• facebook
  • whatsapp
  • telegram

TSPSC Preparation Plan: గురిపెడితే గ్రూప్‌ విజేతవే..

* పక్కా ప్రణాళికతో కొలువు సాధ్యం

దండేపల్లి, న్యూస్‌టుడే: కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తరువాత పోలీస్‌శాఖ, నర్సింగ్‌, గురుకుల విద్యాలయాల్లో డీఎల్‌,  జేఎల్‌, పీజీటీ, టీజీటీ పోస్టుల నియామకాల ప్రక్రియ పూర్తి చేసింది. గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఉద్యోగాల నియామకాలకు రాత పరీక్ష తేదీలు ప్రభుత్వం ఖరారు చేసింది. నిరుద్యోగులు కొలువులు సాధించే లక్ష్యంగా ఇప్పటి నుంచే పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. పోటీ ఎక్కువగా ఉండటంతో పక్కా ప్రణాళికతో పాటు అన్ని విషయాల్లో పట్టు సాధిస్తేనే కొలువు దక్కుతుంది. గతంలో కొలువులు సాధించిన పలువురు విజేతల సూచనలతో కథనం.

    రీజనింగ్‌, అరిథ్‌మెటిక్‌, ఆంగ్లం, జనరల్‌ అవేర్‌నెస్‌, వర్తమాన వ్యవహారాలు (కరెంట్‌ అఫైర్స్‌) సాధన చేయాలి. ఇష్టారీతిన ఏదో ఒక పుస్తకం చదవకుండా తెలుగు అకాడమీతో పాటు పేరు పొందిన రచయితల పుస్తకాలు చదివితే ప్రయోజనం ఉంటుంది. జనరల్‌ అవేర్‌నెస్‌, వర్తమాన విషయాలపై అవగాహన పెంచుకునేందుకు దినపత్రికలు రోజూ చదువుతుండాలి.


ప్రణాళికతో చదవాలి...

సిలబస్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. గతంలో పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలను సాధన చేస్తే ఎలా చదవాలో తెలుస్తుంది. ఒక సబ్జెక్టు తీసుకుంటే ప్రతీ విషయాన్ని లైన్‌ టు లైన్‌ క్షుణ్నంగా చదివితేనే ప్రయోజనం ఉంటుంది. దీనికి అనుగుణంగా ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అవసరమైన పుస్తకాలు ముందే సమీకరించుకోవాలి. పైపైన చదవకుండా సొంత నోట్స్‌ తయారు చేసుకుంటూ చదివితే పరీక్షలు దగ్గర ఉండగా మరోసారి చూసుకోవచ్చు. సిలబస్‌ త్వరగా పూర్తి చేసుకుని పునశ్చరణపై దృష్టి సారిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.

గ్రూప్‌ ఉద్యోగం.. ఉన్నత శిఖరాలకు నాంది

రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌-1, 2, 3 ఉద్యోగాల నియామకానికి పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. కష్టపడి కొలువు సాధిస్తే జిల్లా స్థాయి అధికారి నుంచి కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ పోస్టు వరకు వెళ్లే అవకాశముంది. ప్రణాళికాబద్ధంగా సాధన చేస్తే కొలువు సాధించవచ్చు. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఇక్కడ ఉచిత శిక్షణ ఇస్తారు.


 

సాత్విక ఆహారం తీసుకోవాలి

భోజనాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అజీర్ణం, గ్యాస్ట్రిక్‌ తదితర సమస్యలు వస్తాయి. మెదడుకు, శరీరానికి కావాల్సిన శక్తి లభించక నీరసం వస్తుంది. సరైన సమయానికి భోజనం చేయాలి. అధికంగా మసాలాలు ఉండే పదార్థాలతో పాటు మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది. తేలికపాటి సమతుల్య కూరగాయలతో కూడిన ఆహారం, పండ్లు తీసుకోవాలి.


 

సమయపాలన ముఖ్యం

ప్రస్తుతం సమయం చాలా కీలకం. అందుకే ఏమాత్రం వృథా చేయకుండా ఒక ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి. ఉదయం నిద్ర లేచి సాధన చేయాలి. రాత్రి త్వరగా పడుకొని ఉదయం త్వరగా మేల్కొని సాధన చేసేలా ప్రణాళిక చేసుకొని ఆ దిశగా కృషి చేయాలి. ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.


రీజనింగ్‌పై దృష్టి సారిస్తే..

మొక్కవోని దీక్షతో కష్టపడి మూడు ఉద్యోగాలు సాధించారు మంచిర్యాల డిప్యూటీ తహసీల్దార్‌ అంజలిరెడ్డి. 2015లోనే పంచాయతీ కార్యదర్శి, గ్రూప్‌-4 ఉద్యోగాలు సాధించారు. 2016లో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ రాగానే ఆత్మవిశ్వాసం, పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించారు. 2020లో దండేపల్లి డిప్యూటీ తహసీల్దార్‌గా నియమితులయ్యారు. గతంలో పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు బాగా సాధన చేయడంతో పాటు అప్టిట్యూడ్‌, రీజనింగ్‌పై బాగా దృష్టి సారించాలని ఆమె తెలిపారు. దీనికి అనుగుణంగా ముందే ప్రణాళిక సిద్ధం చేసుకుని సమయపాలనతో చదివితే ఉద్యోగం సాధించవచ్చని చెప్పారు.


ప్రణాళికాబద్ధంగా సాధన చేస్తే విజయం: ఎస్‌.కిషన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మంచిర్యాల

పరీక్షలను తేలికగా తీసుకోకుండా ప్రారంభం నుంచే ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి. సిలబస్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఒక సబ్జెక్టు తీసుకుంటే ప్రతీ విషయాన్ని లైన్‌ టు లైన్‌ క్షుణ్నంగా చదివితేనే ప్రయోజనం ఉంటుంది. అవసరమైన పుస్తకాలు ముందే సమీకరించుకోవాలి. ప్రింటెడ్‌ నోట్స్‌ కాకుండా మనం సొంతంగా తయారు చేసుకుంటే బాగా గుర్తుంటాయి. పరీక్షల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా జవాబులు రాయొచ్చు. తొలుత ఒకసారి సిలబస్‌ పూర్తి చేసి ఆ తర్వాత మరోసారి రివిజన్‌ అయ్యేలా ప్రణాళిక చేసుకోవాలి.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.