• facebook
  • whatsapp
  • telegram

ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారా?

ఇవి తెలుసుకోండి

 

మహేష్, సురేష్‌ ఇద్దరూ ఒకేసారి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొన్ని నెలల్లోనే మహేష్‌ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ఇద్దరి విద్యార్హతలూ ఒకే విధంగా ఉన్నా తనకెందుకు ఉద్యోగం రాలేదో తెలియక తికమక పడుతున్నాడు సురేష్‌. నిజానికి ఇది అతనొక్కడి సమస్య మాత్రమే కాదు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టినవారు తాము ఏయే విషయాల్లో వెనకబడి ఉన్నామో తెలియక ఇబ్బందిపడుతుంటారు. అందుకే ఎలాంటి నైపుణ్యాలను అలవరుచుకుంటే త్వరగా ఉద్యోగాన్ని సాధించవచ్చో తెలుసుకుంటే మంచిది.

 

1. లోపాలను అధిగమించాలి

మీ బలాలు, బలహీనతలు ఏమిటో మీకు తెలిసినంత బాగా ప్రపంచంలో మరెవరికీ తెలియదు. కాబట్టి ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో ముందుగా గుర్తించాలి. వాటిని మెరుగుపరుచుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాలి. ఇది కొన్ని రోజుల్లోనే సాధ్యపడకపోవచ్చు. కొన్ని నెలలపాటైనా లోపాలను అధిగమించడానికి కాస్త ఓపిగ్గా ప్రయత్నించాలి. మీరు ఇంగ్లిష్‌లో వేగంగా మాట్లాడలేకపోవచ్చు. లేదా నలుగురి ముందు మాట్లాడ్డానికి తడబడవచ్చు. ఇలాంటి లోపాలను సాధనతో అధిగమించడానికి ప్రయత్నించాలి. అవసరమైతే స్నేహితులు, కుటుంబసభ్యుల సహకారం తీసుకోవాలి. 

 

2. తెలుసుకోవాలనే ఆసక్తి

కొంతమంది కోర్సు పూర్తికాగానే ఇక కొత్త పరిజ్ఞానమేదీ అవసరం లేదని అనుకుంటారు. సాధించినదానికి సంతృప్తిపడి అక్కడితో తమ ప్రయాణాన్ని ఆపేస్తుంటారు. ఈ పద్ధతి ఎంతమాత్రం సరి కాదు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తికి ఎప్పుడూ తెరపడకూడదు. నిజానికి తెలియకపోవడం తప్పుకాదు. తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోవడమే తప్పు. మీకంటే ముందు ఉద్యోగం సాధించిన మిత్రులను అడిగితే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. వారి సలహాలూ, సూచనలూ పాటిస్తే మీరూ త్వరగా ఉద్యోగాన్ని సాధించవచ్చు. వారి అనుభవాల నుంచి మీరు సరికొత్త పాఠాలు గ్రహించవచ్చు. 

 

3. అందరితో కలిసిపోవాలి

నలుగురితో పరిచయాలు పెంచుకోవడానికి  ఎప్పుడూ సందేహించకూడదు. ఆ నలుగురిలో చదువుకునే విద్యార్థులు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు లేదా ఉద్యోగులూ ఉండొచ్చు. అందరితో త్వరగా కలిసిపోయే తత్వం వల్ల మీరు తెలుసుకున్న కొత్త విషయాలు ఉద్యోగ సాధనలో ఎంతగానో తోడ్పడవచ్చు. 

 

4. నేర్చుకోవడం ఆపొద్దు

విద్యాలయాన్ని వదిలేయడం అంటే.. నేర్చుకోవడం ఆపేయడం కాదు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన ఎప్పుడూ ఉండాలి. మీకున్న విద్యార్హతలకు అదనంగా సాంకేతిక నైపుణ్యాలను చేర్చడానికి ప్రయత్నించాలి. ఉద్యోగ సాధనలో అదనపు నైపుణ్యాలు ఉన్న వారికి ఎప్పుడూ ప్రాధాన్యముంటుంది. దీంట్లో భాగంగా వర్క్‌షాప్‌లకు హాజరు కావచ్చు. లేదా అందుబాటులో ఉండే ఆన్‌లైన్‌ తరగతులనూ ఎంచుకోవచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవడంలోని మీ ఆసక్తి త్వరలోనే మీకు ఉద్యోగాన్నీ సాధించిపెడుతుంది.

 

5. అభిరుచులను మర్చిపోవద్దు

ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా మీరెంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ వ్యక్తిగత అభిరుచులను ఎప్పుడూ మర్చిపోకూడదు. పుస్తకాలు చదవడం ఇష్టమైతే.. సమయం చిక్కినప్పుడల్లా మంచి పుస్తకాన్ని అందుకోండి. పాటలు వినడం మీ అభిరుచైతే.. మనసుకు నచ్చిన పాటలను వీలునప్పుడల్లా వింటూనే ఉండండి. అప్పుడప్పుడూ స్నేహితులను కలిసినా, మాట్లాడినా మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. అభిరుచులను పదిలంగా కాపాడుకోవడం వల్ల విసుగనేది ఉండదు. రోజులను భారంగా వెళ్లదీయకుండా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపగలుగుతారు. ఒకవేళ మీరు ఆశించిన ఫలితాలను అందుకోవడం ఆలస్యమైనా నిరాశపడకుండా సానుకూల దృక్పథంతో తిరిగి ప్రయత్నించగలుగుతారు! 
 

Posted Date: 30-06-2021


 

ఉద్యోగాన్వేష‌ణ‌

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం