• facebook
  • whatsapp
  • telegram

Private Schools: ‘ఇంటర్నేషనల్‌’ ఫీజులుం

* 10-20 శాతం వరకు పెంచుతున్న ప్రైవేట్‌ పాఠశాలలు

* ప్రశ్నిస్తే టీసీ తీసుకొని వెళ్లండని బెదిరింపులు


ఈనాడు, హైదరాబాద్‌: మా బాబు రెండో తరగతికి రూ.63 వేల ఫీజు. వచ్చే విద్యా సంవత్సరం మూడో తరగతిలోకి వెళ్లాలి. దాన్ని రూ.73 వేలు చేస్తామని పాఠశాల యాజమాన్యం చెప్పింది. అంటే 16 శాతం పెంచారు. కొత్తగా చేరినప్పుడు ప్రతి ఏటా 10 శాతం వరకు మాత్రమే పెంచుతామని చెప్పారు. ఇప్పుడు ప్రశ్నిస్తే ఇష్టం లేకుంటే టీసీ తీసుకొని వెళ్లాలని ప్రిన్సిపాల్‌ పరోక్షంగా బెదిరిస్తున్నారు. రుసుముల పెంపుపై నియంత్రణ లేకుంటే పిల్లల్ని ఎలా చదివించాలి?- ఇది బీరంగూడలోని ఓ ఇంటర్నేషనల్‌ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి తండ్రి ప్రశ్న.

* అత్తాపూర్‌ ప్రాంతంలోని పలు పాఠశాలలు 15 శాతం వరకు పెంచాయి. పెంచడంలో ఒక దానికొకటి పోటీ పడుతున్నాయి. సీబీఎస్‌ఈ పాఠశాలలకు.. అందులో ఇంటర్నేషనల్‌, ఇతర ఆకర్షణీయ పేర్లతో నడిచే వాటికి తల్లిదండ్రుల నుంచి డిమాండ్‌ ఉండటంతో యాజమాన్యాలు చెప్పిందే ఫీజు అవుతోంది- ఒకటో తరగతిలో తమ కుమారుడిని చేర్పించాలనే ప్రయత్నంలో ఉన్న ఓ తండ్రి ఆవేదన.
 

* డిసెంబరు వచ్చిందంటే తమ పిల్లలు చదువుతున్న పాఠశాలలు కొత్త విద్యా సంవత్సరానికి ఎంత ఫీజు పెంచుతాయోనని జీహెచ్‌ఎంసీ, చుట్టుపక్కల ప్రాంతాల్లోని తల్లిదండ్రుల గుండెలు అదురుతున్నాయంటే అతిశయోక్తి కాదు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల స్కూళ్లు నవంబరు నుంచే వచ్చే విద్యా సంవత్సరానికి(2024-25) ఎల్‌కేజీ, యూకేజీ, ఒకటో తరగతికి ప్రవేశాలు నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి అందుకు విద్యాశాఖ ఓ కాలపట్టిక ఇవ్వాల్సి ఉన్నా అధికారులు మాత్రం గత మూడు నాలుగేళ్లుగా దీన్ని మరిచిపోయారు. తల్లిదండ్రులే ఎవరికి వారు ఆరా తీసుకొని దరఖాస్తు చేసుకుంటున్నారు. 100-150 సీట్లకు 1500-2000 వరకు దరఖాస్తులు వస్తున్న పాఠశాలలు జీహెచ్‌ఎంసీ పరిధిలో అనేకం ఉన్నాయి. ఆ డిమాండ్‌ను గమనిస్తున్న స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. పలు పాఠశాలలు 10-20 శాతం దాకా పెంచుతున్నాయి. ట్యూషన్‌ ఫీజులే కాకుండా అడ్మిషన్‌ ఫీజును రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నాయి. గచ్చిబౌలిలోని ఓ పాఠశాల విచిత్రంగా పేరెంట్స్‌ ఓరియంటేషన్‌ పేరిట రూ.5 వేల వరకు చూపడం ఇటీవల సామాజిక మాధ్యమాల్లోనూ చర్చకు దారితీసింది.


నియంత్రణే కాదు.. ఫీజుల వివరాలూ కష్టమే


ఫీజులు భారీగా పెరుగుతుండటంపై హెచ్‌ఎస్‌పీఏ ప్రతినిధులు వాటిని నియంత్రించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తుండటంతో 2017లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య తిరుపతిరావు ఛైర్మన్‌గా ఓ కమిటీని నియమించింది. ఆ నివేదిక ఇచ్చినా గత ఆరేళ్ల నుంచి ప్రభుత్వం దాన్ని ఆమోదించామనిగానీ.. తిరస్కరించామనిగానీ చెప్పకుండా.. పరిశీలిస్తున్నామని కాలయాపన చేసింది. 2022 మార్చిలో మంత్రివర్గ ఉపసంఘం సైతం సమావేశమై పది శాతానికి మించకుండా పెంపు ఉండాలని నిర్ణయించి పలు సిఫారసులను సర్కారుకు పంపింది. అయినా దానికీ ఆమోదం లభించలేదు. కొద్ది నెలల క్రితం కనీస ఫీజుల వివరాలు వెబ్‌సైట్లో ఉంచడంతోపాటు తమకూ పంపాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. అయినా కేవలం 100 పాఠశాలలు మాత్రమే ఆ వివరాలను సమర్పించాయి. ఆ తర్వాత ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులతో ఫీజుల విషయాన్ని పక్కనబెట్టింది.  


అడిగితే టీసీ ఇస్తామంటారు..


రాష్ట్రంలో బీటెక్‌ ఫీజులు రూ.45 వేల నుంచి గరిష్ఠంగా రూ.1.60 లక్షలు మాత్రమే. అదే ఎల్‌కేజీ, యూకేజీ ఫీజులు అత్యధికంగా రూ.4 లక్షల దాకా ఉండటం గమనార్హం. మెట్రో నగరాల్లో అధిక ఫీజులు ఉన్నది హైదరాబాద్‌ అని సర్వేలు స్పష్టంచేస్తున్నాయని హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌(హెచ్‌ఎస్‌పీఏ) ప్రతినిధులు చెబుతున్నారు. ‘ఇప్పటికే అధిక ఫీజులు.. ప్రతి ఏటా భారీగా పెంచుతున్నారు. అడిగితే ఇష్టం లేకుంటే టీసీ తీసుకొని వెళ్లమని సలహా ఇస్తున్నారు. ఇది పరోక్షంగా బెదిరిస్తున్నట్లే’ అని అమీర్‌పేటలోని ఓ పాఠశాల విద్యార్థి తండ్రి తెలిపారు. ‘అందరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే.. ఎంత పెంచినా ఎవరూ అడగరనే భావనతో 16 శాతం పెంచారు. ఇతర పాఠశాలల్లో ఫీజులు ఇంకా ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నార’ని బీరంగూడకు చెందిన ఆర్మీ విశ్రాంత ఉద్యోగి వాపోయారు. మధ్యలో ఒకరు టీసీ తీసుకొని వెళితే కొత్తగా వచ్చేవారికి మరింత ఫీజుతోపాటు మళ్లీ అడ్మిషన్‌ ఫీజు వసూలు చేయవచ్చన్న భావనతో యాజమాన్యాలు ఉన్నట్లు చెబుతున్నారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల పాఠశాలలకు డిమాండ్‌ పెరుగుతుండటంతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో పలు నగరాలు, పట్టణాల్లోని పాఠశాలలు ఆ బోర్డుకు మారేందుకు విద్యాశాఖకు దరఖాస్తు చేస్తున్నాయి.

మరింత సమాచారం... మీ కోసం!

‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?

‣ దిద్దుబాటుతో విజయం తథ్యం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

‣ 995 ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కొలువులు

‣ వైరాలజీ సంస్థలో ఉద్యోగాలు

‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.