• facebook
  • whatsapp
  • telegram

Byjus Lessons: గాడి తప్పుతున్న బైజూస్‌ ట్యాబ్‌ చదువులు

ఇతర వీడియోలు, ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటుపడుతున్న విద్యార్థులు
వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు
అయినా వాడాల్సిందేనంటున్న జగన్‌ సర్కారు

మా పిల్లలకు ఈ బైజూస్‌ వద్దు ఏం వద్దు. ట్యాబ్‌లు వెనక్కి తీసుకోండి.
ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి వద్ద తల్లిదండ్రుల మొర
ఇక మీదట ట్యాబ్‌లో పాఠాలు తప్పించి మరేదీ చూడనని మాటిస్తున్నాను.
ఏలూరు జిల్లాలోనే ఓ విద్యార్థితో  ప్రధానోపాధ్యాయుడు రాయించుకున్న హామీపత్రం
ట్యాబ్‌ల పుణ్యమా అని మా పిల్లలు చెడిపోయేలా ఉన్నారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో ఓ విద్యార్థి తల్లి ఆవేదన
పిల్లలు చదువులు మానేసి ఏవేవో చూస్తున్నారు. ఇళ్లకు ఈ ట్యాబ్‌లు ఇవ్వొద్దు.
అనకాపల్లి జిల్లాలో ఉపాధ్యాయులకు తల్లిదండ్రుల ఫిర్యాదు
రాష్ట్రంలో ఎక్కడ చూసినా పాఠశాలల్లో ఇదే తీరు! రోజూ ఏదో ఒక ఫిర్యాదు. జగనన్న పుట్టినరోజు కానుకగా విద్యార్థులకు అందించిన బైజూస్‌ ట్యాబ్‌లు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో, ఇళ్లలో కలకలం సృష్టిస్తున్నాయి. చదువేమో గానీ... పిల్లలు చెడిపోతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈనాడు, అమరావతి: బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు ఇవ్వడం చదువుల్లో ఓ విప్లవాత్మక మార్పుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ వాటితో మేలుకంటే కీడే ఎక్కువ జరుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. చాలా చోట్ల విద్యార్థులు ట్యాబ్‌ల పాస్‌వర్డ్‌లను తొలగించి, ఇతర రకాల వీడియోలు చూస్తున్నారు. కొందరు ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడుతున్నారు. దాంతో కొన్నిచోట్ల విద్యార్థుల తల్లిదండ్రులే ట్యాబ్‌లను వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయులను కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ పాఠశాలలో విద్యార్థులు ట్యాబ్‌లో ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడుతుండడంతో స్థానికులు గుర్తించి ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ట్యాబ్‌లను లాక్‌ చేయించారు. కానీ కొద్ది రోజులకే మళ్లీ ప్రైవేటు యాప్‌లు అప్‌లోడ్‌ చేయించారు విద్యార్థులు. సెలవు రోజుల్లో చరవాణుల నుంచి వైఫై కనెక్షన్‌తో ట్యాబ్‌లో ప్రైవేటు వీడియోలు చూస్తున్నారు. నిరుడు సీఎం జగన్‌ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు కలిపి 5.18లక్షల ట్యాబ్‌లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈనెల 21న మరోసారి ట్యాబ్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
యునిసెఫ్‌ వద్దంటున్నా..
‘ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయం లేదు. ఆన్‌లైన్‌కంటే ఉపాధ్యాయుడి సమక్షంలో అభ్యసనే మేలు. బోధనలో సాంకేతిక పరికరాలు తెచ్చే దుష్ప్రభావాలపై తస్మాత్‌ జాగ్రత్త!’ అంటూ ఐక్యరాజ్య సమితి విద్యానుబంధ సంస్థ యునిసెఫ్‌ ఇటీవలే ఆన్‌లైన్‌ చదువులపై హెచ్చరించింది. తదనుగుణంగా అనేక దేశాలు ఆన్‌లైన్‌ నుంచి పిల్లల్ని మళ్లీ సాధారణ విద్యకు అలవాటు చేస్తున్నాయి. చైనా, ఫ్రాన్స్‌లాంటి చోట్లయితే విద్యార్థులకు ట్యాబ్‌లు, ఫోన్లపై నిషేధాలు సైతం విధిస్తున్నారు. తద్వారా భావితరాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆంధ్రావనిలో జగన్‌ సర్కారు మాత్రం ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెది మరోదారన్నట్లు వ్యవహరిస్తోంది. బైజూస్‌ పాఠాలంటూ విద్యార్థులపై ట్యాబ్లెెట్‌ చదువును  బలవంతంగా రుద్దుతోంది.
ఉచితం ఉండగా... ఎందుకీ దండగ!
కరోనా తర్వాత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆఫ్‌లైన్‌ తరగతులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆన్‌లైన్‌ చదువుల కారణంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయని, విద్యార్థుల ఏకాగ్రత తగ్గిపోతుందని అనేక సర్వేలు చెబుతున్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం బైజూస్‌ ట్యాబ్‌లతో విద్యార్థులను ఏదో ఉద్ధరిస్తున్నట్టు ప్రచార ఆర్భాటం చేస్తోంది. పాఠశాల స్థాయిలో టెక్నాలజీ వాడకాన్ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తే ఫర్వాలేదు. పిల్లలపై ఎవ్వరి పర్యవేక్షణా లేకపోతే టెక్నాలజీ గాడితప్పే పరిస్థితి ఉంది. ఇందు కోసమే చాలామంది తల్లిదండ్రులు కరోనా తర్వాత ఆన్‌లైన్‌ చదువులను ఆపేశారు. ఒకవేళ ప్రభుత్వం విద్యార్థులకు అదనంగా చదువును అందించాలి అనుకుంటే ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా తరగతులు పెట్టించొచ్చు. సీబీఎస్‌ఈ సిలబస్‌కు సంబంధించిన వీడియోలను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆన్‌లైన్‌లో ఉంచింది. కానీ, ప్రభుత్వం బైజూస్‌ కంటెంట్‌, ట్యాబ్‌లతో ఎన్నికల ప్రచారం కోసం ప్రయత్నాలు చేస్తుందే తప్ప.. పిల్లల పరిస్థితి, అభ్యసన సామర్థ్యాలను పట్టించుకోవడం లేదు. బైజూస్‌ కంటెంట్‌ ఉన్నప్పటికీ రూ.లక్షలు పెట్టి విద్యాశాఖ ఇటీవల ఉపాధ్యాయులతో మళ్లీ అదనంగా వీడియో పాఠాలు చేయిస్తుండటం గమనార్హం!
మరమ్మతులకూ దిక్కు లేదు
ఇచ్చిన ట్యాబ్‌లూ సరిగ్గా పనిచేయటం లేదు. అధికశాతం తరచూ మొరాయిస్తున్నాయి. సరఫరా చేసిన గుత్తేదారు మాత్రం వాటి మరమ్మతులను పట్టించుకోవడం లేదు. ట్యాబుల్లో సమస్య తలెత్తిన వారం రోజుల్లో మరమ్మతులు చేయలేకపోతే కొత్తవి ఇవ్వాలని గతంలో ఓ సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశించారు. నిబంధనల ప్రకారం మూడేళ్లు వారంటీ ఉన్నా, సాక్షాత్తూ ముఖ్యమంత్రే మౌఖికంగా చెప్పినా.. నెలల తరబడి మరమ్మతులు చేయకపోవడంతో రాష్ట్రంలో 30 శాతం ట్యాబ్‌లు ఎప్పుడూ రిపేర్‌లోనే ఉంటున్నాయి.
అనకాపల్లి జిల్లా చోడవరం మండలానికి ఇచ్చిన 960 ట్యాబ్‌ల్లో పాడైన కొన్నింటిని విద్యార్థులే నేరుగా సెల్‌ దుకాణానికి తీసుకెళ్లి రిపేర్‌ చేయించుకున్నారు. అక్కడ కొన్ని ప్రైవేటు యాప్‌లు వేస్తూ, విద్యార్థులతో సొంతంగా పాస్‌వర్డ్‌ పెట్టిస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులు వాటిని ఓపెన్‌ చేసి చూడలేకపోతున్నారు. ఇదే మండలంలోని ఓ ఉన్నత పాఠశాలకు 108 ట్యాబ్‌లు ఇవ్వగా.. వాటిలో 40శాతం పని చేయడం లేదు.
కాన్సెప్ట్‌లు అర్థం చేసుకునేదెలా?
ట్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నవారికి ఆ అవకాశం ఉందా అంటే అదీ లేదు. పాఠాలు వింటున్న విద్యార్థులకు ఏమైనా సందేహాలు వస్తే వాటిని నివృత్తి చేసేవారే ఉండటం లేదు. సాధారణంగా ప్రైవేటులో బైజూస్‌ పాఠాలపై ఏమైనా సందేహాలు వస్తే ఆ సంస్థ ప్రతినిధులు ఆన్‌లైన్‌లో నివృత్తి చేస్తారు. విద్యార్థుల సందేహాలపై ఫోన్‌ చేస్తే సమయం ఇచ్చి ఆన్‌లైన్‌లో మాట్లాడతారు. జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతిలో ఆ విధానం లేదు. కేవలం కంటెంట్‌ వేసి, ఇవ్వడమే తప్ప అది పిల్లవాడికి ఎంత వరకు అర్థమైంది? వారి పరిస్థితి ఏంటి? అనే పరిశీలన లేదు. బైజూస్‌ పాఠాలపై సమీక్షలు ఉండడం లేదు. విద్యార్థులకు ఇష్టం ఉంటే వినడం, లేదంటే మూలకు పడేయడం అన్నట్లు తయారైంది. తరగతిగది పాఠాలు, వర్క్‌బుక్‌లు, నోటుపుస్తకాలు.. దిద్దడంపై ఉన్నతాధికారులు తనిఖీలు చేస్తున్నందున ఉపాధ్యాయులు వీటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. బైజూస్‌లో సందేహాలపై దృష్టిపెట్టడం లేదు. మరోవైపు ప్రభుత్వం మాత్రం బైజూస్‌ కంటెంట్‌, ట్యాబ్‌ల పంపిణీని ఎన్నికల ప్రచారంగా భావిస్తుందే తప్ప, పిల్లలకు కలుగుతున్న ప్రయోజనాన్ని మదింపు చేయడం లేదు.
గతంలో బైజూస్‌ పాఠాల నుంచి పరీక్షల్లో ప్రశ్నలు ఇచ్చేవారు. ఆ తర్వాత టోఫెల్‌ తీసుకురావడంతో దీన్లో కంటెంట్‌ సంగతిని ఉపాధ్యాయులూ పట్టించుకోవడం మానేశారు. ఆ విధంగానూ విద్యార్థులకు ట్యాబ్‌లు నిష్ప్రయోజనంగా మారాయి!
ఉన్నతాధికారులు ట్యాబ్‌ వినియోగంపై లక్ష్యాలు పెట్టడంతో చాలామంది పిల్లలు పాఠాలు వినకుండానే వాటిని ఆన్‌ చేసి వదిలేస్తున్నారు. దాని నుంచి వాళ్లు నేర్చుకుంటున్నది శూన్యం. అధికారులు మాత్రం విద్యార్థులు రోజుకు సగటున 67 నిమిషాలు వినియోగిస్తున్నారంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ 26,146 కానిస్టేబుల్‌ ఖాళీలకు ప్రకటన

‣ ఐటీఐతో విద్యుత్‌ సంస్థలో ఉద్యోగాలు

‣ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో కెరియర్ అవకాశాలు

‣ డిగ్రీతో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటిలో ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.