• facebook
  • whatsapp
  • telegram

మంచి విద్యార్థి ఎవరు?

లెక్చరర్ చాణక్య క్లాసులోకి వచ్చీరాగానే ఓ ప్రశ్న వేశాడు. 'ఫ్రెండ్స్ మీరంతా మంచి విద్యార్థులేనా? 'అవును విద్యార్థులంతా ఒకే గొంతుతో బదులిచ్చారు.

'మరోసారి ఆలోచించుకొని చెప్పండి. మీరంతా మంచి విద్యార్థులేనా?' ఈ సారి క్లాసంతా గంభీరమైన నిశ్శబ్దం అలుముకుంది.

       'చూశారా ఎంత అనుమానమో? నిజమే మంచి విద్యార్థి ఎవరు అని చెప్పటం అంత తేలికకాదు. మార్కులు వచ్చినవాళ్లంతా మంచి విద్యార్థులనీ, రానివాళ్లు కాదనీ చెప్పలేం. క్రమశిక్షణ, వినయ విధేయతలూ, జిజ్ఞాస మంచి విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలే కానీ అవి మాత్రమే మంచి విద్యార్థిని తయారుచేయలేవు. నిజానికి ఈ మంచితనానికి ఒక నిర్దిష్ట నిర్వచనం గానీ, కొలతగానీ లేదు. అయినా మనం ఒక విద్యార్థి చదువుతున్న తీరునూ, అతను చదువులో సాధిస్తున్న విజయాలను బట్టి అతను మంచి విద్యార్థో కాదో చెప్పగలం కదా? చదువు అనే పెద్ద పనిలో అనేక చిన్నపనులు ఉంటాయి. వాటన్నిటినీ బాగా చేయడం వస్తే చదువుబాగా వస్తుంది. అంటే అవన్నీ బాగా చేయడం వచ్చినవాడే మంచి అన్నమాట. మనం మంచి విద్యార్థి లక్షణాలను గురించి తెలుసుకుంటున్నామంటే చదువులో విజయం సాధించేందుకు కావాల్సిన సామర్థ్యాలను గురించి తెలుసుకుంటున్నామనే.

గమ్యం

గమ్యం అంటే మనం ఎందుకు చదువుతున్నామో తెలుసుకోవడం. ఉదాహరణకు ఐఐటీ సీటు సంపాదించడం. మంచి డాక్టరు లేదా టీచరు కావడం, మంచి ఉద్యోగం సంపాదించడం ఇలా ఏదైనా గమ్యం కావచ్చు. దాని మీద స్పష్టత ఉండాలి. మీ గమ్యం ఒకవాక్యంలో రాసి చూపించగలిగేలా ఉండాలి. అలా దాన్ని రాసుకోవాలి. కానీ దాన్ని గురించి వివరించమంటే మీరు ఎన్నిపేజీల వివరణ అయినా ఇవ్వగలిగి ఉండాలి. ఉదాహరణకు ఐఐటి సీటు సాధించడం గమ్యమైతే 'నేను ఐఐటీ సీటు సాధిస్తాను అనేది దానికి సంబంధించిన ఏకవాక్య తీర్మానం. ఏ ఐఐటీలో చేరాలనుకుంటున్నావు? ఏ బ్రాంచిలో చేరాలనుకుంటున్నావు? సింగిల్ డిగ్రీనా? డ్యూయల్ డిగ్రీనా? దానికి కావాల్సిన మార్కులు ఎన్ని? ఇవన్నీ వివరణలోకి వస్తాయి.

మార్గం

మార్గం అంటే గమ్యం ఏ పద్ధతిలో చేరాలనుకుంటున్నామో అది. పైన అనుకున్న 'ఐఐటీ సీటు అనే గమ్యాన్నే తీసుకుంటే దాన్ని ఎలా సాధిద్దామనుకుంటున్నారు? కాలేజీలో చదువుతూ విడిగా కోచింగ్ తీసుకుంటారా? కోచింగ్‌కూడా ఇచ్చే కాలేజీలో చేరతారా? ఇంటి దగ్గర ఉండి చదువుతారా? హాస్టల్లోనా? ముందు ఇంటర్ పూర్తిచేసి తర్వాత లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటారా? ఇలా ఏదో ఒకటి మనకు అనుకూలమైన మార్గాన్ని నిర్ణయించుకొని దానికి కట్టుబడాలి. ఈ మార్గం నిర్ణయించుకొనేటప్పుడు ఎన్నిసలహాలు కావాలన్నా తీసుకోవచ్చు. కానీ, ఒకసారి ఒక మార్గంలో వెళదామని నిర్ణయించుకున్నాక సాధ్యమైనంత వరకూ దానిలో మార్పులు చేయకూడదు. అవసరాన్ని బట్టి చిన్నచిన్న సర్దుబాట్లు సరే. కానీ పూర్తిగా అంతా మార్చేసుకోవడం మంచిదికాదు.

      కృషి లేదా ప్రయత్నమే ఏ విజయానికైనా ఆధారం. ఇంజినులేని రైలుబండి పట్టాల మీద ఉన్నా ఎలా కదలలేదో, కృషిచేయకుండా ఏ విజయమూ సాధించలేం. మనం చెప్పుకొనే మాటలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ కృషికి సంబంధించినవే.

