• facebook
  • whatsapp
  • telegram

డ్రాగన్‌ వైఖరితో వీడని ప్రతిష్టంభన

భారత్‌-చైనా సరిహద్దుల్లో తగ్గని ఉద్రిక్తతలు

గల్వాన్‌ ఘర్షణలు జరిగి రెండేళ్లు పూర్తయినా ఇండియా, చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా కుదుటపడలేదు. ఇరు దేశాల బలగాల పోటాపోటీ మోహరింపులతో తూర్పు లద్దాఖ్‌లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. దరిమిలా ద్వైపాక్షిక సంబంధాలు ఇప్పుడప్పుడే పూర్తిస్థాయిలో పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. గల్వాన్‌ హింస తరవాత పలు దఫాలు దౌత్య, సైనిక చర్చలు జరిగినా పరిస్థితులు మెరుగుపడకపోవడానికి డ్రాగన్‌ దుందుడుకు వైఖరే కారణమని అవగతమవుతోంది. ఇటీవలే భారత సైన్యాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జనరల్‌ మనోజ్‌ పాండే సైతం ఈ విషయాన్ని స్పష్టీకరించారు. భూ సరిహద్దు సంబంధిత వివాదాన్ని సాగదీయాలని బీజింగ్‌ భావిస్తున్నట్లు ఆయన చేసిన వ్యాఖ్య అందరి దృష్టినీ ఆకర్షించింది.

కొలిక్కిరాని చర్చలు

రెండేళ్ల కిందట చైనా ప్రజా విమోచన సైన్యం (పీఎల్‌ఏ) సరిహద్దుల్లో తీవ్ర అలజడి సృష్టించింది. తూర్పు లద్దాఖ్‌లో యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు 2020 మేలో ప్రయత్నించింది. దుందుడుకుగా వ్యవహరించి గడచిన నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత రక్తపాతానికి కారణమైంది. ఆపై ఇరు దేశాల బలగాలు సరిహద్దుల్లోని అత్యంత కీలక ప్రాంతాల్లో నువ్వా, నేనా అన్నట్లు మోహరించాయి. పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇప్పటివరకు 15మార్లు కోర్‌ కమాండర్ల స్థాయి భేటీలు జరిగాయి. వాటికి అదనంగా దౌత్యమార్గాల్లోనూ సంప్రతింపులు నడిచాయి. అవి కొంతమేర ఫలించడంతో పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాలతోపాటు- గోగ్రా ప్రాంతంలో ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కి తీసుకున్నాయి. కానీ, హాట్‌స్ప్రింగ్స్‌, దెమ్‌చోక్‌, దెప్‌సంగ్‌ వంటి ప్రాంతాల్లో మాత్రం ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. తూర్పు లద్దాఖ్‌లో 2020 ఏప్రిల్‌ ముందునాటి పరిస్థితులు తిరిగి నెలకొనాలని ఇండియా పట్టు పడుతుండగా, డ్రాగన్‌ అందుకు ససేమిరా అంటోంది. ఫలితంగా ఎప్పటికప్పుడు చర్చలు నిష్ఫలమవుతున్నాయి. ఎల్‌ఏసీ వెంబడి సున్నితమైన ప్రాంతాల్లో ప్రస్తుతం రెండు దేశాలూ దాదాపు 50-60 వేలమంది సైనికులను మోహరించి ఉండటంతో ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్నాయి. అదే సమయంలో సరిహద్దుకు సమీపంలో మౌలిక వసతులను డ్రాగన్‌ వేగంగా అభివృద్ధి చేసుకుంటోంది.

తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభనను కొనసాగించేందుకు చైనా ప్రయత్నిస్తుండటం వెనక అసలు వ్యూహం వేరే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇండియా దృష్టి మొత్తం భూసరిహద్దుపైనే కేంద్రీకృతమయ్యేలా చేసి... నౌకాదళాన్ని మరింత పటిష్ఠంగా మార్చుకోకుండా కాలయాపనకు తెరతీయాలన్నది డ్రాగన్‌ కుట్ర అయ్యుండవచ్చు. యుద్ధనౌకలు, విమానవాహక నౌకల సంఖ్య పరంగా ప్రస్తుతం చైనాదే పైచేయి. పాకిస్థాన్‌లోని గ్వాదర్‌, శ్రీలంకలోని హంబన్‌టోట ఓడరేవులను డ్రాగన్‌ తన నియంత్రణలోకి తెచ్చుకుంది. మయన్మార్‌లోనూ ఓ రేవును అభివృద్ధి చేస్తోంది. వాటిని ఎప్పుడైనాసరే- సైనిక అవసరాలకు అనుగుణంగా మలుచుకోగలదు. ఈ తరుణంలో భారత్‌ నౌకాదళాన్ని త్వరితగతిన బలోపేతం చేసుకోవాలి. సైన్యం, వాయుసేనలతో పోలిస్తే బడ్జెట్‌ కేటాయింపుల్లో నేవీ ఏళ్లతరబడి నిర్లక్ష్యానికి గురవుతోందనడంలో సందేహం లేదు. వార్షిక రక్షణ బడ్జెట్‌లో ఈ దళానికి ఎన్నడూ 17శాతానికి మించి నిధులు దక్కిన దాఖలాల్లేవు. 2030కల్లా మొత్తం రక్షణ బడ్జెట్‌లో నేవీకి కేటాయింపులు 30శాతంగా ఉండాలని సిఫార్సులు వస్తున్నాయి. వాటిని అమల్లో పెట్టగలిగితే మన నావికా బలగాలు మరింత శత్రు భీకరంగా మారతాయి.

ఉభయులకూ నష్టం

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రాంతంలో ఉన్న ఇండియా... క్వాడ్‌ కూటమిలో చేరి అమెరికాతో సన్నిహితంగా ఉండటం డ్రాగన్‌కు ఎంతమాత్రం రుచించడం లేదు. అందుకే భూ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఏర్పరచడం ద్వారా ఇబ్బంది పెట్టేందుకు, ఇండో-పసిఫిక్‌లో భారత ప్రణాళికలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుండవచ్చు. ఇండియా, చైనా రెండూ శక్తిమంతమైన దేశాలే. సరిహద్దు వివాదం కారణంగా ద్వైపాక్షిక సంబంధాలు అటకెక్కడంతో ఇరుపక్షాలకూ నష్టం వాటిల్లుతోంది. ఈ విషయాన్ని దిల్లీ, బీజింగ్‌ అంగీకరిస్తున్నా- చైనా సహకార లేమితో సరిహద్దుల్లో ప్రతిష్టంభన తొలగడంలేదు. ఇటీవల భారత్‌లో పర్యటించిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ తూర్పు లద్దాఖ్‌లో సున్నితమైన ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి తీసుకోవడంపై స్పష్టమైన హామీ ఇవ్వనే లేదు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభలు జరగబోతున్నాయి. ఇండియాతో సరిహద్దు వివాదాన్ని ప్రధానంగా ప్రస్తావించడం ద్వారా అందులో తనకు మరింత మద్దతు కూడగట్టుకునేందుకు జిన్‌పింగ్‌ ప్రయత్నించే అవకాశాలున్నాయి. చైనా వేదికగా ఈ ఏడాది బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు జరగనుండటం ప్రస్తుత పరిస్థితుల్లో కాస్త ఆశాజనకంగా కనిపిస్తోంది. 2017లో డోక్లామ్‌లో తలెత్తిన ప్రతిష్టంభన తొలగిపోవడానికి బ్రిక్‌ సదస్సే కారణం! ఆ ఏడాది తమ దేశంలో జరగనున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రధాని మోదీ హాజరు కావాలని బీజింగ్‌ ఆశించింది. అందుకే డోక్లామ్‌ నుంచి బలగాలను వెనక్కి తీసుకుంది. ఈ ఏడాది కూడా బ్రిక్స్‌ సదస్సు చైనాలోనే జరగనుంది. ఆలోగా తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణకు మొగ్గే అవకాశాలను కొట్టిపారేయలేం!

- నవీన్‌ కుమార్‌

 

 


‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 17-05-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం