• facebook
  • whatsapp
  • telegram

మనో వైఖరీ ముఖ్యమే!

కోరుకున్న సంస్థలో మెరుగైన ఉద్యోగం సంపాదించాలంటే నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరచుకోవాల్సిందే. ఇలా చేయలేనివారు పోటీ ఎదుర్కొనలేక అవకాశాలు కోల్పోతుంటారు. ఉపాధి నైపుణ్యాల ఆధారంగా కార్పొరేట్‌ సంస్థలు ఉద్యోగులను ఎంపిక చేసుకుంటుంటాయి. అభ్యర్థికి నైపుణ్యాలు ఉండటం ఒక ఎత్తయితే... ఎంపిక ప్రక్రియలో వాటిని ప్రజెంట్‌ చేసే విధానం మరొక ఎత్తు. దీనిపై కూడా విజయావకాశాలు ఆధారపడివుంటాయి. కొత్త విషయాలూ, నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్న మనోవైఖరి/ దృక్పథం చాలా ముఖ్యం! 

ప్రతి సంస్థలోనూ ప్రతి ఉద్యోగానికీ కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు అవసరమవుతాయి. ఉదాహరణకు- మార్కెటింగ్‌ శాఖలో అవసరమయ్యే ప్రత్యేక నైపుణ్యాలు ఆ శాఖకు మాత్రమే పరిమితం. అలాగే అకౌంటింగ్, హెచ్‌.ఆర్‌., సప్లై చెయిన్‌.. ఇలా ఒక్కో శాఖకు కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు ఉండాలి. అందుకు తగిన ఉద్యోగ వివరణ పత్రాలు ప్రతి ఉద్యోగానికీ ఉంటాయి. వీటికి అదనంగా ప్రతి కొలువుకూ ఉద్యోగి నిర్వర్తించవలసిన కొన్ని సార్వజనీన సాధారణ నైపుణ్యాలు అవసరమవుతాయి. ఉత్పత్తి వ్యయ నియంత్రణ, భద్రత, కమ్యూనికేషన్‌ నైపుణ్యాల్లాంటివి.  

ఉద్యోగాన్వేషణలో ఉన్న విద్యార్థులకు ఈ అన్ని అంశాలపై సరైన శిక్షణ, అవగాహన తక్కువగా ఉంటాయి. ప్రతి సంస్థా కొత్తగా ఉద్యోగంలో చేరినవారికి కొన్ని అంశాల్లో శిక్షణ అందిస్తుంది. విద్యార్థి దశనుంచి ఉద్యోగిగా మారే పరిణామ క్రమం ఇది. ఈ అంతరాన్ని విద్యార్థి దశలోనే కొంతవరకు తగ్గించగలిగితే యాజమాన్యాల సమయమూ, ఇతర వనరులూ ఆదా అవుతాయి. అందుకే  ప్రాథమిక, స్పెషలైజేషన్‌ అంశాల్లో కొంత అవగాహన అప్పటికే ఉన్న అభ్యర్థులకు యాజమాన్యాలు ప్రాధాన్యమిస్తాయి. ఇది గమనించి విద్యార్థులు ఉపాధి నైపుణ్యాల్లో అవగాహన పెంచుకొని సిద్ధంగా ఉండాలి. ఇలాంటి మనోవైఖరితో నైపుణ్యాలను పెంపొందించుకొని సంస్థలో చేరేవారు తమ కెరియర్లో ఇతరులతో పోటీపడి ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు అధికం.

నైపుణ్యాల మార్కెటింగ్‌  

సాంకేతికతలో సంభవించే మార్పులకు అనుగుణంగా నూతన ఆవిష్కరణలు సంభవిస్తుంటాయి వ్యాపార వ్యవహారాల్లో ఎన్నో మార్పులు వస్తాయి. మార్పులు చిన్నవైనా కొత్త విషయాలను తెలుసుకోవడంవల్ల మార్పు ఫలితాలను సహజంగా హ్యాండిల్‌ చేయవచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న అభ్యర్థులు తమ స్పెషలైజేషన్‌ అంశాల్లో శిక్షణ పొందగలిగితే ఇతరులకంటే మెరుగైన ఉపాధి అవకాశాలు పొందగలుగుతారు. మెరుగుపరచుకున్న నైపుణ్యాలను ప్రొఫైల్‌లో ఎప్పటికప్పుడు జోడిస్తూపోతుంటే అభ్యర్థి విలువ పెరిగి అవకాశాలు మెరుగుపడతాయి. 

