• facebook
  • whatsapp
  • telegram

Success: ఓట‌మిని ఓడించి.. విజ‌యాన్ని వ‌రించి!

* సివిల్స్‌లో తొలి నాలుగు స్థానాలు సాధించిన యువ‌తులు

సామర్థ్యానికే కాదు.. సహనానికీ పరీక్ష పెడుతుంది సివిల్స్‌! మట్టిలో మాణిక్యాలను వెలికితీసే పరీక్షా ప్రక్రియ ఇది... ఈసారి ఐదున్నర లక్షల మంది ప్రతిభను చాటుకునేందుకు చేసిన ప్రయత్నంలో.. అగ్రశ్రేణి ర్యాంకులు మనవే. మరో విశేషం.. తొలి 100 మందిలో దాదాపు 50మంది అమ్మాయిలే. అందులోనూ మన తెలుగమ్మాయి టాప్‌ త్రీలో మెరిసి శభాష్‌ అనిపించుకుంది.  తొలి నలుగురు ర్యాంకర్లు శ్రమించిన తీరిదీ.. 

    

ఆటల వల్లే మొదటిర్యాంకు కొట్టా: ఇషితా కిషోర్‌, 1వ ర్యాంకర్‌

తాము కలలు కన్న గొప్ప లక్ష్యాలని చేరుకోవడానికి అమ్మాయిలకు చదువొక్కటే సరిపోదు.. అన్ని రంగాల్లోనూ దూసుకెళ్లే ఆత్మవిశ్వాసం కావాలి. ఆటలే నన్ను ముందుకు నడిపించాయి అంటోంది 27 ఏళ్ల ఇషితా కిషోర్‌.. తండ్రి నుంచి దేశభక్తిని అలవరుచుకున్నా అనే ఇషిత పుట్టింది హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో. స్వస్థలం బిహార్‌. అమ్మ విశ్రాంత ఉపాధ్యాయురాలు. నాన్న ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారి. దిల్లీలోని లేడీశ్రీరామ్‌ కాలేజీ ఆఫ్‌ కామర్స్‌ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసింది. స్కూల్లో చదువుతోపాటు ఆల్‌రౌండర్‌గా రాణించింది. ఆటలంటే ప్రాణం పెడుతుంది. జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిగా రాణించింది. ప్రభుత్వం తరఫున ఇండోచైనా యూత్‌ డెలిగేషన్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించింది. 2017లో డిగ్రీ పూర్తిచేశాక.. ‘ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌’ సంస్థలో రెండేళ్లు రిస్క్‌ అడ్వైజరీ విభాగంలో పనిచేసింది. హడ్కో, గెయిల్‌ వంటి సంస్థల్లోనూ ఇంటర్న్‌గా చేసింది. ‘ఉద్యోగంలో చేరాక నాకెదురైన సవాళ్లే నన్ను సివిల్స్‌ దిశగా నడిపించాయి’ అనే ఇషిత మూడో ప్రయత్నంలో ఈ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి రెండు సార్లూ ప్రిలిమ్స్‌కే వెనుతిరిగినా తనలో ముందు నుంచీ ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం తగ్గనీయలేదు. ‘నాకు టెక్స్ట్‌ పుస్తకాలకి అంకితమైపోవడం కన్నా ఎక్‌స్ట్రాకరిక్యులర్‌ ఆక్టివిటీస్‌ అంటేనే ఇష్టం. డిబేట్లు, ఆటలు ఏదీ వదిలేదాన్ని కాదు. స్కూల్లో ఐరాసకి సంబంధించిన మాక్‌ సదస్సులు నిర్వహించేదాన్ని. చిన్నతనం నుంచి విదేశీ వ్యవహారాలంటే ఆసక్తి చూపించేదాన్ని. సివిల్స్‌లో నా ఆప్షన్‌ కూడా అదే.. పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌. ఇక సినిమాల్లో దంగల్‌ చాలా ఇష్టం. చదువు అయ్యాక కూడా ఉద్యోగం చేస్తూ ఎన్జీవోలతో కలిసి పనిచేశా. కనెక్టింగ్‌ డ్రీమ్స్‌ ఫౌండేషన్‌ సంస్థలో మా కాలేజీ చాప్టర్‌ తరఫున వ్యాపారవేత్తలుగా రాణించాలనుకునే పేద పిల్లల కోసం పనిచేశా. మొదటి రెండు సార్లు ప్రిలిమ్స్‌ దగ్గరే ఆగిపోయినప్పుడు అమ్మ వెన్నుతట్టి నడిపించింది. ఆ ధైర్యంతోనే ముందుకెళ్లా’ అనే ఇషిత కలల్ని నిజం చేసుకొనే విషయంలో రాజీపడొద్దు. నిర్భయంగా నచ్చిన దారిలో నడవండి అంటుంది.

    

ఆ పిల్లలకు సాయం చేయాలనీ..: గరిమా లోహియా, 2వ ర్యాంకర్‌

బిహార్‌లోని బక్సర్‌ జిల్లా గరిమాది. పది వరకూ బక్సర్‌లో ఇంటర్‌ బనారస్‌లో చేసింది. అకౌంటింగ్‌లో డిగ్రీ కిరోరిమల్‌ కాలేజ్‌, దిల్లీ నుంచి పూర్తిచేసింది. నిజానికి సీఏ గరిమ లక్ష్యం. డిగ్రీతోపాటు సీఏనీ చేస్తూ వచ్చింది. మూడో సంవత్సరంలో ఉన్నప్పుడు లాక్‌డౌన్‌. అనుకోకుండా సివిల్స్‌కి ప్రయత్నించాలనిపించింది. తన వద్ద ఉన్న పుస్తకాలతోనే సన్నద్ధత ప్రారంభించింది. మొదటి ప్రయత్నంలో విఫలమైనా నిరాశ స్థానంలో పట్టుదల వచ్చింది. ఖాళీ సమయంలో సెల్ఫ్‌ హెల్ప్‌, సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ పాడ్‌కాస్ట్‌లు వినడం ఈమె వ్యాపకం. అవే తనను సానుకూలంగా ఆలోచించేలా చేస్తాయంటుందీమె. యూట్యూబ్‌, ఆన్‌లైన్‌ వనరుల సాయంతో ఇంట్లోనే ఉండి, సాధన చేసింది. ‘ఈసారి సివిల్స్‌ సాధిస్తానన్న నమ్మకం ఉంది. కానీ ర్యాంకుని మాత్రం ఊహించలేదు. ఉదయం నుంచి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నా. ర్యాంకు చూసి నమ్మలేకపోయా. ఎంతోమంది ఫోన్‌చేసి అభినందనలు చెబుతోంటే అప్పుడు రూఢీ చేసుకున్నా. ఈ విజయాన్ని అమ్మకే అంకితమిస్తా. పదోతరగతిలో ఉన్నప్పుడే నాన్న చనిపోయారు. నాకో అక్క, తమ్ముడు. అమ్మ మా ముగ్గురికీ ఏలోటూ రాకుండా చూసుకుంది. మొదట్నుంచీ మంచి విద్యార్థినే. ఆర్థికంగా ఇబ్బందులెదురైనా.. ‘నీకు నచ్చింది చేయ’మని అమ్మ ప్రోత్సహించింది. బిహార్‌లోనే పోస్టింగ్‌ రావాలని కోరుకుంటున్నా. నా జన్మభూమి ఇది. ఈ మట్టి రుణం తీర్చుకోవాలి. ఎంత అభివృద్ధి చెందుతున్నా మా రాష్ట్రంలో ఇప్పటికీ చదువుకు నోచుకోని గ్రామాలెన్నో. వాటి రూపు మార్చాలన్నది నా కల’ అనే గరిమ.. చదువుతూనే ఓ ఎడ్‌టెక్‌ స్టార్టప్‌కి పనిచేసింది. మహిళా సాధికారత మీద రాసిన వ్యాసానికి యూఎన్‌ ఫోరం నుంచి పురస్కారాన్నీ అందుకుంది. ‘ఇంటర్నెట్‌ యుగంలో గ్రామాల నుంచొచ్చినా సాధించొచ్చు. ఆ భావనను పక్కన పెట్టి ప్రయత్నించాలంతే. నేను ఎవరికీ తీసిపోననే ధీమాతో లక్ష్యంవైపు నడిచా అదే నా విజయరహస్య’మనీ చెబుతోంది.

    

వాళ్లు అలా అనలేదు కాబట్టే ఈ విజయం..: నూకల ఉమాహారతి, 3వ ర్యాంకర్‌

నాలుగుసార్లు వైఫల్యం. అయినా నిరాశపడలేదు. ఇంట్లోనే ఉండి.. అమ్మానాన్నలు ఇచ్చిన ప్రోత్సాహంతో ముందుకెళ్లిన నూకల ఉమాహారతి జాతీయ స్థాయిలో మూడోర్యాంకు సాధించి తెలుగమ్మాయిల సత్తా చాటింది.

* ఉమాహారతి వాళ్ల నాన్న తెలంగాణలోని నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు, అమ్మ శ్రీదేవి. తండ్రి పోలీసు అధికారి కావడంతో ఆమె ప్రాథమిక విద్యాభ్యాసమంతా వేర్వేరు చోట్ల కొనసాగింది. హైదరాబాద్‌ బీహెచ్‌ఈఎల్‌లోని భారతి విద్యానికేతన్‌లో పదో తరగతి వరకూ చదివింది. నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివింది.  ఎంపీసీలో 965 మార్కులు సాధించింది. ఐఐటీ హైదరాబాద్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ చేసింది. 2017 నుంచీ సివిల్స్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దిల్లీలో ఏడాదిపాటు శిక్షణ తీసుకున్నా, అక్కడ ఉండటం ఇష్టంలేక తిరిగి అమ్మానాన్నల దగ్గరకు వచ్చేసి ఇంట్లోనే ఉంటూ ఇంటర్నెట్ సాయంతో పరీక్షలకు సిద్ధమైంది. ‘2019 నుంచీ రాస్తున్నా. నాలుగుసార్లు విఫలమయ్యా. ఎన్నో పొరపాట్లు. ఆ నిరాశ నుంచీ నన్ను బయటకు తీసుకొచ్చింది అమ్మానాన్న, తమ్ముడే. వాళ్ల అండ లేకపోతే నేనీ విజయం సాధించేదాన్ని కాదు. ఇంటర్నెట్లో సమాచారం, పుస్తకాలు దొరకొచ్చేమో కానీ ఫ్యామిలీ, ఎమోషనల్‌ సపోర్ట్‌ దొరకవు కదా! ‘ఇంకా ఎన్నాళ్లు చదువుతావ్‌!’ లాంటి మాటలు ఒక్కసారి కూడా ఇంట్లో అనలేదు. దాంతో పరీక్షల్లో ముందు చేసిన పొరపాట్లని దిద్దుకొనేందుకు సమయం చిక్కింది. ఆప్షన్‌ విషయంలో, ఇంటర్వ్యూల్లో నేను చేసిన తప్పులు దిద్దుకుని పక్కాగా సిద్ధమయ్యా. రోజూ 8గంటలు చదివేదాన్ని. ఐఏఎస్‌ కావాలన్నది నాన్న కల. సమాజానికి సేవ చేసేందుకు ఇంతకు మించిన వేదిక లేదని ఆయన నమ్మకం. ఒత్తిడిగా ఉన్న సమయంలో యోగా, బ్యాడ్మింటన్‌, సినిమాలు చూడటం, బుక్స్‌ చదవడం వంటివి చేసేదాన్ని. ఐదో ప్రయత్నంలో ఏదో ఒక ర్యాంకు వస్తుందని అనుకున్నా కానీ ఇంత మంచి ర్యాంకు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. నిజానికి నేను మరోసారి ప్రిలిమ్స్‌కి కూడా సిద్ధమయిపోయా. ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదని చాలా రిలీఫ్‌గా ఉంది. మహిళల విద్యపై ఎక్కువ దృష్టి పెడతా అంటోంది’ హారతి.

    

చిన్ననాటి కల: స్మృతి మిశ్రా, 4వ ర్యాంకర్‌

‘పెద్దయ్యాక ఏమవుతావ్‌?’ నాన్న సరదాగా అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా ‘ఐఏఎస్‌’ అని సమాధానమిచ్చింది చిన్నారి స్మృతి. అప్పట్నుంచీ దాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి రెండు సార్లూ విఫలమైనా పట్టుదలగా ప్రయత్నించి ఈసారి నాలుగో ర్యాంకు దక్కించుకుంది. అసలు ప్రయాగ్‌రాజ్‌. కానీ పెరిగిందంతా ఆగ్రాలో. డిగ్రీకి దిల్లీ వెళ్లింది. బీఎస్‌సీ పూర్తయ్యాక ఎల్‌ఎల్‌బీ చదువుతోంది. నాన్న రాజ్‌కుమార్‌ మిశ్రా బరేలీలో డీఎస్‌పీ. ‘నాన్నని చూసే సివిల్స్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. కొన్నేళ్లపాటు గంటల కొద్దీ పుస్తకాలతో కుస్తీపట్టా. ఇన్నాళ్లకు అనుకున్నది సాధించా. ఫలితం తెలియగానే నాన్నకి వీడియోకాల్‌ చేసి చెప్పా. ఆయన కళ్లల్లో ఆనందం చూశాక సాధించా అనిపించింది’ అంటూ సంబరంగా చెబుతోంది స్మృతి.
 

    

మరింత సమాచారం... మీ కోసం!

‣ అత్యున్న‌త స‌ర్వీసుల్లో అమ్మాయిలే టాప్‌!

‣ అనులోమ విలోమాల్లో అంత్యమధ్యమాలు!

‣ సమ్మర్‌లో సరికొత్త కోర్సులు

‣ సరిహద్దు దళంలో 247 కొలువులు

Posted Date : 24-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