరస్కారమే ఎదురయింది.

ఉత్తరాఖండ్‌లోని గడ్వాల్‌, కుమౌన్‌ డివిజన్ల నుంచి తాజా ఎన్నికల్లో తొలిసారిగా ఎనిమిది మంది మహిళా అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. ఈ ఎన్నికలు, జయాపజయాల సంగతి అటుంచితే రాష్ట్రం ఏర్పడి రెండు దశాబ్దాలు దాటినా ఉత్తరాఖండ్‌ ఎందుకు సరైన అభివృద్ధి సాధించలేదన్న ప్రశ్న అన్నిచోట్లా వినిపిస్తోంది. ప్రత్యేక రాష్ట్రంగా ఉద్భవించిన తరవాత దీర్ఘకాలంగా తమను వెంటాడుతున్న సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని అప్పట్లో చాలామంది ఆశించారు. అది అడియాసగానే మిగిలిందని రాజకీయ పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. కొత్త ప్రభుత్వం స్థానికంగా వేధిస్తున్న ప్రధాన సమస్యలపై, రాష్ట్ర అభివృద్ధిపై ఎలా ముందుకెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

- ఆర్‌.పి.నైల్వాల్‌

(ఉత్తరాఖండ్‌ వ్యవహారాల నిపుణులు)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అందరికీ దక్కని ఉపాధి హామీ

‣ జీవ వైవిధ్యానికి పొంచి ఉన్న ముప్పు

‣ యుద్ధం... ప్రపంచార్థికానికి శాపం!

‣ యూఏఈతో సరికొత్త వాణిజ్య బంధం

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 14-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం