• facebook
  • whatsapp
  • telegram

Education: పోటీ తీవ్రత వల్లే కట్‌ ఆఫ్‌ మార్కుల పెంపు...

* నీట్‌లో టాపర్ల సంఖ్యా పెరిగింది

* విమర్శలపై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ వివరణ

దిల్లీ: వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌-యూజీకి సంబంధించి కట్‌ ఆఫ్‌ మార్కుల పెంపును, అగ్రశేణి టాపర్ల సంఖ్య పెరగడాన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సమర్థించుకుంది. అభ్యర్థుల పోటీతత్వంతో పాటు పరీక్ష రాసిన వారి సంఖ్య అధికం కావడమూ దీనికి కారణమని పేర్కొంది. పరీక్ష నిర్వహణలో, సంస్థ నైతిక నిష్ఠ విషయంలో  ఎక్కడా రాజీపడలేదని స్పష్టం చేసింది. మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో నిర్వహించిన నీట్‌లో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై సంస్థ జూన్‌ 6నఈ వివరణ ఇచ్చింది. 2023లో 20.38లక్షల మంది నీట్‌కు సన్నద్ధం కాగా 2024లో వారి సంఖ్య 23.33లక్షలకు పెరిగిందని ఎన్‌టీఏ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అభ్యర్థుల సంఖ్యతో పాటు అధిక స్కోరు సాధించే వారి సంఖ్యా పెరగడం సహజమేనన్నారు. కొన్ని కేంద్రాల్లో పరీక్ష నిర్వహణలో జాప్యంపై 1,563 మంది అభ్యర్థులు హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారని, వారికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయడం కోసం గ్రేస్‌ మార్కులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇలా గ్రేస్‌ మార్కులు పొందిన వారిలో మైనస్‌ 20 నుంచి 720 వరకు మార్కులు వచ్చిన విద్యార్థులూ ఉన్నారని వివరించారు. ఒకేవిధమైన టాప్‌ ర్యాంకును అత్యధిక స్థాయిలో 67 మంది సాధించడం, వీరిలో ఆరుగురు హరియాణాలోని ఒకే కేంద్రంలో పరీక్ష రాసినవారు కావడంపైనా ఆరోపణలు వచ్చాయి. అయితే, వీటిని ఎన్‌టీఏ తోసిపుచ్చింది. ఎన్సీఈఆర్టీ నూతన పాఠ్యపుస్తకాల ప్రకారం నీట్‌ ప్రశ్నపత్రం రూపొందిందని, కొందరు విద్యార్థులు ఎన్సీఈఆర్టీ పాత పాఠ్యపుస్తకాలతో పరీక్షకు సన్నద్ధమయ్యారని తెలిపారు. వారి నుంచి అభ్యర్థనలు రావడంతో కమిటీ పరిశీలించి వారికి 5 గ్రేస్‌ మార్కులు కలిపిందన్నారు. దీనివల్ల 44 మంది మార్కులు 715 నుంచి 720కి పెరిగాయని, టాపర్ల సంఖ్య అధికం కావడానికి ఇది కూడా ఓ కారణమని ఎన్‌టీఏ అధికారులు వివరించారు. నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీతో పాటు ఫలితాల వెల్లడి వరకు పలు అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించింది. నీట్‌ నిర్వహణలో పారదర్శకత లోపించిందంటూ పలువురు విద్యార్థులు కూడా ఎన్‌టీఏ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

‣ వాయుసేనలో అత్యు్న్నత ఉద్యోగాలకు ఏఎఫ్‌ క్యాట్‌

‣ కోర్సుతోపాటు ఆర్మీ కొలువు

‣ డేటా ప్రపంచంలో సత్తా చాటాలంటే?


 

Published Date : 07-06-2024 12:54:18

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం