• facebook
  • whatsapp
  • telegram

పంటల వైవిధ్యం... పోషకాహార భద్రత!

వ్యవసాయంలో పంటల వైవిధ్యం కీలకం. ఇది క్రమంగా క్షీణిస్తుండటంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం ఆహారభద్రతకు ముప్పుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

గతంలో వివిధ పంటలకు సంబంధించి ఎన్నో రకాల వంగడాలను రైతులు సాగు చేసేవారు. తమ పొలాల్లో ఒకే సమయంలో వేర్వేరు రకాల పంటలు పండించేవారు. కాలక్రమంలో ఈ పంట వైవిధ్యం దెబ్బతింది. అనాదిగా వస్తున్న ఎన్నో రకాల వంగడాలు నేడు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం దేశీయంగా వరి, గోధుమ, ఇతర వాణిజ్య పంటలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. ఫలితంగా పప్పుధాన్యాల ఉత్పత్తి తగ్గిపోతోంది. 1900 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా పంట వైవిధ్యానికి 75శాతం మేర నష్టం వాటిల్లినట్లు ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) వెల్లడించింది. మానవులు తినే మొత్తం ఆహారంలో 60శాతం ప్రస్తుతం మూడు రకాల పంటల నుంచే ఉత్పత్తి అవుతోంది. థాయ్‌లాండ్‌లో గతంలో పదహారు వేల వరి రకాలు ఉండేవి. నేడు వాటి సంఖ్య 37కు పడిపోయింది. పంటల్లో వైవిధ్యం లేకపోవడమంటే, ఒకటి రెండు రకాలపైనే అధికంగా ఆధారపడుతున్నామని అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఆహార వ్యవస్థ ప్రస్తుతం ఇదే మార్గంలో పయనిస్తోంది.

ఆంగ్లేయుల పాలనా కాలంలో ఇండియాలో పంట వైవిధ్యం భారీగా దెబ్బతింది. బ్రిటిష్‌ వారు దేశీయ పంటలను పట్టించుకోకుండా తమ లాభాలను పెంచుకోవడానికి వాణిజ్య పంటల సాగును ప్రోత్సహించారు. 1960లో వచ్చిన హరిత విప్లవం దేశానికి ఆహార భద్రతను అందించింది. అదే సమయంలో స్థానిక పంటల వైవిధ్యానికి నష్టం వాటిల్లింది. 2018-19 నాటికి పంజాబ్‌ మొత్తం పంట విస్తీర్ణంలో వరి, గోధుమల వాటా 84.6శాతం. ఇది 1960-61లో 32శాతమే. గోధుమ, వరి అధికంగా పండించడం వల్ల పప్పుధాన్యాలు, మొక్కజొన్న, జొన్న, సెనగ, కంది, ఆవాలు, పొద్దుతిరుగుడు, వేరుసెనగ, చెరకు తదితర పంటల సాగు గణనీయంగా తగ్గింది. పంట వైవిధ్యం దెబ్బతినడంతో ఐరన్‌, ప్రొటీన్లు అధికంగా ఉండే వరి రకాలను తమిళనాడు కోల్పోయింది. వరదలను తట్టుకోగల కట్టుయానం వంటి రకాలు ఉప్పు, క్షార నేలల్లో సైతం పండేవి. అవి దాదాపు అంతర్ధానమయ్యాయి. 1970 వరకు ఇండియాలో లక్షకు పైగా వరి రకాలు ఉండేవి. పంట వైవిధ్యం దెబ్బతినడంతో అవి ప్రస్తుతం ఆరు వేలకు పడిపోయాయి. 1960 నుంచి 2010 మధ్య కాలంలో కేరళలో సంప్రదాయ వరి రకాలు 70శాతం దాకా క్షీణించాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కర్హానీ వరి రకం, మధ్యకర్ణాటక, మహారాష్ట్రలోని మోఠ్‌ బీన్స్‌ (ఒక రకమైన చిక్కుడు), ఛత్తీస్‌గఢ్‌లో కొర్రలు, సజ్జలు, ఒడిశాలో జొన్న వంటి వాటికి సంబంధించి అనేక వాతావరణ అనుకూలమైన, అత్యధిక పోషకాలు కలిగిన స్థానిక వంగడాలు అంతరించిపోయాయి. ఇవే కాకుండా అనేక పంటలకు సంబంధించిన దేశీయ రకాలు కనుమరుగయ్యాయి. పరిశోధనతో పాటు సరైన వ్యూహం లేకపోవడం, గోధుమ, వరి సాగును అధికంగా ప్రోత్సహించడం వంటివి పంట వైవిధ్యాన్ని దెబ్బతీశాయి. పత్తి, చెరకు వంటి వాణిజ్య పంటల విస్తీర్ణం పెరగడం, జన్యు మార్పిడి విత్తనాలను ప్రవేశపెట్టడం వల్లా సంప్రదాయ వంగడాల సాగును అన్నదాతలు వదిలిపెట్టారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు పంట వైవిధ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంటల వైవిధ్యం నేల ఆరోగ్యం, నాణ్యతను మెరుగుపరుస్తుంది. చీడపీడలను తగ్గిస్తుంది. రసాయన ఎరువులు, కలుపు నివారణ మందులు, క్రిమిసంహారాలపై అధికంగా ఆధారపడటాన్ని తప్పిస్తుంది. ఏటా ఒకే పంటను సాగుచేయడం వల్ల చాలా అనర్థాలు కలుగుతాయి. ముఖ్యంగా పంటల దిగుబడి తగ్గుతుంది. చీడపీడలు ఆశించే ప్రమాదం పెరుగుతుంది. నేల పోషకాల్లో అసమతుల్యత తలెత్తుతుంది. అనువుకాని భూముల్లో ఆయా పంటలను సాగు చేయడం వల్లా రైతులకు నష్టాలు తప్పవు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం పత్తి సాగుకు అనుకూలం కాకపోయినా రైతులు ఆ పంటను పెద్దమొత్తంలో అక్కడ సాగు చేస్తున్నారు. ఫలితంగా వారికి కడగండ్లే మిగులుతున్నాయని నాగ్‌పుర్‌లోని జాతీయ నేల సర్వే, భూ వినియోగ ప్రణాళిక సంస్థ గతంలోనే తెలిపింది. పంటల వైవిధ్యాన్ని పెంచడం వల్ల ఆహార, పోషకాహార భద్రతకు హామీ దక్కుతుంది. దాన్ని ప్రోత్సహించడం వల్ల వాతావరణ సంక్షోభాలను తట్టుకునేలా వ్యవసాయాన్ని తీర్చిదిద్దగలమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో పంట వైవిధ్యాన్ని పెంచడానికి ప్రభుత్వాలు సరైన ప్రణాళికలు రూపొందించి వాటిని పకడ్బందీగా అమలు చేయాలి.

- డి.సతీశ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నేల తల్లికి పుట్టెడు శోకం

‣ సహ చట్ట స్ఫూర్తిపై దాడి

‣ మదుపరుల పుట్టిముంచిన క్రిప్టో

‣ డేటా కేంద్రాల విపణిగా భారత్‌

Posted Date: 17-12-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని