• facebook
  • whatsapp
  • telegram

Govt college: ప్రభుత్వ కళాశాలల్లో తక్కువ ఉత్తీర్ణత 

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల పరిస్థితి దారుణంగా తయారైంది. సర్కారీ కాలేజీల్లో చదువుకున్న వారిలో ప్రథమ సంవత్సరంలో 62%, ద్వితీయ సంవత్సరంలో 42% మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. రాష్ట్రవ్యాప్త సగటు ఉత్తీర్ణత 67% కాగా, ప్రభుత్వ కాలేజీల్లో అంతకంటే 29% తక్కువగా అంటే.. కేవలం 38% ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలోని అన్ని జూనియర్‌ కళాశాలల్లో కలిపి 46,549 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరైతే 17,789 (38%) మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లోనూ పెద్ద మార్పేమీ లేదు. రెండో ఏడాది పరీక్షలకు 46,549 మంది హాజరుకాగా, 21,382 (58%) మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర సగటు 78%తో పోల్చితే ఇది 20% తక్కువ. ప్రభుత్వ కళాశాలల్లో ఓ పక్క ప్రవేశాలు తగ్గిపోతుండగా, చేరిన వారిలోనూ పాస్‌ అవుతున్న వారి సంఖ్య దారుణంగా పడిపోతోంది. ఇక్కడ చదివే వారిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేదవర్గాల పిల్లలే. వారికి నాణ్యమైన విద్యనందించి, పై చదువులకు పంపించాల్సిన సర్కారు.. ఇంటర్‌తోనే సరిపెడుతోంది. ‘ప్రభుత్వ కళాశాలల్లో టోఫెల్‌ నేర్పిస్తాం. అంతర్జాతీయ స్థాయి విద్యార్థులుగా తీర్చిదిద్దుతాం. మన విద్యార్థులు పోటీ పడేది జాతీయ స్థాయిలో కాదు, ప్రపంచంతో’ అని గొప్పలు చెప్పిన జగన్‌.. ఇంటర్‌లో కనీస ఫలితాలు సాధించేందుకూ చర్యలు తీసుకోలేదు. ప్రతి సభలోనూ పేద వర్గాలపై ప్రేమ నటించడమే కానీ, వారి పిల్లల ఉన్నత చదువులకు ప్రోత్సాహమేది అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది.

* గురువుల్లేని గుడ్డి విద్య

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పాఠాలు చెప్పేవారే కరవయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 84 కళాశాలల్లో రెగ్యులర్‌ అధ్యాపకులు లేకుండానే ఒప్పంద, అతిథి అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. అన్ని కళాశాలల్లో కలిపి 6,116 పోస్టులుండగా, వీటిల్లో పనిచేస్తున్న రెగ్యులర్‌ అధ్యాపకులు 2,010 మంది మాత్రమే. రెగ్యులర్‌ అధ్యాపక పోస్టులు లేని కళాశాలలకు పోస్టులు మంజూరు చేయాలని ఎన్ని ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చాలాచోట్ల సబ్జెక్టుల బోధనను కూడా అతిథి అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. ఇంటర్‌ విద్యా మండలి వద్దనున్న పిల్లల ఫీజుల డబ్బులు, అనుబంధ కళాశాలలు చెల్లించే ఫీజులు రూ.100 కోట్ల నిధులను ‘నాడు-నేడు’ పనులకు  మళ్లించారు.

* ఉచిత పుస్తకాలకు స్వస్తి

‘పిల్లల చదువుల కోసం ప్రభుత్వం పెట్టే ఏ ఖర్చైనా సరే, దాన్ని ఖర్చుగా భావించబోను. అది పిల్లలకిచ్చే ఆస్తిగా భావిస్తా. గొప్పగా చదవండి. మీ చదువులకు నాది పూచీ’ అంటూ గొప్పలు చెప్పిన సీఎం జగన్‌.. ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీకి స్వస్తి పలికారు. పాఠ్యపుస్తకాలు లేకుండా పేద పిల్లలు ఎలా చదువుకుంటారని ఆలోచించలేదు. వీటికి కేవలం రూ.15 కోట్లు ఇవ్వలేకపోయారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు మండల, జిల్లా కేంద్రాల్లో చదువుకునేందుకు నిత్యం వచ్చి పోతుంటారు. వీరు ఉదయమే వచ్చి, సాయంత్రం ఇళ్లకు చేరేవరకు ఆకలితో అలమటించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో మధ్యాహ్న భోజనం పథకాన్ని తీసుకొచ్చారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక   దీన్ని ఎత్తేశారు.

 


మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్‌షిప్పు!

‣ నెట్‌ విలువలకు.. నెటికెట్‌

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.