పరిస్థితులతో మమేకం  

వ్యక్తిలో అత్యంత విలువైన నైపుణ్యం- పరిస్థితులకు అనుకూలంగా మారడం (అడాప్టబిలిటీ). తెలివైనవారు, బలమైన వారికన్నా ‘మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకొని అందుకు అడాప్ట్‌ కాగలిగినవారే’ నిజమైన విజేత అవుతారు. ఈ నైపుణ్యం వ్యాపార సంస్థలకు అత్యంత అవసరమయ్యే నైపుణ్యం. అభ్యర్థులందరిలో ఇతర లక్షణాలూ.. నైపుణ్యాలూ సమానంగా ఉన్నప్పటికీ సంస్థ విజన్, మిషన్‌లను సులభంగా అర్థం చేసుకొని అడాఫ్ట్‌ కాగలిగినవారినే ఉద్యోగం వరిస్తుంది. ఉద్యోగులు తమ సహోద్యోగులతో నిత్య వ్యవహారాల్లో సంభాషించాలి, వారితో మమేకమవ్వాలి. సృజనాత్మకంగా ఆలోచించే సందర్భాల్లో సహోద్యోగులతో కలిసి పనిచేయడానికి అడాప్ట్‌ కావాలి.

ఎలాంటి సమాచారం..? 

చురుకైన అభ్యర్థులు తమ ఉద్యోగులుగా ఉండాలని యాజమాన్యాలు కోరుకుంటుంటాయి. తన చురుకుదనాన్ని అభ్యర్థి ఇంటర్వ్యూ సందర్భంలో తెలియజేసే ప్రయత్నం చేయటం మేలు. ఇంటర్వ్యూ ముగిసేముందు అభ్యర్థి తమ సంస్థ గురించీ, చేయబోయే ఉద్యోగానికి సంబంధించీ ఎలాంటి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నాడని అడగవచ్చు. అప్పుడు సంకోచించకుండా సంస్థకూ, వృత్తికి సంబంధించి ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. సంస్థ అవసరాలను ఎలా పరిగణిస్తున్నారు? ప్రాజెక్టులను ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నారన్న అంశాలు తెలియజేయవచ్చు. ఈ ప్రక్రియలో సెలక్టర్లు అభ్యర్థి వ్యక్తిత్వాన్నీ, ప్రశ్నించే తత్వాన్నీ, మనో వైఖరినీ గమనించే వీలుంది. అభ్యర్థి మానసిక పరిపక్వత, స్వీయ ప్రేరణ స్థాయులు కూడా ఈ సందర్భంగా సెలక్టర్లకు తెలుస్తాయి.

సంకల్పం

సంస్థలో పనిచేసే క్రమంలో క్లిష్టమైన లక్ష్యాలు సాధించవలసివచ్చినపుడు ఉద్యోగిలో సంకల్పబలం ఉండాలి. అభ్యర్థిలో యాజమాన్యాలు కోరుకునే ప్రాధాన్య అంశమిది. దీన్ని అంచనా వేసేందుకు.. ‘గతంలో మీరు ఎలాంటి క్లిష్ట సమస్యలు ఎదుర్కొన్నారు? సమస్యలో ఏ అంశం క్లిష్టమైనది? మీరు ఎలా పరిష్కరించారు?..అంటూ ఇంటర్వ్యూల్లో అడుగుతారు. చెప్పే సమాధానాలు.. అభ్యర్థిలోని సంకల్పబలాన్ని తెలియజెప్పుతాయి. సంస్థలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని అంచనా వేయటానికీ తోడ్పడతాయి.

సానుకూల దృక్పథం

సానుకూల ఆలోచనలు ఉన్న ఉద్యోగులు కార్యాలయాన్ని ఆరోగ్యకరంగా మార్చగలరు. ఉద్యోగుల మనోవైఖరి పని వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. సానుకూల దృక్పథం ఉన్న ఉద్యోగులు బృందంలో ఉండటం వల్ల పని వాతావరణం క్రమంగా ఉల్లాసభరితంగా తయారై ఉత్పాదకత పెంచేదిగా మారుతుంది. 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 01-02-2022


 

ప్రజెంటేషన్‌

మరిన్ని