• facebook
  • whatsapp
  • telegram

వ్యర్థాలకు అడ్డుకట్ట... నదులకు రక్ష

ఆశలు రేపుతున్న ఆధునిక పద్ధతులు

నదులు మానవ నాగరికతా వికాసానికి ఆలవాలాలు. తాగునీటిని, సస్యశ్యామల సుక్షేత్రాలకు ప్రాణ జలాలను అందించడంతోపాటు చేపల వేట ద్వారానూ ఎంతోమందికి జీవనోపాధిని కల్పిస్తున్నాయి. ప్రజల అవగాహనా రాహిత్యం, పాలకుల అలక్ష్యం కారణంగా దేశీయంగా చాలా నదులు కశ్మల కాసారాలుగా మారాయి. పారిశ్రామిక, గృహ వ్యర్థాలు, మురుగు నీరు కలవడం, గనుల తవ్వకాలు, భూతాపం తదితర కారణాలతో నదులు కాలుష్యమయంగా మారుతున్నాయి. ఫలితంగా వాటిలో ప్రాణుల మనుగడ దుస్సాధ్యమవుతోంది. భారత్‌లో 2018 నాటికి 350కి పైగా నదీ ప్రాంతాలు కశ్మలమయమైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తీవ్ర కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న నదులకు కొత్త ఊపిరులు ఊదేందుకు విభిన్న పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. మేఘాలయలో అటువంటి ప్రయత్నాలు ఇటీవల విజయవంతమయ్యాయి.

శైవలాల సాయం

మేఘాలయలోని తూర్పు జయంతియా హిల్స్‌ జిల్లా దక్షిణ ప్రాంతంలో లుఖా నది ప్రవహిస్తుంది. స్థానికంగా చాలా కుటుంబాలు అందులో చేపలు పట్టి జీవనం సాగిస్తుంటాయి. మేఘాలయలో బొగ్గు, సున్నపు రాయి గనులు, సిమెంటు పరిశ్రమలు అత్యధికంగా తూర్పు జయంతియా జిల్లాలోనే ఉన్నాయి. వాటి వ్యర్థాలతో లుఖా నది విషతుల్యంగా మారింది. ముఖ్యంగా డిసెంబర్‌ మొదలు మళ్ళీ భారీ వర్షాలు కురిసేదాకా లోహ కాలుష్య కారకాల గాఢత తారస్థాయికి చేరి లుఖా నది నీరు నీలం లేదా పసుపు రంగులోకి మారి అందులోని చేపలు మృత్యువాత పడుతున్నాయి. దాంతో లుఖా పునరుద్ధరణకు ప్రభుత్వం ఒక పైలట్‌ ప్రాజెక్టు చేపట్టింది. అందులో భాగంగా నీటిలోని కలుషితాలను తొలగించేందుకు ఫైకోరెమెడియేషన్‌ పద్ధతిని అనుసరించారు. ఇందులో ఆల్గేలను (శైవలాలను) వినియోగిస్తారు. రెండున్నర కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును దిల్లీకి చెందిన ట్రినిటీ ఇంపెక్స్‌ ఇంటర్నేషనల్‌ (టీఐఐ) సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్ర అటవీ శాఖ చేపట్టింది. ఇందులో భాగంగా తూర్పు జయంతియా హిల్స్‌ జిల్లాలోని సోనాపైర్డి గ్రామంలో 14 కుంటల్లో శైవలాలను పెంచారు. వాటి సాయంతోనే లుఖా నది నీటిలోని లోహ అవశేషాలను విజయవంతంగా తొలగించారు. ఫలితంగా అక్కడి నీటిలో పీహెచ్‌ స్థాయులు మెరుగయ్యాయి. ఆ పైలట్‌ ప్రాజెక్టును ఇతర ప్రాంతాల్లోని లుఖా నదికి, రాష్ట్రంలోని ఇతర నదులకు విస్తరించాలని మేఘాలయ ప్రభుత్వం నిర్ణయించింది. 2019లో మేఘాలయలోని కైరుఖ్లా నదిని కాలుష్యం నుంచి విముక్తం చేసేందుకు ఫైకోరెమెడియేషన్‌ విధానాన్నే ఎంచుకున్నారు. శైవలాల్లో 27 వేలకు పైగా రకాలు ఉన్నాయని, విభిన్న ప్రయోజనాల కోసం వాటిని వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఫైకోరెమెడియేషన్‌ పద్ధతిలో మేలైన ఫలితాలు రావడమే కాకుండా దాని వ్యయమూ తక్కువే అని వెల్లడిస్తున్నారు.

లండన్‌లోని ప్రఖ్యాత థేమ్స్‌ నది గతంలో ప్రజల దాహార్తిని తీర్చేది. పారిశ్రామిక, గృహ, కబేళాల వ్యర్థాలన్నీ అందులో కలవడంతో క్రమంగా ఆ నది విషతుల్యంగా మారింది. 1960నుంచి థేమ్స్‌ పునరుద్ధరణ చురుకందుకుంది. అందులో భాగంగా నగరంలో మురుగునీటి నిర్వహణ వ్యవస్థను పటిష్ఠం చేశారు. పారిశ్రామిక వ్యర్థాలు కలవకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. తద్వారా నది నీటిలో ఆక్సిజన్‌ శాతాన్ని పెంచగలిగారు. థేమ్స్‌ నదిని బాగుచేసినప్పుడు, దిల్లీ ఒడ్డున కంపు కొడుతున్న యమునా నదిని ఎందుకు సాధారణ స్థితికి తేలేమన్నది పర్యావరణవేత్తల ప్రశ్న. దేశీయంగా అహ్మదాబాద్‌ వద్ద సబర్మతి నది, అలహాబాద్‌ వద్ద గంగానది, చెన్నైలోని కూమ్‌ నది, ముంబయిలో మిఠీ, పుణేలో ములా-ముఠా, లఖ్‌నవూలో గోమతి, బెంగళూరులో వృషభవతి తదితర నదులు తీవ్రంగా కాలుష్యభరితమయ్యాయి. ఆయా నదుల శుద్ధి కోసం ప్రభుత్వాలు పెద్దమొత్తంలో నిధులు వెచ్చిస్తున్నాయి. అయినా సరైన ఫలితాలు దక్కడంలేదు. ప్రధానంగా నగరాల్లోని మురుగునీరు, పారిశ్రామిక, ఇతర వ్యర్థాలు కలవడం వల్ల అవి కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి.

ఆరోగ్యానికి ముప్పు

తెలుగు రాష్ట్రాల్లో ప్రవహించే కృష్ణా, గోదావరి నదులకు సైతం పారిశ్రామిక వ్యర్థాల బెడద తప్పడంలేదు. ఇక హైదరాబాదులో మూసీ నది పరిస్థితి గురించి వేరే చెప్పనక్కరలేదు. నదులు దేశ భాగ్యరేఖలుగా వెలుగులీనాలంటే ముందుగా వాటిలో వ్యర్థాలు కలవకుండా ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. నదుల కాలుష్యం తీవ్రంగా ఉన్నచోట ఫైకోరెమెడియేషన్‌ వంటి పద్ధతులతో నీటి నాణ్యతను పెంచడం గురించి ఆలోచించాలి. కాలుష్య భరితమైన నీటిని వ్యవసాయానికి వాడటం వల్ల భూసారం దెబ్బతింటుంది. ఆ కాలుష్య కారకాలు పంటల ద్వారా మానవుల శరీరంలోకి చేరి ఆరోగ్యాన్ని గుల్లచేస్తాయి. మరోవైపు మానవ విపరీత పోకడలు, వాతావరణ మార్పులతో చాలా నదులు కనుమరుగైపోతున్నాయి. పలు స్వచ్ఛంద సంస్థలు వాటి పునరుద్ధరణకు కృషి చేస్తున్నాయి. అలాంటి వాటికి ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించాలి. నదుల పరిరక్షణలో పాలకుల చొరవతోపాటు ప్రజల చైతన్యవంతమైన తోడ్పాటూ కీలకం.

- ఎం.వి.బాబు

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 31-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం