• facebook
  • whatsapp
  • telegram

సివిల్స్‌లో 590.. ఐఎఫ్‌ఎస్‌లో 22వ ర్యాంకు

విజయనగరం జిల్లా యువకుడి ప్రతిభ

విజయప్రస్థానం వివరాలులక్ష్యాన్ని నిర్ణయించుకోవడమే కాదు.. దానికి పట్టే సమయాన్నీ, తీసుకోవాల్సిన శ్రమనూ అంచనా వేయడమే అసలైన విజయ రహస్యం అంటున్నారు పొటుపురెడ్డి భార్గవ్‌. ఇటీవల ఐఎఫ్‌ఎస్‌ పరీక్షలో జాతీయ స్థాయిలో 22వ ర్యాంకు సాధించిన ఈయన.. ఇప్పటికే సివిల్స్‌ ర్యాంకు సాధించి శిక్షణలో ఉన్నారు. విజయనగరం జిల్లాలోని పెదవేమలి గ్రామం నుంచి.. సివిల్స్‌, ఐఎఫ్‌ఎస్‌ ర్యాంకుల వరకూ తన ప్రయాణం గురించి వివరిస్తున్నారిలా..


‘చిన్నప్పటి నుంచి బాగానే చదివేవాడిని, కానీ అప్పట్లో సివిల్స్‌ ఆలోచన లేదు. మా నాన్నగారు సత్యం.. విజయనగరం ఆర్టీసీ సెక్యూరిటీ డివిజన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌. అమ్మ పద్మావతి. చెల్లి హారిక రంగరాయ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది.


ఇంటర్‌ తర్వాత ఐఐటీ ముంబయిలో సీటు వచ్చింది. దాంతో అక్కడే మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశాను. క్యాంపస్‌లోనే సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం రావడంతో వెంటనే దిల్లీ వెళ్లి ఉద్యోగంలో చేరాను. అలా ఒక ఏడాది పని చేశాక.. ఇక ఇంతేనా అనిపించింది. నాన్న కూడా ఇక్కడితో ఆగిపోకూడదు, ఇంకా ఏదో సాధించాలని ప్రోత్సహించేవారు. ఏం చేయాలా అని చాలా ఆలోచించాను. చివరిగా సివిల్స్‌ను లక్ష్యంగా ఎంచుకున్నాను. ఇంట్లో కూడా సమ్మతించడంతో ఉద్యోగం మానేసి పూర్తిస్థాయిలో సన్నద్ధత మొదలుపెట్టాను. ఆ సమయంలో దిల్లీలోనే ఉండటంతో కోచింగ్‌లో చేరాను. ఒక పక్క ప్రిపేర్‌ అవుతూనే మరోపక్క అటెమ్ట్స్‌ ఇస్తూ వెళ్లాను.


నాలుగో ప్రయత్నం తర్వాత మొత్తం ఒకసారి సమీక్షించుకున్నాను. అసలు నేను వెళ్తున్న దారి సరైనదేనా అని పూర్తిస్థాయిలో ఆలోచించుకుని ఇంకా సీరియస్‌గా ఐదోసారి ప్రయత్నించాలి అనుకున్నా. అప్పుడు దాటలేకపోతే వదిలేద్దాం అన్నంతగా కష్టపడి చదివాను. అనుకున్నట్టే ఆ ప్రయత్నంలో 772 ర్యాంకు వచ్చింది! ఈ ఫలితాలు 2023లో విడుదలయ్యాయి. ఐడీఏఎస్‌ (ఇండియన్‌ డిఫెన్స్‌ అకౌంట్స్‌ సర్వీస్‌) రావడంతో వెంటనే శిక్షణలో చేరాను. అక్కడ ఉంటూనే మరోసారి ప్రయత్నించడంతో అప్పుడు 590 ర్యాంకు వచ్చింది. అదే సమయంలో ఐఎఫ్‌ఎస్‌ కూడా రాశాను, అందులో ఆలిండియా 22వ ర్యాంకు వచ్చింది. ఏపీ, తెలంగాణలకు ఇదే మొదటి ర్యాంకు. ప్రస్తుతం ఐడీఏఎస్‌ ప్రొబేషన్‌లో ఉన్నాను. మొత్తంగా అన్నీ ఆలోచించుకుని ఏ సర్వీసులో కొనసాగాలో నిర్ణయించుకుంటాను.


‘సమాజంలో ఒక మంచి మార్పు తీసుకురావాలి’ అనే ఆలోచనతోనే ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి సివిల్స్‌ బాట పట్టాను. దాదాపు ఆరేళ్ల కఠిన సాధన తర్వాత ఈ విజయాలు సొంతమయ్యాయి.


ఈ పరీక్ష ఎక్కువ సమయం తీసుకుంటుంది అని తెలుసు, దానికి నేను సిద్ధంగానే ఉన్నప్పటికీ.. అనుకున్న దానికంటే కొంత సమయం ఎక్కువే పట్టింది. ఈ ప్రక్రియలో మా కుటుంబ సభ్యులూ, స్నేహితులూ నిరంతరం వెన్నుదన్నుగా నిలిచారు. ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోనివ్వలేదు, సాధించగలవనే స్ఫూర్తిని నింపారు. వారి ప్రోత్సాహం వెలకట్టలేనిది.


మొదటి ప్రయత్నం సమయానికి నేను పూర్తిగా సిద్ధం కాలేదు. దాంతో అది సరిగ్గా రాయలేకపోయాను. రెండు, మూడు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్‌ దాటి మెయిన్స్‌ పరీక్షలు రాసినా.. ఇంటర్వ్యూ వరకూ వెళ్లలేదు. నాలుగోప్రయత్నంలో మాత్రం కనీసం ప్రిలిమ్స్‌ కూడా దాటలేకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది.


సన్నద్ధత ఇలా..

ఆప్షనల్‌గా కెమిస్ట్రీ ఎంచుకున్నాను. మొదటి ఏడాది కోచింగ్‌ తీసుకున్నా తర్వాత కరోనా ఇబ్బందులతో ఇంటికి వచ్చేశాను. అప్పటి నుంచి సొంతంగానే సన్నద్ధమయ్యాను. కోచింగ్‌ ఏది, ఎలా, ఎంత వరకూ చదవాలి అనేది నేర్పించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఒక అభ్యర్థి విజయంలో శిక్షణ 20 శాతం వరకూ మాత్రమే పనిచేస్తుంది. మిగతా 80 శాతం మన శ్రమపైనే ఆధారపడి ఉంటుంది. స్నేహితుల, సీనియర్ల సలహాలు, సూచనలు పాటిస్తూ చదివాను. తప్పు చేస్తే కచ్చితంగా దాన్ని సరిచేసుకోవడం, తిరిగి మళ్లీ ప్రయత్నించడం చేశాను.


సివిల్స్‌ సన్నద్ధత శారీరకంగానూ మానసికంగానూ మనకు పరీక్ష పెడుతుంది. దానికి తగిన విధంగా ఆహారం, వ్యాయామం ఉండాలి. పరీక్ష గురించి పూర్తిగా తెలుసుకోవాలి. గత ఏడాది పరీక్ష పత్రాలు చూడటం ద్వారా ప్రశ్న ఎలా ఇస్తున్నారో తెలుసుకోవడం సులభమవుతుంది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, మౌఖిక పరీక్ష.. దేనికదే విభిన్నమైన తీరుల్లో అభ్యర్థిని పరీక్షిస్తాయి. అన్నింటికీ ప్రత్యేక వ్యూహాలు ఉండాలి. నిరంతరం శ్రమించడం చాలా ముఖ్యం. ఏదైనా ఒక రోజు కాస్త అటూఇటూ అయినా మరో రోజు ఆ మేరకు సాధన పూర్తిచేయాలి.


మౌఖిక పరీక్ష ఒక వ్యక్తిగా మనం సర్వీస్‌కి ఫిట్‌ అవునా కాదా అనేది పరీక్షిస్తుంది. ఫిట్‌ అనిపించుకునేలా మనల్ని మనం వీలైనంతగా సిద్ధం చేసుకోవాలి. పర్సనాలిటీలోని లోపాలను సరిచేసుకోవాలి, ఇందుకు మాక్‌ ఇంటర్వ్యూలు సహాయపడతాయి. వీలైనన్ని మాక్స్‌ ఇస్తూ మనల్ని మనం బెటర్‌ చేసుకోవాలి. నిజాయతీ, నిబద్ధత, ఆత్మవిశ్వాసం కలిగిన అభ్యర్థులుగా ప్యానెల్‌కు కనిపిస్తే కచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. సివిల్స్‌ జర్నీలో ఒత్తిడి అత్యంత సాధారణ విషయం. కానీ లక్ష్యం మీద స్పష్టత ఉంటే చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది పడకుండా ఉంటాం.


రోజుకు ఇన్ని గంటలు అంటూ ఏదీ పెట్టుకోలేదు. అలా అని కనీసం 6 గంటలు కేటాయించకుండా లేను. అప్పుడప్పుడూ రిలాక్స్‌ అవ్వడం కోసం ఫ్రెండ్స్‌తో సినిమాలు చూసేవాణ్ని. అయితే ఇలాంటి ప్రయత్నాల్లో సమయం చాలా విలువైనది, దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ పరీక్షలో విజయశాతం చాలా తక్కువ కావడం వల్ల బ్యాకప్‌ ఒక ఆప్షన్‌ పెట్టుకుని ఉంచుకోవడం మంచిది. అప్పుడు మనపై ఎక్కువ ఒత్తిడి ఉండదు. అదే సమయంలో ప్రేరణ కోల్పోకుండా సన్నద్ధమవ్వాలి.


ఎలా అయినా సాధించాలి అనే తపనతో ప్రయత్నిస్తే ఇందులో కచ్చితంగా విజయావకాశాలు ఉంటాయి!


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ రాబోయే మూడేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు

‣ ఆఫర్‌ చేజారితే?

‣ సందిగ్ధ స్థితిని దాటి.. సముచిత నిర్ణయం!

‣ ఏఐసీటీఈ... కెరియర్‌ పోర్టల్‌

‣ రాస్తే.. ప్రయోజనాలెన్నో!

‣ మొదటిసారే.. మంచి ముద్ర!

‣ ఈ ప్రత్యేకతలు మీలో ఉన్నాయా?

Posted Date: 15-05-2024


 

పోటీ పరీక్షలు

మరిన్ని