• facebook
  • whatsapp
  • telegram

CM Revanth Reddy: సివిల్స్‌ అభ్యర్థులకు ఆర్థిక సాయం: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌లో ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పాసైన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు. అంతకుముందు సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పాసైన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, సింగరేణి సీఎండీ బలరామ్‌ పాల్గొన్నారు.


ఉద్యోగ నియామకాల కోసమే రాష్ట్రాన్ని సాధించుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘విద్యార్థుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పడింది. 90 రోజుల్లో 30 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్నారు. నిరుద్యోగుల బాధలు మాకు తెలుసు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్స్‌ ఇచ్చాం. టీజీపీఎస్సీని పునర్‌వ్యవస్థీకరించాం.  పరీక్షలు మాటిమాటికి వాయిదా పడటం మంచిదికాదు. అభ్యర్థుల సమస్యలను అర్థం చేసుకుని గ్రూప్‌-2ను వాయిదా వేశాం.

నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యం

నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నాం. జూన్‌ 2న నోటిఫికేషన్‌, డిసెంబర్‌ 9 లోపు ఉద్యోగాలిచ్చేలా జాబ్‌ క్యాలెండర్‌ రూపొందిస్తాం. సివిల్స్‌ అభ్యర్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరఫున సాయం చేస్తున్నాం. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు కచ్చితంగా జాబ్‌ సాధించాలి. సివిల్స్‌ సాధించి మన రాష్ట్రానికే రావాలి. ఐఏఎస్‌, ఐపీఎస్‌లు మన వారైతే రాష్ట్రానికి మంచి జరుగుతుంది.

నోటిఫికేషన్‌ ఇచ్చి సమయానికి పరీక్షలు నిర్వహించిన దాఖలాలు గత పదేళ్లలో లేవు. అందుకు కారణమేదైనా యువత ఉజ్వల భవిష్యత్ ఆగమైంది. దురదృష్టవశాత్తూ కొన్నేళ్లుగా తెలంగాణలో యువత ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేదానికంటే.. పరీక్షల్లో జరిగే నిర్వహణ లోపాలపై కొట్లాడేందుకే వారి సమయం వృథా అయ్యింది. యూపీఎస్సీ ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా.. వాటిపై ఆరోపణలు లేవు. అందుకే మేం గతంలో యూపీఎస్సీ ఛైర్మన్‌ను కలిశాం. యూపీఎస్సీ తరహాలో కొన్ని మార్పులు చేసి వెంట వెంటనే నోటిఫికేషన్లు ఇస్తున్నాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.