• facebook
  • whatsapp
  • telegram

JEE : జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా

* జేఈఈ విద్యార్థుల మనోగతాలు

విశాఖపట్నం(కార్పొరేషన్‌),(గోపాలపట్నం), న్యూస్‌టుడే: జాతీయ పరీక్షల విభాగం(ఎన్‌టీఏ) ఏప్రిల్‌ 24న అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. అందులో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వివిధ జిల్లాల విద్యార్థులు తమ మనోగతాలను వెల్లడించారు.

ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతా..

-చింతు సతీష్‌కుమార్‌, 8వ ర్యాంకు


మాది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. ఆలిండియా ఓపెన్‌లో 8, కేటగిరి విభాగంలో 2వ ర్యాంకు సాధించా. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. విశాఖలో ఇంటర్‌ (సీబీఎస్‌ఈ)చదివాను. పదో తరగతి సీబీఎస్‌ఈలో 472 మార్కులు సాధించా. పదో తరగతిలోనే ఇంటర్‌ గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రంలలో ముఖ్యమైన పాఠ్యాంశాలను అధ్యయనం చేశా. ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించడానికి ప్రణాళిక రూపొందించుకున్నా. నిత్యం 14 గంటలకుపైగా చదివా. ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతా.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అవుతా..

-రెడ్డి అనిల్‌, 9వ ర్యాంకు

 

నాకు ఆలిండియా స్థాయిలో 9వ ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. మేము విశాఖలోని 92వ వార్డు ఇందిరానగర్‌లో ఉంటున్నాం. మా నాన్న డిఫెన్స్‌ సివిలియన్‌గా పని చేస్తున్నారు. అమ్మ గృహిణి. చిన్నప్పటి నుంచి పట్టుదలతో అన్ని పాఠ్యాంశాలు శ్రద్ధగా చదివేవాడిని. సరైన ప్రణాళిక, నిరంతర సాధనతోనే మంచి ర్యాంకు వచ్చింది. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడాలని ఉంది.
 

అంకుర సంస్థలు స్థాపిస్తా..

-మురికినాటి దివ్యతేజరెడ్డి, 15వ ర్యాంక్‌

మాది అనంతపురం జిల్లా ఎన్‌పీ కుంట. నాకు 15వ ర్యాంకు వచ్చింది. ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్‌ తీసుకున్న తర్వాత ఐఐటీ బాంబేలో చదవాలని అనుకున్నా. 8వ తరగతి నుంచే ఇంజినీరింగ్‌ చదువుపై ఆసక్తి కలిగింది. ప్రతి సబ్జెక్టులో ముఖ్యాంశాలను రాసుకుని, వాటిని పదేపదే చదువుకున్నా. ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష రాశా. మా నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ గృహిణి. చదువు పూర్తయ్యాక అంకుర సంస్థలను స్థాపించాలని అనుకుంటున్నా.

ఐఏఎస్‌ లక్ష్యంగా పెట్టుకున్నా..

-తవ్వా దినేష్‌, 24వ ర్యాంక్‌

మాది కడప పట్టణం. నాకు 24వ ర్యాంకు వచ్చింది. నాన్న జైళ్ల శాఖలో అధికారిగా పనిచేస్తున్నారు. కడపలోనే పదో తరగతి వరకు చదివా. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం నుంచే ప్రణాళిక ప్రకారం సిలబస్‌ను పూర్తి చేయడం, పునశ్చరణ చేయడంతో పాటు అన్ని అంశాలపై అవగాహన పెంచుకున్నా. ఐఐటీ బాంబేలో చదువు పూర్తిచేశాక ఐఏఎస్‌ సాధించాలన్నదే నా లక్ష్యం.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలని..

-రితేష్‌ బాలాజీ, 39 ర్యాంక్‌

ఆలిండియా ఓపెన్‌ కేటగిరిలో 39వ ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. మాది ప్రకాశం జిల్లా. నాన్న వ్యాపారి. అమ్మ గృహిణి. హైదరాబాద్‌లో ప్రైవేట్‌ సంస్థలో శిక్షణ తీసుకున్నా. సందేహాలను ఎప్పటికప్పుడు అధ్యాపకులతో నివృత్తి చేసుకున్నా. ఐఐటీలో చేరి, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలన్నదే లక్ష్యం.

Posted Date: 26-04-2024


 

ఇత‌రాలు

మరిన్ని