• facebook
  • whatsapp
  • telegram

స్వీయ నిర్వ‌హ‌ణ‌తో.. ల‌క్ష్యం దిశ‌గా..

కెరియర్‌ ఉన్నతికి  జీవన నైపుణ్యాలు- 4

మీ బలాలు ఏమిటి? పరిమితులేమిటి? మీకు ఆసక్తి ఉన్న రంగాల అవసరాలపై అవగాహన ఉందా? వాటిలో రేపటి  అవకాశాలకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మలచుకోగలరా? 

మధు, వెంకట్‌ ఇద్దరూ సమీపంలోని చిన్న గ్రామాల నుంచి హైదరాబాద్‌కి ఇంజినీరింగ్‌ చదువుకోవడానికి వచ్చారు. ఇద్దరిదీ దాదాపుగా ఒకే విధమైన ఆర్థిక నేపథ్యం. చిన్న ఊరు నుంచి మహానగరానికి రాగానే మధులో చాలా మార్పు వచ్చింది. చదువు మీదకంటే ఇతర విషయాలపై ధ్యాస ఎక్కువైంది. ఇంటి దగ్గర నుంచి ఏదో ఒక సాకు చెప్పి డబ్బు తెప్పించుకోవడం, జల్సాగా ఖర్చు చేయడం అలవాటైంది. నాలుగేళ్లు గడిచేసరికి బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులతో మళ్లీ సొంత ఊరు చేరాడు.

కాలేజీలో సరదాగా గడిపే చాలామంది కంటే తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి వేరని వెంకట్‌ గుర్తించాడు. చదువుపైనే ధ్యాసపెట్టి ఆరో సెమిస్టర్‌ దాటేసరికి తరగతిలో అందరి కంటే మెరుగ్గా ఉన్నాడు. త్వరలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు మొదలవుతాయని తెలుసు. కానీ సివిల్స్‌ వైపు వెళ్లి తన తండ్రిలాంటి లక్షలాది రైతుల వ్యధ తీర్చేందుకు కృషి చేయాలని నిర్ణయించుకున్నాడు. దృఢ సంకల్పంతో తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌కు ఎంపికయ్యాడు. 

మధు వెంకట్‌ల ప్రయాణంలో వెంకట్‌ని సరైన దిశగా నడిపించిందేమిటి? స్వీయ నిర్వహణ (సెల్ఫ్‌ మేనేజ్‌మెంట్‌)! మనుషుల్ని తీర్చిదిద్దే జీవన నైపుణ్యం!

ఇంతకీ ఏమిటిది?

సొంత బలాలు, పరిమితులు, తాను ప్రవేశించాలనుకుంటున్న రంగ అవసరాలు, భవిష్యత్‌ అవకాశాలను గుర్తించి వీటికి తగ్గట్టు తనను తాను మలచుకోవడమే- స్వీయ నిర్వహణ. ఇందుకోసం నిత్యజీవితంలో అనవసరమైనవి త్యజించాలి; అవసరమైన నైపుణ్యాలను దీక్షతో నేర్చుకోవాలి.

గంపెడు సంతానంలో ఒకరిగా తమిళనాడులోని వెనుకబడిన ప్రాంతంలో పుట్టారు అబ్దుల్‌ కలాం. పేపర్‌ బాయ్‌గా పనిచేసినా చదువును ఆయుధంగా చేసుకుని ఎదిగారు. భారత క్షిపణి పితామహుడిగా నిలిచి రాష్ట్రపతిగా సేవలందించారు. సెల్ఫ్‌ మేనేజ్‌మెంట్‌కి ఆయన నిశ్చిత తార్కాణం.

నల్లజాతీయుడిగా ఎన్నో పరాభవాలను దిగమింగుకుని విద్యతో తనను తీర్చిదిద్దుకున్నారు బరాక్‌ ఒబామా. జన హృదయాలను గెలుచుకునే లక్షణాలు అలవర్చుకుని రెండు సార్లు అమెరికా అధ్యక్షుడిగా సేవలందించారు. స్వీయ నిర్వహణ నైపుణ్యం ఫలితంగా ప్రపంచానికి పరిచయమైన నేత ఈయన.

