• facebook
  • whatsapp
  • telegram

CIVILS: మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగం వదిలి.. ప్రజాసేవకు కదిలి.. 

‣ మూడు సార్లు విఫలమైనా గురి తప్పలేదు..శ్యామలాసెంటర్‌, న్యూస్‌టుడే: కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదువు.. నాలుగో ఏడాదిలోనే ప్రాంగణ ఎంపికల్లో సాఫ్ట్‌వేర్‌ కొలువు.. రూ.లక్షల జీతం.. అంతటితో ఆగలేదు ఆమె. సమాజానికి సేవచేయాలనే ఉద్దేశంతో ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు సాధన ప్రారంభించారు. మూడుసార్లు విఫలమై నాలుగోసారి లక్ష్యం చేరుకున్నారు రాజమహేంద్రవరానికి చెందిన అడుసుమిల్లి మౌనిక. అఖిలభారత స్థాయిలో 487వ ర్యాంకు సాధించింది.


ఇంజినీరింగ్‌ చదువుతుండగానే కొలువు..

మౌనిక స్వస్థలం విజయవాడ అయినా.. రాజమహేంద్రవరంలో స్థిరపడ్డారు. తండ్రి ఎ.వెంకటప్రేమ్‌చంద్‌ రెస్టారెంట్‌ నిర్వహిస్తుండగా తల్లి సునీత గృహిణి. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ వరకు విజయవాడలో చదివి బిట్స్‌ పిలానీ (హైదరాబాద్‌)లో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ (2014-18) నాలుగో ఏడాదిలోనే మైక్రోసాఫ్ట్‌ (బెంగళూరు)లో కొలువు సాధించారు. వారాంతపు సెలవు దినాల్లో మొక్కలు నాటడం, వృద్ధాశ్రమాలు సందర్శించడం.. ఉద్యోగం చేస్తూనే ఏడాది శిక్షణతో సివిల్స్‌ రాశారు.


తొలి ప్రయత్నాలు విఫలమైనా..

మొదటి మూడు ప్రయత్నాల్లో విఫలమైనా కుంగిపోలేదు. సొంతంగా సాధన చేస్తూనే ఆన్‌లైన్‌లో నమూనా పరీక్షలు రాయడం, గతంలో దొర్లిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం, ఒక ప్రశ్నకు జవాబు కొత్తదనంగా సమగ్ర సమాచారాన్ని జోడించి ఏవిధంగా రాయాలో నేర్చుకొని నాలుగోసారి ప్రయత్నించి సఫలమయ్యారు. 20 నిమిషాల ఇంటర్వ్యూ సమయంలో అతి క్లిష్టమైన ప్రశ్నలను ఎదుర్కొన్నానని, లక్షలు వచ్చే కొలువును వదిలి సివిల్‌ సర్వీసెస్‌కు ఎందుకు వచ్చావని, ఏపీ విభజనతో వచ్చే లాభనష్టాలు వంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చిందని మౌనిక పేర్కొన్నారు. ఇకపై ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా చెబుతున్నారు.


నాన్న కలే.. నా సంకల్పమైంది..


 

జగ్గంపేట, న్యూస్‌టుడే: సివిల్స్‌లో ర్యాంకే లక్ష్యంగా మొదటిసారి పరీక్ష రాస్తే ఆశించిన ఫలితం రాలేదు.. రెండోసారి ప్రయత్నిస్తే 314 ర్యాంకుతో ఇండియన్‌ పోస్టల్‌ సర్వీసులో ఉద్యోగం సాధించారు. మరోసారి ఇండియన్‌ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీసు ఉద్యోగం సాధించారు. అదే సంవత్సరంలో ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసుకి ఎంపికయ్యారు. తాజా ఫలితాల్లో 162వ ర్యాంకు సాధించిన జీను జశ్వంత్‌ ‘న్యూస్‌టుడే’తో తన అనుభూతులను పంచుకున్నారిలా.. జగ్గంపేటకు చెందిన ఆయన మూడేళ్లు బెంగళూర్‌లో శాంసంగ్‌లో ఉద్యోగం చేస్తూ 2020 నుంచి ప్రయత్నాలు చేస్తూ లక్ష్యం  సాధించారు.


తండ్రి లక్ష్యమే అతని ముందున్న గురి..

రెండు సార్లు సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించినా సంతృప్తి లేదు. సివిల్‌ సర్వెంట్‌ కావాలనే తండ్రి జీను మాణిక్యాలరావు లక్ష్యాన్ని నెరవేర్చాలనే సంకల్పంతో ముందుకు సాగా. మంగళవారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో 162 ర్యాంకుతో మెరిసి తండ్రి చిరకాల కలను నెరవేర్చాడు జగ్గంపేటకు చెందిన జీను శ్రీ జశ్వంత్‌ చంద్ర. ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్నారు. అయితే ఈ ఆనందాన్ని పంచుకోవడానికి ఆ తండ్రి లేడు. 2021లో అనారోగ్యంతో మరణించారు.


బాల్యమంతా కాకినాడలోనే

జీను జశ్వంత్‌ బాల్యం కాకినాడలోనే సాగింది. తల్లి జీను నాగలక్ష్మి కాకినాడలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు.  తాతయ్య విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు గొల్లపల్లి లక్ష్మణరావు. జస్వంత్‌ కాకినాడ ఆశ్రమ్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఐఐటీ కాన్పూర్‌లో కంప్యూటర్‌ సైన్సు చేసి 2018లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.


గెలుపు కథ రాసుకున్నారు!

వైఫల్యం జీవితాన్ని అగాథంలోకి నెట్టేస్తుంది.. నిరాశలో ముంచేస్తుంది. కానీ అదే ఫెయిల్యూర్‌ జీవితానికో పాఠం నేర్పిస్తుంది. గొప్ప గెలుపునీ అందిస్తుంది... అని నిరూపించారీ సివిల్స్‌ విజేతలు. చక్రాల కుర్చీకే పరిమితం అయినా, కోరుకున్న కెరియర్‌ దూరమైనా పట్టువిడవక ఓటమిపై సమరం చేసిన స్ఫూర్తిదాతలు వీరంతా!  


అమ్మ కల కోసం..

సెరిబ్రల్‌ పాల్సీ... ఎటూ కదల్లేని స్థితి. సరిగ్గా మాట్లాడలేరు, వినలేరు... కొందరిలో మెదడూ పూర్తిగా పనిచేయదు. అందుకే ఈ వ్యాధి అని తెలియగానే చాలామంది జీవితం మీద ఆశను కోల్పోతారు. కానీ 23 ఏళ్ల ఏ.కే సారిక మాత్రం మరింత పట్టుదలగా చదివి, యూపీఎస్సీ ర్యాంకు సాధించింది. అమ్మకోసం కలెక్టర్‌ని కావాలనుకున్నా అంటోన్న ఆమెను వసుంధర పలకరించగా... 

మాది కేరళ, కీళరియూర్‌లోని వటకర. మధ్యతరగతి కుటుంబం. నాన్న శశికి ఖతార్‌లో ఉద్యోగం. అమ్మ రాజి. పుట్టబోయే పిల్లలను బాగా చదివించాలని అమ్మ కలలు కనేదట. తొలి కాన్పులో సెరిబ్రల్‌ పాల్సీతో నేను పుట్టాను. నడుం కింది భాగం, కుడిచేయి పనిచేయవు. జీవితాంతం చక్రాల కుర్చీలోనే గడపాలి. ఈ విషయం తెలిసినా అమ్మ ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు, నాముందు ఎన్నడూ కంటతడి పెట్టలేదు. ఇంత వైకల్యంతో పుట్టిన ఆడపిల్లనెలా పెంచగలవని బంధువులంతా ఎత్తిపొడిచినా పట్టించుకోలేదు. నడవలేకపోతేనేం... సమాజంలో ఉన్నతస్థానంలో నిలబడాలంటూ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ... నా నీడలా మారింది.

నన్ను బాగా చదివించాలని అమ్మానాన్న ఇంటికి దగ్గరలో స్కూల్‌లో చేర్పించారు. ఆటోలో దింపడం, సాయంత్రం తీసుకెళ్లడం అమ్మే చూసుకునేది. చిన్నప్పటి నుంచీ మంచి మార్కులే వచ్చేవి. కుడిచేయి పూర్తిగా పనిచేయకపోవడంతో ఎడమచేతితో రాయడం నేర్చుకున్నా. స్కూల్లో పిల్లలంతా ఆడుకుంటుంటే నేను మాత్రం పుస్తకాల పురుగులా సమయాన్నంతా చదువుకు కేటాయించేదాన్ని. నా సమయాన్నంతా చదువుకే కేటాయించేదాన్ని. అలా ఇంటర్‌ పూర్తిచేశా. నా వ్యక్తిగత పనులకూ అమ్మపైనే ఆధారపడుతోంటే ఏడుపొచ్చేది. నాకోసం తన జీవితాన్నే అంకితం చేసిన అమ్మకు తిరిగి ఏదైనా చేయాలనిపించేది. అదే నాకు ‘సివిల్స్‌’ లక్ష్యాన్నిచ్చింది. అమ్మకు కానుకగా కలెక్టరునై చూపించాలనుకున్నా. 


ఉచిత శిక్షణతో...

డిగ్రీ చదవాలంటే ఇంటికి ఎనిమిది కిలోమీటర్ల దూరం వెళ్లాలి. నర్సరీ పిల్లల మాదిరి అమ్మ నన్ను రోజూ కాలేజీకి తీసుకెళ్లేది. ఆటోలో దింపి, నా స్నేహితులకు జాగ్రత్తలు చెప్పి వెళ్లేది. అందరిలా నేను వేగంగా నోట్స్‌ రాయలేను. అందుకే ముందుగానే పాఠ్యాంశాలు చదువుకునేదాన్ని. అధ్యాపకులు, స్నేహితులు ప్రోత్సహించేవారు. అలా బీఏ ఇంగ్లిష్‌ లిటరేచర్‌ పూర్తిచేసి మొదటిసారి సివిల్స్‌కు హాజరయ్యా. శిక్షణలేక మెయిన్స్‌ పాసవ్వలేకపోయా. దాంతో తీవ్ర ఒత్తిడికీ ఆందోళనకీ గురయ్యా. ‘ఈసారి గట్టిగా ప్రయత్నించు, సాధించగల’వని అమ్మ చెప్పేది. అప్పుడు ‘ఆబ్జల్యూట్‌ ఐఏఎస్‌ అకాడమీ’ స్థాపకులు డాక్టర్‌ జాన్‌ ఎస్‌.కొట్టారం నిర్వహిస్తున్న ‘చిత్రశలభం’ ప్రాజెక్టులో చేరా. వైకల్యంతో బాధపడే నాలాంటివారికి ఆయన ఉచిత శిక్షణ ఇస్తున్నారు. మెంటార్‌గా ఆయన అందించిన సహకారం మర్చిపోలేను. నిరాశకు గురైనప్పుడల్లా ఎంతో ధైర్యాన్నిచ్చారు. రోజుకి ఎనిమిదిగంటలు చదివేదాన్ని. తొలి వైఫల్యం నుంచి నేర్చుకున్న పాఠాలతో గతేడాది సివిల్స్‌కు రెండోసారి హాజరై పాసయ్యాను. 922వ ర్యాంకు సాధించి, నా శిక్షకుడు డాక్టర్‌ జాన్‌, అమ్మానాన్నలను గర్వపడేలా చేశా. పట్టుదల ఉంటే వైకల్యం మనల్ని ఓడించలేదు. దానికి నేనే ఉదాహరణ. ఉన్నతస్థానాన్ని అందుకోవాలనే అమ్మ కోరిక తీర్చా. కలెక్టరునై, సమాజంలో నాలాంటివాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలి అనుకుంటున్నా. అందరికీ నేను చెప్పేదేంటంటే... ఓటమిని అంగీకరించొద్దు. లక్ష్యాన్ని వదులుకోవద్దు..!


‘హనిత’ర సాధ్యమైంది..! 

ఆడుతూ పాడుతూ సాగిపోతున్న జీవితం... హఠాత్తుగా అనుకోని వ్యాధితో మంచానపడితే? రెండేళ్లు చీకటి గదిలోనే గడపాల్సి వస్తే? మరొకరైతే నిరాశలో కూరుకుపోతారు. తను మాత్రం సమస్య నుంచే సమాధానం వెతుక్కుంది. సివిల్స్‌కి వీల్‌ఛైర్‌లోనే సిద్ధమై తాజా యూపీఎస్సీ ఫలితాల్లో 887వ ర్యాంకు సాధించింది వేములపాటి హనిత..

‘మాది విశాఖపట్నం. నాన్న రాఘవేంద్రరావు రైల్వేలో, అమ్మ ఇందిర ఐసీడీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఫిట్జీలో ఇంటర్‌ పూర్తిచేసి 91శాతం మార్కులు సాధించాను. ఖరగ్‌పూర్‌ ఐఐటీలో అగ్రికల్చరల్‌ అండ్‌ ఫుడ్‌ ఇంజినీరింగ్‌లో చేరా. అప్పటివరకు నా ప్రయాణం సాఫీగా సాగింది. ఐఐటీ మొదటి ఏడాదిలో ఓ రోజు తీవ్రమైన వెన్నునొప్పితో కాళ్లు రెండూ తిమ్మిర్లెక్కి పడిపోయాను. కదల్లేని పరిస్థితి. కొన్నిరోజులకి నాకున్న సమస్యని ట్రాన్స్‌వెర్స్‌ మైఎలైటిస్‌ ఆటోఇమ్యూన్‌ డిసీజ్‌ (వెన్నెముక సంబంధిత వ్యాధి) అంటారని తెలిసింది. అమ్మా, నాన్న పెద్ద ఆసుపత్రులన్నీ తిప్పారు. ఫలితం లేదు. జీవితాంతం ఇలా చక్రాల కుర్చీకి పరిమితం కావాల్సిందే అన్నప్పుడు, వాళ్లు చాలా బాధ పడ్డారు. నాకే ఎందుకిలా జరిగిందని కుమిలిపోయాను. రెండేళ్లు గదిలోంచి బయటికే రాలేదు. వెలుతుర్ని చూడడానికే భయపడేదాన్ని. మా గురువు గారు నన్ను ఆశీర్వదిస్తూ వదిలేసిన చదువును కొనసాగించు. పోటీ పరీక్షలకు ప్రయత్నించమన్నారు. అప్పటి నుంచి తిరిగి చదువుపై దృష్టిపెట్టా. ఐఐటీ పూర్తిచేసే అవకాశం లేకపోవడంతో దూరవిద్యలో డిగ్రీ కట్టాను. మొదటి రెండేళ్లు ఫెయిల్‌. ఆఖరి ఏడాది మాత్రం ఒకేసారి అన్నీ కలిపి రాసి పాసయ్యాను. అప్పటి వరకు ఇంటి నుంచి బయటకే రాలేదు. 2020లో మొదటిసారి సివిల్స్‌ ప్రిలిమ్స్‌ రాసి.. మెయిన్స్‌ అర్హత సాధించాను. పరీక్షా కేంద్రం హైదరాబాద్‌. నాన్న బలవంతంతో కష్టపడి రాసినా మెయిన్స్‌లో ఫెయిల్‌. ఆ తర్వాతా అలాంటి వైఫల్యాలే. మా తాతగారి ప్రోత్సాహంతో గ్రూప్స్‌ రాసి, వైద్యారోగ్యశాఖలో పర్యవేక్షణాధికారిగా ఉద్యోగం సాధించా. ప్రస్తుతం విశాఖలో మానసిక ఆసుపత్రి, డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏవో ట్రైనీ అధికారిగా పనిచేస్తున్నా. ఓవైపు పనిచేస్తూనే, యూపీఎస్సీ సాధన చేశా. నాలుగో ప్రయత్నంలో మెయిన్స్‌ క్లియర్‌ చేశా. హైదరాబాద్‌లోని బాలలతా మేడమ్‌ మాక్‌ ఇంటర్వ్యూలకూ హాజరయ్యా. 887వ ర్యాంకు వచ్చింది. చీకటి వెంటే వెలుగు ఉంటుందన్న మా తాతగారి మాటలే నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చాయి. నాలాంటి వారికి అండగా ఉండాలన్నదే నా కల.


బ్యాడ్మింటన్‌ కోర్టు దాటి... 

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి... 56 జాతీయ, 19 అంతర్జాతీయ పతకాలు... ప్రపంచంలోనే 34వ ర్యాంకు ఆమె సొంతం. అలాంటమ్మాయి ఆటకు దూరమైతే? నిరాశే. కానీ ఒలింపిక్‌ పతక కల చేజారినా... కూహూ సివిల్స్‌ లక్ష్యం సాధించింది.

ఈమెది దేహ్రాదూన్‌. కొవిడ్‌ సమయంలో ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు మోకాలికి గాయమైంది. శస్త్రచికిత్స చేసినా కొన్నేళ్లపాటు మైదానంలోకే అడుగుపెట్టొద్దు అన్నారు వైద్యులు. తొమ్మిదో ఏట నుంచి ఆటే లోకం. ఒక్కసారిగా దానికి దూరం అవ్వడాన్ని కూహూ తట్టుకోలేకపోయింది. ఒకరకంగా కుంగిపోయింది. అప్పుడు చదువుపై దృష్టిపెట్టమని సలహా ఇచ్చారు ఇంట్లోవాళ్లు. అదీ కూహూ తరం కాలేదు. అప్పుడు వాళ్ల నాన్న అశోక్‌ కుమార్‌ ఏవైనా స్ఫూర్తి కథనాలు చదవమని సలహా ఇచ్చారు. కానీ కూహూకి చిన్నప్పట్నుంచీ నాన్నే స్ఫూర్తి. ఆయన డీజీపీ. ఎందరికో సాయపడి యువతలో పేరూ తెచ్చుకున్నారు. అప్పుడు ‘నాన్నా నేనూ నీలా అవ్వొచ్చా’ అనడిగిందట. దానికి చాలా కష్టపడాలి అన్నారట ఆయన. ‘ఇప్పటిదాకా మైదానంలో శ్రమించా. ఇప్పుడు పుస్తకాల వంతు’ అని చెప్పడమే కాదు... డిగ్రీతోపాటు దీనికీ సీరియస్‌గా సిద్ధమవడం మొదలుపెట్టింది. కూతురి పట్టుదల చూసిన ఆయన మెటీరియల్‌ తయారీ, అర్థం కాని అంశాలను విశ్లేషించి చెప్పడం వంటి విషయాల్లో సాయం చేశారు. కూహూ శ్రమ ఫలించి, తాజాగా అఖిల భారతస్థాయిలో 178వ ర్యాంకు సాధించింది. ఆమె ప్రయాణాన్ని అశోక్‌ కుమార్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేయడమే కాదు... ఆమెను చూసి గర్వపడుతున్నా అని రాసుకొచ్చారు. ఆట కారణంగా కూహూకి సరిగా కాలేజీకి వెళ్లడం కుదరలేదు. అలాంటి ఆమెకు గంటలకొద్దీ చదవడం ఇబ్బందే. అయినా పట్టుదలగా ప్రయత్నించి, మంచి ర్యాంకు సాధించడం గొప్పే కదూ!

 


 

 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

‣ ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

‣ నిర్ణయాలు తీసుకునేముందు..

‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!

Posted Date: 18-04-2024


 

పోటీ పరీక్షలు

మరిన్ని