* గతేడాది ఫీజులో 70శాతమే వసూలు చేయాలి
ఈనాడు, అమరావతి: ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు గతేడాది వసూలు చేసిన ట్యూషన్ ఫీజులో 70 శాతమే తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సూచన ప్రకారం ఈ విషయం నిర్ణయించింది. కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడిందని, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులను చెల్లించే పరిస్థితుల్లో లేరని పేర్కొంది. అన్లాక్ నిబంధనలతో ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని, సాధారణ ప్రజలు, మధ్యతరగతి వారు ఆర్థిక సమస్యల్లో ఉన్నారని, అందుకే ట్యూషన్ ఫీజులో 30% తగ్గిస్తున్నట్లు పేర్కొంది.
* పాఠశాలలు మార్చి 23 నుంచి మూతపడ్డాయి. ఇప్పటివరకు పునఃప్రారంభం కాలేదు. దీంతో నిర్వహణ ఖర్చులు తగ్గాయి.
* నవంబరు 2నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. సాధారణ రోజులతో పోల్చితే ఐదు నెలలు పని చేయలేదు. దీనికి అనుగుణంగా ఖర్చులు తగ్గాయి.
* కేంద్రం ఇచ్చిన ప్రత్యామ్నాయ కేలండర్ను అమలు చేశారు. ఆన్లైన్ బోధన మాత్రమే అందించారు.
* మిగతా నెలలకు పాఠశాల విద్యాశాఖ పాఠ్యాంశాలను తగ్గించనుంది. పాఠశాల బస్సులకు కొంత మొత్తమే వ్యయం కానుంది.
ఒక్కో గదిలో 16 మంది విద్యార్థులే
రాష్ట్రంలో నవంబరు రెండో తేదీ నుంచి పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో ఒక్కో గదిలో 16 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. తల్లిదండ్రుల అంగీకారంతోనే విద్యార్థులను పాఠశాలకు అనుమతించాలని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ గుంపులుగా ఉండకుండా జాగత్త్రలు తీసుకోవాలని వివరించింది. ‘‘ప్రతి విద్యార్థి వ్యక్తిగతంగా మాస్కు, నీళ్ల సీసా ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలి. విద్యార్థులందరికీ ఒకేసారి మధ్యాహ్న భోజన విరామం ఇవ్వకూడదు. మాస్కు ధరిస్తేనే ఎవరినైనా పాఠశాలల్లోకి అనుమతించాలి. వీరందరికీ తప్పనిసరిగా థర్మల్ స్కానింగ్ చేయాలి. ప్రార్థన సమావేశాలు తరగతి గదిలోనే నిర్వహించాలి. కొవిడ్-19 జాగ్రత్తలపై ప్రతిజ్ఞ చేయించాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ప్రదేశంలోనే బోధన నిర్వహించాలి. నవంబరు ఒకటో తేదీన తల్లిదండ్రుల కమిటీ సభ్యులతో ఉపాధ్యాయులతో ప్రధానోపాధ్యాయుడు సమావేశం నిర్వహించాలి’’ అని మార్గదర్శకాల్లో పేర్కొంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.