• facebook
  • whatsapp
  • telegram

ఎగుమతుల వృద్ధికి అవకాశాలు అపారం



సుదీర్ఘ సముద్ర తీరం కలిగిన ఆంధ్రప్రదేశ్‌కు ఎగుమతుల పరంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి ఎన్నో రకాల వస్తువులు, సరకులను దేశ విదేశాల్లోని విపణులకు పంపించవచ్చు. గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నూతన ప్రభుత్వం ఎగుమతులపై ప్రత్యేక దృష్టి సారించాలి.


ప్రతి జిల్లాను ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చేయడం ద్వారా దేశార్థిక రథాన్ని పరుగులు తీయించవచ్చని 2019 నాటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈ క్రమంలో ప్రతి జిల్లా నుంచి ఎగుమతి చేయగల వస్తువులను గుర్తించేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర వాణిజ్య శాఖ ప్రోత్సహిస్తోంది. 974 కిలోమీటర్ల పొడవైన తీరం, ప్రధాన రేవు విశాఖపట్నానికి తోడు అనేక చిన్నాపెద్ద రేవులు కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్యాభివృద్ధికి అత్యంత అనువైనది. అయినా గత ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టలేదు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఎగుమతులు, పరిశ్రమలు పడకేశాయి. గత సర్కారు పెడపోకడల వల్ల పెట్టుబడులు, పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి.


గత ప్రభుత్వ నిర్వాకం

భారత్‌ 2022-23లో జరిపిన మొత్తం ఎగుమతుల్లో గుజరాత్‌ (33.4శాతం వాటా), మహారాష్ట్ర(16.06శాతం), తమిళనాడు(9.02శాతం) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌ కేవలం 4.4శాతం ఎగుమతులతో సరిపెట్టుకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యింది. ఏపీ ఎగుమతుల వృద్ధిపై నూతన సర్కారు ప్రత్యేక దృష్టి సారించాలి. రాష్ట్రాల ఎగుమతి సామర్థ్యంపై నీతి ఆయోగ్‌ 2023 జులైలో వెలువరించిన నివేదికలో ఆంధ్రప్రదేశ్‌కు ఎనిమిదో ర్యాంకు దక్కింది. తెలంగాణ ఆరో ర్యాంకు సాధించింది. సారవంతమైన వ్యవసాయ భూములు, ఖనిజ నిక్షేపాలు, సుదీర్ఘ సముద్ర తీరం ఉన్న ఏపీ- ఎగుమతుల్లో దూసుకుపోవలసింది. ఇక్కడి నుంచి శుద్ధి చేసిన ఆహారం, ఔషధాలు, చేపలు, రొయ్యల ఎగుమతికి పుష్కలంగా అవకాశాలున్నాయి. విశాఖపట్నం రేవు చుట్టూ అనేక ఫార్మా, రసాయనాలు, ఆటొమోటివ్‌ పరిశ్రమలు ఉన్నాయి. బెల్లం, జీడిపప్పు ఎగుమతులకూ ఈ రేవు కేంద్రంగా ఉంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి బియ్యం, వంటనూనెలు, కొబ్బరి పీచు, శుద్ధి చేసిన ఆహారోత్పత్తులు ఎగుమతి అవుతాయి. కృష్ణా జిల్లా నుంచి బియ్యం, మామిడి తదితర పండ్లు, కలంకారీ వస్త్రాలు, గిల్టు నగలు; గుంటూరు జిల్లా నుంచి మిర్చి, పత్తి, పసుపు, పొగాకు ఎగుమతి అవుతాయి. ప్రకాశం జిల్లా గ్రానైట్, నెల్లూరు జిల్లా బియ్యం, చేపలు, రొయ్యలు, వివిధ ఖనిజాల ఎగుమతులకు ప్రసిద్ధి. చిత్తూరు జిల్లా మామిడి గుజ్జు, ఇతర ఆహార శుద్ధి ఉత్పత్తులతోపాటు ఆటొమొబైల్‌ విడిభాగాలు, ఎలెక్ట్రానిక్స్‌ ఎగుమతులకూ పేరుగాంచింది. కడప, అనంతపురాల నుంచి ఖనిజాలు, పండ్లు ఎగుమతి చేస్తున్నారు. ఇలా ఒక్కో జిల్లా నుంచి ఎగుమతి చేయదగిన వాటిని నూతన ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాలి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఆర్థిక మండలాలు, పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా పారిశ్రామిక వస్తు ఎగుమతులను పెంచగలిగే అవకాశం ఉన్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కొత్త ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణంలాగే ఎగుమతుల విషయంలోనూ మళ్ళీ మొదటి నుంచి కసరత్తు చేయాలి.


దేశ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా పెంచాలంటే మొదట రవాణా సదుపాయాలను విస్తరించాలి. సరకులు వేగంగా రేవులకు చేరాలంటే రహదారులు, రైల్వేలను మెరుగుపరచాలి. శీతల గిడ్డంగులు, లాజిస్టిక్‌ పార్కుల నిర్మాణ, విస్తరణలు ఎగుమతుల వృద్ధికి దోహదం చేస్తాయి. వ్యవసాయం, వస్త్రాలు, ఔషధాలు, ఎలెక్ట్రానిక్స్, ఆటో విడిభాగాల ఎగుమతులను పెంచడానికి ఆయా రంగాలకు అండదండలివ్వాలి. అందుకు అనువైన విధానాలను చేపట్టాలి. గత ప్రభుత్వంలోని మంత్రులు ప్రతిపక్ష నాయకులను తిట్టిపోయడానికే సమయాన్ని వృథా చేసేవారు తప్ప తమ శాఖల పనితీరును మెరుగుపరచడంపై దృష్టిపెట్టలేదు. వ్యాపార సౌలభ్యంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉన్నా- రాజకీయ నాయకుల జోక్యం, డిమాండ్లు, అధికారుల అలసత్వం వల్ల  రాష్ట్రం నుంచి ఎగుమతులు వృద్ధి చెందలేదు. అసలు రాష్ట్రంలో నిజమైన పారిశ్రామిక, వాణిజ్యాభివృద్ధి లేకపోయినా అంతా బాగున్నట్లు భ్రమింపజేయడానికి యత్నించారని ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు.


ఏమి చేయాలి?

రాష్ట్రం నుంచి ఎగుమతులు పెంచాలంటే నూతన ప్రభుత్వం పలు చర్యలు చేపట్టాలి. వివిధ రంగాల ఎగుమతిదారులు, ప్రభుత్వాధికారులతో రాష్ట్రస్థాయి సమన్వయ సంఘాలను ఏర్పాటు చేయాలి. ఎగుమతుల వృద్ధికి అడ్డుపడుతున్న అంశాలేవో గుర్తించి వాటిని పరిష్కరించడం ఈ సంఘాల బాధ్యత కావాలి. వ్యవసాయోత్పత్తుల నిల్వకు గిడ్డంగులను పెంచి ఎగుమతులకు వెసులుబాటు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుని రాష్ట్రంలో లాజిస్టిక్‌ కేంద్రాలను విస్తరించాలి. లోతట్టు ప్రాంతాల్లో కంటైనర్‌ డిపోలను ఏర్పాటు చేయాలి. రేవుల నుంచి వచ్చే దిగుమతులను అక్కడ నిల్వచేయాలి. రాష్ట్రంలోని మొత్తం 14 రేవులనూ అభివృద్ధి చేయాలని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తలపెట్టింది. దాన్ని ఈసారి నెరవేర్చాలి. కేంద్రం చేపట్టే సాగర్‌ మాల ప్రాజెక్టు ద్వారా అంతర్గత జలమార్గాల ద్వారా రవాణాను పెంచాలి. రాష్ట్రంలోని చిన్నాపెద్ద విమానాశ్రయాల నుంచి సరకుల ఎగుమతులను పెంచాలి. వాటిని పలు దేశాలకు పంపగలగాలి. ఎగుమతిదారులకు ఫైనాన్స్, బీమా సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఎగుమతులు చేయాల్సిందిగా స్వదేశీ, విదేశీ కంపెనీలను ఆహ్వానించాలి. పరిశ్రమలకు, ఎగుమతి సంస్థలకు కావాల్సిన నైపుణ్యాలున్న మానవ వనరులను తయారు చేసుకోవడం మరో కీలకాంశం. అందుకు తగిన శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. అందుబాటులో ఉన్న ప్రాకృతిక, మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ఎగుమతుల పథంలో దూసుకెళ్ళగలుగుతుంది.


ఎన్నో సరకులు...

ఏపీ నుంచి ఎగుమతులను పెంచడానికి గత ప్రభుత్వం పటిష్ఠమైన మార్కెటింగ్‌ విధానాన్ని అనుసరించలేదు. ద్వైపాక్షిక, బహుళపక్ష వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆసక్తి ప్రదర్శించలేదు. అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనల్లో మన పారిశ్రామిక, వ్యాపారవేత్తలు పాల్గొనేలా శ్రద్ధ చూపలేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మేలైన వస్తువులను అన్ని దేశాలకూ ఎగుమతి చేయవచ్చు. ఒక్కో జిల్లా నుంచి ఎగుమతి చేయగల వస్తువులతో కేంద్ర వాణిజ్య శాఖ రూపొందించిన జాబితాపై నూతన ప్రభుత్వం దృష్టి సారించాలి. మత్స్య ఉత్పత్తులు, ఔషధాలు, గ్రానైట్‌ వంటి ఖనిజాలు, సేంద్రియ రసాయనాలు, ఇనుము, ఉక్కు, బియ్యం, చిరుధాన్యాలు, కాఫీ, మసాలా దినుసులు, ఆటో విడిభాగాలు, ఇంజినీరింగ్‌ వస్తువులను ఎగుమతి చేయడానికి పుష్కలంగా అవకాశాలున్నాయి. ఎలెక్ట్రానిక్‌ విడిభాగాలు, రెడీమేడ్‌ దుస్తులు, శుద్ధి చేసిన ఆహారాలు తదితరాలనూ ఎగుమతి చేయవచ్చు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇంధన భద్రతకు సానుకూల పవనం

‣ స్విస్‌ సదస్సుకు భారత్‌

‣ మేక్రాన్‌ మహాజూదం

‣ ఉపాధికి ఊతమిచ్చే ఉన్నత విద్య

‣ సవాళ్ల ముంగిట ఆంధ్రప్రదేశ్‌.. సమర్థ ప్రణాళికలతో మహర్దశ

Posted Date: 19-06-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం