• facebook
  • whatsapp
  • telegram

ఏ ప్ర‌శ్న‌కు ఏం చెప్పాలి?

సివిల్స్‌లో విజ‌యానికి నిపుణుల సూచ‌న‌లు

మౌఖిక పరీక్ష అంటే.. ఎవరికైనా కొంత బెరుకు సహజం. ఎంతో ప్రాముఖ్యమున్న సివిల్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూను ఎదుర్కోవడమంటే చిన్న విషయం కాదు. కానీ ప్రాథమికంగా అడిగే కొన్ని ప్రశ్నలకు మెరుగ్గా ఎలా సమాధానం ఇవ్వొచ్చో తెలుసుకుంటే అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో ఆత్మవిశ్వాసంతో స్పష్టంగా జవాబులు చెప్పొచ్చు!  


1. ఎలా ఉన్నారు?
యూపీఎస్సీ ఇంటర్వ్యూల్లో ఇది ఊహించని ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలకు మీ ప్రతిస్పందనను ప్యానల్‌ సభ్యులు తెలుసుకోవాలనుకుంటారు. అసలైన ఇంటర్వ్యూ ప్రారంభం కావడానికి ముందు మిమ్మల్ని సౌకర్యంగా ఉంచేందుకు ఇలాంటి ప్రశ్న వేస్తారు. ‘బాగున్నాను’ అనే సమాధానాన్ని సాధారణంగా మీ నుంచి ప్యానల్‌ ఆశిస్తుంది.
 ‘సర్, ఈ స్థాయి వరకూ వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇంటర్వ్యూను ఎదుర్కొనేందుకు ఉత్సాహంగా ఉన్నాను’. 
 ‘రాత్రంతా సన్నద్ధం అవుతూనే ఉన్నాను. కొంత భయంగా ఉంది’/ ‘బాగానే ఉన్నాను’ . 


2. మీ గురించి చెప్పండి. 
ప్రైవేటు రంగంలో జరిగే మౌఖిక పరీక్షల్లో ఈ ప్రశ్నను ఎక్కువగా అడుగుతుంటారు. అయినప్పటికీ గత సంవత్సరాల్లో యూపీఎస్సీ ఇంటర్వ్యూల్లోనూ ఇలాంటి ప్రశ్నను అడిగారు. మీ బలాలు, బలహీనతలను ఏ విధంగా విశ్లేషించగలుగుతారో బోర్డు తెలుసుకోవాలనుకుంటుంది. ముఖ్యంగా మీ గురించి మీరు ఆలోచించి, దాన్ని తక్కువ పదాల్లో వివరించగలరో లేదో చూస్తారు.   

 మీ నైపుణ్యాలు, మీ పరిజ్ఞానం, వ్యక్తిత్వం, బాగా చేయగలిగే పనులు, సాధించిన విజయాలపై దృష్టిపెట్టి ఈ లక్షణాలను  ప్రభుత్వం లబ్ధి పొందేలా ఎలా మార్చగలరో వివరించగలగాలి. మీ గురించి సానుకూలంగా చెప్పగలిగే కొన్ని పదాలతో జాబితా తయారుచేసుకుని వాటిని చొప్పిస్తూ సమాధానాన్ని ఇవ్వాలి. అనుబంధంగా మీ బలహీనతల గురించీ ప్రశ్నించే అవకాశం ఉంది కాబట్టి దానికీ సిద్ధంగా ఉండాలి. 
 వెంటనే సమాధానం చెప్పలేకపోవటం/ ‘సర్, నా బయోడేటాలో తెలియజేశాను. అది మీ ముందే ఉంది.’ (బలహీనతల గురించి ఒకవేళ అడిగినప్పుడు.. వాటిని చెప్పడానికి ఇష్టపడకపోతే... సమతూకం లేని వ్యక్తిగా భావిస్తారు). 
 

