• facebook
  • whatsapp
  • telegram

TGPSC Group 1: గ్రూప్‌-1 పరీక్షలు సజావుగా నిర్వహించాలి

* జూన్‌ 9న నిర్వహించే పరీక్షల ఏర్పాట్లపై సీఎస్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎ.శాంతికుమారి అధికారులను ఆదేశించారు. జూన్‌ 9న నిర్వహించే ఈ పరీక్షల ఏర్పాట్లపై సీఎస్‌ జూన్‌ 6న రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. 31 జిల్లాల్లోని 897 కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు 4.03 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను సీఎస్‌కు వివరించారు. సీఎస్‌ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్లకు కూడా పరీక్షల ఏర్పాట్లపై తగు ఆదేశాలు జారీచేశామని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పరిస్థితిని పరిశీలించేందుకు జిల్లావ్యాప్తంగా పోలీసు, ఇతర అధికారులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

కాగా విత్తనాల బ్లాక్‌ మార్కెటింగ్, అక్రమ నిల్వలను అరికట్టడంలో సమర్థవంతమైన చర్యలు తీసుకున్నందుకు కలెక్టర్లను ఈ సందర్భంగా సీఎస్‌ అభినందించారు. రాబోయే 3 వారాల పాటు ఇదే నిఘా కొనసాగించాలన్నారు. పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, దుకాణాల్లో నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్‌ ఉందా? లేదా? అనే విషయమై నిర్ణీత గడువులోగా సర్వే చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. జూన్‌ 12న పాఠశాలలు ప్రారంభించే నాటికి ఒక జత స్కూల్‌ యూనిఫాంను విద్యార్థులకు అందేలా చూడాలన్నారు. సమీక్షలో మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ అనితా రామచంద్రన్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ దివ్య, టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పోలీస్‌ అకాడమీ నుంచి డీజీపీ రవిగుప్తా, ఇతర పోలీసు అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

‣ వాయుసేనలో అత్యు్న్నత ఉద్యోగాలకు ఏఎఫ్‌ క్యాట్‌

‣ కోర్సుతోపాటు ఆర్మీ కొలువు

‣ డేటా ప్రపంచంలో సత్తా చాటాలంటే?


 

Updated Date : 07-06-2024 12:24:46

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం