• facebook
  • whatsapp
  • telegram

  Reservation: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు

* స్పష్టతనిచ్చిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యక్ష నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్‌ పాయింట్‌ను మార్కు చేయకుండా ఓపెన్‌, రిజర్వుడు కేటగిరీల్లో 33 1/3 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని ఆదేశించింది. రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వర్సెస్‌ రాజేష్‌ కుమార్‌ దరియా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియలో ఈ మేరకు అమలుచేయాలని స్పష్టం చేస్తూ సీఎస్‌ శాంతికుమారి ఫిబ్రవరి 1న మెమో జారీ చేశారు. దీంతో సమాంతర రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ సహా  వివిధ నియామక బోర్డులు ఫలితాల వెల్లడికి కసరత్తు మొదలు పెట్టాయి.

హైకోర్టు ఆదేశాల మేరకు...

తెలంగాణ స్టేట్‌ అండ్‌ సబార్డినేట్‌ సర్వీసు నిబంధనలు-1996 ప్రకారం మహిళలకు ఓపెన్‌, రిజర్వుడు కేటగిరీల్లో 33 1/3 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిబంధన ఉంది. గ్రూప్‌-1 ఉద్యోగ ప్రకటనలో రోస్టర్‌ పాయింట్‌ 1 నుంచి తీసుకోవడంతో మహిళలకు ఎక్కువ పోస్టులు రిజర్వు అయ్యాయి. దీన్ని సవాల్‌ చేస్తూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌, రాజేష్‌కుమార్‌ దరియా కేసులో సుప్రీం తీర్పు ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని, వారికి ఎలాంటి రోస్టర్‌పాయింట్‌ పేర్కొనకూడదని హైకోర్టు ఆదేశించింది. ఆ ప్రకారం టీఎస్‌పీఎస్సీ నియామకాల్లో సుప్రీం తీర్పు అమలుచేయాలని ప్రభుత్వం 2022 డిసెంబరు 2న మెమో జారీ చేసింది. అయితే గ్రూప్‌-1తో పాటు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు (ఏఈఈ), టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ (టీపీబీవో), ఇతర నియామక నోటిఫికేషన్లలోనూ మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించిందని 2023 జూన్‌ 16న టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై నిర్ణయం తీసుకోకపోవడంతో నియామక పరీక్షల ఫలితాల వెల్లడికి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి టీఎస్‌పీఎస్సీతో పాటు ఇతర విభాగాధిపతులు అందరూ మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ప్రభుత్వం తాజా ఆదేశాల్లో పేర్కొంది.

ఇప్పటివరకు ఇలా...ఇకపై అలా

ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు వర్టికల్‌ రిజర్వేషన్లు అమలవుతాయి. ఆ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులను ఆయా వర్గాలతోనే భర్తీ చేస్తారు. ఒకవేళ వీరు ఓపెన్‌ కేటగిరీ(ఓసీ)లో మెరిట్‌తో ఓపెన్‌ పోస్టులకు ఎంపికైతే వారికి రిజర్వు చేసిన పోస్టులు అలాగే ఉంటాయి. వాటిని ఆయా రిజర్వుడు వర్గాల అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేస్తారు. ఇదే పద్ధతిలో మహిళలకు సబార్డినేట్‌ సర్వీసు నిబంధన రూల్‌ నం.22ఏ ప్రకారం వర్టికల్‌ విధానంలో రిజర్వేషన్లు అమలయ్యాయి. ఈ విధానంలో మహిళలు...ఓపెన్‌లో, రిజర్వుడు కేటగిరీల్లో జనరల్‌ మెరిట్‌లో పోస్టులు సాధించినప్పటికీ, వారికి ప్రత్యేకంగా రిజర్వు చేసిన పోస్టులు వారికే ఉంటాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మహిళలకు ఇక వర్టికల్‌ రిజర్వేషన్లు వర్తించవు. సమాంతర రిజర్వేషన్‌ కింద ఆ రిజర్వుడు కేటగిరీలో మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్‌ మాత్రమే అమలవుతుంది. ఒకవేళ మెరిట్‌ ఉంటే జనరల్‌ కింద రిజర్వు అయిన పోస్టులకు పోటీపడవచ్చు.

14న నియామక పత్రాల పంపిణీ

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఫిబ్ర‌వ‌రి 14న పోలీసు, గురుకుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేసేందుకు పోలీసు, గురుకుల నియామక బోర్డులు కసరత్తు చేస్తున్నాయి. నియామక పత్రాలు సీఎం చేతుల మీదుగా ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సాధారణ పరిపాలనశాఖ నుంచి బోర్డులకు ఆదేశాలు వెళ్లాయి. పోలీసు పోస్టులకు ఎంపికైన వారితో కలిపి గురుకుల సొసైటీలకు ఎంపికైన ఉపాధ్యాయ, అధ్యాపకులకు నియామక పత్రాలు జారీకానున్నాయి.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.