• facebook
  • whatsapp
  • telegram

ఆశలపల్లకిలో కొత్త ఏడాదిలోకి...

ఒడుదొడుకుల 2021

గడచిన సంవత్సర కాలంలో భారత్‌ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది. ఆశనిరాశల మధ్య ఊగిసలాడింది. 2021 ప్రారంభమైనప్పుడు కొవిడ్‌పై పోరులో గెలవగలమని, ఆర్థిక వ్యవస్థ వేగంగా తెప్పరిల్లుతుందనే ఆశలు వెల్లివిరిశాయి. సంవత్సరం మధ్యనాళ్లకు అవి ఆవిరయ్యాయి. అయినా ఏడాది చివర్లో మళ్ళీ ఆశావాదం మొగ్గ తొడుగుతోంది. 2021 సంవత్సరం మన అభివృద్ధిలోని డొల్లతనాన్ని, లోపాలను బయటపెట్టింది. మన పౌరులకు రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కుకు ఢోకా లేదు. కానీ కొవిడ్‌ రెండోదశలో ఆక్సిజన్‌ అందక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. 2020లో ప్రపంచమంతటా భయోత్పాతం సృష్టించిన కొవిడ్‌పై 2021లో జనం కాస్త నింపాదిగా స్పందించసాగారు.

ఆశాభావంతో ముందుకు

కొవిడ్‌ కట్టడిలో ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా నిలిచిన ఆరని చితిమంటలు ప్రపంచ టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయి. 2021లో దేశవ్యాప్త కొవిడ్‌ లాక్‌డౌన్‌లు లేకపోవడం ఒకింత ఊరట కలిగించింది. స్థానిక ఆంక్షలతోనే కొవిడ్‌ నియంత్రణకు ప్రయత్నించారు. దుకాణాలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు మళ్ళీ తెరుచుకున్నాయి. విద్యార్థులపై కొవిడ్‌ పెద్దగా ప్రభావం చూపదనే ఆశాభావంతో అందరూ ముందుకెళ్తున్నారు. భారత్‌లో కరోనా కట్టడిలో మొదట తప్పటడుగులు పడినప్పటికీ, తరవాత ప్రభుత్వం వేగంగా మేల్కొని టీకాల కార్యక్రమాన్ని ఉద్ధృతం చేసింది. మొదట్లో కొవిషీల్డ్‌ టీకా వల్ల రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడతాయని చాలామంది టీకాలు తీసుకోవడానికి తటపటాయించారు. తరవాత గడ్డల వల్ల మరణించే ప్రమాదంకన్నా టీకాలు వేసుకోకపోవడం వల్లే ప్రమాదం ఎన్నోరెట్లు ఎక్కువని గ్రహించి ప్రజలు పెద్ద సంఖ్యలో టీకాలు వేయించుకోసాగారు. 2021 జనవరి నుంచి మొదలైన టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా సుమారు 140 కోట్ల డోసులు అందించారు. కరోనా వైరస్‌ కొత్త రూపాంతరమైన ఒమిక్రాన్‌ ఆందోళనకరంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, అది మరీ అంత ప్రాణాపాయకరం కాదనే ఆశాభావం ప్రజలను ముందుకు నడిపిస్తోంది.కొవిడ్‌ నిరపాయంగా మారడానికి చాలాకాలం పడుతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. కాబట్టి నిత్యం జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

వ్యవసాయ చట్టాల రద్దు

వ్యవసాయ చట్టాలను ఎంత ఆదరాబాదరాగా ప్రవేశపెట్టారో అంతే హడావుడిగా ఉపసంహరించడం 2021లో మరో సంచలనాత్మక ఉదంతంగా నిలిచింది. తీవ్ర ఆర్థిక నష్టాలను, కొవిడ్‌ ప్రమాదాన్ని, ఎండావానలు, అసత్య ప్రచారం, వదంతులు, బెదిరింపులను లెక్కచేయకుండా రైతులు సాగు చట్టాలకు ఎదురొడ్డి సుదీర్ఘ కాలం పోరాడారు. చివరికి కేంద్రం దిగివచ్చేలా చేశారు. రాజకీయ అండదండలు ఏమాత్రం లేకపోయినప్పటికీ, రైతులు విజయమో వీరస్వర్గమో అన్నట్లు పోరాడటంవల్లనే ఆ చట్టాలు రద్దయ్యాయి. నగరాలు, సామాజిక మాధ్యమాల వెలుపల సువిశాల ప్రపంచం ఉందనే వాస్తవం రైతు పోరాటం వల్ల మధ్యతరగతికి, విధానకర్తలకు తెలిసివచ్చింది. 2021లో ప్రకృతి ఉత్పాతాల తీవ్రత పెరిగింది. సంవత్సర ఆరంభంలో ఉత్తరాఖండ్‌లో భారీ వరద నష్టం సంభవించింది. సంవత్సరం చివరలో దక్షిణ భారతం వరద ఉద్ధృతితో అతలాకుతలమైంది. వాతావరణ మార్పులు ప్రజల జీవనాధారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు నిరుద్యోగమూ పెరుగుతోంది. విధానకర్తలు గట్టిగా పట్టించుకోవలసిన సమస్యలివి.

కొవిడ్‌ లాక్‌డౌన్ల వల్ల కార్మికుల రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడి ఉత్పత్తి దెబ్బతింది. నౌకల్లో సరకుల రవాణాకు కంటైనర్ల కొరత ఏర్పడటం వల్ల సరఫరా గొలుసులు విచ్ఛిన్నమై యావత్‌ ప్రపంచంపై నష్టదాయక ప్రభావం పడింది. ఒకవైపు ఉత్పత్తి, రవాణా, ఉపాధి దెబ్బతినగా కేంద్రం, రాష్ట్రాలు పన్నులు పెంచి పరిస్థితిని మరింత దిగజార్చాయి. పెట్రో ఉత్పత్తులపై పన్ను బాదుడు గిరాకీని, వినియోగాన్ని దెబ్బతీసింది. పెట్రో ధరలను పదేపదే పెంచడం ధరల పెరుగుదలకు దారితీస్తోందని, ఇకనైనా ఎక్సైజ్‌ సుంకంలో రాయితీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని రిజర్వు బ్యాంకు బహిరంగంగా కోరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కొవిడ్‌ కాలంలో భారత్‌లో ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు సర్వవ్యాప్తం కావడం గణనీయ పరిణామం. 2022లో డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ కొత్త అధ్యాయంలోకి అడుగు పెడుతుందనడంలో సందేహం లేదు. కేంద్రంలో కొత్తగా సహకార శాఖను ఏర్పాటుచేసి, దాన్ని హోంమంత్రికి అదనపు బాధ్యతగా అప్పగించడం మరో విశేష పరిణామం. 2022 నుంచి సహకార రంగంలో గణనీయ మార్పులు సంభవించబోతున్నాయని భావించవచ్చు. నిరుడు ఏప్రిల్‌, మే నెలల్లో తమిళనాడు, పశ్చిమ్‌ బెంగాల్‌, కేరళ, పుదుచ్చేరి, అస్సాంలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే- తనకు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నప్పుడు మాత్రమే భాజపా గెలవగలదని, బలమైన ఇతర పార్టీలతో పోటీలో అదే స్థాయి విజయాలను అందుకోలేకపోతోందని నిరూపితమైంది. తమిళనాడు, కేరళ, బెంగాల్‌లలో భాజపా నామమాత్రపు ఉనికితో సరిపెట్టుకోవలసి రావడమే అందుకు నిదర్శనం.

ఆందోళనకర ధోరణులు

రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘననుంచి, నిరంకుశ పాలనా ప్రమాదంనుంచి జాతిని కాపాడే బాధ్యతను న్యాయవ్యవస్థ తన భుజస్కంధాలపైకి తీసుకోవడం 2021లో మరో ముఖ్య పరిణామం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒక తెలుగు వ్యక్తి నియమితులు కావడం రెండు తెలుగు రాష్ట్రాలకూ సంతోషకర వార్త అయింది. ప్రాథమిక హక్కుల అతిక్రమణకు ఆయన అడ్డుకట్ట వేస్తారనే ఆశాభావం వెల్లివిరుస్తోంది. 2021లో ప్రాథమిక హక్కులకన్నా ప్రాథమిక బాధ్యతలే మిన్న అనే వాదం బలం పుంజుకోవడం ఆందోళనకర పరిణామం. ప్రాథమిక విధులు, బాధ్యతలు రాజ్యాంగంలో అంతర్భాగం కావు. అత్యవసర పరిస్థితి కాలంలో 42వ రాజ్యాంగ సవరణ కింద వాటిని చొప్పించారు. హిట్లర్‌, స్టాలిన్‌, నేటి ఉత్తర కొరియాలో కిమ్‌ వరకు నియంతలంతా హక్కులకన్నా విధులు, బాధ్యతలే మిన్న అంటారు. ప్రాథమిక విధులు అనే భావనను సోవియట్‌ యూనియన్‌ నుంచి అరువు తెచ్చుకున్నాం. మన రాజ్యాంగం ప్రాథమిక హక్కులకు మాత్రమే భరోసా ఇస్తుంది తప్ప ప్రాథమిక విధులకు కాదు. ఆ సంగతిని విస్మరించడం వల్లనే, భావ ప్రకటనాస్వేచ్ఛను రాజద్రోహంగా పరిగణించే స్థాయికి పరిస్థితి వెళ్ళింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధ ధోరణులకు మన న్యాయవ్యవస్థ ఎప్పటికప్పుడు సమర్థంగా అడ్డుకట్ట వేస్తుందనే ఆశలతో కొత్త ఏడాదిలోకి అడుగులేద్దాం.


 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ‘హస్త’వాసి బాగాలేదు...

‣ గగనతల రక్షణలో కొత్త అధ్యాయం

‣ వనరుల పరిరక్షణ ప్రాణావసరం

‣ అసమానతల భారతం

‣ చేనేతకు మరణశాసనం

Posted Date: 31-12-2021గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం