• facebook
  • whatsapp
  • telegram

తరిగిపోతున్న దట్టమైన అడవులు

వనాల లెక్కల్లో వాణిజ్య తోటలు

దేశంలో గత రెండేళ్ల కాలంలో స్థూలంగా అడవుల పరిస్థితి మెరుగైంది. అటవీ, చెట్ల విస్తీర్ణం మొత్తంగా సుమారు రెండు వేల చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది. 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 33 శాతానికిపైగా అటవీ భూభాగం ఉంది. మడ అడవులూ పెరిగాయి. తాజా గణాంకాల ప్రకారం- భారత్‌లో అడవుల విస్తీర్ణం 7,13,789 చ.కి.మీ. భారత అడవుల స్థితిగతులు-2021 (ఐఎస్‌ఎఫ్‌ఆర్‌) పేరిట ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐ) రూపొందించిన నివేదిక ఈ వివరాల్ని వెల్లడించింది. అయితే, పరిస్థితులు నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగానే ఉన్నాయా?

ఆందోళనకర పరిణామం

వృక్షాల ఛత్ర సాంద్రత 70శాతం, అంతకుమించి ఉంటే చాలా దట్టమైన అడవిగా, 40 నుంచి 70శాతం వరకు ఉంటే ఒక మోస్తరు దట్టమైన అడవిగా, పది నుంచి నలభై శాతందాకా ఉంటే ఓపెన్‌ ఫారెస్ట్‌గా ఎఫ్‌ఎస్‌ఐ పరిగణిస్తోంది. దేశంలో అడవుల పెరుగుదల ఎక్కువగా ఓపెన్‌ ఫారెస్టు పరిధిలోనే నమోదైంది. ఇందుకు వాణిజ్యపరమైన తోటల పెంపకమే కారణం. ఒక హెక్టారుకన్నా అధిక భూభాగంలో చెట్ల ఛత్ర సాంద్రత పదిశాతం కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని అటవీ ప్రాంతంగా పరిగణిస్తున్నారు. దానివల్ల కాఫీ, రబ్బరు తదితర తోటలు సైతం అడవుల పరిధిలోకి వచ్చేస్తున్నాయి. ఆ లెక్కన నగరాల్లో హెక్టారుకు మించిన విస్తీర్ణంలో ఉండే చెట్లతో కూడిన ఉద్యానాల్ని సైతం అడవులుగానే పరిగణించాల్సి వస్తుందనేది నిపుణుల అభ్యంతరం. ఈ క్రమంలో దీన్ని భారత అడవుల నివేదిక కన్నా చెట్ల నివేదికగా పేర్కొనడం సబబనే విమర్శలున్నాయి. జాతీయ అటవీ విధానం-1988 ప్రకారం  ఈ ఏడాదికే భారత్‌లో అడవుల విస్తీర్ణం 33శాతందాకా పెరగాలి. 2018 డిసెంబర్‌లో నీతిఆయోగ్‌ విడుదల చేసిన 75 ఏళ్ల నవభారత్‌ వ్యూహాల్లోనూ ఈ లక్ష్యం ఉంది. లక్ష్యసాధనలో వెనకంజలోనే ఉన్నట్లు గణాంకాలు చాటుతున్నాయి. తాజా నివేదికలో మరో ప్రాధాన్య అంశం- అటవీ నష్టం దట్టమైన అడవుల్లో ఎక్కువగా ఉండగా, సాధారణ ఓపెన్‌ ఫారెస్టులో పెరుగుదల చోటుచేసుకుంది. దానివల్ల మన అడవుల పరిస్థితి మరీ గొప్పగా ఉన్నట్లేమీ కాదని విదితమవుతోంది. దేశంలోని 52 పులుల సంరక్షణ ప్రాంతాల్లో 22.62 చ.కి.మీ. మేర అటవీ విస్తీర్ణం తగ్గగా, ఏకైక సింహాల సంరక్షణ ప్రాంతమైన గుజరాత్‌లోని గిర్‌ అడవుల్లోనూ 33.43 చ.కి.మీ.క్షీణత నమోదవడం గమనార్హం. మొత్తంగా 11 రాష్ట్రాల్లో అడవుల క్షీణత నమోదైనట్లు ఐఎస్‌ఎఫ్‌ఆర్‌-21 నివేదిక వెల్లడించింది. మడ అడవుల విస్తీర్ణం పెరిగినట్లు చెబుతున్నా, అవి సాధారణ మడ అడవులే. ఒక మోస్తరు దట్టమైన మడ అడవుల విస్తీర్ణంలో పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు. ప్రపంచంలోనే అత్యంత విలువైన, ప్రత్యేక జీవ వైవిధ్యం సంతరించుకున్న అడవులు కలిగిన ఈశాన్య భారత్‌లో అడవులు దెబ్బతినడం ఆందోళనకర పరిణామంగా భావిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో ఈశాన్యంలో అటవీ క్షీణత దెబ్బతినడం అధికమైంది. అడవుల్లో కార్చిచ్చు సంఘటనలు పెరుగుతుండటం మరొక ఆందోళనకర అంశం. 2020 నవంబర్‌, 2021 జూన్‌ మధ్య 3.45 లక్షల కార్చిచ్చు ఘటనలను ఎఫ్‌ఎస్‌ఐ ఏర్పాటు చేసిన సెన్సర్లు గుర్తించాయి. ఇలాంటి ఘటనల విషయంలో గతంతో పోలిస్తే 177శాతం పెరుగుదల నమోదైనట్లు తేల్చారు.

కొనసాగుతున్న క్షీణత

అడవుల స్థితిగతుల్ని నిర్ధారించిన విషయంలోనూ పలు విమర్శలున్నాయి. అడవులు, చెట్ల విస్తీర్ణాన్ని గుర్తించేందుకు ఎఫ్‌ఎస్‌ఐ రిమోట్‌ సెన్సింగ్‌ డేటాను ఉపయోగించారు. ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించారు. అత్యంత దట్టమైన అడవుల విస్తీర్ణాన్ని నిర్దేశించే విషయంలో నిర్దిష్టమైన పద్ధతులను ఉపయోగించలేదనేది నిపుణుల విమర్శ. వాస్తవానికి మానవ నివాసిత ప్రాంతాలకు సమీపంలో ఉండే ఒక మోస్తరు దట్టమైన అడవుల్లో దశాబ్ది కాలంలో 4.3శాతం మేర క్షీణత కనిపించింది. ఈ తరహా అడవుల్లో చాలా ఏళ్లుగా క్షీణత కొనసాగుతుండటం ఆందోళనకర విషయం. 2002 నుంచి 2020 మధ్య తేమతో కూడిన ప్రాథమిక అడవులు తగ్గినట్లు గ్లోబల్‌ ఫారెస్ట్‌ వాచ్‌ తెలిపింది. భారత్‌ తన ద్వైవార్షిక నివేదికల్లో ప్రతిసారీ అడవుల విస్తీర్ణం పెరిగినట్లు చెబుతున్నా- ఆ గణాంకాలు నిక్కచ్చిగా ఉండటం లేదంటూ ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (యూఎన్‌ఎఫ్‌సీసీ) గతంలోనే పేర్కొంది. మారుతున్న సాగు పద్ధతులు, చెట్ల నరికివేత, ప్రకృతి విపత్తులు, మానవ కార్యకలాపాల ఒత్తిడి, అభివృద్ధి కార్యకలాపాల విస్తృతి వంటివి అడవుల క్షీణతకు కారణాలుగా చెబుతున్నారు. అటవీ చట్టం-1980కి చేపట్టిన కొన్ని సవరణల కారణంగా అటవీ భూమిని అటవీయేతర కార్యకలాపాలకోసం మార్పిడి చేసుకోవడం సులభతరమైంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా 2018 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి మధ్య ఈ చట్టం కింద 55,430.13 హెక్టార్ల అటవీ భూమికి అటవీయేతర వినియోగం కోసం ఆమోదం లభించినట్లు విదితమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అటవీ పరిరక్షణలో మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తేనే మన అడవులు పచ్చగా వర్ధిల్లుతాయి. 

- డీఎస్‌
 

Posted Date: 31-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం