• facebook
  • whatsapp
  • telegram

చేయూత దక్కని రైతన్న

దేశంలో అత్యంత కీలకమైన వ్యవసాయ రంగానికి తాజా బడ్జెట్లో నిధుల కేటాయింపులు నిరుత్సాహపూరితంగా ఉన్నాయి. పంటల దిగుబడులు పెంచేందుకు, వాటికి మద్దతు ధర ఇచ్చి కొనేందుకు, విపత్తులను ఎదుర్కొనేందుకు, వ్యవసాయ విజ్ఞాన పరిశోధనలకు ఇతోధిక నిధుల కేటాయింపులు జరగలేదు. ఇది దేశ వ్యవసాయ రంగ భవిష్యత్తుపై అనిశ్చితిని పెంచుతుంది.

రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎంతో కొంత సొమ్ము జమచేస్తే చాలు... పంటల సాగు, దిగుబడులు పెంచుకోవడం వంటివి అన్నదాతలే చూసుకుంటారు అన్నట్లుగా బడ్జెట్లు వస్తున్నాయి. దానివల్ల దేశ ఆహారభద్రతకు ఏమాత్రం పూచీకత్తు దక్కదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించిన మొత్తం నిధుల్లో దాదాపు సగం రైతుల ఖాతాలో సొమ్ము జమచేసే ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ (పీఎం కిసాన్‌) పథకానికే దక్కాయి. వాతావరణ మార్పులతో ప్రకృతి విపత్తులు పెరుగుతున్నాయని ప్రపంచమంతా మొత్తుకొంటోంది. వాటి నుంచి రైతులను, పంటలను రక్షించే విభాగానికి ఈసారి నిధుల కేటాయింపులే లేవు! పంటలకు మద్దతు ధరలు ప్రకటించడం వరకే తమ బాధ్యత అంటున్న కేంద్రం- దానికి హామీ ఇవ్వడానికి నిధులను పెంచలేదు.

తగ్గిన కేటాయింపులు

పంటలను మద్దతు ధరకు కొని రైతులకు ఆర్థిక భరోసా కల్పించడానికి మోదీ ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్‌ సంరక్షణ యోజన’ (పీఎం-ఆశ) పథకాన్ని తెచ్చింది. నూనెగింజల పంటలను మద్దతు ధరకు ప్రభుత్వం నేరుగా కొనాలనేది ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఒకవేళ పంటను వ్యాపారులు మద్దతు ధరకన్నా తక్కువకు కొంటే, అన్నదాతలు నష్టపోయిన మొత్తాన్ని ‘ధర వ్యత్యాసాన్ని చెల్లించే పథకం’(పీడీపీఎస్‌) కింద ప్రభుత్వం తిరిగి అందించాలన్నది మరో నిబంధన. ఈ పీడీపీఎస్‌ను నాలుగేళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లో సోయాచిక్కుడు, హరియాణాలో కూరగాయలకు అమలుచేసి ఏడాదికే అటకెక్కించారు. ప్రస్తుత బడ్జెట్లో పీఎం-ఆశ పథకానికి కేవలం లక్ష రూపాయలే కేటాయించి కేంద్రం దానిపై తన అనాసక్తిని చాటుకొంది. దేశీయంగా నూనెగింజల సాగు విస్తీర్ణం పెరగకపోవడంతో విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అందుకోసం ఏటా రూ.75 వేల కోట్లను భారత్‌ వెచ్చిస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల పొద్దుతిరుగుడు నూనె ధరలు గతంలో ఆకాశానికి ఎగబాకాయి. అదే పొద్దుతిరుగుడును ఇక్కడి రైతులు పండిస్తే మాత్రం మద్దతు ధరకు కొనడానికి బడ్జెట్లో నిధులు ఉండవు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పంటలను మద్దతు ధరకు కొనడానికి ‘మార్కెట్‌ జోక్యం పథకం’(ఎంఐఎస్‌) కింద 2021-22 బడ్జెట్లో రూ.2288 కోట్లు, ఆ తరవాతి ఏడాది రూ.1500 కోట్లు కేటాయించారు. తాజా బడ్జెట్లో కేవలం లక్ష రూపాయలు మాత్రమే విదిలించారు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని తీరిగ్గా కొనుగోలు కాలం ముగిశాక ఆయా సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. దానివల్ల ప్రైవేటు వ్యాపారులకే మేలు జరుగుతోంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌, ఝార్ఖండ్‌ తదితర రాష్ట్రాలు నిలిపివేసిన ‘ప్రధానమంత్రి పంటల బీమా’ పథకానికి తాజాగా రూ.13,625 కోట్లు కేటాయించారు. ఆ పథకం అమలులో లేని రాష్ట్రాల్లో దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సుస్థిర వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి రైతుల ఆదాయాన్ని పెంచడానికి అమలు చేస్తున్న ‘రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన’(ఆర్‌కేవీవై) పథకానికీ అరకొర కేటాయింపులు జరిపారు. ఈ పథకానికి కేంద్రం 60శాతమిస్తే మిగిలిన 40శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయాలి. ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం తన వాటాను విడుదల చేయనందువల్ల మిగిలిన 60శాతమూ కేంద్రం నుంచి రైతులకు రాలేదు. ఇలా పలు రాష్ట్రాలు తమ వాటా ఇవ్వకపోవడంవల్ల ఈ పథకం కింద ఏటా వేల కోట్ల రూపాయలకు బడ్జెట్లో కేంద్రం కోతలు పెడుతోంది. ఫలితంగా పేద రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇలాంటి పథకాల అమలు సరిగ్గా లేనందువల్ల పంటల దిగుబడి, రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యాలు నీరుగారిపోతున్నాయి.

లోపాలను సరిదిద్దాలి  

ఇండియాలో 105 జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు పెద్ద సంఖ్యలో కొత్త విత్తనాలను విడుదల చేస్తున్నాయి. అవి రైతుల పొలాలకు చేరడంలేదు. అందులోని లోపాలను సరిదిద్దాలి. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకొనేందుకు పంటల బీమా పథకం అన్ని రాష్ట్రాల్లో అమలయ్యేలా చూడాలి. వ్యవసాయ పరిశోధనలకు ప్రభుత్వ పెట్టుబడులు బడ్జెట్లలో తగ్గిపోతున్నందువల్ల ప్రైవేటు భాగస్వామ్యంతో నిధులను పెంచాలి. కూలీల కొరతతో ఇప్పటికే రైతులకు పంటలు పండించడం కత్తిమీద సాములా మారింది. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తెలంగాణ వంటి రాష్ట్రాలు కోరుతున్నాయి. ఆ విషయాన్ని పట్టించుకోకపోగా ఏకంగా నిధులకు కోత పెడుతున్నారు. వాతావరణ మార్పులను తట్టుకొనే వంగడాలు రాకపోతే ఆహార భద్రతకు ప్రమాదం తప్పదని ప్రపంచ ఆహార సంస్థ హెచ్చరిస్తోంది. దాన్ని గుర్తించి వ్యవసాయ దిగుబడులను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతోధికంగా నిధులు కేటాయించాలి. అప్పుడే దేశానికి ఆర్థిక, ఆహార భద్రత లభిస్తుంది.

పరిశోధనలు కీలకం

చైనాలో ఎకరాకు సగటున 30 నుంచి 40 క్వింటాళ్ల వరిధాన్యం దిగుబడి వస్తోంది. ఇండియాలో అది సగటున 20 క్వింటాళ్లే. అమెరికా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌, ఇజ్రాయెల్‌ వంటి దేశాలూ వ్యవసాయ పరిశోధనలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాయి. భారత్‌ సైతం ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. వ్యవసాయ పరిశోధనలకు సరైన చేయూతనివ్వాలి. మరోవైపు జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పెద్దయెత్తున ఖాళీగా ఉన్న శాస్త్రవేత్తల పోస్టులనూ భర్తీ చేయడంలేదు. పరిశోధనలకు నిధులను సైతం ఇవ్వడంలేదు. ఈ పరిశోధనా సంస్థలు విడుదల చేసే అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలు, సాగు పరిజ్ఞానం గురించి వ్యవసాయ విస్తరణ విభాగం రైతులకు తెలియజెబుతుంది. ఈ విభాగానికి గతంలో తొలుత వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు. సవరించిన అంచనాల్లో అది రూ.800 కోట్లకు తగ్గింది. తాజా బడ్జెట్లో ఒక్క రూపాయీ కేటాయించలేదు!

- మంగమూరి శ్రీనివాస్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నదుల్ని కాటేస్తున్న వ్యర్థాలు

‣ మానవ తప్పిదం... ప్రకృతి ఆగ్రహం!

‣ ఎగుమతులు పెరిగితేనే ఆర్థిక ప్రగతి

‣ తుర్కియే జిత్తులకు పైయెత్తు!

Posted Date: 03-02-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని