• facebook
  • whatsapp
  • telegram

Job Skills: ఉద్యోగ నైపుణ్యాల్లో ఐటీ, సీఎస్‌ఈ అభ్యర్థులే టాప్‌

* కొత్త ఏడాదిలో అత్యధిక ఉద్యోగావకాశాలుండే రాష్ట్రాల్లో తెలంగాణది అయిదో స్థానం

* భారత నైపుణ్యాల నివేదిక - 2024 వెల్లడి
 

ఈనాడు, హైదరాబాద్‌: బీటెక్‌లో ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్‌ఈ) చదువుతున్న యువతలో ఉద్యోగ నైపుణ్యాలు అధికంగా ఉంటున్నట్లు భారత నైపుణ్యాల నివేదిక-2024 వెల్లడించింది. ఐటీ విద్యార్థులు 68.44 శాతం, సీఎస్‌ఈలో 66 శాతం మందిలో ప్రతిభ మెండుగా ఉందని ఆ నివేదిక పేర్కొంది. అత్యధిక ఉద్యోగ నైపుణ్యాలున్న బీటెక్‌ అభ్యర్థుల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. అక్కడ 80.56 శాతం మంది ఉన్నారు. 73.23 శాతంతో ఆంధ్రప్రదేశ్‌, 68.36 శాతంతో కేరళ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. బీటెక్‌లోనే కాదు పాలిటెక్నిక్‌లోనూ మహారాష్ట్ర అభ్యర్థులు అత్యంత ప్రతిభ చూపుతున్నారు. వారిలో 84.62 శాతం మంది ఉద్యోగాలకు అర్హులుగా ఉన్నారు.

ఆ రెండు బ్రాంచీల్లోనే ఎందుకు?

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఐటీ రంగంలోనే అత్యధిక ఉద్యోగావకాశాలు ఉన్నాయి. వేతనాలు కూడా ఎక్కువ ఉండడంతో యువత ఐటీ, సీఎస్‌ఈల్లో చేరుతున్నారు. ఏ పరీక్ష నిర్వహించినా ఈ విద్యార్థులే ముందు వరసలో ఉంటున్నారని జేఎన్‌టీయూ జగిత్యాల ప్రిన్సిపల్‌, సీఎస్‌ఈ ఆచార్యుడు కామాక్షిప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. అనేక మంది కళాశాలల్లో చదువుకుంటూనే కొత్త సాంకేతికతలపై సర్టిఫికెట్‌ కోర్సులు చేస్తున్నారని, మరికొందరు సెలవు రోజుల్లో డిమాండ్‌ ఉన్న కోర్సులను అభ్యసిస్తున్నారని ఆయన తెలిపారు. దానికితోడు ఐటీ రంగంలో ఉద్యోగాలకు పోటీ పెరుగుతుండటంతో బీటెక్‌ తొలి ఏడాది నుంచే ప్రాంగణ నియామకాలకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని, ఆయా కళాశాలలు సైతం ఆ దిశగా శిక్షణ ఇస్తున్నాయని పేర్కొన్నారు. బీటెక్‌లో చేరేవారిలో అత్యధికంగా దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోనే ఉంటున్నారని తెలిపారు.

కర్ణాటకలో అత్యధిక కొలువులకు అవకాశం...

2024లో ఉద్యోగ నియామకాలు అధికంగా ఉండే రాష్ట్రాల్లో కర్ణాటక తొలి స్థానంలో నిలవనుందని నివేదిక వెల్లడించింది. ఎక్కువ ఉద్యోగాలకల్పన విషయంలో కర్ణాటక, దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు మొదటి అయిదు స్థానాల్లో ఉండనున్నాయి.


మరింత సమాచారం... మీ కోసం!

‣ నౌకాదళంలో 910 సివిల్‌ కొలువులు

‣ ఫుట్‌వేర్‌ తయారీలో శిక్షణ ఇలా..

‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు

‣ సివిల్స్‌ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.