ఆరు సోపానాలు

కెరియర్‌లో ఉన్నత సోపానాలను ఎక్కేందుకు స్వీయ నిర్వహణే పునాది. ఈ కౌశలాన్ని పెంపొందించుకునేందుకు ఆరు అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

1.  స్వీయ అవగాహన: ముందుగా తనపై తన శక్తియుక్తులపై తగిన అవగాహన ఏర్పరచుకోవాలి. బలాలు, పరిమితులపై వాస్తవ దృక్పథంతో అంచనా వేసుకోవాలి. స్వీయ మానసిక ఉద్వేగాలపైనా అవగాహన పెంచుకోవాలి.

2. ఇతరులను అర్థం చేసుకోగలగడం: మన గమనం ఇతరులపై ఆధారపడి ఉందన్న వాస్తవాన్ని సదా మనసులో ఉంచుకోవాలి. మనకు ఆనందం, దుఃఖం, ఆశ, నిరాశ, భయం లాంటి అనుభూతులు ఎలా ఉంటాయో అలాగే వివిధ సందర్భాల్లో తన చుట్టూ ఉన్నవారి స్పందనల పట్లా అవగాహన ఉండాలి.

3. స్పష్టమైన లక్ష్యాలు: గాలికి ఎగిరిన ఎండుటాకు ఎటు పయనిస్తుందో తెలియదు. కానీ కెరియర్‌ ఉన్నతికి స్పష్టమైన లక్ష్యాలుండాలి. వాటి సాధనకు నిర్దిష్ట కాలపరిమితి విధించుకోవాలి. ఆ దృష్ట్యా దీర్ఘకాల, స్వల్పకాల లక్ష్యాలుగా వర్గీకరించుకోవాలి.

4. సామాజిక సంబంధాలపై పట్టు: ఎంచుకునే రంగంలో ఎదగాలంటే సోషల్‌ నెట్‌వర్కింగ్‌ పటిష్ఠంగా ఉండాలి. బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగువారు.. ఇలా మన సామాజిక స్రవంతిని విస్తృతం చేసుకోవాలి. స్నేహం, సహకారం, అందరిపట్ల ఆదరభావం ఉంటేనే పటిష్ఠ సామాజిక సంబంధాలు ఏర్పడతాయి.

5. విలువల వ్యవస్థ: సమాజం ఆమోదించిన విలువలను అలవర్చుకునే ప్రయత్నం చేయాలి. ఐటీ, కార్పొరేట్‌ సామ్రాజ్ఞి అయినా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ సుధామూర్తి పేరు వినగానే ఆమె నిరాడంబరత, సేవాభావం, మానవీయ విలువలు కళ్లముందు కదలాడుతాయి. బాపు-రమణల గురించి వినగానే వారు కడదాకా అనుసరించిన స్నేహధర్మం గుర్తుకు వస్తుంది. ఇలా సమాజం హర్షించే విలువలను పాటిస్తే అందరిలో గుర్తింపు పొందవచ్చు.

6. సామర్థ్యాల సంపూర్ణ వినియోగం: తనకు ఏమేం సామర్థ్యాలున్నాయో గుర్తించడంతోపాటు వాటిని పూర్తిగా వినియోగించుకునే కార్యాలను తలపెట్టాలి. ఉద్యోగసాధన, ఉద్యోగ ఉన్నతి, వ్యాపారం... ఇలా ఏ కార్యం తలపెట్టినా అందులో తన సామర్థ్యాలన్నింటినీ వినియోగించి అనుకున్న సమయంలో సాధించే యత్నం చేయాలి.

వీటన్నింటి సమాహారమే స్వీయ నిర్వహణ. ఈ లక్షణాలపై తొలుత అవగాహన పెంచుకుంటే క్రమేపీ సాధన ద్వారా అలవరచుకోవచ్చు. జీవన నైపుణ్యాల్లో ఒకటైన స్వీయ నిర్వహణ ద్వారా లక్ష్యసాధన దిశగా దూసుకు వెళ్లవచ్చు!
 

Posted Date: 11-01-2021


 

స్వీయ అవగాహన

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం