• facebook
  • whatsapp
  • telegram

సందిగ్ధ స్థితిని దాటి.. సముచిత నిర్ణయం!

ఎటూ తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితి విద్యార్థులకు ఎన్నోసార్లు ఎదురవుతూనే ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలో.. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటప్పుడు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో తెలుసుకుందామా? 

అభిరామ్‌కు సైన్స్‌ సబ్జెక్టు అంటే ఆసక్తి ఉండదు. కానీ తల్లిదండ్రులూ, స్నేహితులు ఇంటర్‌లో సైన్స్‌ గ్రూప్‌ తీసుకుని.. మెడిసిన్‌ చదవమని సలహా ఇచ్చారు. అతడికేమో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అంటే ప్రాణం. దాంతో ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో పడిపోయాడు. 

సాత్విక పరిస్థితీ ఇలాగే ఉంది. తనకు లెక్కలంటే భయం. తెలిసివాళ్లందరూ మ్యాథ్స్‌ చదివితే భవిష్యత్తు బాగుంటుందనీ.. పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికీ ఈ సబ్జెక్టు ఉపయోగ పడుతుందనీ అంటున్నారు. తనకేమో ఫైనార్ట్స్‌ డిగ్రీ చేయాలనుంది.

ఇలాంటి సందిగ్ధ పరిస్థితి సాధారణంగా ఎంతోమంది విద్యార్థులకు ఎదురవుతూనే ఉంటుంది. పదో తరగతి తర్వాత ఏ గ్రూప్‌ తీసుకోవాలి.. ఇంటర్‌ తర్వాత.. ఏ డిగ్రీ చదవాలనే విషయంలో ఎన్నో సందేహాలు వస్తుంటాయి. నిజానికి ఈ దశలో తీసుకునే నిర్ణయం ఎంతో కీలకమైంది. సరైన దారిలో వెళితే వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. పొరపాటు నిర్ణయం తీసుకుంటే.. ఆ తర్వాత సరిదిద్దుకునే అవకాశం లేకపోవచ్చు కూడా. ఒకవేళ అవకాశం ఉన్నా విలువైన కాలమెంతో వృథా కావచ్చు. కాబట్టి  ఇలాంటి పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో చూద్దాం.  

సాధారణంగా ఏదైనా సందేహం రాగానే ఇతరుల సలహాలూ, సూచనలు తీసుకోవాలని ఆలోచిస్తారు కదా. కానీ ముందుగా ఆలోచించుకోవాల్సింది మీరే. ఎందుకంటే మీకు ఇష్టమైన సబ్జెక్టులు ఏవి? ఏవంటే అసలు ఆసక్తి లేదు? అనేది మీకే స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఎవరో సలహా ఇచ్చారనో, భవిష్యత్తులో అవకాశాలు బాగుంటాయనో కాకుండా.. మీకు ఇష్టమైన సబ్జెక్టునే ఎంచుకోవాలి. అప్పుడు మాత్రమే ఆసక్తిగా చదవగలుగుతారు. లేకపోతే ఏదో తప్పదన్నట్టుగా చదువుతారు. అలాంటప్పుడు అతి కష్టం మీద పాస్‌ మార్కులు మాత్రమే సంపాదించగలుగుతారు. 

ఆసక్తికి అనుగుణంగానే నిర్ణయానికి రావాలి. అంటే ఇష్టమైన సబ్జెక్టునే ఎంచుకోవాలి. దాంతో ఉన్నత విద్యా, ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయో సీనియర్లు, అధ్యాపకులను అడిగి తెలుసుకోవచ్చు. 

ప్రస్తుతం ఉన్న డిమాండ్, భవిష్యత్తు ఉద్యోగావకాశాల ప్రాతిపదికగా కాకుండా.. ఆసక్తినే ఎందుకు పరిణించాలంటే.. ఆ సబ్జెక్టును చదవాల్సింది మీరు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాల్సిందే మీరే. ఇష్టంలేకపోతే మొక్కుబడిగా చదవాల్సివస్తుంది. పరీక్షలు సరిగా రాయలేక ఆశించిన ఫలితాలను అందుకోవటం చాలా కష్టమవుతుంది.  

అందుకే అన్ని విధాలుగా ఆలోచించి సరైన నిర్ణయానికి రావాలి. అంతేగానీ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆలోచించాల్సిన పరిస్థితీ, అలా చేయకుండా ఉండాల్సిందని బాధపడాల్సిన అవసరమూ రాకూడదు. 

సలహాలు ఇవ్వడానికి ఎవరూ అందుబాటులో లేరనుకుంటే.. మీరు ఎంచుకున్న సబ్జెక్టు, సంబంధిత రంగానికి చెందిన సమాచారాన్ని ఆన్‌లైన్‌ నుంచీ సేకరించవచ్చు. 

ఇష్టమైన సబ్జెక్టును ఎంచుకున్న తర్వాత దాంట్లో లోతైన పరిజ్ఞానం సంపాదించడానికి ప్రయత్నించాలి. ఆ రంగంలోని మార్పులనూ, తాజా సమాచారాన్ని పరిశీలించాలి. 

సరైన సమయంలో.. సరైన నిర్ణయం తీసుకుని చదువు, ఉద్యోగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించేవాళ్లు కొందరే ఉంటారు. వారిలో మీరూ ఉండాలి. 

చివరగా ఒక్క విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. మీరు ఎంచుకున్న రంగంలో ఎలాంటి సమాచారం కావాలన్నా ఇతరులు మిమ్మల్ని సంప్రదించే స్థాయికి మీరు ఎదగాలి. తీసుకున్న నిర్ణయం సరైంది అయినప్పుడే ఇది సాధ్యమవుతుంది. 

Some more information

‣  "Unveiling the Secret to Yasir M.'s Multi-Crore Success"

Posted Date: 14-05-2024


 

స్వీయ అవగాహన