• facebook
  • whatsapp
  • telegram

‘ఉచిత’ భారానికి సౌర విద్యుత్‌ పరిష్కారం

వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అంశం ఇటీవలి కాలంలో బాగా చర్చల్లో నిలుస్తోంది. నాసిరకం మోటార్ల వల్ల కరెంటు అధికంగా వృథా అవుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు పక్కాగా వినియోగ వివరాలు లేకుండా కాకిలెక్కలతో డిస్కమ్‌లు ప్రభుత్వాల నుంచి భారీగా వసూలు చేస్తున్నాయి. ఈ తరుణంలో వ్యవసాయ బోర్లకు సౌర విద్యుత్తును వినియోగించడం వల్ల ప్రజాధనాన్ని ఆదా చేయవచ్చు. పర్యావరణానికీ మేలు కలుగుతుంది.

దేశంలో వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా ఉంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల రైతులకు రోజంతా నిరంతర సరఫరా జరుగుతోంది. వ్యవసాయానికి అత్యంత కీలకమైన పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో కేవలం ఏడెనిమిది గంటలే ఇస్తున్నారు. ఏపీ, తెలంగాణలో రైతులకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తుంటే, పేద రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌ వంటి చోట్ల రైతుల నుంచి కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నారు. తమకు అధికారం ఇస్తే దేశవ్యాప్తంగా వ్యవసాయ బోర్లకు రోజంతా ఉచితంగా కరెంటు ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటించారు. ఉచిత సరఫరా వల్ల ఏటా రూ.1.45 లక్షల కోట్ల వ్యయం అవుతుందని, అది దేశానికి పెద్ద ఆర్థికభారం కూడా కాదని ఆయన వివరించారు. ఇది సాధ్యమేనా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రెండు కోట్ల 20 లక్షల వ్యవసాయ బోర్లకే కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. వాటికి కొన్ని రాష్ట్రాల్లోనే రోజంతా కరెంటు ఇస్తున్నారు. దేశమంతటా అన్ని కనెక్షన్లకూ రోజంతా ఉచితంగా సరఫరా చేస్తే ఆ వ్యయం రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయి. దేశంలో మొత్తం కరెంటు వినియోగంలో వ్యవసాయానికి వాడే జాతీయ సగటు ప్రస్తుతం 20శాతంలోపే ఉంది. రోజంతా విద్యుత్‌ ఇచ్చే తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అది 30శాతం దాటుతోంది.

పక్కా లెక్కలు కరవు

దేశంలో వ్యవసాయానికి నిత్యం ఎంత కరెంటు వినియోగిస్తున్నారనేది అంచనాతో వేసే లెక్కే. పక్కా గణన లేదు. ఇలా గణించడానికే ప్రతి వ్యవసాయ బోరు మోటారుకు స్మార్ట్‌ మీటరు పెట్టాలని కేంద్రం ఇటీవల విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు ముసాయిదా విడుదల చేసింది. తెలంగాణ సహా పలు రాష్ట్రాలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గింది. బోరు మోటారుకు మీటరు పెట్టకపోయినా, కనీసం ట్రాన్స్‌ఫార్మర్ల వద్దనైనా ఏర్పాటు చేసి, ఎంత సరఫరా అవుతుందనేది యూనిట్ల వారీగా లెక్కించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచిస్తోంది. పలు రాష్ట్రాలు దానికీ ససేమిరా అంటున్నాయి. నాసిరకం మోటార్లను రైతులు బోర్లకు బిగించడం వల్ల అవి ఎక్కువ కరెంటును వినియోగిస్తున్నాయి. ‘భారత ఇంధన సామర్థ్య సేవల సంస్థ’(ఈఈఎస్‌ఎల్‌) కర్ణాటకలో 590 వ్యవసాయ పంపుసెట్లకు ‘ఇంధన సామర్థ్య వినియోగ కొత్త మోటార్ల’ (ఈఈపీఎస్‌)ను అమర్చి ప్రయోగాత్మకంగా అధ్యయనం చేసింది. పాత మోటార్లతో పోలిస్తే ఈఈపీఎస్‌ల ఏర్పాటు తరవాత ఏకంగా 37శాతం కరెంటు ఆదా అయినట్లు తేలింది. మహారాష్ట్రలోని సోలాపుర్‌ సర్కిల్‌ పరిధిలోనూ పలు పద్ధతులతో కరెంటును ఆదా చేసినట్లు తెలిసింది. వ్యవసాయ కరెంటు డిమాండు నిర్వహణ అనేది విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు అత్యంత ముఖ్యమైన అంశం. దాన్ని పట్టించుకోకపోతే దేశంలో వ్యవసాయ మోటార్లకు సరఫరా పేరిట లెక్కిస్తున్న కరెంటులో మూడోవంతు వృథా అవుతున్నట్లు మహారాష్ట్ర, కర్ణాటకలో జరిపిన పరిశీలనల్లో తేలింది.

ప్రజాధనం ఆదా

ప్రస్తుతం వ్యవసాయ బోర్లకు దేశవ్యాప్తంగా ఏడాదికి సుమారు 22,750 కోట్ల యూనిట్ల కరెంటును సరఫరా చేస్తున్నారు. సౌరవిద్యుత్‌ ఏర్పాట్లతో ఇదంతా మిగిలిపోతుంది. దీన్ని పరిశ్రమలకు, గృహావసరాలకు మళ్లించవచ్చు. ఒకసారి వ్యవసాయ బోరుకు సౌరవిద్యుత్‌ను ఏర్పాటు చేసుకుంటే దాదాపు పాతికేళ్లపాటు ఉచితంగా కరెంటును సౌరశక్తి ద్వారా పొందవచ్చు. అప్పుడిక ఏటా వ్యవసాయ మోటార్ల కరెంటు బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వాలుగాని, రైతులుగాని రుసుములు చెల్లించాల్సిన అవసరమే ఉండదు. వ్యవసాయానికి భారీగా కరెంటు ఇస్తున్నామని తప్పుడు లెక్కలు చూపుతూ, ఏటా వేల కోట్ల రూపాయలను దండుకుంటున్న డిస్కమ్‌ల మోసాలకూ అడ్డుకట్ట వేయవచ్చు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌మీటర్లు పెట్టేదే లేదని కేంద్రానికి స్పష్టం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు వాస్తవిక ధోరణితో ఆలోచించి సౌరవిద్యుత్‌ సదుపాయాలను కల్పిస్తే, స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు అవసరమే ఉండదు. పెద్దయెత్తున ప్రజాధనాన్నీ మిగుల్చుకోవచ్చు. పైగా వ్యవసాయానికి పూర్తిగా సౌరవిద్యుత్తునే వాడటం వల్ల ఏటా సాధారణ కరెంటు మిగిలిపోతుంది. తద్వారా భారీస్థాయిలో బొగ్గును మండించాల్సిన అవసరం ఉండదు. బొగ్గు దిగుమతుల కోసం విదేశాలకు చెల్లింపులు చేయాల్సిన ఆర్థికభారం తప్పుతుంది. కాలుష్యమూ తగ్గి పర్యావరణ పరిరక్షణా సుసాధ్యమవుతుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగిన సౌరవిద్యుత్‌ దిశగా మొగ్గు చూపడం మేలు. అలాకాకుండా బొగ్గును మండిస్తూ, కాలుష్యాన్ని వెదజల్లుతూ ఉత్పత్తి చేసే సాధారణ కరెంటునే ఏటా కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి, వ్యవసాయానికి ఉచితంగా అందించడం వల్ల ప్రజలకు జరిగే మేలెంత అనేది పాలకులు ఆలోచించాలి.

భారీగా చెల్లింపులు

వ్యవసాయానికి కరెంటును ఉచితంగా లేదా తక్కువ ఛార్జీలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతుండటంతో డిస్కమ్‌లు ఏటా వేలకోట్ల రూపాయల సొమ్మును రాయితీల పేరుతో వసూలు చేస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి ఇస్తున్న కరెంటు రుసుముల కింద రెండు తెలుగు రాష్ట్రాలు రూ.17 వేల కోట్లను డిస్కమ్‌లకు చెల్లించాలని అంచనా. ఎన్ని యూనిట్ల కరెంటును వ్యవసాయానికి వాడుతున్నారనే లెక్కలను మీటర్లు అమర్చి పక్కాగా సేకరించకుండా, కాకిలెక్కలతో వేల కోట్ల రూపాయలను డిస్కమ్‌లు వసూలు చేస్తున్నాయి. దానివల్ల ప్రజాధనం సద్వినియోగం కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మహారాష్ట్రలో వ్యవసాయానికి ఇస్తున్న కరెంటు పేరుతో వేల కోట్ల రాయితీని డిస్కమ్‌లు ఏళ్ల తరబడి అధికంగా వసూలు చేస్తున్నాయని ఆ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) జరిపిన క్షేత్రస్థాయి అధ్యయనంలో తేలింది. వాస్తవానికి ప్రతి రాష్ట్ర ఈఆర్‌సీ ఇలాంటి పరిశీలనలు జరిపి, ఎంత కరెంటు ఎలా వినియోగం అవుతోందన్నది శాస్త్రీయంగా తేల్చాలి. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలి. ఈఆర్‌సీ పాలక వర్గాల్లో రాజకీయ నియామకాల వల్ల అవి మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నాయి.

- మంగమూరి శ్రీనివాస్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆర్కిటిక్‌... మన ప్రయోజనాలకు కీలకం!

‣ నాగాలతో సయోధ్య మంత్రం

‣ భారత్‌ - ఇటలీ స్నేహబంధం

‣ వాతావరణ మార్పులు.. జనజీవనం తలకిందులు

‣ ఇరకాటంలో గుజరాత్‌ సర్కారు

Posted Date: 03-10-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని