• facebook
  • whatsapp
  • telegram

Career: యువతా.. ఉందా ‘ప్లాన్‌ బీ’?

* లక్ష్యాన్ని చేరకపోతే ప్రత్యామ్నాయ కెరీర్‌ చూపాలి

* ఆత్మహత్యల నివారణ, కౌన్సెలింగ్‌ కోసం ఎన్‌సీపీసీఆర్‌ విధివిధానాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఈసారి ఎలాగైనా ఉద్యోగం సాధించాలని.. ర్యాంకు కొట్టాలని ఉన్నతాశయాలతో శిక్షణ కేంద్రాలు, వసతిగృహాల్లో చేరుతున్న విద్యార్థులు ఒత్తిడిని జయించలేక ఆత్మహత్యలకు పాల్పడుతుండటంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు సమగ్ర విధానం అవసరమని పేర్కొంది. విద్యార్థులకు మానసిక వైద్యులతో కౌన్సెలింగ్‌ ఇప్పించాలని, లక్ష్యాన్ని సాధించలేనప్పుడు ప్లాన్‌ బీ (ప్రత్యామ్నాయ కెరీర్‌)పై ముందుగానే వారికి వివరించాలని సూచించింది. ఈ మేరకు శిక్షణ సంస్థల్లో నిపుణులు, కౌన్సెలర్లు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. రాజస్థాన్‌ హైకోర్టు ఆదేశాల మేరకు విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు ఎన్‌సీపీసీఆర్‌ ముసాయిదా విధివిధానాలు రూపొందించింది. ఆయా కార్యక్రమాలు నిర్వహణకు రాష్ట్రాలు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించింది.


* ముఖ్యంగా నీట్‌-యూజీ, జేఈఈ,  ఎన్‌టీఎస్‌ఈ తదితర పరీక్షల కోసం వివిధ ప్రాంతాల్లో ఉంటూ విద్యార్థులు కోచింగ్‌ తీసుకుంటున్నారు. ఒక్కో తరగతి గదిలో 150-200 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఇంతమందిని చూసినప్పుడు పోటీ గురించి ఆలోచిస్తూ ఒత్తిడి పెంచుకుంటారు. శిక్షణ సంస్థల్లో రెగ్యులర్‌గా అసెస్‌మెంట్‌ పరీక్షలు నిర్వహిస్తూ.. వాటి స్కోరు ఆధారంగా విద్యార్థులను గ్రూపులుగా విభజిస్తారు. తక్కువ స్కోరు వస్తే కిందిస్థాయి గ్రూపుల్లోకి పంపిస్తారని మానసిక ధైర్యం కోల్పోతున్నారు. మార్కులను తల్లిదండ్రులకు పంపుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. 
 

* ఒత్తిడికి కారణాలు: తల్లిదండ్రుల పెద్దస్థాయి ఆకాంక్షలు, ఒంటరితనం, మానసిక ఆరోగ్యానికి సరైన కౌన్సెలింగ్‌ లేకపోవడం, పరీక్షల్లో ఫెయిలవుతామన్న భయం, విజయంతో కీర్తి సాధించాలన్న తపన, పోలిక, శిక్షణ ఫీజులతో ఆర్థిక భారం, జీవన నైపుణ్యాలు లేకపోవడం, ప్రత్యామ్నాయ కెరీర్‌ ప్లాన్‌ సిద్ధంగా లేకపోవడం. 


* మానసిక అనారోగ్యాన్ని గుర్తించడం ఇలా: విశ్రాంతి తీసుకోకపోవడం, శ్వాసలో ఇబ్బందులు, ఏకాగ్రత కొరవడటం, గైర్హాజరు, జ్ఞాపకశక్తి లోపించడం, వెంటవెంటనే భావోద్వేగాల మార్పు, అపనమ్మకం పేరుకుపోవడం, కుటుంబసభ్యులతో మాట్లాడకపోవడం, స్వీయ హాని చేసుకోవడం, మత్తు పదార్థాలకు అలవాటుపడటం.

ఇవీ విధివిధానాలు..

* బోధన, బోధనేతర సిబ్బందికి విద్యార్థులు ఒత్తిడిని జయించేలా చేయడంపై తర్ఫీదు ఇవ్వాలి.

* లక్ష్య సాధనకు మెరుగైన ప్రణాళికతోపాటు ఇతర ప్రత్యామ్నాయ కెరీర్‌లపై వివరంగా చెప్పాలి.

* పాఠ్యప్రణాళికలో మానసిక విద్య, యోగా, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ తప్పనిసరిగా చేర్చాలి.

* విద్యార్థుల్లో అకడమిక్‌ ఒత్తిడిని తగ్గించేందుకు తరచూ వారితో మాట్లాడుతూ ఉండాలి.

* మానసిక అనారోగ్యాన్ని ముందుగానే గుర్తించేలా నిరంతరం స్క్రీనింగ్‌ చేస్తుండాలి. విద్యార్థులను బృందాలుగా చేసి ఒంటరితనం దూరం చేయాలి.

* తల్లిదండ్రులు పిల్లల్లో సామాజిక ఒత్తిడిని దూరం చేయడంతో పాటు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినా ధైర్యం నింపేలా మాటలు చెప్పాలి. పిల్లలపై వాస్తవ దూరంగా అంచనాలు పెంచుకుని ఒత్తిడి తెచ్చే చర్యలు మానుకోవాలి.

ఒత్తిడిలో ఉన్న విద్యార్థులు సంప్రదించాల్సిన నంబర్లు

* నిమ్హాన్స్‌ సహాయ కేంద్రం - 080 4611 0007

* సంవేదన (ఎన్‌సీపీసీఆర్‌) - 1800 121 2830

* రోషిణి (హైదరాబాద్‌) - 040-66202000

* కిరణ్‌ (సామాజిక న్యాయశాఖ) - 1800 599 0019
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ నౌకాదళంలో 910 సివిల్‌ కొలువులు

‣ ఫుట్‌వేర్‌ తయారీలో శిక్షణ ఇలా..

‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు

‣ సివిల్స్‌ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.