అక్కడ అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి
ప్రభుత్వానికి ఉన్నతస్థాయి కమిటీ నివేదిక
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు హైదరాబాద్‌లోని నేషనల్ అకాడెమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్)లో అన్ని సదుపాయాలు ఉన్నాయని ఉన్నతస్థాయి కమిటీ పేర్కొంది. వసతులు, నిధులూ అందుబాటులో ఉండటంతో పాటు నిర్మాణరంగ కోర్సులకూ డిమాండు ఉన్న నేపథ్యంలో న్యాక్‌లో కన్స్ట్రక్షన్ యూనివర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయవచ్చని ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ నివేదికను సమర్పించింది. ‘నిర్మాణ రంగం అనూహ్యంగా విస్తరిస్తోంది. దీనికి సంబంధించి ప్రపంచంలో ఎక్కడా ప్రత్యేక వర్సిటీలు లేవు. మలేసియా, సింగపూర్లలో రెండు అకాడమీలు ఉన్నాయి’’ అని అందులో తెలిపింది.
సర్కారుపై ఆర్థిక భారం ఉండదు
‘‘అంతర్జాతీయంగా నిర్మాణ రంగ నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్‌లో కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. వర్సిటీకి అవసరమైన స్థలం, కొన్ని నిర్మాణాలు న్యాక్‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టం ప్రకారం ప్రయివేటు(డీమ్డ్) విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 20 ఎకరాల విస్తీర్ణం ఉండాలి. న్యాక్‌కు 46 ఎకరాల ప్రాంగణం ఉంది. ఇప్పటికే వివిధ విశ్వవిద్యాలయాలతో కలిసి కన్స్ట్రక్షన్ కోర్సులను అందిస్తున్న అనుభవం ఉంది. కార్పస్ ఫండ్ రూపంలో ప్రభుత్వం ప్రతిఏటా న్యాక్‌కు నిధులు విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో సర్కారుపై పెద్దగా ఆర్థిక భారం కూడా ఉండదు’’అని కమిటీ తన నివేదికలో అభిప్రాయపడింది. విశ్వవిద్యాలయం స్థాపనకు అనువైన పరిస్థితులు న్యాక్‌లో ఉన్నాయని, ఏర్పాటైతే దేశంలో తొలి ప్రత్యేక విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందుతుందని కమిటీ సభ్యుడు ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు.
త్వరలో సీఎం కార్యాలయానికి దస్త్రం
‣ న్యాక్‌లో ప్రైవేటు వర్సిటీ ఏర్పాటుపై ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన నివేదికకు రహదారులు, భవనాలశాఖ మంత్రి ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. త్వరలో ముఖ్యమంత్రి కార్యాలయానికి దస్త్రం చేరనుంది. అక్కడి నుంచి అనుమతి లభించిన తరవాత నిర్మాణరంగానికి సంబంధించి ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది.
‣ ఉన్నత స్థాయి కమిటీ ఛైర్మన్‌గా రహదారులు, భవనాలశాఖ కార్యదర్శి, న్యాక్ డైరెక్టర్ జనరల్ కన్వీనర్‌గా, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ నుంచి ఇద్దరు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, క్రెడాయ్ తెలంగాణ విభాగం నుంచి ఒక్కో ప్రతినిధి సభ్యులుగా వ్యవహరించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.