• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఖరగ్‌పూర్‌ ఐఐటీలో లా కోర్సులు

డిగ్రీ అర్హతతో దరఖాస్తుకు అవకాశం



ఐఐటీలంటే ఇంజినీరింగ్‌ కోర్సులకు ప్రసిద్ధి. అయితే గత కొన్నేళ్లగా ఇవి ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజ్‌లు, మేనేజ్‌మెంట్‌.. ఇలా భిన్న చదువులు అందిస్తున్నాయి. ఇలా ఇంజినీరింగేతర కోర్సులు అందించే సంస్థల్లో ఐఐటీ ఖరగ్‌పూర్‌ ముఖ్యమైంది. ఈ సంస్థ బోధిస్తోన్న.. ఎల్‌ఎల్‌బీ - ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ లా ప్రతిష్ఠాత్మకమైనదిగా గుర్తింపు పొందింది. అలాగే ఇక్కడి ఎల్‌ఎల్‌ఎం కోర్సులోనూ పలు స్పెషలైజేషన్లు లభిస్తున్నాయి. వీటిని పూర్తిచేసుకున్నవారు ప్రాంగణ నియామకాల ద్వారా ఆకర్షణీయ వేతనాలు పొందుతున్నారు.


అన్ని రంగాల్లోనూ సాంకేతికత ప్రాధాన్యం పెరుగుతోంది. కీలకమైన న్యాయవిద్యలో ఇప్పుడిదే అస్త్రమైంది. ఈ పరిజ్ఞానంతోనే ఎన్నో కేసుల్లో పరిష్కారం దక్కుతోంది. అందువల్ల సాంకేతిక నేపథ్యం ఉన్న న్యాయవాదులకూ గిరాకీ ఏర్పడింది. అలాగే సాంకేతిక సంస్థల్లో లీగల్‌ సేవలందించడానికి న్యాయవిద్యపై పట్టుతోపాటు ఐటీ చట్టాలు, ఆ రంగంలోని ఇతర అంశాలపై అవగాహన అవసరం. ఐఐటీ ఖరగ్‌పూర్‌ అందించే ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులు అందుకు ఉపయోగపడతాయి.


ఎల్‌ఎల్‌బీ 

ఎల్‌ఎల్‌బీలో ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ మూడేళ్ల లా కోర్సును రెసిడెన్షియల్‌ విధానంలో ఈ సంస్థ అందిస్తోంది. మొత్తం 6 సెమిస్టర్లు ఉంటాయి. ఒక్కో సెమిస్టర్‌ ఫీజు రూ.55,750. ఈ కోర్సులో చేరినవారికి న్యాయవిద్యతో పాటు సైన్స్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ అంశాల్లోనూ ప్రావీణ్యం కల్పిస్తారు. 

అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఇంజినీరింగ్‌ / మెడిసిన్‌లో బ్యాచిరల్‌ డిగ్రీ లేదా పీజీలో ప్రథమ శ్రేణి మార్కులతో సైన్స్‌/ ఫార్మసీ డిగ్రీ లేదా ప్రథమ శ్రేణి మార్కులతో ఎంబీఏతోపాటు.. ఇంజినీరింగ్‌/ మెడిసిన్‌లో యూజీ లేదా సైన్స్‌/ ఫార్మసీలో పీజీ.

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్షతో

పరీక్ష: మొత్తం ప్రశ్నపత్రం 200 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకూ 2 మార్కులు. మొత్తం వంద ప్రశ్నలు వస్తాయి. రుణాత్మక మార్కులు లేవు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటాయి. ఇందులో రెండు విభాగాలు ఉన్నాయి. పార్ట్‌-1లో మ్యాథ్స్‌ ఆప్టిట్యూడ్‌ 8, సైన్స్‌ ఆప్టిట్యూడ్‌ (కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ) 10 ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌-1కి 36 మార్కులు. పార్ట్‌-2లో ఇంగ్లిష్‌ 35, లాజికల్‌ రీజనింగ్‌ 12, లీగల్‌ ఆప్టిట్యూడ్‌ 35 ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌-2 మొత్తం 164 మార్కులు. పరీక్షలో అర్హత సాధించడానికి ఒక్కో విభాగంలోనూ 35 శాతం మార్కులు తప్పనిసరి. అర్హులైనవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్‌ ప్రకారం అభ్యర్థులను కోర్సులోకి తీసుకుంటారు.


ఎల్‌ఎల్‌ఎం 

ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ లా, ఇంటర్నేషనల్‌ లా స్పెషలైజేషన్లు ఉన్నాయి. కోర్సు వ్యవధి రెండేళ్లు. మొత్తం 4 సెమిస్టర్లు ఉంటాయి. ప్రతి సెమిస్టర్‌కూ రూ.75,750 ఫీజు చెల్లించాలి.  

అర్హత: మూడేళ్లు లేదా ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్‌లో ప్రథమ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణత.  

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్షతో

పరీక్ష: ఎల్‌ఎల్‌బీ సిలబస్‌ నుంచి 120 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. రుణాత్మక మార్కులు లేవు. ఇందులో అర్హత సాధించడానికి 35 శాతం మార్కులు తప్పనిసరి. ఇలా అర్హుల జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్లు అనుసరించి సీట్లు కేటాయిస్తారు. 


ముఖ్య వివరాలు..

ప్రస్తుతం ఆఖరు సెమిస్టర్‌ కోర్సుల్లో ఉన్న విద్యార్థులూ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు పరీక్షలకూ సంబంధించి మాదిరి ప్రశ్నలను ఐఐటీ ఖరగ్‌పూర్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వాటిని పరిశీలించి, ప్రశ్నపత్రంపై అవగాహన పొందవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 31 

దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్‌ జెండర్లకు రూ.1500. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్‌ పురుషులకు రూ.3000. 

పరీక్ష తేదీ: మార్చి 17 

పరీక్ష కేంద్రాలు: ఏపీలో విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాద్‌

వెబ్‌సైట్‌: https://gateoffice.iitkgp.ac.in/law/index.php
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

‣ సరైన వ్యూహాలతో సవ్యంగా సాధన!

‣ కలల కొలువుకు అయిదు మెట్లు!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

Posted Date : 31-01-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