• facebook
  • whatsapp
  • telegram

TG EAPCET: ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదా

జూన్‌ 27కి బదులు జులై 4 నుంచి ప్రారంభం

8 నుంచి వెబ్‌ ఆప్షన్లు 


 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద బీటెక్‌లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ వారం రోజులపాటు వాయిదా పడింది. గత నెలలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 27వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుకావాల్సి ఉంది. దాన్ని జులై 4వ తేదీ నుంచి ప్రారంభిస్తామని ఎప్‌సెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ బుర్రా వెంకటేశం తాజాగా ప్రకటించారు. వాస్తవానికి ఇంజినీరింగ్‌ కళాశాలలకు జూన్‌ 30 నాటికి అనుమతుల ప్రక్రియ పూర్తి చేస్తామని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గతంలోనే ప్రకటించింది. అయితే రాష్ట్ర విద్యాశాఖ అధికారులు మాత్రం జూన్‌ 27వ తేదీ నుంచి కౌన్సెలింగ్, 30వ తేదీ నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రారంభిస్తామంటూ మూడు విడతల కౌన్సెలింగ్‌ షెడ్యూలు జారీ చేశారు. వాస్తవానికి ఈ ప్రక్రియను ఒకటీ, రెండు రోజులు వాయిదా వేస్తే సరిపోతుంది. అయినా వారం రోజులపాటు వాయిదా వేయడం గమనార్హం.


సీట్ల పెంపుపై తుది నిర్ణయం తీసుకోకపోవడంతోనే..

ఏఐసీటీఈ ఇచ్చిన వెసులుబాటుతో ఈసారి దాదాపు 50 కళాశాలలు సీఎస్‌ఈ, ఇతర డిమాండ్‌ ఉన్న సీట్లను పెంచుకోవడానికి దరఖాస్తు చేశాయి. ఏఐసీటీఈ అనుమతులు కూడా ఇచ్చింది. వాటికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపితేనే కౌన్సెలింగ్‌లో చేరుస్తారు. దీనిపై విద్యాశాఖ కూడా సీఎం వద్దే ఉండటంతో.. ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త సీట్లకు అనుమతి ఇస్తే బోధనా రుసుముల భారం భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీట్ల పెంపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోవడంతో కౌన్సెలింగ్‌ను వారం రోజులపాటు వాయిదా వేసినట్లు సమాచారం.


ఆఫ్‌ క్యాంపస్‌లకు ఈసారి అనుమతి లేనట్లే!

కొన్ని నిర్దిష్ట నిబంధనల మేరకు కళాశాలలు ఆఫ్‌ క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకోవడానికి ఏఐసీటీఈ అనుమతులు ఇస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలోని నాలుగు కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో బీవీఆర్‌ఐటీ, వర్ధమాన్, కేఎంఐటీ, జయప్రకాశ్‌ నారాయణ్‌ (మహబూబ్‌నగర్‌) కళాశాలలు ఉన్నాయి. హైదరాబాద్‌లో మరో క్యాంపస్‌ ఏర్పాటుకు ఆ కళాశాలలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. వాటికి ఏఐసీటీఈ నుంచి అనుమతులు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. ఇప్పటికే ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలు వెల్లడించినందువల్ల ఈ సంవత్సరానికి ఆఫ్‌ క్యాంపస్‌లకు అనుమతి ఇవ్వకూడదని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం. కళాశాలల యాజమాన్యాలు మాత్రం కౌన్సెలింగ్‌ వాయిదా పడినందువల్ల.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.


తొలి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూలు

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, స్లాట్‌ బుకింగ్‌ : జులై 4 నుంచి 12 వరకు

ధ్రువపత్రాల పరిశీలన : జులై 6 నుంచి 13 వరకు

వెబ్‌ ఆప్షన్ల నమోదు : జులై 8 నుంచి 15 వరకు

సీట్ల కేటాయింపు : జులై 19వ తేదీ లేదా ఆలోపు

ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్, ఫీజు చెల్లింపు : జులై 19 నుంచి 23 వరకు

 రెండో విడత కౌన్సెలింగ్‌ : జులై 26 నుంచి ఆగస్టు 2 వరకు

 చివరి విడత కౌన్సెలింగ్‌ : ఆగస్టు 8 నుంచి 17 వరకు

 కేంద్రీయ అంతర్గత స్లైడింగ్‌ : ఆగస్టు 21 నుంచి 28 వరకు

 స్పాట్‌ ప్రవేశాలకు మార్గదర్శకాల జారీ : ఆగస్టు 28న
 

                                           తొలిదశ
‣ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, స్లాట్‌ బుకింగ్‌ 04-07-2024 నుంచి 12-07-2024 వరకు.
‣ ధ్రువపత్రాల పరిశీలన 06-07-2024 నుంచి 13-07-2024 వరకు.
‣ ఆప్షన్ల ఎంపిక 08-07-2024 నుంచి 15-07-2024 వరకు.
‣ ఆప్షన్ల ఫ్రీజింగ్‌ 15-07-2024
‣ సీట్ల కేటాయింపు 19-07-2024
‣ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ 19-07-2024 నుంచి 23-07-2024 వరకు.


 

                                            రెండోదశ
 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, స్లాట్‌ బుకింగ్‌ 26-07-2024.
 ధ్రువపత్రాల పరిశీలన 27-07-2024.
 ఆప్షన్ల ఎంపిక 27-07-2024 నుంచి 28-07-2024 వరకు.
‣ ఆప్షన్ల ఫ్రీజింగ్‌ 28-07-2024.
 సీట్ల కేటాయింపు 31-07-2024.
 సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ 31-07-2024 నుంచి 02-08-2024 వరకు.


 

                                             తుదిదశ
‣ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, స్లాట్‌ బుకింగ్‌ 08-08-2024.
 ధ్రువపత్రాల పరిశీలన 09-08-2024.
‣ ఆప్షన్ల ఎంపిక 09-08-2024 నుంచి 10-08-2024 వరకు.
 ఆప్షన్ల ఫ్రీజింగ్‌ 10-08-2024
 సీట్ల కేటాయింపు 13-08-2024
 సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ 13-08-2024 నుంచి 15-08-2024 వరకు.


 ♦ తెలంగాణ ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు  


  ♦ తెలంగాణ ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ వెబ్‌సైట్‌  
 

 ♦  తెలంగాణ మాక్ కౌన్సెలింగ్స్ - 2024  

 ‣ ఇంజినీరింగ్
 ‣ అగ్రిక‌ల్చ‌ర్ & మెడిక‌ల్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.