3. వృత్తి, వ్యక్తిగత జీవితాల మధ్య సమతౌల్యాన్ని 
సాధించగలనని అనుకుంటున్నారా? 
మహిళా అభ్యర్థులనే ఇలా ప్రశ్నిస్తారని అనుకుంటాం. కానీ పురుష అభ్యర్థులను కూడా ఇలా అడగొచ్చు. 
‘సర్, అంకిత భావంతో విశ్వసనీయంగా, కష్టపడి పనిచేస్తాను. కుటుంబ బాధ్యతలూ, అభిరుచులూ, స్వచ్ఛంద సేవ నా పనితీరుపై ప్రభావం చూపలేవు. ప్రస్తుతం తల్లిదండ్రులూ, భవిష్యత్తులో భార్యాపిల్లల సహకారంతో నా విధులను సమర్థంగా నిర్వర్తిస్తాను’. 
 

4. సివిల్‌ సర్వీసెస్‌కు ఎలాంటి వ్యక్తిగత లక్షణాలు ఉండాలి? అవి మీకు ఉన్నాయనుకుంటున్నారా? 
సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాల గురించి తెలుసుకోవడానికి మీరేమైనా ప్రయత్నించారా? పరీక్ష మాత్రమే రాసి ఉన్నారా? అనేది గమనించటానికి అడిగే ప్రశ్న ఇది.
‘సర్, ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే... చొరవ, ప్రేరణ, శక్తి, ఆత్మవిశ్వాసం, అంకితభావం, భావ వ్యక్తీకరణ నైపుణ్యం, విశ్లేషణ సామర్థ్యం కావాలి. వీటన్నింటితోపాటుగా నలుగురితో కలిసిపోయి పనిచేయగలగాలి. ఈ నైపుణ్యాలుంటే ఆదర్శవంతమైన సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగిగా.. అందరి అభిమానాన్నీ పొందగలుగుతారు’(అనుబంధంగా వచ్చే ప్రశ్నలను ఎదుర్కోవడానికీ సిద్ధంగా ఉండాలి. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో పేరొందిన సివిల్‌ సర్వెంట్లకు సంబంధించిన సంఘటనలను ఉదాహరిస్తే బాగుంటుంది). 
 సంసిద్ధం కాకుండా పొడిపొడిగా సమాధానం చెప్పటం. పాఠ్యపుస్తకాల్లో చదివిన కొన్ని నైపుణ్యాలను సరైన ఉదాహరణలు లేకుండా మొక్కుబడిగా చెప్పటం. 
 

5. బాధ్యతల్లో భాగంగా ప్రజలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ప్రజలతో మమేకం కాగలుగుతారా?
ఇతరులను గౌరవిస్తూ.. బృందంతో కలిసి మీరు పనిచేయగలుగుతారో లేదో తెలుసుకోవాలనుకుంటారు. 
వివిధ రకాల వనరుల నుంచి ఆలోచనలను ఎలా సేకరిస్తారో చెప్పాలి. అలాగే కళాశాలలో బృంద సభ్యుడు లేదా సహోద్యోగి నుంచి ఏం నేర్చుకున్నారో నిజాయతీగా వివరించాలి.
 రుజువుగా ఎలాంటి ఉదాహరణలూ లేకుండా ‘ఇతరులతో బాగా కలిసిపోతా’నని అతి విశ్వాసంతో చెప్పడం.
 

6. క్రీడలంటే ఆసక్తి ఉందా?
బృందంలో మీ ప్రమేయం ఎలా ఉంది? వాళ్లందరినీ ఒక్క తాటిమీద నడిపించడానికి మీరు చేసిన ప్రయత్నాల గురించి తెలుసుకోవాలనుకుంటారు. 
 ‘సర్, సమయం ఉంటే చాలు, బృందంతో కలిసి ఆడాలనుకుంటాను’ (టీమ్‌లో ఆడేవే కాకుండా స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్‌ గురించి కూడా చెప్పొచ్చు. ఇవి మీలోని పట్టుదలకు గుర్తు. చెస్‌ ఆడే అలవాటున్నా చెప్పొచ్చు. ఇది మీలోని విశ్లేషణాత్మక నైపుణ్యానికి నిదర్శనం) 
 ఆటలాడటానికి మీకంత సమయమేమీ లేదని చెప్పడం. లేదా మీ పాఠశాల/ కళాశాలలో ఆటస్థలంలేదని ఫిర్యాదు చేయడం. 
 

7. మిమ్మల్ని మీరు సహజ నాయకుడిగా అభివర్ణించుకుంటారా? లేదా పుట్టుకతోనే అనుచరుడిని అంటారా? 
మీలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయో లేదో.. అలాగే ప్రతి నాయకుడూ అనుచరుడేననేది అంగీకరిస్తారో లేదో తెలుసుకోవాలనుకుంటారు. 

ముందుగా నాయకుడు కావాలనే అభిలాష ఉండాలి. అలాగే దీనికోసం జీవితాంతం నేర్చుకోవాల్సి ఉంటుందనే విషయాన్నీ అర్థం చేసుకోవాలి. నాయకత్వ లక్షణాల్లో భాగంగా అధికారుల సూచనలు పాటించాలి. అదేవిధంగా కింద పనిచేసే ఉద్యోగులకు దిశానిర్దేశం చేయాలి. ‘ప్రస్తుత పరిస్థితుల్లో నిజమైన నాయకుడు అంటే... ఆజ్ఞాపించేవాడు మాత్రమేకాదు.. అనుసరించేవాడు కూడా’ అని సమాధానం చెబితే బాగు.

 ‘నేను ఇప్పుడు లీడర్‌నే. గతంలో పాఠశాల/ కళాశాల /గతంలో ఉద్యోగం చేసినచోట కూడా నేనే నాయకుణ్ణి’ .

8. మీరు మమ్మల్ని ఏమైనా ప్రశ్నించాలనుకుంటున్నారా? 

ఇలా అడిగినప్పుడు అభ్యర్థులకు సమాధానం చెప్పడం కష్టంగానే ఉంటుంది. అయినప్పటికీ మాట్లాడ్డానికి సన్నద్ధంగా ఉండాలి. ఊహించనివిధంగా ఎదురైన ప్రశ్నలకు మీ ప్రతిస్పందన ఎలా ఉంటుందో బోర్డు సభ్యులు తెలుసుకోవాలనుకుంటారు. 

గత ఇంటర్వ్యూల్లో ఒక అభ్యర్థి... ‘దేశ భవిష్యత్తును నిర్మించే పరిపాలనాధికారులను ఎంపిక చేసే ఉన్నత స్థానంలో ఉన్నారు. దీనికి మీరెలా స్పందిస్తున్నారు?’ అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్నలను మీరు కూడా ప్రయత్నించవచ్చు. 

సమాధానం చెప్పకపోవటం/ ‘సీనియర్లను ప్రశ్నించటానికి నేను చాలా చిన్నవాణ్ని సర్‌’ 

ఇలాంటి ప్రశ్నలకు మెరుగ్గా, స్పష్టంగా సమాధానాలు ఇవ్వటాన్ని క్రమం తప్పకుండా సాధన చేయాలి. ఇలా చేస్తే... ఇంటర్వ్యూ సమయంలో తడబాటు లేకుండా ధీమాగా జవాబులు ఇవ్వొచ్చు.


- వి.గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్‌ ట్రీ 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కేంద్రీయ విద్యాల‌యాల్లో ఉద్యోగాలు

‣ కచ్చితంగా నేర్చుకోండి లీన్‌ 6 సిగ్మా

‣ టాప్‌ 5 ఉద్యోగాలు ఇవే!

‣ ఇంటర్మీడియట్‌తో ఇవిగో ఉద్యోగాలు

‣ ఏపీ పోలీస్‌ కొలువుకు సిద్ధ‌మేనా?

‣ పోలీస్ ఉద్యోగాల మొయిన్స్‌లో మెర‌వాలంటే?

Posted Date : 16-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