• facebook
  • whatsapp
  • telegram

రష్యా - చైనా చెట్టపట్టాల్‌.. భారత్‌పై ప్రభావమెంత?



రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇటీవల చైనాను సందర్శించారు. పాశ్చాత్య దేశాలకు ఇదెంతమాత్రం మింగుడు పడలేదు. చారిత్రకంగా ఒకరంటే ఒకరికి అపనమ్మకం కాబట్టి మైత్రీ సుమం త్వరలోనే వాడిపోతుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జిమ్‌ కిర్బీ జోస్యం చెప్పారు. ఈ రెండు దేశాల స్నేహబంధం భారత్‌పై ఎటువంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరం. 


రష్యా - చైనాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 75 ఏళ్లయిన సందర్భంగా పుతిన్‌ ఈ నెలలో బీజింగ్‌లో పర్యటించారు. తన పర్యటన ముగింపు రోజైన మే 16న హార్బిన్‌ నగరంలో రష్యా-చైనా ఎక్స్‌పోలో విలేకరులతో మాట్లాడిన పుతిన్‌ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఫలవంతమైన చర్చలు జరిపానని చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్యం దినదినాభివృద్ధి చెందుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. రష్యా, చైనా మైత్రి రెండు దేశాల అభివృద్ధికి, ప్రజా శ్రేయస్సుకూ తోడ్పడుతుందని పేర్కొన్నారు. అమెరికా ఆధిపత్యం సాగదని అన్యాపదేశంగా సూచిస్తూ నేడు మన కళ్ల ముందే బహుళ ధ్రువ ప్రపంచం రూపుదిద్దుకొంటోందన్నారు. ప్రపంచంలో అన్ని సమస్యలపై తామే నిర్ణయం తీసుకోవాలని, అంతా తాము అనుకున్న ప్రకారమే జరగాలని కోరుకునే వారికి ఆశాభంగం తప్పదని స్పష్టంచేశారు. సర్వం సహాధిపత్యం చలాయించాలని చూస్తే కుదరదన్నారు. 


సన్నిహిత సహకారం

పుతిన్‌ యాత్ర ముగింపు సందర్భంగా ఓ సంయుక్త ప్రకటన విడుదలైంది. కొత్త యుగం కోసం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, సహకారాలను పెంపొందించుకుంటామని ఆ ప్రకటన ఉద్ఘాటించింది. చైనా-రష్యా బంధం ఏ ఇతర దేశానికీ వ్యతిరేకంగా ఎక్కుపెట్టింది కాదని హామీ ఇచ్చింది. కూటములు కట్టి ఇతరులతో సంఘర్షణకు దిగడం తమ ఉద్దేశం కాదని ఉద్ఘాటించింది. ప్రపంచ దేశాలకు తమ సంస్కృతి, చరిత్ర, జాతీయ స్థితిగతుల ఆధారంగా తమకు అనువైన పంథాలో పయనించే స్వేచ్ఛ ఉందని చాటింది. సర్వశ్రేష్ఠ ప్రజాస్వామ్యమంటూ ఏదీ లేదని స్పష్టం చేసింది. ఇది అమెరికాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య అనడంలో సందేహం లేదు. తైవాన్‌ను చైనాలో అంతర్భాగంగా గుర్తిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. తైవాన్‌ స్వాతంత్య్రాన్ని వ్యతిరేకిస్తున్నామని చాటింది. ఇది చైనాను సంతోషపెట్టడానికి చేసిన వ్యాఖ్యే. ఇంధన రంగంలో మరింత సన్నిహిత సహకారం సాధిస్తామని రష్యా, చైనాలు ప్రకటించాయి. అంతర్జాతీయ ఇంధన భద్రత ఆవశ్యకతను పునరుద్ఘాటించాయి. రష్యా నుంచి జర్మనీకి చమురును తీసుకెళ్ళే సముద్రగర్భ పైపులైన్‌ పేలిపోవడాన్ని ఉద్దేశించి ఈ విధంగా పేర్కొన్నాయి. ఈ ఘటన మీద నిష్పాక్షిక విచారణను డిమాండ్‌ చేశాయి. అమెరికా జీవసంబంధ ఆయుధాల ఉత్పత్తి కార్యకలాపాలను సాగిస్తోందని చైనా, రష్యాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తికి చైనాయే కారణమని అమెరికా నిందిస్తున్నందుకు ప్రతిగా ఈ అంశాన్ని లేవనెత్తాయి. అమెరికా నేతృత్వంలోని ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి(నాటో) తూర్పు దిశగా, అంటే రష్యా వైపు విస్తరించాలని చూడటాన్ని తప్పుపట్టాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాలతో ‘ఆకస్‌’ కూటమి ఏర్పాటుపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఆకస్‌ రష్యా, చైనాలు రెండింటికీ ప్రమాదకరమని పుతిన్, జిన్‌పింగ్‌లు భావిస్తున్నారు. జపాన్‌ ఫుకుషిమా అణు కేంద్రం నుంచి రేడియో ధార్మిక జలాలను సముద్రంలోకి విడుదల చేయడాన్ని విమర్శించాయి. ఉత్తర కొరియా న్యాయబద్ధమైన సమస్యలను, ఆందోళనను అమెరికా పట్టించుకోవాలని హితవు చెప్పాయి. ఇలా అమెరికా, నాటో, జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్, దక్షిణ కొరియాల చర్యలను ఖండించిన రష్యా, చైనాలు- భారత్‌కు సభ్యత్వం కలిగిన క్వాడ్‌ కూటమిని మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. 


ఒకరి అవసరం మరొకరికి..

రష్యా, చైనా మైత్రి నేపథ్యంలో డ్రాగన్‌ విషయంలో మనదేశం ఆందోళన చెందాలనేది కొంతమంది వాదన. నిజంగానే అటువంటి పరిస్థితి ఉందా అనేది అనుమానమే. చైనా బలహీనపడిన తన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకోవడంలో తలమునకలుగా ఉంది. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ కార్యకలాపాలకు తీరస్థ దేశాల నుంచి, అమెరికా నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఇది చాలదన్నట్లు తైవాన్‌ వ్యవహారం ఉండనే ఉంది. డ్రాగన్‌ చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్, చైనా-పాక్‌ ఆర్థిక నడవా ప్రాజెక్టులకు తీవ్ర అంతరాయాలు కలుగుతున్నాయి. ఈ పరిస్థితిలో భారత్‌తో కానీ, అమెరికా కూటమితో కానీ లడాయి పెట్టుకోవడం అవివేకమని డ్రాగన్‌ గ్రహించకపోదు. 1962లో మాదిరిగా ఆకస్మిక దాడి చేసి భారత్‌ను దెబ్బతీయడం ఇప్పుడు సాధ్యం కాదు. గతానుభవంతో భారత్‌ సర్వసన్నద్ధంగా ఉంది. ఈసారి ఇండియాకు అండగా పాశ్చాత్య దేశాలు ముందుకురావచ్చు. రష్యా కూడా చేతులు ముడుచుకుని కూర్చుంటుందనుకోవడం పొరపాటు. ఇండియా తన ఆయుధ అవసరాలలో 47శాతాన్ని రష్యా నుంచే దిగుమతి చేసుకొంటోంది. ఆసియాలో చైనా, అమెరికాలే చక్రం తిప్పుతుంటే చూస్తూ ఊరుకోవడం రష్యాకు సైతం ప్రయోజనకరం కాదు. భారత్‌ వంటి పెద్దదేశం తన మిత్రునిగా ఉండటం మాస్కోకూ మంచిదే. ఇండియా, రష్యాలు రెండింటికీ ఒకరి అవసరం మరొకరికి ఉంది. అందుకే బీజింగ్‌లో విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో భారత్‌ పేరెత్తలేదు. ప్రస్తుతానికి చైనా-రష్యా మైత్రిని అవసరార్థ పొత్తుగానే పరిగణించాలి. భారత్‌ అత్యంత నేర్పుగా రష్యా, నాటోలతో మైత్రి నెరపుతోంది. మోదీ, పుతిన్‌ల మధ్య పటిష్ఠమైన స్నేహ బంధం ఉంది. చిరకాలంగా చైనాకన్నా భారత్‌తోనే రష్యాకు ఎక్కువ సాన్నిహిత్యం ఉంది. దాన్ని పుతిన్‌ చేతులారా చెడగొట్టుకుంటారని అనుకోలేము. 


యుద్ధమే వస్తే..

రష్యా, చైనాల మైత్రిని భారత్‌ ఎలా అర్థం చేసుకోవాలి? ఇండియా, చైనాల మధ్య సరిహద్దు యుద్ధం సంభవిస్తే రష్యా ఎవరి పక్షం వహిస్తుంది? చైనా, రష్యాల మైత్రి నానాటికీ వృద్ధి చెందుతున్నందు వల్ల మనదేశం కలవరపడాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఇండియాపై డ్రాగన్‌ రేపు పూర్తిస్థాయి యుద్ధం ప్రకటిస్తే రష్యా బీజింగ్‌కు మద్దతు ప్రకటించవచ్చు లేదా తటస్థంగా ఉండిపోవచ్చని మరికొందరంటున్నారు. ఇలాంటి అంచనాలు నిరాధారమనే భావించవచ్చు. భారత్, చైనాల మధ్య యుద్ధం తప్పదని ఈ నిపుణులు ఊహిస్తున్నారు. కానీ, అది కేవలం ఊహామాత్రంగా మిగిలిపోవచ్చనేది వారు గుర్తించడం లేదు. చైనాతో యుద్ధమే వస్తే రష్యా భారతదేశంతో వ్యూహాత్మక, వాణిజ్య, రక్షణపరమైన సంబంధాలన్నింటినీ తెగతెంపులు చేసుకుని బీజింగ్‌ పక్షాన నిలుస్తుందనుకోవడం కూడా సహేతుకం కాదు. చైనా ఇప్పట్లో అలాంటి దుస్సాహసానికి పాల్పడే అవకాశాలు సైతం కనిపించడం లేదు. 
 


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రాచీన జ్ఞానమా.. నవీన విజ్ఞానమా?

‣ పాలస్తీనాకు పెరుగుతున్న మద్దతు

‣ ద్రవ్యలోటును కట్టడి చేసేదెలా?

‣ ఏఐ శకంలో కొత్త ఒరవడి

‣ డిజిటల్‌ భారత్‌పై హ్యాకింగ్‌ పంజా

Posted Date: 28-05-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం