• facebook
  • whatsapp
  • telegram

Medical College: వైద్య కళాశాల.. ఖాళీలతో వెతలు

* అధ్యాపకుల హాజరుపై ఎన్‌ఎంసీ షోకాజు నోటీసులు

* నియామకాలపై ప్రభుత్వం దృష్టి పెడితే మేలు

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: అట్టహాసంగా మొదలైన సిరిసిల్ల వైద్య కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది. గతేడాది సెప్టెంబరు 15న 2023-24 విద్యా సంవత్సరానికి కళాశాల ప్రారంభమైంది. ప్రస్తుతం వంద మంది విద్యార్థులున్నారు. తొలి ఏడాది ఎంబీబీఎస్‌ కోర్సులో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ పాఠ్యాంశాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లు అవసరమైన ప్రొఫెసర్లను ప్రభుత్వం నియమించి తరగతులు ప్రారంభించింది. వీరికి రెండో ఏడాది నుంచి తరగతులతోపాటు ఆసుపత్రికి అనుబంధంగా ఉండే జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో వైద్య చికిత్సలపై శిక్షణ కూడా ఉంటుంది. కళాశాల అనుమతులు జారీ చేశాక జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అందుకు సంబంధించిన నిబంధనలు సూచిస్తుంది. అయితే సిరిసిల్ల మెడికల్‌ కళాశాలలో బోధన, బోధనేతర సిబ్బంది హాజరుశాతం తగ్గడంపై షోకాజు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.


హాజరు శాతం, నిర్వహణ

విద్యార్థుల హాజరు శాతం వందశాతం ఉన్నప్పటికీ ఆచార్యుల హాజరు శాతం ప్రతి నెలా తగ్గుతోంది. దీనిని ఎన్‌ఎంసీ ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ విధానంలో నిత్యం పరిశీలిస్తుంది. బయోమెట్రిక్‌ హాజరు విధానం అమలు కోసం డీఎంఈ ఆరు యంత్రాలను అందజేసింది. వీటితో ఆచార్యుల హాజరులో మార్పు రాకపోవడంతో సీరియస్‌గా తీసుకుంది. ఆసుపత్రి మేనేజ్‌మెంట్‌ ఇన్ఫ్‌ర్మేషన్‌ సిస్టం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తప్పుపట్టింది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఏడాది విద్యార్థుల బోధనపైన ప్రభావం చూపుతుందని, దీనిపై సమాధానం ఇవ్వాలని ఇటీవల జారీ చేసిన షోకాజ్‌ నోటీసులో పేర్కొంది.


అదనపు పని గంటలతో ఒత్తిడి

మరోవైపు విధుల్లో చేరిన వైద్యుల్లో పలువురు వివిధ కారణాలతో హాజరు కావడం లేదు. వైద్యులైన దంపతులకు వేర్వేరు జిల్లాలో పోస్టింగులు ఇచ్చారు. ఉదాహరణకు భర్తకు నాగర్‌కర్నూలు, భార్యకు సిరిసిల్లలో విధులు కేటాయించారు. దీనికితోడు కళాశాల, ఆసుపత్రిలో పని భారం ఉంది. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం వారం మొత్తంలో 48 గంటలకు మించి పని చేయరాదు. కానీ అదనంగా పని చేయిస్తున్నారు. అయినా అదనపు సెలవులు ఇవ్వడం లేదని వాపోతున్నారు. దీనిపై గతేడాది డీఎంఈకి నివేదిక ఇచ్చినా స్పందన లేదు. ఇన్ని ఇబ్బందుల నడుమ నెలకు రూ.84 వేల వేతనంతో విధుల్లో చేరేందుకు చాలా మంది వైద్యులు నిరాసక్తి చూపుతున్నట్లు సమాచారం.

ప్రభుత్వం వెంటనే స్పందించి కళాశాలలో ఆయా సమస్యల పరిష్కారానికి నడుం బిగించాలని కోరుతున్నారు. లేకపోతే వసతులు, నిర్వహణ సరిగ్గా లేదని ఎన్‌ఎంసీ సీట్లలో కోత పెడితే పేద విద్యార్థులకు డాక్టర్‌ కావాలనే కల చేజారిపోయే అవకాశాలున్నాయి.


ప్రతి విభాగంలోనూ

వైద్య కళాశాల జనరల్‌ ఆసుపత్రిలోనూ బోధన, బోధనేత సిబ్బంది నియామకం అసంపూర్తిగా ఉంది. 18 మంది ప్రొఫెసర్లకు గాను ప్రిన్సిపల్‌తో సహా కేవలం అయిదుగురు మాత్రమే ఉన్నారు. 26 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లకు ఇద్దరు, 51 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు 24 మంది, జనరల్‌ ఆసుపత్రిలో 59 మంది సీనియర్‌ రెసిడెంట్లకుగాను 26 మంది ఉన్నారు. వీటితోపాటు ఆసుపత్రిలో జనరల్‌ మెడిసిన్‌లో ఆరుగురికి ముగ్గురు, గైనకాలజీ విభాగంలో ఎనిమిదికి ఇద్దరే ఉన్నారు. వీరిలోనూ ఒకరు జనవరి 31న  ఉద్యోగ విరమణ పొందనున్నారు. సర్జరీలో నలుగురికి ముగ్గురు ఉన్నారు. వీరిలో విధులకు హాజరుకావడం లేదంటూ ఒకరిని డీఎంఈకి సరెండర్‌ చేశారు. ఒక బోధనేతర సిబ్బందిలో ఏవో, నలుగురు ఏడీలు, 12 మంది జూనియర్‌, ఆరుగురు సీనియర్‌ అసిస్టెంట్లు ఉండాలి. ఇప్పటికీ ఒక్కరిని కూడా నియమించకపోవడం గమనార్హం.


బోధనలో ఇబ్బందులు లేవు

తొలి ఏడాది వైద్య విద్యార్థులకు సబ్జెక్టులకు సరిపడా ప్రొఫెసర్లు ఉన్నారు. వారి బోధనకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఏటేటా పెంచుతూ పోతాం. ఎన్‌ఎంసీ నుంచి ఆధార్‌ ఆధారిత హాజరుపై వచ్చిన ఉత్తర్వులపై వారికి సమాధానం ఇచ్చాం. రెండో ఏడాదికి సంబంధించి ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఆచార్యుల నియామకానికి డీఎంఈకి నివేదికలు పంపాం. విద్యార్థులకు మంచి వసతులతో పాటు నాణ్యమైన బోధనను అందించేందుకు కృషి చేస్తున్నాం.

  - చంద్రశేఖర్‌, ప్రిన్సిపల్‌, వైద్య కళాశాల

 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.