ఇష్టం లేదా ఆసక్తి అనేది ఏ ప్రయత్నానికైనా మూలం. అయిష్టంగా ఏ ప్రయత్నమూ చేయలేం. చేసినా ఫలితం బాగుండదు. మన సబ్జెక్టుల మీదా, గమ్యం మీదా ఇష్టాన్ని పెంచుకోవాలి. ఈ ఇష్టం ఎంత ఎక్కువ గా ఉంటే కృషి అంతబాగా జరుగుతుంది. అందుకే దీన్ని ఇంధనంతో పోల్చాం.

ఉత్సాహం ప్రయత్నాన్ని ప్రోత్సహించే కారకం. నేను చేస్తాను, నేను చేయగలను. అనే నమ్మకం ఉత్సాహానికి పునాది. ఎత్తు ఎక్కే బండికి యాక్సిలేటర్ ఎంత అవసరమో, ఎక్కువ పని చేయాల్సిన విద్యార్థికి ఉత్సాహం అంత అవసరం. మితిమీరిన ఉత్సాహం ప్రమాదాలకు దారి తీస్తుంది.

జాగ్రత్తలు అంటే ప్రమాదావకాశాలను ముందుగానే గుర్తించి, వాటి వల్ల నష్టపోకుండా చేసుకొనే ఏర్పాట్లు. బండికి బ్రేకులుంటే చాలదు వాటిని సరైన సమయంలో ఉపయోగించాలి. అలాగే జాగ్రత్తలు తెలుసుకుంటే చాలదు. వాటిని సరిగ్గా పాటించాలి. అప్పుడే ప్రమాదాల బారిన పడుకుండా లక్ష్యాన్ని సాధించగలుగుతాం.

మన గమ్యం చేరుకునేందుకు అనుకూలమైన అవకాశాలన్నీ గ్రీన్‌లైట్లు, పక్కదారి పట్టించే ప్రమాదాలన్నీ రెడ్‌లైట్లు. వీటిగురించి మనకంటే మన తల్లిదుండ్రులకీ అంటే గార్డులకూ, ఉపాధ్యాయులకూ అంటే స్టేషను మాస్టర్లకూ ఎక్కువ సమాచారం తెలుస్తుంది. కాబట్టి మనం తప్పనిసరిగా వాళ్ల సూచనలు పాటించాలి.

ఇంతసేపూ మనం మానసికమైన సన్నద్ధత గురించి చెప్పుకున్నాం. శరీరానికి సంబంధించిన మరో మూడు ముఖ్యాంశాలు చెప్పి ఈ జాబితాను ముగిస్తాను. అవి

1. జ్ఞాపకశక్తి:

చదువులో విజయానికి ప్రధానకారకం జ్ఞాపకశక్తి. ఇది మంచి మానసిక శారీరక అలవాట్ల సమ్మిళిత ఫలితం. ఇది శరీరం రంగు, ఎత్తు, ఆకారంలాగా పుట్టుకతో నిర్ధారించే అంశం కాదు. చదివేటప్పుడూ, వినేటప్పుడూ, రాసేటప్పుడూ పాటించాల్సిన మంచి పద్ధతులను పాటిస్తే ఎవరైనా మంచి జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవచ్చు.

2. చక్కటి చేతిరాత:

ప్రస్తుతం చాలా పరీక్షలు చేతిరాత మీద ఆధారపడి ఉన్నాయి. ఎంసెట్, ఐఐటీ ప్రవేశపరీక్ష లాంటి వాటికి కూడా సొంతచేత్తో రాసుకున్న నోట్సు ఎంతో ప్రయోజనకరం. దురదృష్టమేమిటంటే చాలామంది తమ చేతిరాతను నిర్లక్ష్యం చేస్తారు. కాస్త ప్రయత్నంతో దాన్ని బాగుచేసుకోవచ్చని నమ్మరు. కానీ చదవచక్కని చేతిరాతను అలవరచుకోవడం కొద్దిపాటి ప్రయత్నంతో ఎవరికైనా సాధ్యమే.

3. పరిశుభ్రత:

శరీరం, చదివే గదీ, పాఠ్యపుస్తకాలూ, పరీక్షాపత్రమూ ఒకటేమిటి చదువుకు సంబంధించిన అన్నిటికీ ఈ పరిశుభ్రత అనే మాటను వర్తింపచేయవచ్చు. ఈ పనిని ఇంకా అందంగా/ శుభ్రంగా చేయలేమా? అని ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవడం ద్వారా ఎంతో మెరుగుదల సాధించవచ్చు. పైన చెప్పుకున్న అంశాలన్నీ సమానంగా ఉండి కేవలం పరిశుభ్రత ఎక్కువగా ఉన్న విద్యార్థి లేని విద్యార్థి కంటే కనీసం పదిశాతం ఎక్కువ మార్కులు సంపాదిస్తాడనేది ఆశ్యర్యకరమైన నిజం.

Posted Date: 11-09-2020


 

ఆవశ్యకత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం