• facebook
  • whatsapp
  • telegram

TSLPRB: స్క్రీనింగ్‌ కమిటీకి 326 మంది కానిస్టేబుల్‌ అభ్యర్థుల దస్త్రాలు

‣ కమిటీ నిర్ణయం ఆధారంగానే ఎంపికకు అవకాశం



ఈనాడు, హైదరాబాద్‌: పోలీసు కానిస్టేబుళ్ల స్థాయి నియామకాలకు సంబంధించి కొందరు అభ్యర్థుల ఎంపిక పత్రాల అందజేతపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎలాంటి అవాంతరాలు లేని అభ్యర్థులు ఇప్పటికే ఎంపిక పత్రాలు అందుకొని శిక్షణ పొందుతుండగా.. 326 మందికి మాత్రం ఇంకా నిరీక్షణ తప్పడం లేదు. నియామక ప్రక్రియను పర్యవేక్షిస్తున్న తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వీరి ఎంపిక అంశాన్ని స్క్రీనింగ్‌ కమిటీకి పంపించింది. ఇప్పటికే శిక్షణ పొందుతున్న వారితోపాటు ఈ 326 మంది కూడా అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఎంపికైనప్పటికీ యూనిట్ల వారీ విచారణ క్రమంలో కొన్ని లోటుపాట్లు బహిర్గతమయ్యాయి. స్థానికత ధ్రువపత్రం, నేరచరిత్ర, సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, వర్టికల్‌/హారిజాంటల్‌ రిజర్వేషన్ల అర్హత, మెడికల్‌ ఫిట్‌నెస్‌.. తదితర అంశాల్లో సమస్యలను గుర్తించారు. ఈ క్రమంలోనే వీరి ఎంపిక అంశం స్క్రీనింగ్‌ కమిటీకి చేరింది. ఈ కమిటీలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి, డీజీపీ ప్రతినిధితోపాటు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్‌ సభ్యులుగా ఉన్నారు. వీరి పరిశీలనలో ఎంపికైన వారిని మాత్రమే శిక్షణకు పంపించనున్నారు. ఈ ప్రక్రియ తొందరగా పూర్తయితే ఇటీవలే ప్రారంభమైన టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్లతోపాటు వీరూ శిక్షణ కొనసాగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.


వైద్య పరీక్షల్లో 188 మంది అనర్హులు

టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ 16,969 కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల నియామక ప్రక్రియ కోసం 2022లో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రాథమిక, తుది రాత పరీక్షలతోపాటు శారీరక సామర్థ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల జాబితాను గతేడాది విడుదల చేసింది. అనంతరం వీరికి సంబంధించి స్పెషల్‌బ్రాంచి విచారణ, వైద్య పరీక్షల ప్రక్రియ పూర్తయ్యాక ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఎంపిక పత్రాల్ని అందుకున్నారు. అయితే అభ్యంతరాలకు సంబంధించి టీఎస్‌ఎల్‌పీఆర్‌బీకి యూనిట్ల వారీగా కమిషనర్లు, ఎస్పీలు నివేదికలు పంపించారు. 136 మంది అభ్యర్థులకు ఎంపిక అర్హత లేదంటూ కమిషనర్లు, ఎస్పీలు నివేదికలు పంపారు. మరో 188 మంది వైద్యపరీక్షల్లో ఫెయిలైనట్లు పేర్కొన్నారు. అలాగే నేరచరిత్రను దాచిన వారు 121 మంది, నేరాల్లో ప్రమేయమున్న వారు 189 మంది, గత ఉద్యోగాల విషయాన్ని దాచిన వారు 16 మంది ఉన్నారు. ఈ 326 మంది ఎంపిక అంశం స్క్రీనింగ్‌ కమిటీకి పంపించారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ మూడు నెల‌ల్లో గేట్ మొద‌టి ర్యాంకు

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

=================================

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.