• facebook
  • whatsapp
  • telegram

ఈ ప్రత్యేకతలు మీలో ఉన్నాయా?

కెరియర్‌ సక్సెస్‌కు సూచనలు


 


కొంతమంది విద్యార్థులు చురుకుదనం, తెలివి తేటలతో మిగతావారి కంటే భిన్నంగా ఉంటారు. నిశితంగా గమనిస్తే.. వాళ్లలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అనుకున్నది సాధించాలనే తపన స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి విద్యార్థుల ప్రత్యేక లక్షణాలేమిటో తెలుసుకుందామా? 


ఈ తరహా విద్యార్థుల్లో జ్ఞానాన్ని ఆర్జించాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. తరగతి పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా.. సమయం చిక్కినప్పుడల్లా కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అధ్యాపకులు, సీనియర్లు, కుటుంబంలోని పెద్దవాళ్లు చెప్పిన విషయాలను ఆసక్తిగా ఆలకిస్తారు. ఏమైనా సందేహాలు వస్తే వెంటనే ప్రశ్నించి నివృత్తి చేసుకుంటారు. సందేహాలడిగితే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోననే మొహమాటం వీరిలో కనిపించదు. 

పాఠాలు మొక్కుబడిగా విని.. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించాలని తాపత్రయపడరు. ప్రతి విషయాన్నీ లోతుగా ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. విన్న విషయాన్ని అంతటితో వదిలిపెట్టకుండా అనేక రకాలుగా విశ్లేషించుకుని అవగాహన పెంచుకుంటారు. అలాగే అన్ని విషయాలూ తమకు మాత్రమే తెలుసుననే అహంకార ధోరణి వీరిలో కనిపించదు. జీవితంలోని ప్రతి దశలోనూ కొత్త విషయాలను తెలుసుకోవాలనే కుతూహలం వీరికుంటుంది. 

కోర్సులు, కాలేజీల ఎంపిక, వృత్తిలో స్థిరపడటం లాంటి విషయాల్లో త్వరపడి నిర్ణయాలు తీసుకుని.. ఆ తర్వాత విచారిస్తూ కూర్చోరు. ఒక పని మొదలుపెట్టడానికి ముందే వివిధ కోణాల్లో ఆలోచిస్తారు. పని పూర్తయిన తర్వాత అలా ఎందుకు చేశానా అని బాధపడరు. వీరు చేసే పనుల్లో, తీసుకునే నిర్ణయాల్లో పరిపక్వత కనిపిస్తుంది. 

ప్రతి పనినీ ఎంతో శ్రద్ధగా, ఆసక్తిగా చేస్తారు. ఏ పని విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించరు. పరిసరాలను చిందరవందరగా ఉంచడం, వస్తువులను అస్తవ్యస్తంగా పారేయడం లాంటివి వీరి విషయంలో కనిపించవు. ఎక్కడి వస్తువులు అక్కడ లేకపోతే వాటిని వెతకడానికే ఎక్కువ సమయం వృథా అవుతుంది. సమయం విలువ బాగా తెలిసినవాళ్లు వీరు. అలా జరగడానికి అవకాశం ఇవ్వరు. చిన్న పనులనూ శ్రద్ధగా చేస్తారు కాబట్టి చేసిన పనులే మళ్లీ చేయాల్సిన అవసరమూ రాదు. 

వీరి ఆలోచనలు ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటాయి. గడిచిపోయిన గతంలోనే ఆగిపోరు. రాబోయే రోజుల గురించి గొప్పగా ఊహించుకుంటూ పగటి కలలు కనరు. సమయాన్ని వృథా చేయడమంటే ఏమాత్రం ఇష్టముండదు. రోజువారీ ప్రణాళిక వేసుకుని దాన్ని పకడ్బందీగా అమలుచేస్తారు. సానుకూల దృక్పథంతో అనుకున్నది సాధించడమే వీరి లక్ష్యం. అందుకు అవరోధంగా నిలిచే స్నేహితులకూ, పరిస్థితులకు సాధ్యమైనంత దూరంగా ఉండటానికే ఇష్టపడతారు. 

వీళ్లు అసలు పొరపాట్లే చేయరని అనుకోకూడదు. తప్పులూ, పొరపాట్లు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. వాటి నుంచి పాఠాలూ నేర్చుకుంటూ.. అవే పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరి జీవితంలోనైనా ఊహించని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. దానికి వీరూ మినహాయింపేం కాదు. కొన్ని నిరుత్సాహ పరిచే పరిస్థితులూ వీరి జీవితంలోనూ ఎదురుకావచ్చు. అయినా ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్లాలనే ఆశపడతారు.  


ఈ ప్రత్యేకతల్లో మీలో ఏమైనా లోపించాయా? అయితే వాటిని సాధించటం అసాధ్యమేమీ కాదు. నమ్మకంతో శక్తివంచన లేకుండా కృషి చేయండి.   

Some more information

‣  "The Power of Persistence: Yasir M.'s Path to Prosperity"

Posted Date: 08-05-2024